యాగాల
ఫలమా శ్రీరామావతారం?
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ
చింతన కాలమ్ (30-04-2020)
ముని కుమారుడిని చంపినందువలనే తనకు సంతాన ప్రాప్తి కలగడం లేదని దశరథుడు చింతించాడు.
బాల్యంలో జరిగిన ఆ సంఘటనను, చాలాకాలం
మరిచిపోతాడు దశరథుడు. జ్ఞప్తికి వచ్చిన వెంటనే, పాప
పరిహారార్థం, అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన చేస్తాడు. అనిష్ఠ పరిహారం కొరకు అశ్వమేధ
యాగం చేయడంతో పాటు, ఇష్ట ప్రాప్తికొరకు పుత్ర కామేష్ఠి
యాగం కూడా చేద్దామనుకుంటాడు. పుత్ర కామేష్ఠికి పూర్వ రంగంగా అశ్వమేధ యాగం చేయాలని
దశరథుడి కోరిక. సంతాన ప్రాప్తికి ఉద్దేశించిన అశ్వమేధ యాగానికి ఋత్విజుడిగా
వ్యవహరించాల్సిందిగా, ఋశ్యశృంగుడిని ప్రార్తించాడు
దశరథుడు.
దశరథుడి కోరికను మన్నించిన ఋశ్యశృంగుడు, క్రతువుకు
కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోమని, యజ్ఞాశ్వాన్ని
వదలమని చెప్పగా, ఋత్విజులను, పండితులను,
బ్రహ్మ వాదులను పిలిపించమని దశరథుడు మంత్రి సుమంత్రుడిని
ఆదేశిస్తాడు. రాజాజ్ఞ మేరకు, సుమంత్రుడు,
బ్రాహ్మణోత్తములను పిల్చుకుని వస్తాడు. వచ్చిన వారందరినీ సగౌరవంగా
స్వాగతించి, సంతానం కలిగేందుకు అశ్వమేధ యాగం చేయ తలపెట్టానని అంటాడు దశరథుడు.
దశరథుడి మాటలు విన్నవారందరూ సంతోషంతో, ఆయన
తలపెట్టిన కార్యం మంచిదని అంటారు. వారిలో ముఖ్యులైన వశిష్ఠుడు,
ఋశ్యశృంగుడు, రాజు
ఆలోచన గొప్పదని, ఫలితం తప్పక లభిస్తుందని, ఆలశ్యం
చేయకుండా కార్యక్రమం ఆరంభించమని సలహా ఇస్తారు. బ్రాహ్మణులు చెప్పిన పనులన్నీ
తక్షణమే చేయాలని, వస్తువులన్నీ సమకూర్చాలని,
గురువులు చెప్పినట్లు యజ్ఞాశ్వాన్ని విడవమని, దానికి
రక్షణగా పురోహితుడొకడిని పంపమని, సరయూ
నదికి ఉత్తర దిశగా యజ్ఞశాల నిర్మించమని, శాంతి
కార్యాలన్నీ చక్కగా నిర్వహించమని మంత్రులను ఆదేశిస్తాడు దశరథుడు. రాజు తలపెట్టిన
కార్యం విఘ్నం కాదని, తమకప్పగించిన పనులన్నీ
నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చూస్తామని మంత్రులు హామీ ఇచ్చిన తదుపరి బ్రాహ్మణులు
శలవు తీసుకుని వెళ్లారప్పటికి.
మొదటి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు సాంగ్రహణేష్టిని జరిపించి,
మర్నాడు, శాస్త్రోక్తంగా బ్రహ్మౌదనం,
మేధ్యాశ్వబంధనం, స్నాపనం,
ప్రోక్షణం, అశ్వ
విమోచనం మొదలైన ’చత్వారస్సముక్షంతి’ అనే కార్యాలను నెరవేర్చి,
ఆ తర్వాత ప్రతిరోజూ శ్రుత్యుక్తంగా సావిత్రాది కర్మాలను చేస్తుండాలి.
ఆవిధంగా మొదటి సంవత్సరం గడచిన తర్వాత, రెండో
సంవత్సరం ఆరంభంలో అశ్వం యాగ స్థానానికి బయల్దేరాలి.
అశ్వాన్ని విడిచిన తర్వాత ఒక సంవత్సరకాలం పూర్తయి,
తిరిగి వసంత రుతువు చైత్ర మాసం రాగానే దశరథుడు వశిష్ఠుడి దగ్గరకు
వచ్చి అశ్వం తిరిగొచ్చిందని తెలియచేస్తాడు. వశిష్ఠుడు చెప్పిన ప్రకారం తాను యజ్ఞం
ప్రారంభిస్తానని, యాగానికి విఘ్నం లేకుండా ఆయన
కాపాడాలనీ విజ్ఞప్తిచేస్తాడు. రాజుకోరినవిధంగానే సర్వం తానే నిర్వహిస్తానని ఆయనకు
మాట ఇచ్చి, యజ్ఞ కార్యాలను పర్యవేక్షిందేకు నియమించిన వృద్ధ బ్రాహ్మణులను,
నియమవంతులైన ధర్మాత్ములను, స్థపతిసంఘాలను,
శిల్పవిద్యాప్రవీణులను, గుంతలు
తవ్వేవారిని, ఇతరత్రా పనులు చేసేవారిని, వడ్రంగులను,
చిత్రకారులను పిలిచి, ఎవరెవరికి
అప్ప చెప్పాల్సిన పనులను వారివారికి అప్పగించి, ఇతర
ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు వశిష్ఠుడు.
"యాగ నిర్వహణకు వేలాది ఇటుకలు కావాలి కనుక వాటిని యాగశాల
సమీపానికి తేవాలి. ఉత్తమ బ్రాహ్మణులు, ఋత్విక్కులు
బసచేసేందుకు, వారికవసరమైన భక్ష్యభోజ్యపానీయాలు నిలవచేసేందుకు,
విశాలమైన, ఎత్తైన
రాజగృహాలు, అనువైన ఇతర రకాల భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ఋత్విక్కులకు
సహాయపడేందుకు వస్తున్న బ్రాహ్మణుల విడిదికొరకు, వారికి
భక్ష్యాన్నపానీయాలు వినియోగించేందుకు అనువైన ఇళ్ళుకూడా నిర్మించాలి. యాగాన్ని
చూసేందుకొచ్చే పౌరులకు దృఢమైన ఇళ్ళు కట్టించి, ప్రతి
ఇంటిలో కావాల్సిన పదార్థాలన్నీ మళ్ళీ-మళ్ళీ అడగకుండా ఏర్పాటుచేయాలి”.
"వీరూ-వారూ అనే తేడాలేకుండా, అన్నిజాతులవారినీ,
అన్నితరగతులవారినీ, వారివారియోగ్యమైన
రీతిలో సత్కరిస్తూ, వారిని తృప్తిపరచాలి. కామంతో కానీ,
కోపంతో కానీ ఎవరినీ అవమానించరాదు. యజ్ఞ కార్యాలలో తిరిగేపనివాళ్ళను,
శిల్పులను, ఇతరులను
అందరి లాగే గౌరవించాలి. వారెవరూ కూటికీ, నీళ్ళకూ
ఇబ్బందిపడకూడదు. చేయాల్సినపని చిన్నదైనా, పెద్దదైనా
వదలకుండా పూర్తిచేయాలి. చేసే ప్రతి పనినీ స్నేహంతో, ప్రీతితో
చేయాలి. ఇదేదో వెట్టికి చేస్తున్నామన్న రీతిలో చేయొద్దు." అని వశిష్ఠుడు
పనులు చేసేందుకు నియమించిన వారితో అనగా, వారందరూ
"మునీంద్రా! మీరు చెప్పిన పనులన్నీ చేసాం. ఏలోపమూలేదు" అని జవాబిచ్చారు.
వశిష్ఠుడు సుమంత్రుడితో ఆయన స్వయంగా చేయాల్సిన పనులను,
ఇతరులతో చేయించాల్సిన పనులనూ వివరిస్తాడు. "సుమంత్రా! నీకు అందరిగురించీ,
వారి అవసరాల గురించీ క్షుణ్ణంగా తెలుసు. ఎవరిని ఏవిధంగా పిలవాల్నో,
ఎలా ఆదారించాల్నో తెలిసినవాడివి నువ్వు. నువ్వు నీ అనుభవం ఆదారంగా,
దేశంలోని ధర్మాత్ములైన, శిష్టులైన
బ్రాహ్మణులను, రాజులను, వైశ్యులను, శూద్రులను,
నానా
వర్ణాల ప్రజా బాహుళ్యాన్ని యజ్ఞం చూసేందుకు రమ్మని
శ్రద్ధగా, త్వరగా పిలిపించు." అని
ఆదేశిస్తాడు వశిష్ఠుడు.
ఆయన చెప్పినట్లే పిలిచేందుకు, పిలిపించేందుకు
సన్నద్ధమయ్యాడు సుమంత్రుడు. ఇలా వశిష్ఠుడు పనివారందరినీ హెచ్చరిస్తుండగానే,
నానా దేశాల రాజులు అయోధ్యా నగరానికి చేరుకున్నారు. అంతవరకు పూర్తి
అయిన పనులను, యాగానికి సిద్ధంగా వున్న స్థలాలను, పరిశీలించేందుకు
రమ్మని వశిష్ఠుడు, ఋశ్యశృంగుడు అనగానే దశరథుడు మంచి
ముహూర్తంలో బయలుదేరి, యజ్ఞశాలకు వెళ్తాడు. వెంటనే
బ్రాహ్మణులందరు ఋశ్యశృంగుడుని ముందుంచుకుని, సరయూనది
ఉత్తర తీరంలో యజ్ఞకర్మను ఆరంభిస్తారు.
సంవత్సరాంతంలో యజ్ఞాశ్వం
తిరిగి రావడంతో, యాగం ఆరంభించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యజ్ఞాశ్వం
మరలివచ్చేటప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు శాస్త్రంలో చెప్పినట్లే చేయాలి. మొదటి
సంవత్సరం గుర్రాన్ని స్వేచ్ఛగా తిరిగేందుకు విడిచిన తర్వాత,
అది విహరించేందుకు, దాని
సంరక్షణార్థం వీరులు దానివెంబడే పంపాలి. గుర్రాన్ని వారు మరలించకూడదు. అది
తిరుగుతూ, తిరుగుతూనే తుదకు తనకుతానుగా గృహానికి మరలిరావాలి.
వచ్చిన వెంటనే,
బ్రహ్మ, అధ్వర్యుడు,
హోత, ఉద్గాత అనిపిలువబడే నలుగురు
ఋత్విక్కులు దానిని రథకారుడి ఇంటిలో బంధించి, దానినాలుగుపాదాలపై
మంత్రాలుచెప్తూ హోమం చేస్తారు. అశ్వ విసర్జన సంవత్సరంలో పదకొండు నెలలు గడచిన
తర్వాత దానిని, అక్కడనుండి తరలించి, సదస్సు
వద్దకు తెచ్చి, మళ్ళీ అక్కడ అశ్వత్థప్రజంలో బంధిస్తారు. పన్నెండో నెల యజ్ఞానికి
కావాల్సిన సామానులను తెచ్చుకొని, కడపటి
ఫాల్గుణ అమావాస్య నాడు ఋత్విక్కులతో యజ్ఞశాలలో ప్రవేశించి, రెండవ
సంవత్సరం మొదటిరోజు పాడ్యమినుండి మొదలుపెట్టి అశ్వమేధయాగం ప్రారంభిస్తారు. అది
మొదలు ఏడు రోజులు శాస్త్రోక్తంగా ఇరవై ఒక్క హోమాలు జరుపుతారు. సోమ ప్రయోగంలో
భాగంగా, ఇంద్రుడు దేవతగా గల అయిదు హవిస్సులను (దానం,
కరంభం, పరివాపం, పురోడాశం, నయస్య)
ప్రాతస్సవనమున ఇంద్రుడిగూర్చి హోమం చేయాలి. మాద్యందినసవనమున,
సాయంసవనమున నయస్య తప్ప ఇతర హోమాలను చేయాలి. ఈ విధమైన కార్యక్రమాలను
ఋషి పుత్రుడైన ఋశ్యశృంగుడు, ఇతర బ్రాహ్మణులు కొరత రానీకుండా నిర్వహించారు.
ఔపవసత్థ్యదినాన అశ్వాలంభమనే
కార్యాన్ని జరిపించేందుకు యూపస్తంభ (యజ్ఞ పశువును కట్టివేయాల్సిన స్తంభం) స్థాపన
జరగాలి. యూపస్తంభాలు నాటే సమయం రాగానే, మారేడువి
ఆరు, చండ్రవి ఆరు, మోదుగువి
ఆరు నాటారు మొదలు. అగ్నిని వుంచే తిన్నె (వేది) సమీపంలో ఒక ’విరిగి కట్టె’
స్తంభాన్ని నాటారు. దానికి ఇరు పక్కల ఒక్కో ’దేవదార’ స్తంభాన్ని నాటారు. మొత్తం
ఇరవై ఒక్క స్తంభాలను నాటి వస్త్రాలతో వాటిని అలంకరించారు. చందనం పూసి, వస్త్రాభరణాలతో
అలంకరించిన ఆ యూపస్తంభాలు ఆకాశంలో సప్తర్షులలాగా ప్రకాశించాయి.
శాస్త్రంలో చెప్పిన
విధంగానే, అందులో సూచించిన కొలతలుగల ఇటుక రాళ్లను తెచ్చి "శుల్బ"
మనే పనిలో నైపుణ్యమున్న బ్రాహ్మణులు అగ్నినుంచే తిన్నె (వేది) ను కట్టారు. అది
గరుడి ఆకారంలో, బంగారు రెక్కలతో, మూడంతలుగా,
పద్దెనిమిది ప్రస్తారాలుగా, ప్రకాశించింది.
ఆ తర్వాత శాస్త్రోక్తంగా దైవ ధ్యానం చేసుకుంటూ, మూడువందల
పక్షులను, పశువులను, జలజంతువులను కట్టారు. అటు పిమ్మట, కౌసల్య
అశ్వానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, మూడు
బంగారు సూదులతో గాట్లుచేసింది అశ్వానికి. ఒక రాత్రంతా గుర్రం సమీపంలో పడుకుంది
ధర్మంగా. తర్వాత దశరథుడు బ్రహ్మకు, హోతకు, అధ్వర్యునకు, ఉద్గాతకు,
మహిషిని, వావాతను, పాలాకలిని, పరివృత్తిని, దానంగా
ఇచ్చాడు. ఋత్విజుడప్పుడు "వపను" మంత్రోక్తంగా అగ్నిలో హోమం
చేయడంతో, దశరథుడు, శాస్త్రోక్తంగా తగిన సమయంలో దాని
వాసన చూసాడు.
పదహారు మంది బ్రాహ్మణులు అశ్వానికి చెందిన ఒక్కొక్క అంగాన్ని
తీసుకొని, మంత్రోక్తంగా అగ్నిలో వేసి హోమం చేసారు. ఇతర యజ్ఞాలలో హవిస్సును
"రావి" సమిధలతో పాకం చేయగా, అశ్వమేధంలో
"ప్రబ్బలి" సమిధలతో పాకం చేయాలి కనుక అలానే చేసారు. బ్రాహ్మణములలో
అశ్వమేధం మూడురోజులు చేయాలని చెప్పారు. మొదటిరోజు చతుష్టోమం,
రెండవ రోజున ముక్త్యం, మూడోనాడు
అతిరాత్రం అనే కార్యాలను చేయాలని చెప్పబడింది. అలానే చేసిన ఋత్విక్కులు అదనంగా ఇతర
శాస్త్రోక్త కార్యాలైన జ్యోతిష్టోమం, ఆయురధ్వరం,
అతిరాత్రం, అభిజిత్తు,
విశ్వజిత్తు, నప్తోరామ్యం
కూడా జరిపించారు.
ఈవిధంగా యజ్ఞం పూర్తవగానే, హోతకు
తూర్పుదిక్కునవున్న రాజ్యాన్ని, అధ్వర్యునకు పశ్చిమదిక్కునవున్న రాజ్యాన్ని, బ్రహ్మకు
దక్షిణ రాజ్యాన్ని, ఉద్గాతకు ఉత్తరదిక్కునవున్న రాజ్యాన్ని,
ఇక్ష్వాకు కులవర్ధనుడైన దశరథుడు దానంగా ఇచ్చాడు. రాజ్యానికి మారుగా
గోవులను, రత్నాలను, కొంత
బంగారాన్ని ఇస్తే చాలని కోరుతారు బ్రాహ్మణులు. దశరథుడు, వారుకోరినవిధంగానే,
ఋత్విజులకు ఇచ్చాడు.
సంతాన
లాభం అనుగ్రహించమని వేడుకొనిన దశరథుడితో ఋశ్యశృంగుడు, ఆయన కోరిన
విధంగానే నలుగురు కొడుకులు ఆయనకు కలుగనున్నారనీ, కొడుకులు
పుట్టేందుకు అధర్వణమంత్రాలతో యాగాన్ని చేయిస్తానంటాడు. దశరథుడు సంతోషించి
యజ్ఞానికి పూనుకుంటాడు. అదే పుత్రకామేష్టి యాగం.
దశరథుడి పుత్రకామేష్ఠి యాగం నిర్విఘ్నంగా కొనసాగుతుండగా,
అగ్నిహోత్రం మధ్యనుండి ప్రాజాపత్య మూర్తి దర్శనమిస్తాడు. బయట కొచ్చిన
ప్రాజాపత్య మూర్తి దశరథుడితో ఆయన్ను చూడటానికి వచ్చానని అంటాడు. దశరథుడిని ధన్యుడిని
చేసేదయిన పాయసాన్ని తెచ్చానంటాడు. ఆ పాయసాన్ని తనకిష్ఠమైన భార్యలకు-తనకు గల
గుణచేష్టాకీర్తులలో తగినవారని తోచిన వారికి, ఇమ్మని
చెప్తాడాయన. దివ్య పాయసాన్నంతో నిండినదైన బంగారు పాత్రను దశరథుడు తీసుకొని,
తన భార్యలుండే చోటికి పోయి పట్టపు దేవైన కౌసల్యతో సంతోషంతో జరిగిన
విషయాన్నంతా చెపుతాడు.
ప్రాజాపత్య పురుషుడిచ్చింది భగవత్తేజః పూరితమైన పాయసాన్నం. తాను
తెచ్చిన పాయసం సగం మొదలే కౌసల్యకిచ్చాడు. ఆమె దాన్ని తాగింది. మిగిలిన సగంలో సగం
(పాతిక భాగం) రెండో భార్యైన సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాతిక భాగాన్ని రెండు
భాగాలు చేసి, ఒకభాగం కైకకు, మరో భాగం
తిరిగి సుమిత్రకు ఇచ్చాడు.
పాయసాన్ని రాజపత్నులు సమ్మతితో స్వీకరించారు. కౌసల్య పాయసాన్ని తొలుత
తాగిన కారణం వల్ల ఆమె కొడుకు తొలుత (శ్రీరాముడు) జన్మించి జ్యేష్ఠడయ్యాడు. సుమిత్ర
తాగకుండా మొదలు ఊరుకుంది. తనకు న్యాయంగా భాగమొచ్చిందనుకున్న కైకేయి కూడా వెంటనే
తాగడంతో, ఆమె కొడుకు రెండవవాడుగా (భరతుడు) పుట్టాడు. పాతిక-పరక వేర్వేరుగా
ఆఖరున తాగిన సుమిత్రకు కవలలు (లక్ష్మణ-శత్రుఘ్నులు) చివరలో జన్మించారు.
(వాసుదాసు
ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)