అధునాతన పట్టణంగా ఖమ్మం
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దిన పత్రిక (16-02-2016)
ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడానికి
ఉద్దేశించిన "శ్రీరామ ఎత్తిపోతల పథకం" శంకు స్థాపనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లాకొస్తున్నారు.
రాజీవ్ సాగర్-ఇందిరా సాగర్ గా గతంలో పిలువబడిన
ఈ ప్రాజెక్టుకు,
సరికొత్త
డిజైన్ తో, రు. 7900 కోట్ల
వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కు టేకులపల్లి మండలం రోళ్ల పాడు వద్ద శంకు
స్థాపన చేస్తున్నారు సీఎం. ఈ ప్రాజెక్ట్ ద్వారా లోగడ కేవలం 37 టీఎంసీల నీరు
మాత్రమే లభ్యమయ్యే విధంగా డిజైన్ చేయగా, ఇప్పుడు అంతకంటే అధికంగా 50 టీఎంసీల నీరు లభ్యం కాబోతున్నది. నిర్మాణానికి
జరుగనున్న వ్యయం కూడా తగ్గిందిప్పుడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా
ఐదు లక్షల ఎకరాలు జిల్లా వ్యాప్తంగా సాగులోకి రానుంది. ఇంతకు
ముందున్న డిజైన్ ద్వారా లబ్ది పొందే మండలాలకు తోడు ఇప్పుడు అదనంగా తిరుమలాయ పాలెం, కూసుమంచి, ముదిగొండ మండలాలకు కూడా
సాగు నీరు లభించనుంది. ఇదే కాకుండా పాలేరు రిజర్వాయర్ పై రు. 90 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి కూడా
తిరుమలాయ పాలెం మండలం మాదిరి పురం దగ్గర సీఎం శంకు స్థాపన చేయనున్నారు. ముదిగొండ మండలంలో వున్న ముత్తారంలోని ప్రముఖ రామాలయం కూడా సీఎం
సందర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చారిత్రాత్మక ఖమ్మం గురించి
ప్రముఖ విద్యా వేత్త ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు ద్వారా తెలుసుకున్న విషయాలు ...ఆ జిల్లా వాసిగా...
ఖమ్మం కి ఆ పేరు
ఎట్లా వచ్చింది అనేది విచారిస్తే పట్టణ మధ్యలో ఉన్న నరసింహ స్వామి పేరు మీద
స్థంబాద్రిగా వెలసింది. స్తంభాన్ని ఉర్దూలో ఖంబా అంటారు. కనుక అందుకనే ఖంబానికి స్థంబాద్రి అనే పేరుతో మనం వ్యవహరిస్తాం. ప్రముఖ కవి, కవిత్వం ద్వారా నిప్పులు కురిపించిన దాశరధి, ఖమ్మం "తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ముఖద్వారం" అన్నాడు.
ఒకనాటి
వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా వున్న ఖమ్మం,
అక్టోబర్ 1, 1953 న కొత్త జిల్లాగా ఏర్పాటైంది.
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి, రాజకీయ
చైతన్యానికి-ప్రగతికి,
విద్యా వ్యాప్తికి, వ్యాపార-వాణిజ్య-వ్యవసాయ రంగాలకు, వైజ్ఞానిక స్ఫూర్తికి ఖమ్మం పర్యాయపదం
అంటే అతిశయోక్తి కాదేమో! ఖమ్మంలో ఎప్పుడూ జట్కా బండ్లు కాని, టాంగాలు కాని, మనిషి లాగే రిక్షాలు కాని, వుండేవి కాదని పాత కాలానికి చెందిన
వారంటారు. ఒంటెద్దు బండ్లుండేవట. ఖమ్మానికి అద్వితీయమైన ప్రాచీన చరిత్ర కూడా
వుంది. కొన్నాళ్లు కాకతీయుల వశంలో, ఆ
తరువాత గోల్కొండ సుల్తానుల పాలనలో, ఆ
క్రమంలో ఆసఫ్ జాహీల,
నిజాంల అధీనంలో వుండేది. 1900
హైదరాబాద్ స్థానిక సంస్థల చట్టానికి లోబడి 1910 లో ఖమ్మం మునిసిపాలిటీ ఏర్పాటైంది.
అప్పట్లో జనాభా కేవలం ఐదు వేలు మాత్రమే! మునిసిపాలిటీ బాధ్యతలు తహసీల్దార్
నిర్వహించే వాడు. 1942 లో మునిసిపాలిటీ కమిటీగా వ్యవస్థీకరించడం జరిగింది. 1952 లో
మొదటి సారి మునిసిపాలిటీ పాలకవర్గ ఎన్నికలు జరిగాయి.
1956 దాకా ఖమ్మం పట్టణంలో విద్యుత్ సౌకర్యం
వుండేది కాదు. వ్యాపారస్తులు పెట్రోమాక్స్ లైట్లు వాడేవారు. ప్రతివారి ఇంట్లో
ఆముదం దీపాలుండేవి. కాస్త మధ్య తరగతి, సంపన్నుల
ఇండ్లలో లాంతర్లుండేవి. రెండే సినిమా టాకీసులుండేవి మొదట్లో. ఒక దాని పేరు
"సుందర్ టాకీస్",
మరో దాని పేరు "నవాబ్
టాకీస్". ఇవి కూడా డైనమో కరెంటుతో నడిచేవి. పోలీసు స్టేషన్ సమీపంలో
ఇప్పుడున్న దుకాణాల సముదాయంలో "ప్రభాత పుస్తక శాల" వుండేది.
జాతీయోద్యమంలో అంతర్భాగంగా,
గ్రంధాలయోద్యమానికి వూతంగా, ప్రచారానికి ఉపయోగపడేదీ పుస్తక శాల. ఆ
షాప్ కొచ్చి పుస్తకాలు కొనేవారిపై నిఘా కూడా వుండేది ఆ రోజుల్లో. అలానే కారంపెట్టి
చిన నరసయ్య అనే వ్యాపారికి ఒక పుస్తకాల షాప్ వుండేది. అక్కడ కూర్చుని అనేకమంది
ప్రముఖులు ఆయనిచ్చిన కాఫీని సేవిస్తూ కొనకుండా మాగజైన్లు, పుస్తకాలు చదివేవారు. ఇప్పటికీ
వాడుకలో వున్న "కమాన్ బజార్", "కస్బా బజార్" పాత కాలం పేర్లే. అలాగే ఖమ్మం ఖిల్లా. ఇది రాజు
గారి సైన్యాల విడిదిగా,
ఔట్ పోస్టులాగా వుండేది.
రాజుగారి గుర్రాల జీనులకు ఇరు పక్కలా కాళ్లు పెట్టుకోవడానికి వుండే "రికాబులు" తయారు చేసే వీధిని
"రికాబు బజార్" అని అప్పట్లో-ఇప్పట్లో పిలుస్తున్నారు. అక్కడుండాల్సిన
పాఠశాల ఏ కారణం చేతనో మామిళ్లగూడెంలో వుండేది. పేరు రికాబ్ బజార్ హైస్కూల్...కాని వుండేది
వేరే చోట.
1948 వరకు ఖమ్మంలో ఫొటో స్టూడియోలు కూడా
లేవు. మహాత్మా గాంధి 1938 లో ఖమ్మం వచ్చినప్పుడు విజయవాడ నుంచి ఫొటోగ్రాఫర్ ను
పిలిపించారట. ఖమ్మం మార్కెట్ కు సుదూర ప్రాంతాల నుండి రైతులు పండించిన ధాన్యం, వేరు శనగ, మిర్చి, అపరాలు
లాంటివి తెచ్చి అమ్మేవారు. వెళ్లేటప్పుడు డబ్బా నిండా నూనె, ఉప్పు బస్తా కొనుక్కెళ్లేవారు.
ఖమ్మంలో
ఒకే ఒక హైస్కూల్ వుండేది మొదట్లో.
అప్పట్లో తెలంగాణలో సర్కారీ
బడులే వుండేవి. ఆ కారణాన విద్యార్థి వసతి గృహాల స్థాపన, గ్రంథాలయాల ఏర్పాటు వూపందుకున్నాయి.
అందులో భాగంగానే 1931
లో కమ్మ హాస్టల్ స్థాపించారు
కొందరు పెద్దలు. విద్యార్థి వసతి గృహాలు కులం, భాష, సంస్కృతి విభేదాలకు అతీతంగా వుండేవి.
ఇక గ్రంథాలయోద్యమంలో భాగంగా పట్టణ వైశ్య ప్రముఖులు "విజ్ఞాన నికేతనం"
స్థాపించారు.
ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలను
స్థాపించారు. అప్పటి
ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం
తీసుకున్నారు. అప్పటి ఖమ్మం
జిల్లా కలెక్టర్ జీ వీ భట్,
ముఖ్యమంత్రి
ఆలోచనలకు అనుగుణంగా,
ఖమ్మానికి
చెందిన కొందరు ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు, నిధుల సేకరణ మొదలెట్టారు. ఒకానొక సందర్భంలో, భద్రాచల రామాలయానికి చెందిన ఒక ఆభరణాన్ని వేలం వేసి, అలా సేకరించిన పైకంతో
కళాశాల నెలకొల్పాలని భావించారట.
అది
తెలుసుకున్న, స్వర్గీయ శ్రీ
రామ భక్త గెంటాల నారాయణరావు లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని కలెక్టర్‌ను కలిసి
చెప్పడం, ఆయన ఇచ్చిన
మూలధనంతో కళాశాల రూపుదిద్దుకోవడం జరిగింది. తొలుత గుట్టలబాజార్ దాటిన తరువాత గ్రెయిన్ మార్కెట్
ప్రాంతంలో నెలకొల్పారు కళాశాలను.
ప్రభుత్వం
ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా,
కళాశాల
పేరు ముందర శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు పేరు కొనసాగిస్తూ వచ్చారు. దరిమిలా కళాశాలకు
ఇల్లెందు రోడ్డులో నూతన భవనాలను నిర్మించి అక్కడకు మార్చారు. ఆ తరువాత కొంత కాలానికి
మహిళా కళాశాల కూడా స్థాపించడం జరిగింది. మహిళా కళాశాలకు కూడా ఒక చరిత్ర వుంది. ఖమ్మం
పట్టణంలో జరిగిన మూడవ ఆంధ్ర మహాసభ సందర్భంగా బాలికల పాఠశాల ఏర్పాటుకు నాంది
జరిగింది. 1965 ప్రాంతంలో మహిళా డిగ్రీ కళాశాల మొదట్లో
ప్రయివేట్ కాలేజీ గా ఏర్పాటైంది.
1950
కి పూర్వం ప్రభుత్వ ఆసుపత్రి,
మిషన్ ఆసుపత్రి తప్ప వేరే వైద్య
సౌకర్యం ఖమ్మంలో అంతగా లేదు. ఎక్కువగా ఆయుర్వేద మందులే వాడేవారు. చుట్టుపక్కల
గ్రామాలలో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల
బండిలోనో, మేనాలోనో తీసుకుని ఖమ్మం పోయే వాళ్లు. వారి వెంట స్థానిక ఆరెంపీ డాక్టర్
వెళ్లేవాడు. ఆ రోజుల్లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీతో ప్రాక్టీసు చేసిన
వాళ్లలో డాక్టర్ అబ్దుల్ మజీద్,
డాక్ట్రర్ యలమంచిలి
రాధాకృష్ణమూర్తి, డాక్ట్రర్ అశ్వత్థామలు వున్నారు. వారు కాకుండా, చిల్లంచర్ల రంగాచార్యులు, ఉపేందర్ రావు, సీతారామచంద్ర రావు లాంటి కొందరు ఆర్.ఎం.పి
డాక్టర్లు కూడా చిన్న-చిన్న నర్సింగ్ హోంలు పెట్టి వైద్యం
చేసేవారు. ఆపరేషన్లు కూడా వాళ్ళే చేసేవారు. ఇప్పుడైతే ఖమ్మంలో వందలాది మంది ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు....అంతే సంఖ్యలో నర్సింగ్ హోంలు వున్నాయి.
1949 కి పూర్వం ఖమ్మంలో రక్షిత మంచినీటి
సరఫరా సౌకర్యం లేదు. నిజాం కాలంలో దీనికి సంబంధించిన ప్రణాళికలు కొంతవరకు
సిద్ధమయ్యాయి. క్రమేపీ మంచినీటి సరఫరా మునిసిపాలిటీ ద్వారా జరగడం మొదలైంది. అంతకు
ముందు పీపాలలో చిన్న బండ్ల మీద పక్కనే వున్న మునేరు నుంచి నీళ్లు తెచ్చి ఇండ్లలో
పోసే వారు. కాకపోతే అప్పట్లో ఏరు నీరు స్వచ్చంగా వుండేది. అలాగే ఖిల్లా బజారులోని
ఒక మంచినీటి భావి నుంచి కూడా తెచ్చుకునే వారు చాలా మంది. ఖమ్మం పట్టణానికి అన్ని
దిక్కులా, అష్ట దిగ్బంధం లాగా ఆంజనేయ స్వామి
ఆలయాలున్నాయి. అవి,
కాలువ వడ్డున, రంగనాయకుల గుట్ట మీద, చెరువు బజారులో, రికాబు బజారులో, భోగంకుంటలో, నరసింహస్వామి గుట్ట మీద, రావి చెట్టు బజారులో, సుగ్గలవారి తోటలో వున్నాయి. అషుర్
ఖానాలు కూడా వున్నాయి. అలాగే క్రైస్తవ మత చర్చ్, దానికి
అనుబంధంగా మిషన్ ఆసుపత్రి వున్నాయి. ప్రాచీన స్థలాలో ఖిల్లా తరువాత చెప్పుకో
దగ్గవి గుంటు మల్లన్న సత్రం,
రామాలయం. గుంటు మల్లన్న సత్రం
ఆవరణతో సంబంధం వున్న ప్రముఖుల్లో దాశరథి సోదరులున్నారు. సకల భాషా సంపన్నులు దాశరధి జైలు శిక్ష కూడా
అనుభవించాడు. "ముసలి నక్కకు దక్కునే రాజ్యము" అని
బొగ్గుతో నిజామాబాద్ జైలు గోడల మీద కవిత్వం రాశాడు. ఆయన రాసిన కవిత
సంపుటాలు...అగ్నిధార, రుద్రవీణ సామాన్య ప్రజానీకానికి నినాదాలు అయ్యాయి.
ఇంత చారిత్రక
నేపధ్యం వున్న ఖమ్మం పట్టణం చెందాల్సినంతగా అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. పట్టణ
జనాభా, సమీపంలో వుండి, దాదాపు పట్టణంలో
కలిసిపోతున్న గ్రామాల జనాభా కలిపి సుమారు మూడు-నాలుగు లక్షల వరకుండవచ్చు.
పెరుగుతున్న పట్టణ అవసరాలకు సరిపడా మౌలిక వసతుల కల్పన జరగాలి. తాగు నీటి సౌకర్యం
ఎలాగూ మిషన్ భగీరథ ద్వారా కలగబోతోంది. ఆధునిక బస్ స్టాండ్, మార్కెట్ సౌకర్యం, సమీపంలోని గ్రామాలను పట్టణంతో కలుపుతూ రహదారుల
ఏర్పాటు, రింగ్ రోడ్డు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, పార్కుల ఏర్పాటు, అన్ని వసతులున్న
మంచి ఆడిటోరియం...ఇలా ఎన్నో చేయాలి. ఇవన్నీ గత ప్రభుత్వాలు ఆలోచన చేసి
వుండాల్సింది. ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటన ఈ దిశగా ఖమ్మం
సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒక అధునాతన పట్టణ
ఆవిష్కరణ జరగబోతుందనాలి. End
No comments:
Post a Comment