Sunday, April 19, 2020

కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది శ్రీమద్రామాయణం ... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-4 : వనం జ్వాలా నరసింహారావు


కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది శ్రీమద్రామాయణం
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-4
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (20-04-2020)
          శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రను, వీరు ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శత కోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగా, ఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికి, ఇతర మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై శ్రీరామ భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే.

వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది. శ్రీమద్రామాయణంలో నాయిక సాక్షాత్తు శ్రీదేవైన సీతా దేవి. నాయకుడు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. వీరిరువురు త్రేతాయుగంలో దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. ఇహ-పర సాధకంబులైన "స్వధర్మాలలో, స్త్రీ ధర్మం సీతని, పురుష ధర్మం శ్రీరామచంద్రమూర్తని లోకానికుపదేశించాడు వాల్మీకి. వారి చరిత్రను వాల్మీకే రచించి వుండక పోతే, భవిష్యత్ తరాలవారు అంధకారంలో పడిపోయి దురాచార పరులై పోయేవారేమో! అట్టి మహోపకారం లోకానికి చేసిన వాల్మీకి మహర్షిని ఎంత పొగిడినా తక్కువే.

         శ్రీరామచంద్రుడు బాలుడుగా వున్నప్పుడు జరిగిన సంగతులు తెలిపేది కాబట్టి దీనికి "బాల కాండ" అని పేరు."కాండం"అంటే జలం-నీరు. శ్రీ రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్ల, అందులోని జలం కాండమనబడింది. శ్రీ రామాయణంలోని ఏడు కాండలలో "ఏడు వ్యాహృతుల" అర్థం నిక్షిప్తమైంది. బాల కాండలో "ఓం భూః" అనే వ్యాహృత్యర్థం వుంది. అది గ్రంథ పఠనంలో తెలుస్తుంది. ఈ కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన కారణభూతుడు" అని బోధపడుతుంది. జననం మొదలు ఇరవై అయిదు ఏళ్లు వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయి. పన్నెండో ఏట పెళ్లైనప్పటినుండి పట్టాభిషేకం ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు. బాల కాండ వృత్తాంతమంతా 12 సంవత్సరాల కాలంలో జరిగింది.

         రామాయణ రచనకు పూనుకున్న వాల్మీకి మహర్షి, భగవద్విషయాన్ని బోధించే యోగ్యతలున్న గురువు దొరకలేదనే నిర్వేదంతో శుష్కించి, తన ఆశ్రమానికి వచ్చిన నారదుడికి సాష్టాంగ నమస్కారం చేసి: "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు వేస్తాడు.


         "తపమున స్వాధ్యాయంబున. ... .. " అనే పద్యంతో ఆరంభం చేసి, రామాయణాన్నంతా, నారదుడి మాటల్లో ఉపోద్ఘాతంలా పాఠకులకు సంక్షిప్తంగా, ముందుగానే వివరించడం జరిగింది బాల కాండ మందర మకరందంలో. నాటకానికి నాంది-ప్రస్తావనలు ఎలా అంతర్భాగాలో, రామాయణానికి ఇలాంటి ఉపోద్ఘాతం ఒక అంతర్భాగం. వ్యక్తి వైలక్షణ్యం, విషయ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం అనే మూడు ప్రధాన విషయాలను, రామాయణం చదివే వారికి-దానిపై గౌరవం కలిగించేందుకు, ఈ ఉపోద్ఘాతంలో వివరించడం జరిగింది. కుశ లవులు రామాయణ గానం చేయడం, గ్రంథ రచన తదుపరి జరిగిన సంఘటన. ఎందుకు ఆరంభంలోనే దీన్ని రాయాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. త్రికాల జ్ఞానైన వాల్మీకి మహర్షి యోగ దృష్టితో రామాయణ వృత్తాంతమంతా ఆద్యంతం మొదలే తెలుసుకున్న విధంగానే, ఈ విషయాన్నీ తెలుసుకుని, కుశ లవులతో చెప్పించినట్లుగా భావించాలి. వాస్తవానికి ఉపోద్ఘాతంలో తెలియచేసినట్లుగా, కుశ లవులు రామాయణ గానం చేసిన సంగతి ఉత్తర కాండలో సరైన సందర్భంలో చెప్పడం జరిగింది. దాన్నే మొదటి మూడు సర్గల్లో స్వవిషయం గురించి, తనకు యోగ దృష్టి కలదని చెప్పడం గురించి, బ్రహ్మ సాక్షాత్కారం గురించి, రాయడాన్ని కొందరు వాల్మీకి ఆత్మ స్తుతిగా ఆక్షేపించవచ్చు. వాస్తవానికి మొదటి మూడు సర్గల్లో "గ్రంథోత్పత్తి" గురించి చెఫ్ఫడం జరిగిందే కాని మరింకేమీ కాదు.

బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతని అర్థం చేసుకోవాలి. శరణా గతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగకాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఇట్టి శరణాగతికి పురుష కారం అవశ్యం. పురుష కారానికి కావాల్సిన ముఖ్య గుణం శరణాగతుడి పట్ల దయ. ఈ గ్రంథంలో పురుష కారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్య వలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే.

వాల్మీకి అడిగిన ప్రశ్నలు పదహారు. ఇది తపస్సంఖ్యాకం. పదహారు కళలతో కూడినవాడు  పూర్ణ చంద్రుడు. అలానే పదహారు ప్రశ్నలకు జవాబుగా శ్రీరామచంద్రుడిని తప్ప ఇంకొకరి పేరు చెప్పగలమా? అందుకే శ్రీరాముడిది పూర్ణావతారం. శ్రీరాముడి విషయమై  తన అభిప్రాయాన్ని దృఢపర్చుకోవడానికి, భగవద్విషయం ఉపదేశ రూపంగా గ్రహించేందుకు ఈ పదహారు ప్రశ్నలడిగాడు వాల్మీకి.

బాల్యంలోనే శ్రీరాముడు గుహుడిలాంటి (నీచ) జాతివారితో సహవాసం చేయడంతో, ఆయన "గుణవంతుడు" అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి "వీర్యవంతుడు" అయ్యాడు. గురువాజ్ఞ మీరకపోవడం-జనకాజ్ఞ జవదాటక పోవడం-పరశురాముడిని చంపకపోవడం లాంటివి ఆయన "ధర్మజ్ఞుడు" అని తెలుపుతాయి. అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా-సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే విషయాలను కిష్కింధ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ-వాలి వధల ద్వారా అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను-సర్వభూత హితాన్ని అరణ్య కాండ ద్వారా తెలుపుతుంది. సుందర కాండలో హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది. విభీషణ శరణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించక పోవడం, చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం, రాముడి జితక్రోధత్వాన్ని తెలుపుతుంది. విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా. ఇలానే రాముడు కాంతియుక్తుడనీ, భయంకరుడనీ పలు సందర్భాల్లో అర్థమవుతుంది.

No comments:

Post a Comment