Saturday, April 11, 2020

సీతారాముల కళ్యాణ వేదిక వివాహానికి కాని, వివాదానికి కాదు : వనం జ్వాలా నరసింహారావు


సీతారాముల కళ్యాణ వేదిక వివాహానికి కాని, వివాదానికి కాదు
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (21-04-2020)
తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు; దవిళ మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు; తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు; చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు అన్న భర్త్రుహరి సుభాషితం పదే-పదే గుర్తుకొస్తున్నది ఇటీవల పవిత్ర భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి నాడు శ్రీసీతారాముల కల్యాణంలో జరిగిన తతంగం, వివాహ వేదికను వివాద వేదికగా మార్చిన తీరు చూస్తుంటే!

కళ్యాణ కార్యక్రమం ఆరంభం అద్భుతంగా జరుగుతున్నదని సంతోషించే లోపునే అర్చక స్వాముల మనోగతం స్పష్టంగా వెల్లడైంది. రామనారాయణ, శ్రీరామచంద్రమూర్తి వివాద వ్యవహారానికి అర్చక స్వాములు కళ్యాణ వేదికను ఉపయోగించుకున్న విధానం చాలామందికి నచ్చలేదు. పైగా ఒక అర్చకుడు వివరణ ఇస్తుంటే, అదేదో గొప్ప విజయం సాధించినట్లు, చేస్తున్నది అపచారం అని కూడా భావించకుండా, మరో అర్చకుడు ఆనందం ఆపుకోలేక చేతులతో చప్పట్లు కొట్టాడు. పవిత్ర భద్రాచల పుణ్య క్షేత్రంలో, అంతకంటే పవిత్రమైన శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వేదిక మీద లోగడ ఎప్పుడూ చప్పట్లు కొట్టిన సందర్భాలు బహుశా లేవేమో! ఇదంతా టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్న ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక సంపాదకుడు, తన ఆవేదనను, అసంతృప్తిని బహిరంగంగా  వ్యక్తపరిచారు. ఇక అసలక్కడ జరిగిన విషయాలకొస్తే.....

“పావన భద్రాచల క్షేత్రం, రామనామం జపిస్తే చాలు ముక్తిమార్గ్తం సులభమౌతుంది, ఈ సమస్త జగత్తుకు రక్షకుడు శ్రీరామచంద్రమూర్తే, రామచంద్రమూర్తి ఆపదలు తొలగించేవాడు, ఆయన అనుగ్రహం వుంటే చాలు”.....అని అంటూ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అర్చక మహాశయులు. శ్రీరామచంద్రమూర్తిని మనస్సులో ధ్యానించుకొమ్మనీ, ఎవరి స్థానాలలో వారు కూర్చొని తమతమ గోత్రనామాలు చెప్పుకోవాలని సూచించారు. ఉపోద్ఘాతం బాగానే వుందనుకున్నారంతా. ఆద్యంతం, ఒకటికి పదిసార్లు కొనసాగాల్సిన శ్రీరామ, సీతాదేవి నామోచ్చారణ ఆదిలో, అంతంలో బాగానే వినిపించింది కాని మధ్యలో దారి మళ్లింది.

“గత సంవత్సరం వరకూ కూడా ‘సీతమ్మ తల్లి ‘రామచంద్రమూర్తి కి ఎదురుగా ఒక బల్ల మీద కూర్చొని వుండేది. ఈ ఏడాది, మొట్టమొదటి సారిగా, ‘సీతమ్మ తల్లి గజాసనం మీద కూర్చొని ‘సీతారామకల్యాణం జరగబోయే గొప్ప సన్నివేశం కొరకు ఎదురు చూస్తున్నది” అని అన్నప్పుడు కూడా “రామచంద్రమూర్తి”, “సీతమ్మ తల్లి” అనే సంబోధించారు అర్చకులు. బాగుంది. ఇంతెందుకు....మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా “జానకీ ప్రాణ నాథాయ, రామచంద్రాయ మంగళం” అన్నారు. ఆ వెంటనే, “భద్రాద్రి రామా గోవిందా, గోవిందా, జై శ్రీరాం, జై శ్రీరాం” అంటూ నినాదాలు కూడా చేశారు. ఇంతవరకూ అర్చకులకు భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి మాత్రమే కళ్లకు కనిపించారు, అనిపించారు. ఇంతలో కన్యావరణం మొదలెట్టగానే  సీన్ మారింది. ఇక అక్కడి నుండి అర్చకులకు రామనారాయణుడు, సీతామహాలక్ష్మి దర్శనం ఇవ్వడం ఆరంభం అయింది. కేవలం ఆరంభం కావడమే కాకుండా ఆ వేదికను ఒక ప్రచార వేదికగా వాడుకున్నారు అర్చకులు.


ఇక అక్కడినుండి ఇలా మొదలైంది: “అనంత దేశాధ్యాయినే....అచ్యుత వరబ్రహ్మనే....ఆదినారాయణాయ....నిరాకార, సాకార, అచ్యావతార.....పంచారుషేయ ప్రవరాన్విత....అచ్యుత గోత్రోద్భవాయ” అంటూ ఫలాన శర్మ (పరబ్రహ్మ) మునిమనుమడనీ, ఫలానా శర్మ (వ్యూహనారాయణ) మనుమడనీ, ఫలానా శర్మ (వాసుదేవ) పుత్రుడనీ, శ్రీరామనారాయణ స్వామినే వరాయ అని అసలు-సిసలు  బ్రాహ్మణుడిగా క్షత్రియుడైన శ్రీరామచంద్రమూర్తిని పూర్తిగా మార్చేశారు. అలాగే సీతమ్మ తల్లిని త్రయార్షేయ ప్రవరాన్వితగా, సౌభాగ్య గోత్రోద్భావాయిగా, విశ్వంభర శర్మ మునిమనుమరాలిగా, రత్నాకర శర్మ మనుమరాలిగా, శ్రీరార్లత శర్మ కూతురుగా, శ్రీ సీతామహాలక్ష్మి నామ్నీగా మార్చేశారు. కాకపోతే దానికి విరుద్ధంగా, వధువు సీతామహాలక్ష్మి అని, ఆమెకు తగిన వరుడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పారు!!! 


చప్పట్లు, తాళాల మధ్య అత్యంత ఉత్సాహంగా, అవసరం లేకపోయినా, సందర్భం కాకపోయినా, ఎంపిక చేయబడిని అతి కొద్ది మంది ఆహుతుల సమక్షంలో భద్రాచల క్షేత్ర మహిమ వారి సొంత వ్యాఖ్యానాన్ని జోడించి విశదీకరించారు. భద్రాచల రాముడిని ఒకసారి శ్రీరామచంద్రమూర్ర్తి అనీ, మరోసారి రామనారాయణ అని సంబోధించారు. అవి వారి మాటల్లోనే....

“భద్రాచల క్షేత్రంలో అవతరించిన ‘శ్రీరామచంద్రమూర్తి’ వైకుంఠ౦ నుండి వచ్చిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే! భద్రుడి తపస్సు ద్వాపర యుగం వరకూ కొనసాగింది. అప్పటికి రామావతారం, కృష్ణావతారం అయిపోయాయి. భద్రుడికి ప్రత్యక్షం కావాల్సినందున స్వామి వైకుంఠo నుండి బయల్దేరి వచ్చాడు. వైకుంఠo నుండి వచ్చే తొందరలో, వేగంగా వస్తున్న స్వామి శంఖ, చక్రాలను సవ్యాపసవ్యంగా ధరించాడు (డట). ఆయన్ను లక్ష్మీ దేవి, ఇతరులు అనుసరించి వచ్చారు. అలా వైకుంఠo నుండి వచ్చిన విష్ణుమూర్తి భద్ర మహర్షి ముందు సాక్షాత్కరించాడు. ‘రామచంద్రమూర్తి’ గా, చతుర్భుజాలతో, ‘సీతామహాలక్ష్మి’ తో కలిసి తన ముందు సాక్షాత్కరించినందున ఆయన అలాగే తన శిరస్సు మీద వుండాలని భద్రుడు ప్రార్థించాడు. ఆయన ప్రార్థనను అంగీకరించి, స్వామి ఇక్కడ వెలసి వున్నాడు. కాబట్టి స్వామి సాక్షాత్తు వైకుంఠo నుండి వచ్చినవాడిగానే భావించాలి” అని అన్నారు అర్చకులు.


అంతటితో ఆగకుండా స్వామి గోత్ర ప్రవరల గురించి ఎవరో అడిగినట్లు సంజాయిషీ ఇచ్చుకున్నారు. “శ్రీరామచంద్రమూర్తిగా శ్రీమన్నారాయణుడు వెలసి వున్నాడు కాబట్టి, భద్రాచలంలో, స్వామివారిది అచ్యుత గోత్రంగా భావిస్తారు. ఆ గోత్రంలో అయిదుగురు ఋషులున్నారు. వీరంతా భగవంతుడి స్వరూపాలే! ఇక మూడు ఋషులకు  సంబంధించిన గోత్రం సీతామహాలక్ష్మి అమ్మవారిది. ఆమె గోత్రం సౌభాగ్య. (చప్పట్లు). ఎప్పుడైతే ఆమె ‘సీతామహాలక్ష్మి అయిందో, ఆయన రామనారాయణుడు (???) అవుతాడు. (సీతాదేవి భర్త శ్రీరాముడు కాని రామనారాయణుడు కాదే!!!). అంటే. సీతామహాలక్ష్మిని రామనారాయణుడికి ఇచ్చి కన్యాదానం చేస్తారు. ఇది భక్త రామదాసు కాలం నుండి పరంపరగా వస్తున్న ఆచారం. మిగిలిన చోట్ల రామచంద్రమూర్తికి వసిష్ఠ గోత్రం చెప్పవచ్చు కాని భద్రాచలంలో మాత్రం కాదు!!!”.

మరో విషయం, ఎక్కడా లేని విషయం చెప్పారు. బాలకాండలో పరశురామ, శ్రీరామ సంవాదాన్ని ఉదహరించి, అందులో శ్రీరాముడు తనను తాను రామనారాయణుడుగా ప్రకటించుకున్నట్లు మాట్లాడారు. ఇదెంతవరకు నిజం? బాలకాండలోనే కాదు, ఏ కాండలో కూడా రాముడు తాను దేవుడినని ప్రకటించలేదు. మానవుడిలాగే మసలుకున్నాడు. రామాయణం అంటే విశ్వనాథవారిది కాదు.....రామాయణం అంటే, వాల్మీకిదే....లేదా, ఆంధ్రవాల్మీకి వాసుదాస స్వామిదే!!! అందులో ఈ ప్రసక్తి లేదే?

తమ వాదన కాదన్న వారికి సద్భుద్ది కలగాలని దీవిస్తూ, భద్రాచల క్షేత్రంలో వున్నది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనే తత్త్వాన్ని గుర్తించాలి అని హెచ్చరించారు. రాముడిని, రామనారాయణుడిగా గుర్తించకపోతే, రావణాసురుడికి పట్టిన గతే కలుగుతుందనీ, సర్వనాశనం అవుతారనీ శపించారు కళ్యాణ వేదిక సాక్షిగా!!!! (మళ్లీ చప్పట్లు మారోమోగాయి).

భద్రాచలం దేవాలయంలో వున్నది శ్రీరాముడా, లేక, రామనారాయణుడా? అనే వివాదం ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే వుంది. ఈ అంశంపై ఆ ప్రాంతంలో పలు విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రస్థాయిలో వున్నాయి. అక్కడ కొలువై ఉన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడేనని రామ భక్తులు అంటుంటే, వెలసిన దేవుడు శంఖుచక్రాలు, ధనుర్బాణాలతో ఉన్న స్వామి కాబట్టి ఆయన ముమ్మాటికీ రామనారాయణుడేనని మరో భక్తివర్గం వారంటున్నారు.  స్వామివారికి నిర్వహించే నిత్య కల్యాణాల్లో ప్రవర చదివే సమయంలో “రామచంద్ర స్వామినే వరాయ” అని చెప్పాల్సి ఉండగా, “రామనారాయణ స్వామినే వరాయ” అని మార్చడం ద్వారా అర్చకులు అపచారం చేస్తున్నారనేది రామ భక్తుల విమర్శ. 

ఇటీవలి కాలంలో, భద్రాచలంలో జరుగుతున్న జగత్ప్రసిద్ధి గాంచిన సీతారామ కళ్యాణోత్సవంలో అనూచానంగా చెప్పుకు వస్తున్న శ్రీరాముడి దశరథ ఆరంభ ప్రవరను, సీతాదేవి ప్రవరను మార్చివేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తున్నది. అలాగే రామచంద్రమూర్తి పేరు మార్చి రామనారాయణ అని, ప్రవరను మార్చి సీతారాములను లక్ష్మీనారాయణులుగా కల్యాణం జరిపించడం విడ్డూరంగా కనిపిస్తున్నది. నాలుగు చేతులున్నాయి కదా అని ఆయన్ను రామనారాయణుడు అనడం అంతకంటే విడ్డూరం. యావత్ దేశంలోని అన్ని రామాలయాలలో శ్రీ సీతారామ కల్యాణంలో శ్రీరాముడి ప్రవర చదివేటప్పుడు వసిష్ట సగోత్రులైన అజ, రఘు, దశరథులను, సీతాదేవి ప్రవర చెప్పేటప్పుడు గౌతమ సగోత్రులైన నిమి, విదేహ, జనకరాజులను చెప్పి కన్యాదానం జరిపిస్తారు. అదేమి విడ్డూరమో కాని, భద్రాచలంలో మాత్రం (పూర్వంలా కాకుండా) ఇటీవలి కాలంలో రాముడిని రామనారాయణుడుగా సంభోదిస్తూ ఆయన గోత్రం అచ్యుత అని చెప్తున్నారు. అలాగే సీతాదేవికి బదులుగా సీతామహాలక్ష్మి అని చెప్పి సౌభాగ్య సగోత్రాన్ని ఆపాదిస్తున్నారు. ఒకవైపు సీతారాముల కల్యాణం అంటూనే, మరోవైపు ప్రవర చెప్పేటప్పుడు రామనారాయణ, సీతామహాలక్ష్మి అని చెప్పడం పరస్పర విరుద్ధం. దీని సారాంశం, భద్రాద్రిలో ఇటీవలి కాలంలో, శ్రీ సీతారామ కల్యాణం జరగడం లేదు. లక్ష్మీనారాయణ కల్యాణం జరుగుతున్నది. ఇది లోక విరుద్ధం. భక్తులను మోసం చేయడమే! గోత్ర ప్రవరాలే కల్యాణానికి ప్రధానం.

చైత్ర శుద్ధ నవమి నాడు దశరథుడుకి కొడుకు పుట్టాడు. ఆ రోజునే భద్రాచలంలో కల్యాణం జరుగుతున్నదని అంటే, ఆ జరిగేది శ్రీరాముడికే కదా! అంటే దశరథ సుతుడికే కదా? అలాంటప్పుడు, దశరథుడుది, జనకుడిది గోత్రాలు, ప్రవర చెప్పడం న్యాయం కదా? మార్చాల్సిన అవసరం ఏమిటి? శ్రీరాముడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడే....విష్ణు మూర్తి అవతారమే. కాదని ఎవరూ అనరు. కాకపొతే, దశరథ పుత్రుడు ఎవరంటే, శ్రీరామచంద్రుడు అంటాం కాని, రామనారాయణుడు అనం కదా? సీతాదేవి భర్త ఎవరని అడిగితే ఆబాలగోపాలం ముక్తకంఠంతో శ్రీరాముడు అంటుంది కాని రామనారాయణుడు అని ఎవరూ అనరు కదా? మరో అసంబద్ధం ఏమిటంటే, క్షత్రియులైన సీతారాములను పూజారులు బ్రాహ్మణులుగా మార్చి వేశారు. రామనారాయణ పేరుతో అచ్యుత గోత్రం చదివి, పరబ్రహ్మ శర్మ, వ్యూహనారాయణ శర్మ, విభవవాసుదేవ శర్మ చెప్పుతున్నారు. సీతాదేవికి సౌభాగ్య గోత్రం చెప్పి, విశ్వంభర శర్మ, రత్నాకర శర్మ, క్షీరార్ణవ శర్మ అంటున్నారు. వీరి పూర్వీకులు శర్మలు అంటే వీరు బ్రాహ్మణులనే కదా? పెళ్లి బ్రాహ్మణులకు చేసి, పట్టాభిషేకం మాత్రం ఆ తరువాత రాజుకు చేస్తారట! ఇదెక్కడి న్యాయం?

నాలుగు చేతులతో దర్శనం ఇవ్వడం వల్ల రామనారాయణుడు అనే వాదన అసమంజసం. రాముడికి నాలుగు చేతులు వుండడాన్ని పాంచరాత్ర ఆగమమే చెప్పింది. దాని ప్రకారం నాలుగు చేతుల ధనుర్బాణాలు, శంఖ చక్రాలు కలిగింది శ్రీరామమూర్తే అని అర్థం. చతుర్భుజుడిగా కూడా రాముడు వుంటాడు. అంటే, ‘వామాంకస్థిత జానకి’ పక్కన వున్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడే. 

నలుగురు కలిసి భేషజాలకు అతీతంగా, వ్యక్తిగత నమ్మకాలకు, అభిప్రాయాలకు అవసరమైతే విరుద్ధంగా, భిన్నంగా చర్చించి, ఒక సార్వజనీన అవగాహనకు  రావాల్సిన విషయాన్ని, బహిరంగంగా, తమకొక వేదిక దొరికింది కదా అన్న ధీమాతో, ధైర్యంతో సమయం-సందర్భం లేకుండా పావుగంటకు పైగా ఇలా వ్యాఖ్యానించడం పెద్దలకు తగదు. కళ్యాణ వేదిక మీద వున్న అర్చక మహాశయులంతా పండితులు, సర్వం తెలిసిన బ్రాహ్మణోత్తములు, సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన మహానుభావులు. వేదవేదాంగ పారంగతులు. అలాంటి వారికి ఒకింత ఓర్పు వుండడం మంచిదేమో!!!                 

2 comments:

  1. ఎంతో ఆవేదన కలుగుతోంది జ్వాలా గారూ? ఏమిటీ అనాచారం? అవునండి, నేనుకూడా ఆ విచిత్రం టివీలో తిలకించాను. ఈ తమాషా ఎలా ప్రచారంలోనికి వచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? ఎందుకిలా చేస్తున్నారు?

    ప్రభుత్వం పూనుకొని అనాచారాన్ని అరికట్టి సంప్రదాయాన్ని పునరుధ్ధరించవలసిన అగత్యం ఉంది.

    శ్రీవేంకటేశ్వరుడి ఏనుగు నామాలెలా ఉండాలీ అన్న విషయం కాబోలు పూర్వం సుప్రీంకోర్టులో విచారించారని విన్నాను. ఇది అంతకన్నా సీరియస్ విషయం. ప్రభుత్వం పూనుకొని సదాచారాన్ని పునరుధ్ధరించకపోతే రామభక్తులు స్వస్తిశ్రీ కోర్టువారిని ఆశ్రయించక తప్పదేమో!

    ఇప్పటికి వీడిచేత తొమ్మిదివందలకు పైగా కీర్తనలు చెప్పించుకొన్న నా రాముడు ఒక్కటంటే ఒక్క కీర్తనలోనూ భద్రాద్రి ప్రసక్తి రానీయలేదు. ఇది కేవలం కాకతాళీయం అనుకోలేకపోతున్నాను.

    ReplyDelete
  2. గత కొద్దేళ్లుగా కొందరు ఏవో ఛానెళ్ల ద్వారా అదో తరహా ప్రచారాలు, ఇతర హడావుడి చేస్తూనే ఉన్నారు. వాదన కరెక్టా కాదా అనేటిది తెలువదు.

    అసలే విపత్తులో రాష్ట్రం, దేశం & ప్రపంచం ఉన్నప్పుడు సమయసందర్భాల సోయి లేకుంటా వేదికను దుర్వినోయోగపరచడం జాహిల్ ప్రవర్తన.

    ReplyDelete