బాలకాండ
మందరమకరందం
సర్గ-49
అహల్యా
శాప విమోచనం
వనం
జ్వాలా నరసింహారావు
"వృషణ హీనుడైన
ఇంద్రుడు, దేవతల పురోహితుడైన అగ్ని
దేవుడితో సహా ఇతర దేవతలందరితో తనీ స్థితికెందుకెందుకు రావలసి వచ్చిందో చెప్పాడు.
గౌతముడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కోపాన్ని జయించాడా-లేదానని పరీక్షించేందుకు, అతడికి కోపాతిశయం కలిగించేట్లు తపస్సును చెడగొట్టానని అంటాడు. ఇలా
తను చేసిన దేవతా కార్యానికి ప్రతిఫలంగా గౌతముడు, తనను బీజహీనుడివి కమ్మని శపించాడన్నాడు. భార్యపైకూడా కోపమొచ్చి,ఆమెనూ శపించి-వదిలిపెట్టి,తపస్సును వ్యర్థంచేసుకున్నాడు గౌతముడు అనికూడా చెప్పాడు
ఇంద్రుడు.దేవకార్యం చేసిన తనకీగతి పట్టింది కాబట్టి, తిరిగి తన వృషణాలొచ్చే ఉపాయం చేయమని వారందరినీ కోరాడు.ఇంద్రుడిలా
వారినికోరడంతో,అగ్ని మొదలైన దేవతలు,మరుద్గణం-పితృదేవతలతో, వృషణాలులేని ఇంద్రుడికి మేకఅండాలనిచ్చి బీజయుతుడిగా చేయమని
ప్రార్థించారు. యజ్ఞంలో మనుష్యులు వృషహీణమైన మేక మాంసాన్ని ఇస్తే,దాంతో తృప్తిచెంది,యజ్ఞఫలానికి హానిరాకుండా
చేయమనికూడా అంటారు వారు. దేవతలు కోరినట్లు పితృదేవతలు, మేక బీజాలు తీసి, ఇంద్రుడికి తగిలించారు. ఆ
రోజునుంచి, బీజాలు లేని మేకమాంసాన్ని
యజ్ఞంలో భుజించి,యజ్ఞం చేసినవారికి
యాగఫలాన్ని విశేషంగా ఇవ్వసాగారు. గౌతమమహర్షి తపోబలం వల్ల,నాటినుండి ఇంద్రుడు"మేఘవృషణుడు"అయ్యాడు"అని చెప్పిన
విశ్వామిత్రుడు, గౌతముడి ఆశ్రమంలో
ప్రవేశించి, అహల్యను ఉద్ధరించేలా
సంకల్పించమని శ్రీరాముడిని కోరాడు.
విశ్వామిత్రుడిలా
చెప్పడంతో, లక్ష్మణుడితో కలిసి
రామచంద్రమూర్తి, విశ్వామిత్రుడు ముందు
నడవగా, గౌతముడి ఆశ్రమంలోకి
ప్రవేశించాడు. తపస్సునే భాగ్యంగా కలిగున్నదాన్ని, గొప్ప తపస్సు చేయడం వల్ల అతిశయించిన తేజస్సు కలిగిన దాన్ని, దేవ-దాన-మానవులకింతవరకు కనిపించని దాన్ని, మనుష్యులలో ఎవరికీ లేని సౌందర్యం కలదిగా బ్రహ్మ మాయతో సృష్టించబడిన
దాన్ని, మంచు కప్పి-మబ్బు కమ్మినా
చంద్రకాంతిలా వున్నదాన్ని, నీటిలో కనిపిస్తున్న
సూర్యుడిని ఎండలా చూడడం సాధ్యంకాని రీతిలో వున్నదాన్ని అక్కడ చూశాడు శ్రీరాముడు.
ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించగానే, శాపం తొలిగిన అహల్య, పూర్వరూపంలో లోకానికి
కనపడింది. శ్రీరామ లక్ష్మణులు ఆమెకు నమస్కరించారు. వారు అవతారమూర్తులని గౌతముడు
తనకు శాపమిస్తున్నప్పుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకున్న అహల్య, పూజ్యులైన వారికి అర్ఘ్యపాద్యాలను ఇచ్చింది. రామచంద్రమూర్తి అవి
తీసుకుంటున్నప్పుడు దేవతలు దుందుభులు మోగించి, మేలు-మేలని అహల్యను మెచ్చుకున్నారు. ఇలా, శ్రీరామానుగ్రహం వల్లా, ఇంతకాలం తపస్సు చేసినందున పరిశుద్ధురాలైనందు వల్లా గౌతముడు ఆమెను
పరిగ్రహించి శ్రీరాముడిని పూజించాడు. మునీశ్వరుడి పూజలందుకున్న రామచంద్రమూర్తి
ప్రయాణానికి బయల్దేరాడు.
No comments:
Post a Comment