Friday, February 5, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-43 : శివుడి జటాజూటం నుండి బయట కొచ్చిన గంగ : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-43
శివుడి జటాజూటం నుండి బయట కొచ్చిన గంగ
వనం జ్వాలా నరసింహారావు

"బ్రహ్మ దేవుడిలా చెప్పి మాయం కాగానే, భగీరథుడు కాలి బొటనవేలు నేలపై మోపి, నిలబడి, ఏడాదిపాటు శివుడి కొరకు తపస్సు చేశాడు. రెండు చేతులూ పైకెత్తి, ఏ ఆధారం లేకుండా, నిరాధారంగా నిట్టనిడివిగా నిలబడి, శివుడి కొరకు రేయింబవళ్లు తపస్సు చేయడంతో, ఆయన ప్రత్యక్షమైనాడు. భగీరథుడి తపస్సుకు ప్రీతి చెందానని, ఆయన కోరిక ప్రకారమే గంగానదిని తన శిరస్సుపై ధరిస్తానని మాటిస్తాడు. శివుడిలా చెప్పగానే, గర్వాతిశయంలో వున్న ఆకాశ గంగ, ఎలా శివుడు తనను సహించగలుగాతాడో పరీక్షించాలని-ఆయన్నెత్తుకుని పాతాళంలో పడేయాలని నిశ్చయించుకుంటుంది. భయంకరమైన ఆకారంతో, సహించరాని అధికమైన వేగంతో వస్తున్నా ఆకాశ గంగ పొగరు చూసిన శివుడు, రోషంతో విజృంభించి గంగ ఉనికి లేకుండా చేయాలనుకుంటాడు. హిమవత్పర్వతంతో సమానమైన గుహలాంటి రుద్రుడి జడలో భయంకరంగా ప్రవేశించిన ఆకాశ గంగ, వెలుపలకి రాలేక, అందులోనే తిరుగుతూ, చాలా సంవత్సరాలు సుళ్లు తిరుగుతూ బాధననుభవించింది. శివుడి జడలో ప్రవేశించిన గంగ, బయటకు రాలేకపోవడంతో భగీరథుడు మళ్లీ శివిడుగురించి మరింత నిష్ఠతో తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తన జడల గుంపును కొంత సడలించి, ఆ సందులోంచి కొంచం పరిమాణంలో గంగను బిందు సరోవరంలో విడిచాడు. అక్కడినుంచి ఏడు పాయలుగా గంగా నది పారింది. హ్లాదిని, పావని, నళిని అనే మూడు పాయలు తూర్పు ముఖంగా-సుచక్షువు, సీత, సింధు అనే మూడు పాయలు పడమటి దిక్కుగా పారాయి. మిగిలిన ఏడో పాయ భగీరథుడి వెంట వచ్చింది. భగీరథుడు ఆకాశ గమనం గల దివ్యరథాన్నెక్కి- ఆకాశ మార్గంలో పయనం చేస్తుంటే, దేవతల పొగడ్తల మధ్య గంగ భూమ్మీదగా భగీరథుడి వెంట పోయింది. అప్పటి నళిని పాయనే ఇప్పుడు బ్రహ్మపుత్రి నదని అంటున్నారు".


"అలా నిర్మలమైన కాంతితో ఆకాశాన్నుండి చీలిపోయి, శివుడి జటాజూటంలోకి చొరబడి, అక్కడినుంచి భూమి పైకొచ్చి, తాబేళ్లు-చేపల్లాంటి జలచరాలతో నిండి, భూమిపై ప్రవహించ సాగింది గంగ. దేవతలు, మునులు, సురలు, యక్షులు, ఏనుగుల మీద-గుర్రాల మీద-విమానాల మీద అతి వేగంగా ఆకాశం పైకి చేరుకుని, ఆశ్చర్యంగా గంగా పతన దృశ్యాన్ని వీక్షించ సాగారు. దేవతల దేహ కాంతితో-వారు ధరించే ఆభరణాల కాంతితో భూమ్మీదకు దిగుతున్న గంగ కాంతితో, మబ్బుల్లేని ఆకాశం వంద మంది సూర్యులతో నిండినట్లు ప్రకాశించసాగింది. కదలాడే మిడిసిపడుతున్న చేపలు-పాముల గుంపులతో గగనం మెరుపులతో నిండిందా అన్న విధంగా వుంది. నీటి వేగానికి నలు దిక్కులా చెదరిన తెల్లటి నురుగుతో ఆకాశం, హంసలతో-శరత్కాల మేఘాల తునకలతో ప్రకాశిస్తున్నదాననిపించింది. ప్రవహిస్తున్న గంగానది, పల్లపు ప్రదేశాల్లో ధూర్త స్త్రీలాగా వేగంగా పరుగెత్తుతూ-సమ ప్రదేశాల్లో మెల్లగా గంభీరంగా పతివ్రతా స్త్రీలాగా నడుచుకుంటూ-ఇంకొక చోట వేశ్యలాగా వంకర టింకర తోవలో పోతూ-మిట్ట ప్రదేశాల్లో ఆటకత్తెలా గంతులు పెట్టుకుంటూ, తొక్కిసలాడుకుంటూ పోతూ-మరో చోట బలిసిన పిరుదులు కలదానిలా మందంగా నడుచుకుంటూ పోతూ దర్శనమిచ్చింది. పారుతున్న నీటికెదురుగా ఏదైనా అడ్డం వచ్చినప్పుడు, అది వెనక్కు మళ్లడంతో-వెనుకనుండి వస్తున్న నీరు ఈ నీటిని తాకి-కలిసిన నీళ్లు ఎగిరెగిరి పడుతుంటే, ఆ దృశ్యం చూసేవారికి, దరిద్రుడికి ధనం దొరికితే ఎలా మిడిసి పడతాడో అలా వుంది. పవిత్రమైన గంగా జలం శివుడి శిరస్సునుండి పడిందని భావించిన దేవతలు-దేవర్షులు-భూమిపైనున్నవారందరు అందులో స్నానం చేశారు. శాప కారణంగా భూమ్మీదనున్న దేవతలు కూడా గంగా స్నానం చేసి, పాపరహితులై తిరిగి దేవత్వాన్ని పొందారు. భూమ్మీదున్న ప్రజలు కూడా గంగలో స్నానం చేసి తరించారు. ఇలా గంగ భగీరథుడి రథం వెంట పోతుంటే, దాని వెంబడి దేవతల-రాక్షసుల-కిన్నరుల-యక్షుల గుంపులు పోతుండగా, మార్గమధ్యంలో, జహ్నుడు అనే ముని యజ్ఞం చేస్తున్న ప్రదేశాన్ని గంగ నీటితో ముంచింది".

గంగా జలాన్నంతా తాగిన జహ్నుడు

"ఎప్పుడైతే నీటితో గంగ తన యజ్ఞ వాటికను ముంచేసిందో, జహ్నుడు కోపించి, గంగ గర్వం అణచాలనుకొని, నిమిషంలో గంగా జలాన్నంతా తాగేశాడు. అప్పుడు దాని వెంట వస్తున్న మునీంద్రులు-ఇతర దేవతా గణం ఆయన్ను ప్రార్థించి, గంగ ఆయన కూతురుగా ప్రఖ్యాతి వహిస్తుందని చెప్పి, ఆమెను వదిలిపెట్టమని కోరుతారు. వారి మాటలకు సంతోషించిన జహ్నుడు, గంగను తన చెవులలో నుండి బయటకొదిలాడు. గంగ అందువల్ల జాహ్నవిగా పిలువబడుతుంది. గంగ ఆ పిమ్మట భగీరథుడి రథం వెంట పోయి, సముద్రంలో ప్రవేశించి, ఆయన కోరిక నెరవేర్చేందుకు పాతాళానికి పోయి, భగీరథుడి తాతల బూడిదమీద దండిగా ప్రవహించడంతో, సగర పుత్రులంతా దోషరహితులై, స్వర్గానికి పోయారు".


(ఆకాశాన నున్న గంగ, స్థాన భ్రష్టురాలై, మధ్యలో ఆగకుండా, పాతాళ లోకానికి చేరుకుందని దీని సారాంశం. అంటే, ఉన్నత దశలో వున్నవాడు చెడిపోతే అధమాధమ దశకు చేరుకుంటాడు. చెట్టు పైనున్న పండు తొడిమ వూడితే, నేలపై పడుతుంది కాని మధ్యలో ఆగదు. ఉత్తమ బ్రాహ్మణుడు పతితుడై చెడిపోతే నీచుడవుతాడు. స్వబుద్ధితో కాకుండా దైవ వశంలో చెడితే మంచి పనులు చేసి కీర్తి పొందాలి గంగలాగా. గంగ పతనానికి దాని తప్పు కారణం కాదు. అది దైవాజ్ఞ. ఉత్తమ గుణాలు కలిగిన గంగ, దైవాజ్ఞ వల్ల హీన దశకు చేరుకున్నా లోకులను బాగుచేసి కీర్తి గడించింది).

No comments:

Post a Comment