బాలకాండ
మందరమకరందం
సర్గ-60
త్రిశంకుడిని
స్వర్గానికి పంపిన విశ్వామిత్రుడు
వనం
జ్వాలా నరసింహారావు
"ఈ విధంగా వశిష్ఠుడి
కొడుకులను శపించిన విశ్వామిత్రుడు, తన పిలుపు మేరకు యజ్ఞం చూసేందుకొచ్చిన మునుల సమూహంతో, ఇక్ష్వాక వంశం రాజైన త్రిశంకుడనే ధర్మాత్ముడిని-మహాభాగ్య సంపన్నుడిని-దేహంతో స్వర్గానికి పోదల్చి తన సహాయం కోరినవాడిని వారికి పరిచయం
చేస్తున్నానంటాడు. తమందరం కలిసి, ఆలోచించి, ఏ యజ్ఞం చేస్తే అతడి కోరిక నెరవేరుతుందో ఆ యజ్ఞాన్నే చేద్దామంటాడు.
పరమ కోపిష్టైన విశ్వామిత్రుడికి భయపడిన వారందరూ, ఆయన మాట ఎందుకు కాదనాలని-ఆ మూర్ఖుడికెందుకు అడ్డు చెప్పాలని-ఆయన రాజు
కోరిక నెరవేరుస్తుంటే తమ కొచ్చే నష్టమేంలేదని అనుకుని, ఆయన చెప్పినట్లే కార్య నిర్వహణకు పూనుకున్నారు. విశ్వామిత్రుడు
యాజకుడై యాగం నిర్వహిస్తుండగా, మునులందరు తమకప్పచెప్పిన
పనులను కడు హెచ్చరికతో చేసారు. యజ్ఞం సాగుతున్నప్పుడు, హవిర్భావాలను తీసుకెళ్లాల్సిందిగా విశ్వామిత్రుడు దేవతలను
కోరినప్పటికీ, పిలిచిన వారెవరూ
రాలేదక్కడికి. దాంతో ఆయన కోపంతో కళ్లెర్రచేశాడు. వెంటనే యజ్ఞం దగ్గరున్న
కొయ్యగరిటను చేత్తో తీసుకుని, ప్రస్తుతానికి
ప్రయోజనంలేని యజ్ఞంతో నిమిత్తం లేకుండా, తన తపశ్శక్తితో, దేహంతో స్వర్గానికి
పంపిస్తానని త్రిశంకుడితో అంటాడు విశ్వామిత్రుడు".
"తను
సంపాదించిన తపఃఫలంలో, వశిష్ఠాదుల శాపంవల్ల
ఖర్చయింది పోగా ,ఇంకా మిగలనున్నదాని బలంతో, బొందితో ఎవరికీ వెళ్లడానికి సాధ్యపడని స్వర్గానికి పొమ్మని
త్రిశంకుడినంటాడు. విశ్వామిత్రుడలా అంటుండగానే, ఋషులందరు చూస్తుండగా, త్రిశంకుడు ఆకాశ మార్గంలో స్వర్గం చేరువలోకి పోయాడు. అప్పుడు దేవతా
సమూహంతో వున్న ఇంద్రుడు, త్రిశంకుడిని చూసి, అతడు స్వర్గంలో వుండతగినవాడు కాదని, తిరిగి భూమిమీదకే పొమ్మని అంటాడు. గురువు శాపంతో చండాలుడైనవాడనీ, మూఢుడనీ, ఏ లోపంలేని మానవుడికే
స్వర్గప్రాప్తిలేనప్పుడు వాడెలా స్వర్గంలోకి రాగలుగుతాడనీ కోపంతో, త్రిశంకుడిని తలకిందులుగా భూమిమీద దొర్లమని అంటాడు ఇంద్రుడు”.
“తనను రక్షించమని వేడుకుంటాడు కిందకు పడుతున్న త్రిశంకుడు. అతడి
దీనాలాపాలను విన్న విశ్వామిత్రుడు తీవ్రకోపంతో విజృంభించి, పడిపోతున్న త్రిశంకుడిని, ఆకాశం మధ్యలోనే నిలవమని-కింద పడొద్దని అంటూ, తన తపశ్శక్తితో ఆపు చేస్తాడు. అంతటితో ఆగకుండా, ఆకాశంలో దక్షిణదిక్కున సప్తర్షులను (నక్షత్రాలు) సృష్టించి, అక్కడో స్వర్గలోకాన్ని, మరో ఇంద్రుడిని-దేవతలను సృష్టించేందుకు సిద్ధమవుతాడు. తననుకునే
విధంగా సృష్టించడం కుదరకపోతే, లోకంలో ఇంద్రుడే లేకుండా
చేసేందుకు పూనుకుంటున్న సమయంలో దేవతలు, మునులు విశ్వామిత్రుడిదగ్గరకొచ్చి ప్రార్థించారు. తన తపశ్శక్తిని లోకోపకారానికి ఉపయోగించాలేగాని అలా చేయడం తగదనీ, గురు శాపంతో నిహతుడయినవాడిని స్వర్గానికి పంపడం తగదనీ, స్వర్గం పాడైపోకూడదనీ, అలా జరిగితే శాస్త్రాలన్నీ ధ్వంసమైపోవాల్సిందేననీ, అలా కావడానికి అతడు కారణం కారాదనీ అంటూ, విశ్వామిత్రుడిని శాంతించమని వేడుకుంటారు. రాజర్షైన వాడే ఇంత పనికి
పూనుకుంటే, బ్రహ్మర్షులు కూడా
శాస్త్ర మర్యాద మీరితే ఏం కావాలని అడుగుతూ, శాస్త్ర మర్యాదను ఉల్లంఘించవద్దని అంటారు దేవతలు. అలా చెప్పిన వారితో, త్రిశంకుడిని స్వర్గానికి పంపిస్తానని తను మాటిచ్చానని, ఇచ్చిన మాటెలా తప్పాలని ప్రశ్నించి, తనొక ఉపాయం చెప్తానంటాడు. తాను సృష్టించిన నక్షత్రాలను
ధ్వంసం చేయొద్దనీ-శాశ్వతంగా వుండనియ్యాలనీ, త్రిశంకుడు తలకిందుగా-అతడిని అనుసరించి ఆ నక్షత్రాలను అక్కడే
వుండనివ్వాలని వారికి చెప్పాడు. వారొప్పుకోగానే, విశ్వామిత్రుడు శాంతించాడు. త్రిశంకుడు స్వర్గంలో లాగానే అక్కడే
సుఖపడే వీలు కలిగించారు దేవతలు".
No comments:
Post a Comment