Saturday, February 6, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-44 : భగీరథుడికి ప్రత్యక్షమైన బ్రహ్మ- గంగ మహాత్మ్యం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-44
భగీరథుడికి ప్రత్యక్షమైన బ్రహ్మ- గంగ మహాత్మ్యం
వనం జ్వాలా నరసింహారావు
                
                "తన వెంట భగీరథుడు గంగను తీసుకొనిపోయి, సగరకుమారులందరు భస్మమై పడివున్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత, గతులులేక పడివున్న వారి బూడిదకుప్పలమీదిగా గంగపారడంతో, తృప్తి పడిన భగీరథుడికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అరవైవేలమంది సగర కుమారులు గంగ తమ బూడిదలపై ప్రవహించడంతో పిశాచత్వాన్ని వదిలి-భువర్లోకాన్ని విడిచి, స్వర్గలోకానికి పోయి, దేవత్వాన్ని పొందారని బ్రహ్మంటాడు. సముద్రంలో ఎంతవరకు నీరుంటుందో అంతవరకు వారందరు స్వర్గలోకంలోనే వుంటారని అంటాడు బ్రహ్మ. భూలోకంలో ప్రవహిస్తున్న గంగ భగీరథుడి కూతురుగా-భాగీరథి పేరుతో ప్రసిద్ధికెక్కుతుందని కూడా బ్రహ్మంటాడు. అలా ఆ దేవనదికి గంగ, త్రిపథగ, భాగీరథి అన్న మూడు పేర్లుంటాయనీ-మూడు మార్గాల్లో పారినందున త్రిపధగ అని సార్థకమవుతుందనీ భగీరథుడితో చెప్పుతాడు బ్రహ్మ. తాతలందరికి గంగా జలంతో తర్పణం చేసి పట్టిన పట్టు సాధించినవాడయ్యాడని-మిక్కిలి కీర్తిశాలి, ఉత్తమ ధర్మిష్టుడైన ఆయన ముత్తాత కూడా గంగను తేగల సమర్థుడు కాలేకపోయాడని-తాత అంశుమంతుడు ప్రతిజ్ఞ తీర్చాలని వృధా శ్రమ చేశాడని-తండ్రి దిలీపుడు రాజశ్రేష్ఠుడు, గొప్ప రాజర్షి, దేవ మహర్షి అయుండీ, తపస్సులో బ్రహ్మ సమానుడై వుండీ, క్షాత్ర ధర్మంలో నిలిచిన వాడై వుండీ, నిర్మల కీర్తి కలవాడై వుండి కూడా గంగను భూమ్మీద పారించలేక పోయాడని, ఆ కొరత తీర్చిన భగీరథుడు ఎంతో పుణ్యమూర్తుడని పొగుడుతాడు బ్రహ్మ భగీరథుడిని. భగీరథుడు తన కొరత తీరేదాకా, గంగా జలాల్లో స్నానం చేసి, శుచై, పుణ్య సమూహాల ఫలం పొందమని, తాతలందరికీ ఆ నీళ్లతో తర్పణాలు వదలమని, ఆ తర్వాత తన స్వస్థలానికి పొమ్మని చెప్పి బ్రహ్మ సత్యలోకానికి వెళ్తాడు. భగీరథుడు తాతలందరికి తర్పణాలొదిలి, తన నగరానికి పోయి, రాజ్య సంపదను యథావిధిగా స్వీకరించి, దుఃఖాన్ని వదిలి, మనోవేదన విడిచి, సంతోషంగా రాజ్య పాలన చేశాడు".

ఈ విధంగా గంగ చరిత్రమంతా ఆద్యంతం రామచంద్రమూర్తికి తెలిపాడు విశ్వామిత్రుడు. సంధ్య వేళ అతిక్రమించిందని అంటూ, గంగ భూమ్మీదకు దిగిన కథ వినినవారికి కలిగే శుభాల గురించి కూడా చెప్పాడు. "ధనం కోరినవారికి ధనం లభిస్తుంది. కీర్తి కోరినవారికి కీర్తి కలుగుతుంది. ఆయువు కోరుకున్న వారికి ఆయువు పెరుగుతుంది. పుత్రులుకావాలన్న కోరికలుంటే పుత్రులుపుట్తారు. స్వర్గం పోదల్చుకుంటే ఆ ప్రాప్తి కలుగుతుంది. పితృలకు మిక్కిలి ప్రీతి కలిగిస్తుంది. దేవకోటులు తృప్తి పడుతారు. నాల్గు వర్ణాలవారెవరైనా శ్రద్ధగా వింటే-వినిపిస్తే, సర్వ పాపాలు తొలిగి, దీర్ఘాయుస్సు పొంది సమస్తమైన కోరికలు తీరుతాయి" అనంటాడు విశ్వామిత్రుడు.


(శంకరుడి శిరస్సులో పడినందున-పాపాలను పోగెట్టేదైనందున పావనమైంది గంగంటారు. పావనమైంది కనుకనే రుద్రుడు ధరించాడు.అందువల్ల మనం కూడా పావనమవుదామని సమస్త దేవతలు స్నానమాడి వారు పావనులై-గంగనూ పావనం చేసారు. శివుడి శిరస్సునుండి వెలువడిందికనుకనే గంగ పవిత్రమైందని-అంతకు ముందు అపవిత్రమయిందనీ అనడం సరికాదు. వాస్తవానికి, భగీరథుడి కోరిక ప్రకారం గంగా జలాలు తన శిరస్సుమీద పడడం చూసిన శివుడు, యోగ్యుడనయ్యానని భావించి-పావనుడు కావడానికి గంగను తన శిరస్సుపై ధరించాడు. గంగ పవిత్రం కావడానికి అసలు కారణం, విష్ణు పాదంలో పుట్టడమే. హరుడి శిరస్సునందుండి పడడం వల్ల గంగ పుణ్య నదైందని శైవులు వాదిస్తారు. గంగ పుణ్యనది కనుకనే శివుడు తలపై ధరించాడని వైష్ణవ వాదం. ఈ వివాదాన్ని పరిష్కరించేది వాల్మీకి రామాయణం మాత్రమేనని వాసుదాసుగారి అభిప్రాయం. రామాయణం మూల శ్లోకంలో పుణ్యగంగ, పుణ్యశివుడి శిరస్సులో పడిందనుంది. గంగాశివులకు పరస్పర సంబంధం లేనప్పుడు కూడ ఇద్దరూ పుణ్యులనే అర్థం. అయోధ్యా కాండలో వశిష్ఠ వాక్యంగా కూడా ఇది చెప్పబడుతుంది. అక్కడ గంగ పాదతీర్థం ధరించి పార్వతీ పతి ధన్యుడయ్యాడు అని చెప్పబడుతుంది ఒకానొక చోట.

గంగా జలాన్నంతా నిమిషంలో తాగిన జహ్నముని రాజర్షి. భరత వంశపు రాజు. ఆ వంశంలో అజామీఢుడు అనే రాజుండేవాడు. ఆయన కొడుకే జహ్నుడు. ఆయన కొడుకు సింధుధ్వజుడు. ఆయన కొడుకు బలాకాశ్వుడు. బలాకాశ్వుడి కొడుకు వల్లభుడు. ఆయన కొడుకు కుశికుడు. కుశికుడి కొడుకు గాధి. కొడుకుకై గాధి తపస్సు చేస్తున్నప్పుడు అడవిలో ఆయనకు సత్యవతి జన్మించింది. తర్వాత విశ్వామిత్రుడు పుట్టాడు. సత్యవతిని భృగు వంశంలో పుట్టిన చ్యవనుడి కొడుకు ఋచీకుడు వివాహం చేసుకున్నాడు. సత్యవతి-ఋచీకులకు జమదగ్ని పుట్టాడు. జమదగ్ని భార్య రేణుక. వీరిరువురికి పరుశురాముడు జన్మించాడు.


మరో ఆసక్తికరమైన విషయం ఈ సర్గలో చెప్పబడింది. కుమార సంభవ సందర్భంలో "రసవాదం" గురించి పరోక్షంగా చెప్పినట్లే ఇక్కడ యోగ విషయం చెప్పడం జరిగింది. గంగోద్భవానికి యోగవిద్యకు సంబంధముందని ఈ సర్గలో వాల్మీకి చెప్పిన శ్లోకాల్లో వుందంటారు వాసుదాసుగారు. "ప్రాణ శక్తి వాయువాహనగా, బ్రహ్మ రంధ్రం మూలంగా, సహస్రార కమలస్థానం ప్రవేశించి, అక్కడనుండి, శివ స్థానమైన ఆజ్ఞా చక్రానికి దిగి, అక్కడ మూడు పాయలుగా ఇడాపింగళసుషుమ్నలవతుంది. అందులో సుషుమ్న మధ్యది. దీన్నే తపోబలంతో భగీరథుడు తెచ్చాడు. ఇది మేరు దండం వెంట కిందకు దిగి-దిగి, మూలాధారంలోని కుండలిని (నాగ లోకాన్ని) తాకింది. ఈ కారణాన, నిశ్చేష్ఠంగా పడి వున్న అణువులు ఊర్ధ్వగాములవుతాయి". అని సూచన మాత్రంగా వ్యాఖ్యానించి, యోగులకు సవిశేషంగా తెలుస్తుందని అంటారు వాసుదాసుగారు. కాకపోతే ఇతరులకీ విషయం అభేద్యం అనికూడా చెప్తారు).

No comments:

Post a Comment