Saturday, February 13, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-51 : విశ్వామిత్రుడి పూర్వ వృత్తాంతాన్ని శ్రీరాముడికి చెప్పిన శతానందుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-51
విశ్వామిత్రుడి పూర్వ వృత్తాంతాన్ని
శ్రీరాముడికి చెప్పిన శతానందుడు
వనం జ్వాలా నరసింహారావు

విశ్వామిత్రుడు చెప్పిన మాటలకు, రామచంద్రమూర్తి దర్శనం తనకు కలిగినందుకు, గౌతముడి కుమారుడైన శతానందుడు చాలా సంతోషించి, "మునీంద్రా, చిరకాలం తపస్సు చేసి కీర్తి సంపాదించిన నా తల్లిని శ్రీరాముడికి చూపావా? నా తల్లి అహల్య, సర్వ జీవకోటికి పూజ్యుడైన రాముడిని అడవి ఫలాలతో పూజించిందా? అంత తపస్సు చేసి-అంత కీర్తి సంపాదించి కూడా, కాలం కలిసి రానప్పుడు ఆమె చేసిన తప్పు గురించి కూడా రాముడికి చెప్పావా? దశరథ నందనుడి దర్శన మహిమవల్ల,స్నేహభావంతో నా తల్లి తిరిగి నా తండ్రిని కలిసిందా? మహిమాత్ముడైన రాముడిని నా తండ్రి పూజించాడా? తన ఆశ్రమానికి వచ్చిన పుణ్యాత్ముడైన నా తండ్రి చేసిన పూజలను రాముడు గ్రహించాడా? నా తండ్రి మళ్లీ నా తల్లిని చేరదీశాడా?" అని విశ్వామిత్రుడిని అడుగుతాడు. శతానందుడుతో, తాను సమయం వృధా కాకుండా చేయాల్సిన పనులన్నీ చేసానని, పరశురాముడి తల్లి రేణుక తన భర్త జమదగ్నిని కలిసినట్లే , అతడి తల్లి అహల్య గౌతముడుని కలిసిందని అంటాడు.


శతానందుడు, శ్రీరామచంద్రుడికి స్వాగతం పలికి, మిథిల దేశం అదృష్టం కొద్దీ, జయింపనలవికాని తేజస్సుగల రాముడు విశ్వామిత్రుడు పిలుచుకొని రావడంవల్లనే సంతోషంగా తమ దేశానికి వచ్చాడని అంటాడు. ఎవరి వెంటైతే రాముడక్కడకొచ్చాడో, అసమానతేజంగల ఆ విశ్వామిత్రుడు సామాన్యుడు కాదని, ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షితనాన్ని సంపాదించాడని, శిష్టులలో శ్రేష్టుడైన ఆయన తననిక్కడకు తీసుకొచ్చాడంటే అదేదో మేలుచేసేందుకేనని శ్రీరాముడికి చెప్పాడు శతానందుడు. ఇతర ఋషీశ్వరులకు లభించనలవికాని తపోబలంగల విశ్వామిత్రుడి రక్షణలో వున్న రాముడంతటి ధన్యుడు ప్రపంచంలో మరొకరులేరని అంటూ, ఆ మహానుభావుడి మహిమను, గుణాన్ని, చరితాన్ని కొరత లేకుండా రాముడికి చెప్పాడీవిధంగా: "ధర్మస్వభావుడైన విశ్వామిత్రుడు చాలాకాలం ప్రజలను పాలించాడు. అన్ని విద్యలను నేర్చుకొని, ప్రజాహిత కార్యక్రమాలను శ్రద్ధగా చేస్తూ,ధర్మజ్ఞుడనే కీర్తిపొంది ప్రసిద్ధుడయ్యాడు. బ్రహ్మ కొడుకైన కుశుడి కుమారుడు కుశనాభుడు. కుశనాభుడి కుమారుడైన గాధి కొడుకే విశ్వామిత్ర బ్రహ్మర్షి. విశ్వామిత్రుడు అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తూ, ఒక పర్యాయం, సేనలతోగూడి భూమంతాతిరుగుతూ ఆశ్రమాలను, పట్టనాలను, నదులను, కొండలను చూశాడు.


అలా తిరుగుతూ ఒకనాడు, నానా రకాల చెట్లు-పెక్కు విధాలైన మృగాలు–పక్షులు–దానవులు– దేవతలు–సాధువులైన జనులు-మనోజ్ఞమైన అగ్నితో సమానమైన మహాత్ముల తోను, తపస్సు చేసే ధన్యులతోను, దివ్య తేజస్సుగల బ్రహ్మర్షులతోను, జలమే ఆహారంగా గల వారితోను, చెట్లనుండి రాలిన ఆకులను తిని జీవించేవారితోను, ఫలాలు తినేవారితోను, కోపాన్ని జయించిన వారితోను, ఇంద్రియ నిగ్రహం కలవారితోను, రకరకాల ఋషులతోను, జపశీలురైన వానప్రస్థులతోను, వాలఖిల్యులలాంటి నానా మునిజనసమూహాలతోను అలరారుతున్న అసమానమై-బ్రహ్మలోకమా అని అనదగిన వశిష్ఠాశ్రమాన్ని చూశాడు".

No comments:

Post a Comment