బాలకాండ
మందరమకరందం
సర్గ-64
విశ్వామిత్రుడి
తపస్సు భంగం చేయబోయిన రంభ
వనం
జ్వాలా నరసింహారావు
"యోగి పుంగవుల
ప్రయత్నాలను ఫల హీనంగా రంభ చేస్తుందనీ, ఆమె నేర్పును ప్రదర్శించే సమయమొచ్చిందనీ, విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయాలనీ, అది దేవతా కార్యమనీ, నమ్మకంగా చేయగలిగింది
రంభనీ ఇంద్రాది దేవతలు రంభతో అంటారు. ఆ పని చేయడం కష్టమని భావించిన రంభ, చేయలేనని చెప్పడానికి సిగ్గుపడి-దీనంగా రెండు చేతులు జోడించి ఆ
విషయాన్నే చెప్తుంది. విశ్వామిత్రుడి సమీపంలోకి పోవాలన్న ఆలోచనే గుండెలు జల్లు
మనేలా చేస్తున్నదని అంటుంది. ఆయన భయంకరుడని, కోపిష్టని, నోటి దురుసుతనం వున్న
వాడని అంటూ, అలాంటి వాడి దగ్గరకు
పోవాలంటే దేహం గడగడలాడుతుందని చెపుతుంది. తెలిసి-తెలిసీ కొరివితో తల
గోక్కోవడమెందుకని ప్రశ్నిస్తుంది. వజ్రాయుధం ధరించే ఇంద్రుడు, నిరాయుధైన ఆడదానిపై దయతలచమంటుంది. ఆయన వజ్రాయుధంతో కానిపని, ఆడదానితో ఎలా అవుతుందని, తనమీద దయచూపి ఆ పనికి తనను పంప వద్దని దీనంగా ప్రార్థించింది రంభ.
ఆమెను భయపడ వద్దనీ, ఆమెలాంటిది అలా
మాట్లాడరాదని, ఆమెకు మేలుకలుగుతుందనీ, ఆమె సౌందర్యాన్ని మరింత మెరుగుగా చేసుకుని రావాలనీ, మన్మథుడుతో సహా ఆమె పక్కనే తానూ వుంటాననీ-వుండి కోకిలనై కూస్తుంటానని, చెట్ల కొమ్మల్లో వసంతుడుంటాడనీ-వుండడంవల్ల చెట్లన్ని వికసించి
మనస్సును ఆకర్షిస్తాయని ఇంద్రుడంటాడు రంభతో. ఇంద్రుడి ఆదేశం ప్రకారమే రంభ కొత్త
సొగసులతో, విశ్వామిత్రుడి సమీపంలోకి
పోయి మనోహరమైన పాట పాడింది. వినగా-వినగా, ఇంపు-సొంపు కలిగిస్తూ, అంతకంతకూ అతిశయించే పంచమ ధ్వనితో రంభ పాడుతుంటే, ముని కళ్లు తెరిచి చూసి, తన ముందర పాడుతున్న దేవతా స్త్రీని సందేహించాడు. అది ఇంద్రుడి మాయని
గ్రహించాడు. కోపంతో కళ్లెర్రచేశాడు".
"తాను కామ-క్రోధాలను
జయించాలన్న ప్రయత్నంతో తపస్సు చేస్తుంటే, పాపకార్యమనికూడా అనుకోకుండా, తన తపస్సు భంగం చేయడానికి వచ్చిన రంభను ’దాసీ’ అని దూషించి, పదివేల సంవత్సరాలు రాయిగా పడి వుండాలని శపించాడు. (కామాన్ని
జయించాలనుకుంటున్న విశ్వామిత్రుడికి కోపం పోలేదింకా). తానిచ్చిన శాపాన్ని గొప్ప
తపోబలం, బుద్ధిబలం, విస్తారమైన తేజస్సున్న బ్రాహ్మణుడు పోగొట్టి ఆమెను రక్షిస్తాడని
శాపవిమోచనం గురించి కూడా చెప్పాడు. తటాలున శపించాడు గానీ, తొందర పడ్డందుకు చింతించాడు విశ్వామిత్రుడు. ఓర్పు లేకపోయినందుకు
పరితపించాడు. అక్కడేవుండి ఇదంతా గమనిస్తున్న ఇంద్రుడు, మన్మథుడు భయంతో పారిపోయారు".
"కొంచెం కూడా తనకు శాంత గుణం లేకపోయిందని విచారపడ్డాడు
విశ్వామిత్రుడు. రంభ తనను మోసగించేందుకు వచ్చిందని అనవసరంగా కోపగించుకున్నానని, తననామె ఏం చేయలేదని ఎందుకు గ్రహించ లేకపోయానని, తన సమ్మతి లేకుండా ఆమె తనను చెరచలేదుకదానని, ఛీ పొమ్మంటే పోయేదిగదానని, అకారణంగా తపస్సు నాశనం చేసుకుంటినిగదానని, కామ క్రోధాలను జయించానని బ్రహ్మను అడగాల్సిన పని లేకుండా తనకే
తెలిసిందని, కామాన్ని
జయించినా-క్రోధాన్ని జయించలేకపోతినిగదానని పరిపరి విధాల విచారించాడు. ఎలాగైనా
కోపాన్ని జయించి తీరాలని నిశ్చయించుకుంటాడు. మనస్సులో కోపం రానీయనని, నోరు విప్పి ఒక్క మాటైనా పలకనని, దేహాన్ని సన్నగిల్ల చేయాలని, ఇంద్రియాల పొగరు అణచాలని, కామాన్ని పూర్తిగా చంపాలని, ఒకరు మొక్కినా-తొక్కినా ఒక్క విధంగానే వుంటానని నిర్ణయించుకుంటాడు.
ఆహారం తినకూడదని, ఊర్పు విడవద్దనీ, కోపం అనేదాన్ని మనస్సుతో కూడ స్పృశించ వద్దనీ, తనకు బ్రాహ్మణత్వం లభించిందాక వుండితీరుతాననీ నిశ్చయించుకున్నాడు
విశ్వామిత్రుడు".