బాలకాండ
మందరమకరందం
సర్గ-59
వశిష్ఠుడి కుమారులను శపించిన విశ్వామిత్రుడు
వనం
జ్వాలా నరసింహారావు
"దీనాలాపనలతో
మాట్లాడుతున్న త్రిశంకుడిని చూసి విశ్వామిత్రుడు, అతడికి మేలు జరుగుతుందని ధైర్యం చెప్పాడు. అతడిని భయపడ వద్దనీ, అతడు మంచి నడవడిగలవాడని తనకు తెలుసనీ, అతడి మనస్సులో వున్న కోరికను తాను నెరవేరుస్తానని అంటాడు
విశ్వామిత్రుడు. యజ్ఞం చేసేందుకు శీఘ్రంగా మునీశ్వరులందరినీ పిలుస్తానని చెప్పి, వశిష్ఠుడి పుత్రుల శాపాన్ని తప్పించడం సాధ్యపడనందున, చండాల రూపంలోనే త్రిశంకుడిని స్వర్గానికి పంపించి కీర్తిమంతుడిని
చేస్తానని అభయమిస్తాడు. తనను శరణుజొచ్చిన కారణాన స్వర్గం అతడికి అరచేతిలో ఉసిరికాయ
సమానంగా చేస్తానని హామీ ఇస్తాడు. తన కొడుకులను పిల్చి యజ్ఞానికి కావాల్సిన
సామాగ్రిని సమకూర్చమని చెప్పాడు. తన ఆజ్ఞగా-తనపై గౌరవంతో, మునీశ్వరులందరు శిష్యులతో-ముఖ్య హితులతో-బహుశ్రు తులతో-ఋత్విజులతో
రమ్మని పిలవాల్సిందిగా శిష్యులకు చెప్పాడు. ఎవరన్నా తన మాటను వినకపోతే, వారి సంగతి తనకు తెలియచేయాలన్న గురువు ఆజ్ఞానుసారం, శిష్యులు దేశ దేశాల్లో తిరిగి, బ్రహ్మ వాదులందరినీ పిలిచారు. విశ్వామిత్రుడికి భయపడి, ఇష్టమున్నా-లేకపోయినా అందరూ యజ్ఞాన్ని చూడడానికి వచ్చారు".
"ఇదిలా వుండగా
వశిష్ఠుడి కుమారులకీ విషయం తెలిసి కోపంతో యజ్ఞాన్ని తప్పుబట్టారు. యజ్ఞం చేసేవాడు
చండాలుడనీ, చేయించేవాడు రాజర్షైన
క్షత్రియుడనీ, సద్బ్రాహ్మణులందరు
చండాలుడి అన్నం ఎలా తింటారనీ, దేవతలెలా సంతోషంతో
వస్తారనీ, చండాలుడు స్వర్గానికెలా
పోతాడనీ, వాడుపోయే స్వర్గం
ఎలాంటిదనీ మహోదయుడు-మిగిలిన వశిష్ఠుడి కుమారులన్నారని శిష్యులు గురువుతో చెప్పడంతో
విశ్వామిత్రుడి కోపం తారాస్థాయికి చేరింది. విశేష ధ్యానంతో ధర్మాసక్తుడైన తనను
పాపపు పలుకులతో దూషించిన వారందరూ మసైపోవాల్సిన వారని, వారందరూ చచ్చి నరకానికి పోయి-యమభటుల కఠిన పాశాలకు వశ పడి, ఏడొందల జన్మలవరకు పీనుగులుతినేవారిగా పుట్టాలని శపించాడు. కుక్క మాంసం తింటూ, దిక్కులేకుండా-దయాహీనులైన
దుర్జాతివారిగా, నీచులుగా, వికార వేషాలతో భూమ్మీద అపూజ్యులై తిరగాలని కూడా శపించాడు
విశ్వామిత్రుడు వశిష్ఠుడి కొడుకులను. తిట్టగూడని తిట్లు తిట్టిన మహోదయుడిని, బోయవాడిగా పుట్టి-భూమ్మీద తిరిగి, ఆత్మహత్య చేసుకుని, చివరకు తన కోపకారణాన
దుర్గతులలో కూలిపోవాలని శపించాడు".
I think, finally he cursed them to be born as Andhrites or near Andhra's i think, i read some where.
ReplyDelete