బాలకాండ
మందరమకరందం
సర్గ-46
ఇంద్రుడిని
చంపగల కొడుకు
కొరకు వ్రతం చేసిన దితి
వనం
జ్వాలా నరసింహారావు
"తన కొడుకులకు
పట్టిన దురవస్థను చూసి, దిగులుపడిన దితి, దుఃఖాతిశయంతో భర్త కశ్యపుడి దగ్గరకు పోయి, ఆయన కొడుకులే తన కడుపు కొట్టారని, తన పగ తీర్చగల కొడుకొక్కడైనా పుట్టకపోతే తానెట్లా పుత్రశోకాన్ని
భరిస్తానని అడుగుతుంది. ఇంద్రుడిని చంపగలిగే కొడుకు తన కడుపున పుడితే, తన పగ తీరుతుందని, అలాంటి కొడుకు
పుట్టేటట్లు తనను అనుగ్రహించమనీ, దానికొరకు భర్త చెప్పినట్లే
తపస్సు చేస్తాననీ అంటుంది దితి కశ్యపుడితో. అలా దుఃఖిస్తున్న దితితో, వెయ్యేళ్లు తను చెప్పిన రీతిలో పూర్ణంగా-విఘ్నం లేకుండా తపస్సు
చేస్తే, ఇంద్రుడిని
చంపగలిగి-ముల్లోకాలను ఏల గలిగే కొడుకు పుట్తాడని చెప్తాడు కశ్యపుడు. అలా చెప్పిన
కశ్యపుడు, దితి కడుపును తనచేత్తో
తాకి, ఆమెకు ప్రియం కలగాలని
కోరుకుంటూ, తపస్సు చేయడానికి
వెళ్ళాడు. సంతోషించిన దితి, కుశప్లవం అనే క్షేత్రంలో, దీర్ఘకాలం తీవ్రంగా తపస్సు చేసింది. ఆ సమయంలో ఆమెకు సపర్యలు
చేసేందుకొరకు స్వయంగా ఇంద్రుడొచ్చాడు. వచ్చిన ఇంద్రుడు, నీతి మార్గాన్ని కొంచెం కూడా వదిలిపెట్టకుండా, వినయంతో, గొప్ప భక్తితో, దితికి సేవలు చేశాడు. సమయానికి మంచి పళ్లు, దర్భలు, సమిధలు, ఇతర వస్తువులు సమకూరుస్తుండేవాడు. తపస్సు చేసి అలసిపోతే విసన కర్రతో
శ్రమ పోయేందుకు విసిరేవాడు. బదలిక చెందినప్పుడు కాళ్లు పిసికే వాడు. ఆమె ఏ పని
చెప్పినా ఆలస్యం చేయకుండా-విసుగు పడకుండా, వెంటనే చేసేవాడు. ఇలా ఇంద్రుడి శుశ్రూషలో ఆమె తపస్సు వెయ్యేళ్లకు పది
సంవత్సరాలు తక్కువగా పూర్తి కావచ్చింది".
"ఇంద్రుడి సేవకు
తృప్తి చెందిన దితి, వ్రతం పూర్తికావచ్చింది
కనుక, విఘ్న భయం లేదని
భావించింది. తనెందుకు తపస్సుచేస్తుందోనన్న రహస్యాన్ని ఇంద్రుడికి ధైర్యంగా
చెప్పింది. ఇంద్రుడి తండ్రిని తను ఒక వరం కోరాననీ-ఆయన తనను అనుగ్రహించి వేయి
సంవత్సరాలు తపస్సు చేయమన్నాడనీ-ఆ అఖండ తపస్సువలన తనకొక కొడుకు పుడుతాడనీ-ఆయన వర
బలంతో, ముల్లోకాలలో ఇంద్రుడితో
సహా ఎవరూ ఎదిరించలేని బలవంతుడైన కొడుకు తన గర్భంలో కలిగాడని-మరో పదేళ్ల తర్వాత
బలవంతుడుగా పుట్టనున్న తమ్ముడిని ఇంద్రుడు చూస్తాడనీ, అంటుంది దితి ఇంద్రుడితో. తనను గెలవగలవాడు పుడుతున్నాడని ఇంద్రుడు భయ
పడవద్దని, తన కొడుకుతో మాట్లాడి
ఇంద్రుడికి ఏ కొరత లేకుండా వాడిని చక్కదిద్దుతానని, ఇద్దరు కలిసిమెలిసి లోకాలను రక్షించాలని చెప్తుంది. అలా చెప్పి, మధ్యాహ్నపు ఎండకు అలిసిపోయిన దితి, దేహాన్ని మరిచి, తల వెంట్రుకలు కాళ్లమీద
జారుతుంటే, మోకాళ్ల మీద తలనుంచి, సుఖంగా నిద్రిస్తుండగా చూసి తనలో తానే నవ్వుకున్నాడు ఇంద్రుడు. తనను
జయించేవాడు ఆమెకెలా కలుగుతాడో చూద్దామనుకుని, గర్భ పిండాన్ని నాశనం చేద్దామనుకుంటాడు".
దితి
గర్భంలో వున్న పిండాన్ని ఖండించిన ఇంద్రుడు
"అలసటతో
నిద్రిస్తున్న దితి గర్భంలోకి ప్రవేశించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో, ఆ గర్భ పిండాన్ని ఏడు తునకలుగా ఖండించాడు. అలా చేస్తున్నప్పుడు
ఏడ్చిన పిండంతో ఏడ్వవద్దని అంటూ, మరింత ఖండించసాగాడు.
ఇంతలో మేల్కొన్న దితి, పిండాన్నేం చేయొద్దని
అంటుంది ఇంద్రుడితో. తల్లిమీదున్న గౌరవంతో, చంపకుండా, వజ్రాయుధంతో సహా
బయటికొచ్చి, తల్లి పాదాలపై పడతాడు.
తాను నిజంగా అపరాధం చేశాననీ-అయినా క్షమించాలనీ-శపించకుండా మన్నించాలనీ-తల్లి
అశుచిగా, తల వెంట్రుకలు కాళ్లపై
పడుతుంటే నిదురిస్తున్నప్పుడు, తనను తాను
రక్షించుకోవాలన్న కోరికతో-తన్ను చంపేందుకు పుట్టనున్న వాడిని తునకలు చేశాననీ
అంటాడు. తనను చంపదల్చిన బ్రాహ్మణుడినైనా-స్త్రీనైనా-గోవునైనా, చంపవచ్చని శాస్త్రం చెప్తుందని, కాబట్టి తాను చేసింది దోషం కాదని అంటాడు ఇంద్రుడు దితితో".
No comments:
Post a Comment