Sunday, November 10, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు - బాల కాండ-4: వనం జ్వాలానరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు

బాల కాండ-4
వనం జ్వాలానరసింహారావు

విలక్షణమైన ప్రబంధ గ్రంథమే రామాయణ కథనం అని అంటూ ఆ విషయాలను సోదాహరణంగా వివరిస్తారు వాసు దాసుగారు. లోక రక్షణ కొరకు భూమ్మీద అవతరించిన శ్రీరామచంద్రమూర్తి ప్రజా పాలన చేస్తున్న రోజుల్లో, భగవంతుడైన వాల్మీకి మహర్షి, లోకోపకారంగా, చిత్రమైన పదాలతో, ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణ రచన చేశాడు. పూర్వ రామాయణంలోని ఆరు కాండలలో ౫౩౭ (537) సర్గలుంటే, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత జరిగిన కథకు సంబంధించిన ఉత్తర కాండలో మరో ౧౧౦ (110) సర్గలున్నాయి. అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఈ గ్రంథాన్ని లోకానికి ప్రకటించినవారు కుశ లవులు.
సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు

బాల కాండ:     ౭౭    (77)     సర్గలు           ౨౨౫౬ (2256)                    శ్లోకాలు
అయోధ్య కాండ: ౧౧౯  (119)  సర్గలు           ౪౪౧౫ (4415)                     శ్లోకాలు
అరణ్య కాండ:   ౭౫   (75)      సర్గలు           ౨౭౩౨  (2732)                    శ్లోకాలు
కిష్కింధ కాండ: ౬౭   (67)      సర్గలు           ౨౬౨౦ (2620)                    శ్లోకాలు
సుందర కాండ: ౬౮  (68)      సర్గలు           ౩౦౦౬  (3006)                    శ్లోకాలు
యుద్ధ కాండ౧౩౧ (131)     సర్గలు           ౫౯౯౦  (5990)                    శ్లోకాలు
ఉత్తర కాండ:    ౧౧౦ (110)     సర్గలు           ౩౨౩౪  (3234)                    శ్లోకాలు
--------------------------------------------------------------------------------------------
ఏడు కాండలు:      ౬౪౭ (647) సర్గలు           ౨౪,౨౫౩ (24,253)               శ్లోకాలు
---------------------------------------------------------------------------------------------


స్థూల దృష్టితో పెద్ద సంఖ్య చెప్పేటప్పుడు దాని పైనున్న చిల్లర సంఖ్య గణించాల్సిన పనిలేదు. అందుకే రామాయణంలో ౨౪ (24) వేల శ్లోకాలని చెప్పడం జరిగింది. ప్రబంధ వైలక్షణ్యాన్ని తెలియచేసే సర్గ ఇది. పరమ ఆప్తుడైన కవి రచించడం, కీర్తిమంతుడైన నాయకుడు ప్రతిపాద్యుడిగా వుండడం, మహాత్ములు దాన్ని అంగీకరించడం, సాక్షాత్తూ కథానాయకుడే దాన్ని శ్లాఘించడం లాంటి విషయాలను కలిగున్న గ్రంథాన్ని "ప్రబంధ వైలక్షణ్య" మున్న గ్రంథ మంటారు. సర్గలోని మొదటి పద్యంలోనే ఈ విషయం విశదమవుతుంది. సమస్త సద్గుణాలతో లోకులందరినీ ఆనందపర్చిన శ్రీరామచంద్రుడి చరిత్రై నందువల్ల, రామాయణం కడు ఆదరణీయమైంది. శ్రీరామ చరిత్ర అంటే మహాపురుష చరిత్రే.. అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన కూడా మొదటి పద్యం లోనే వివరించబడింది. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం చేసే రోజుల్లో, సీతాదేవి తన ఆశ్రమం చేరిన తర్వాతే, వాల్మీకి రామాయణ రచన చేశారన్న విషయం కూడా ఈ పద్యంలో స్పష్టంగా బోధపడ్తుంది. శ్రీరామచంద్రమూర్తి అవతరించడానికి పూర్వమే వాల్మీకి రామాయణం రచించాడనడం సత్యదూరం

No comments:

Post a Comment