బాలకాండ
మందరమకరందం
సర్గ-55
వశిష్ఠ విశ్వామిత్రుల
యుద్ధం
వనం జ్వాలా నరసింహారావు
"విశ్వామిత్రుడి
భయంకరమైన శస్త్రాస్త్రాలతో కాలిపోయిన తన సైన్యాన్ని చూసిన వశిష్ఠుడు, యోగ బలాన్ని ఆశ్రయించి శీఘ్రంగా శత్రు సేనలను సంహరించమని శబలను
ఆజ్ఞాపించాడు. వెంటనే హుంకరించిన కామధేనువు తన పొదుగులోంచి కాంభోజ సేనలను, యోనినుండి పప్లవ సమూహాలను, పేడ పుట్టే ప్రదేశంనుండి యవనులను, రోమ కూపాల (వెంట్రుక గూళ్లు) నుండి శకులను, మ్లేచ్ఛులను, కిరాతులను సృజించింది.
వారందరు శత్రు సేనలపై పడి, వారి
రథాలను-ఏనుగులను-గుర్రాలను-సైన్యాన్ని నాశనం చేసారు. అది చూసిన విశ్వామిత్రుడి
నూర్గురు కొడుకులు, మితిమీరిన కోపంతో, ఒకేసారి వశిష్ఠుడిమీదకు దూసుకొచ్చారు. ఆయన వెంటనే హుంకరించి నిమిషంలో
వంద మందినీ బూడిద రాసులుగా చేశాడు. తన నూర్గురు కొడుకులు ఒకేసారి
మరణించడంతో-సైన్యమంతా నుగ్గుకావడంతో, సిగ్గుతో కుమిలిపోయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడిని గెలిచేదెలానని మధన పడి, విషాదంతో భూమిపై వాలాడు. వేగంలేని సముద్రంలా, కోరలు పీకిన సర్పంలా, గ్రహణం నాటి సూర్యుడిలా, రెక్కలూడిన పక్షిలా కాంతీహీనుడై-గర్వభంగమై, ఎలాగైనా వశిష్ఠుడిని జయించాలన్న పట్టుదలతో, రాజ్యభారాన్ని కొడుకుకప్పగించి, వీరుడైన విశ్వామిత్రుడు హిమవత్పర్వతానికి పోయి, శివుడికొరకు తపస్సు చేశాడు”.
“శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాల్నో కోరుకొమ్మన్నాడు. భక్తజనుల
సంకటాలను హరించేవాడని, పార్వతీ ప్రియుడని, కఠినాత్ములైన రాక్షసులను సంహరించేవాడని, హరా-త్రిపుర సంహారా అని, మన్మథుడి గర్వం హరించినవాడని, దేవతల పూజలందుకునే చరణాలుగలవాడని శివుడిని స్తోత్రం చేసి, నమస్కరించి, విలువిద్యనంతా
అంగాలతో-ఉపాంగాలతో-మంత్రాలతో-వాటి రహస్యాలన్నిటితో
తనకు ఉపదేశించమని చేతులు జోడించి ప్రార్థించాడు విశ్వామిత్రుడు. రాక్షసుల వద్ద, మునుల వద్ద, గంధర్వుల వద్ద, యక్షుల వద్ద, దేవతల వద్ద వున్న
అస్త్రవిద్యలన్నీ తనకుపదేశించమని కోరాడు. ఆయన కోరినట్లే శివుడు ఉపదేశించి పోయాడు.
అస్త్రాలన్నీ తన స్వాధీనంలోకి వచ్చాయన్న ధైర్యంతో-గర్వంతో విశ్వామిత్రుడు
పున్నమినాటి సముద్రిడిలా పొంగిపోతూ, దూరపుటడుగులు వేసుకుంటూ, వశిష్ఠుడున్న ఆశ్రమానికి వచ్చాడు"
"సకల శత్రువులను
జయించిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడి తపోవనమంతా, స్వల్ప వ్యవధిలో, బలిష్టమైన తన
దివ్యాస్త్రాల జ్వాలల్లో కాల్చి బూడిద చేశాడు. అది సహించలేని అక్కడి మునులందరు, నలు దిక్కులా పరుగెత్తారు. పక్షులన్నీ ఆకాశానికి ఎగిరిపోయాయి.
శిష్యులు భయంతో వణికిపోయారు. రెప్పపాటులో ఆ వనమంతా అలా కావడంతో కోపగించిన
వశిష్ఠుడు, సూర్యుడు మంచును
కరిగించినట్లు, అవలీలగా విశ్వామిత్రుడిని
రూపుమాపుతాననీ, ఎవరూ పోవద్దనీ అన్నా, ఆగకుండా వారంతా పరుగెత్తారు. ఎవరుకూడా అక్కడ నిలవకుండా
పారిపోతుండడంతో, రోషావేశంతో
కనుబొమలదురుతుంటే, విశ్వామిత్రుడిని
మందలించాడు వశిష్ఠుడు. ఆతడి విజృంభణాన్ని ఆపలేనివాడిననుకొని, చిరకాలంనుండి పెంచుకుంటున్న తన తపోవనాన్నంతా కాల్చివేసిన
చెడుబుద్ధిగల విశ్వామిత్రుడిని ఇక సహించలేనని అంటూ, సాధ్యంకాని తేజస్సుతో అతన్ని తేరిపార చూశాడు వశిష్ఠుడు. ఇంత చెప్పినా
విశ్వామిత్రుడు వినిపించుకోకుండా, అస్త్రం వెంట అస్త్రాన్ని
ప్రయోగిస్తుండడంతో, వశిష్ఠుడు తనదగ్గరున్న
రెండవ యమదండంలాంటి-కాలాగ్ని జ్వాలలను చిమ్మే ప్రకాశవంతమైన బ్రహ్మ దండాన్ని చేతిలో
పట్టుకొని మాట్లాడకుండా నిలబడ్డాడు”.
No comments:
Post a Comment