Wednesday, February 17, 2016

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-IX : వనం జ్వాలా నరసింహారావు

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-IX
వనం జ్వాలా నరసింహారావు

ధర్మపురి క్షేత్ర నరసింహ స్వామికి మహా భక్తుడైన శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని పద్యాలను యధాతధంగా నా బ్లాగ్ పాఠకులకు అందించే ప్రయత్నం ఇది. పదిరోజులకొకసారి పది పద్యాల చొప్పున వంద రోజులయ్యేసరికి వీటన్నింటినె నా బ్లాగ్ లో చదవ వచ్చు. (ఇవి తొమ్మిదవ విడత పది పద్యాలు). 

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-81

సీII భావంబు నీనామ భజన గోరుచునుండు,
జిహ్వ నీ కీర్తనల్ చేయ గోరు;
హస్తయుగ్మంబు నిన్నర్చింప గోరును,
గర్ణముల్ నీమీది కథను గోరు;
దనువు నీ సేవయే ఘనముగా గోరును,
నయనముల్ నీ దర్శనంబు గోరు,
మూర్ధమ్ము నీపదంబుల మ్రొక్కుగా గోరు,
నాత్మ నీదై యుండు నరసిచూడ;
తేII స్వప్నములైన నేవేళ సంతతమును
బుద్ధి నీ పాదములయందు బూనియుండు,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-82

సీII పద్మాక్ష! మమతచే బరమునందెదమంచు
విర్రవీగుదుమయ్య! వెర్రిపట్టి
మా స్వతంత్రంబైన మదము కండ్లకు గప్పి
మొగముపట్టదు కామ మోహమునను;
బ్రహ్మ దేవుండైన బైడి దేహము గల్గ
జేసివేయక మమ్ము జెరిచె నతడు;
తుఛ్ఛమైనటువంటి తోలెమ్ముకలతోడ
మురికిచెత్తలు చేర్చి మూటకట్టె;
తేII నీ శరీరలు పడిపోవు టెరుగకేము
కాముకులమైతి! మిక మిమ్ము గానలేము,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-83

సీII గరుడవాహన! దివ్య కౌస్తుభాలంకార
రవి కోటితేజ! సారంగవదన!
మణిగణాన్విత! హేమ మకుటాభరణ! చారు
మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర! రత్న కాంచీవిభూషిత!
సురవరార్చిత! చంద్ర సూర్య నయన!
కమలనాభ! ముకుంద! గంగాధరస్తుత!
రాక్షసాంతక! నాగ రాజశయన!
తేII పతితపావన! లక్ష్మీశ! బ్రహ్మ జనక!
భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-84

సీII పలుమారు దశరూపములు ధరించితివేల?
నేకరూపము బొందవేల నీవు?
నయమున క్షీరాబ్ధి నడుమ జేరితివేల?
రత్నకాంచన మందిరములు లేవె?
పన్నగేంద్రునిమీద బవ్వళించితివేల?
జలతారు పట్టెమంచములు లేవె?
రెక్కలుగల పక్షి నెక్కిసాగితివేల?
గజతురంగాందోళికములు లేవె?
తేII వనజలోచన! యిటువంటి వైభవములు
సొగసుగా నీకు దోచెనో? సుందరాంగ!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
   దుష్టసంహార ! నరసింహ ! దురితదూర




శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-85

సీII తిరుపతి స్థలమందు దిన్నగా నేనున్న
వేంకటేశుడు మేత వేయలేడె?
పురుషోత్తమునకు బోయిన జాలుజ
గన్నాథు డన్నబు గడపలేడె?
శ్రీరంగమునకు నేజేరబోయినజాలు
స్వామి గ్రాసము పెట్టి సాకలేడె?
కాంచీపురములోన గదిసి నే కొలువున్న
గదివరదుడు పొట్ట గడపలేడె?
తేII యెందుబోవక నేను నీ మందిరమున
నిలిచితిని, నీకు నామీద నెనరు లేదు,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-86

సీII తార్క్ష్య వాహన! నీవు దండి దాత వటంచు
గోరి వేడుక నిన్ను గొల్వవచ్చి
యర్ధిమార్గమును నే ననుసరించితినయ్య
లా వెనుబదినాల్గు లక్షలైన
వేషముల్ వేసి నా విద్యా ప్రగల్భత
జూపసాగితి నీకు, సుందరాంగ!
యానందమైన నే నడుగ వచ్చిన దిచ్చి
వాంఛ దీర్చుము నీలవర్ణ, వేగ
తేII నీకు నావిద్య హర్షంబు గాకయున్న
తేపతేపకు వేషముల్ దేనుజుమ్మి!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-87

సీII అమరేంద్రవినుత! నే నతిదురాత్ముడనంచు
గలలోన నైనను గనుల బడవు,
నీవు ప్రత్యక్షమై నిలువకుండినమానె,
దొడ్డగా నొక యుక్తి దొరకెనయ్య!
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి
నీ స్వరూపముచేసి నిలుపుకొంచు
ధూప దీపములిచ్చి తులసితో బూజించి
నిత్యనైవేద్యముల్ నేమముగను,
తేII నడపుచును నిన్నుగొలిచెద నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గలిగె నా కింతెచాలు,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-88

సీII భువనేశ! గోవింద! రవికోటిసంకాశ!
పక్షివాహన! భక్త పారిజాత!
యంభోజ భవరుద్ర జంభారి సన్నుత!
సామగాన విలోల! సారసాక్ష!
వనధిగంభీర! శ్రీవత్సకౌస్తుభవక్ష!
శంఖచక్రగదాసి శార్జహస్త!
దీనరక్షక! వాసుదేవ! దైత్యవినాశ!
నారదార్చిత! దివ్యనాగశయన!
తేII చారునవరత్నకుండల శ్రవణయుగళ!
విబుధవందిత పాదాబ్జ విశ్వరూప!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-89

సీII నాగేంద్రశయన! నీ నామ మాధుర్యంబు
మూడుకన్నుల సాంబమూర్తి కెరుక;
పంకజాతాక్ష! నీ బలపరాక్రమ మెల్ల
భారతీపతియైన బ్రహ్మ కెరుక;
మధుకైటభారి! నీ మాయాసమర్థత
వసుధలో బలిచక్రవర్తి కెరుక;
పరమాత్మ! నీదగు పక్షపాతిత్వంబు
దశశతాక్షుల పురందరున కెరుక
తేII వీరికెరుకగు నీ కథల్ వింతలెల్ల
నరుల కెరుకన్న నెవరైన నవ్విపోరె?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-90

సీII అందరేమైన నిన్నడుగ వచ్చెద రంచు
క్షీరసాగరమందు జేరినావు,
నీ చుట్టు సేవకుల్ నిలువకుండుటకునై
భయద సర్పముమీద బండినావు,
భక్తబృందము వెంటబడి చరించెద రంచు
నెగసిపోయెడి పక్షి నెక్కినావు,
మౌనులు నీ ద్వారమాసింపకుంటకు
మంచియోధుల కావలుంచినావు,
తేII లావు గలవాడవైతి; వేలాగు నేను
నిన్ను జూతును? నా తండ్రి నీరజాక్ష!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

No comments:

Post a Comment