Friday, April 24, 2020

కరోనా లాక్ డౌన్: కలిసొచ్చిన వరం, కానరాని దీవెన ..... వనం జ్వాలా నరసింహారావు


కరోనా లాక్ డౌన్: కలిసొచ్చిన వరం, కానరాని దీవెన
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (25-04-2020)
లాక్ డౌన్ .. ఓ వరం 
ఆంధ్ర ప్రభ దినపత్రిక (25-04-2020) 
కరోనా లాక్ డౌన్ అనంతర పరిస్థితులను సునిశితంగా పరిశీలించనట్లయితే, హైదరాబాద్ నగరంలో, సాయంత్రం వేళల్లో, గత కొన్ని సంవత్సరాలలో లాగా కాకుండా భిన్నంగా, చల్లని గాలులతో, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంది. సాయంకాలాలో ఇంట్లో బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకునే వారికి, మునుపటిలా వేడి వడ గాలులు పలకరించటం పోయి, హాయినిచ్చే చల్లని గాలులు వీస్తున్నాయి. 1960-70 దశకంలోని కాలుష్యరహిత వాతావరణం గుర్తుకొస్తున్నది. సరిగ్గా, అదే, అలాంటి అనుభూతే ఇప్పుడు పొందగలుగుతున్నాం.  అప్పట్లో ఏడాదంతా సాయంత్రాలు చల్లగా ఉండటం పరిపాటిగా ఉండింది.  మధ్యలో చిరుజల్లులు కురవటం దొరికిన దాంతో ఒళ్లు దాచుకునే ప్రయత్నం చేయటం తరచుగా తారసపడే నిత్య కృత్యం అనే చెప్పాలి.  నడి ఎండా కాలంలో కూడా అప్పట్లో ఇదే పరిస్థితి వుండేది.  ఈ మధ్య కాలంలో కూడా అప్పటిలాగే వుండడంతో, ఎయిర్ కండీషన్ల వాడకం బాగా తగ్గింది. అప్పటిలాగా వానలు, జల్లులు లేకున్నా వాతావరణం మాత్రం చల్లగా మారింది.  దీనంతటికీ కారణం వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు అయినా కావచ్చు, లేదా కరోనా వైరస్ నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ వల్ల నైనా కావచ్చు. నాలుగ్గోడల మధ్య ఉండటాటనికి పరిమితమైన ప్రజలు బయట తిరగక పోవడం వల్ల వాహన కాలుష్యం, వాయు కాలుష్యం తగ్గి ఎటువంటి విషవాయువులు విస్తరిచకపోవటం అయినా కావచ్చు.  ఇదొక రకమైన  రేడియేషన్ రహిత పర్యావరణం అనే చెప్పవచ్చు.

         న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం సాధారణ రోజుల్లో కూడా నిరంతరం ముఖాలకు మాస్కులు ధరించి ప్రజానీకం సంచరించే న్యూడిల్లీ నగరంలో, అందునా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత ప్రాంతంగా పేరొందిన ఈ పట్టణంలో,  ఆశ్చర్యకరంగా, అనూహ్యంగా ఎటువంటి వాహన కాలుష్యం లేకపోవటంతో నీలిగగన తలం బయల్పడి ఆహ్లాదపరుస్తొందట. అలాగే అతి కొద్దిపాటి వాహనాల కదలికలు, ఏ విధమైన నిర్మాణ కార్యక్రమాలు లేకపోవటం, పరిశ్రమల నుండి నల్లని పొగలు చిమ్మకపోవటం, మేఘాలను పూర్తిగా వాయి కాలుష్యంతో కమ్మేయకపోవటం, వంటివి భారత మెగలాపోలీస్ (megalopolis) రాజధానిలో తగ్గుముఖం పట్టాయి అని పేర్కొంది.

         ఇదిలా వుండగా యావత్ ప్రపంచంలో కూడా ఇటువంటి పరిణామాలే కానవస్తున్నాయి.  బిబిసి కి చెందిన మార్త హెన్రిక్స్ వార్తా కథనం ప్రకారం అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో వాతావరణ కాలుష్యం, గ్రీన్ హౌస్ గ్యాస్ లు వెదజల్లటం వంటివి పెద్ద మొత్తంలో తగ్గుముఖం పట్టాయన్నది ఒక అంచనా.  కరోనా మహమ్మారి తాకిన కొద్ది నెలల్లోనే ప్రపంచం మొత్తం కూడా పర్యావరణంలో వినూత్న మార్పును పొందింది.  ముఖ్యంగా కరోనా బారిన పడని కోట్లాది మంది ప్రజలు వారి జీవితాల్లో పెను మార్పులను గమనించారు.   ప్రభుత్వాలు కరోనా కట్టడికి విధించిన కాల్ డౌన్ ఒక విధంగా వారి జీవితాలకు అంతో-ఇంతో మేలు చేసిందనే చెప్పాలి.

         వూహాన్, చైనాల వీధులు  లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి.    ఇటలీ, మహా నగరంలో పూర్తి స్థాయిలో ప్రయాణ నియంత్రణలు అమలులోకి వచ్చాయి. లండన్ పట్టణంలో నిత్యం కిటకిటలాడే పబ్ లు, బార్లు, సినిమా హాళ్లు, మూసివేసి ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేసింది.   ప్రపంచ వ్యాప్తంగా విమానాలు రద్దు చేయబడ్డాయి. ఆకాశంలోనే అవి తిరుగుటపా కట్టాయి.


         పరిశ్రమలు, రవాణా, వ్యాపారాలు మూతపడి ఉండటంతో వాతావరణంలో కార్బన్ కాలుష్య విడుదల శాతం తగ్గుముఖం పట్టింది.  కాలుష్యం పెద్ద మొత్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో కట్టడి చేయబడింది. వాతావరణంలో మంచి గాలి శాతం పెరిగింది. గత కొద్ది నెలల్లో అనూహ్యంగా వాతావరణం మెరుగుపడింది.  ఇదీ ఒకరకంగా అనూహ్యమైన దీవెనగానే భావించాల్సిన తరుణం ఆసన్నమయింది. ఇందుకు కరోనా వైరస్ వ్యాప్తి వల్ల విధించబడిన లాక్ డౌన్ కట్టడికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.   ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే కరోనా మహమ్మారి ప్రభావం వల్ల గాలిలో ఉండే కాలుష్యం ఖండాంతరాల్లో పెద్ద సంఖ్యలో తగ్గిపోయింది.  ఇదీ మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న పారిశ్రామిక దేశాలైన చైనా, భారత్ వంటి చోట్ల ప్రస్పుటంగా కానవస్తోంది. 

         ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగతంగానో, నియమాల చేతనో, అధికారిక బలవంతపు లాక్ డౌన్ వత్తిడుల నేపథ్యమో కాని, కట్టడులు విధించుకోవటం వల్ల ముఖ్య నగరాలు, పట్టణాలు నాణ్యమైన గాలిని పర్యావరణనాన్ని పొందగలుగుతున్నారు.  జనం లేక వాహనాలు నియంత్రించబడి, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల రాకపోకలు తగ్గి, రోడ్లు నిర్మాణుష్యం కావటం వల్ల కార్బన్ మోనాక్సైడ్ కారకాలు కూడా పెద్ద మొత్తంగా తగ్గాయి. మరో   ఆశ్చర్యకర అంశం ఏంటంటే విమానాల రాకపోకలు నియంత్రించబడటం వల్ల గాలిలో నాణ్యత పెరిగి ఆకాశం నిర్మలంగా మారిపోయింది.   అతి తక్కువ విమానాలు ఎగరటం మూలంగా కాలుష్య కారకాలు వెదజల్లటాలు కూడా తగ్గిపోయాయి.

         కరోనా కట్టడి నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇళ్లనుంచే పనిచేయటం మొదలు పెట్టటంతో డోమెస్టిక్ విద్యుత్ వినియోగం పెరగటం అలాగే మరీ తక్కువ మొత్తంలో కమర్షియల్ పనులు జరగటం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుముఖం పట్టటం జరిగిందనే చెప్పాలి. కమర్షియల్ బిల్డింగ్ లలో విద్యుత్ శక్తి వినియోగం కూడా తగ్గుముఖం పట్టిందన్నది వాస్తవం.   ఇది ఒక రకంగా విద్యుత్ శక్తి పొదుపుకు దారి తీసిందనే చెప్పాలి. డిమాండ్ తగ్గడంతో పవర్ స్టేషన్లపై కూడా పర్యావరణ కాలుష్య ప్రభావం తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి.


         ఇదే విధంగా పర్యావరణ సంబంధమైన అనారోగ్యం కూడా తగ్గుముఖం పట్టింది. గతంలో ప్రజల్లో చిన్నచిన్న సమస్యల వల్ల తుమ్ములు, ముక్కులు కారటం, కళ్లు మంటలతో నలపటం, ఊపిరి అందకపోవటం వటి వాతావరణ మార్పుల సంబంధమైన రుగ్మతలు చోటు చేసుకునేవి.   ఇవన్నీ ఒకరకమైన ఆస్తమా సంబంధ వ్యాదులు, ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు.  పర్యావరణ మార్పు ఇందుకు మూల కారణంగా చెప్పుకోవాలి.   చర్మ సంబంధ దురదలు, వాపులు, పొక్కులు, దద్దుర్లు వంటివి వాతావరణ ప్రభావితమే, వాటి కాలుష్య ఫలితమే.  వాతావరణ కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలు చిట్లి అనారోగ్యానికి దారి తీస్తుంది.  కళ్లు కూడా వాతావరణ కాలుష్యానికి వెంటనే స్పందిస్తాయి.   కళ్లల్లో మంటలు, దురదలు, ఎర్రబడటం వంటివి వాతావరణ మార్పుకు సంకేతాలు. కొత్తగా జరిగిన పరిశోధనలు తేల్చినది ఏంటంటే వాతావరణ కాలుష్యం మానవ ఆరోగ్యాన్ని సంబంధిత బాక్టీయాను ప్రేరిపించి ప్రభావితం చేస్తుంది అన్న సత్యం.

         ప్రఖ్యాత పల్మనాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్ డా. వ్యాకరణం తేల్చినదేమిటంటే నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటివి ఊపిరి తిత్తులకు, గుండెకు, మెదడులోని కొన్ని సెల్స్ కు కానరాని హానిచేస్తాయని తేల్చారు. ముఖ్యంగా పార్టికులేట్ మ్యాటర్ 2.5 సైజు (పరిమాణంలో)  ఉన్న కాలుష్యంలోని ఎరోసెల్స్, సహజంగా 10 నుండి 20 శాతం మైక్రో ఆర్గానిజమ్స్ తేలుతుంటాయి.   వీటిలో 80 శాతం బాక్టీరియా ఆర్గానిజమ్స్, ఫంగల్ ఎలిమెంట్స్ ఇవే అనేక రకాల పాథోజెమ్స్ కి ఎలర్జీలకు కారణం అని తేల్చారు.  నిరూపించబడిన అంశం ఏమిటంటే ఎంత ఎక్కువ వాతావరణ కాలుష్యం ఉంటే అంత పెద్ద మొత్తంలో సూక్ష్మజీవులు చేరి ఊపిరి సంబంధిత రుగ్మతలకు దారితీస్తుందని, అది న్యూమెనియా  సూడోమోనాస్, ఎపెడో బ్యాక్టీరియస్, స్టాఫిలో కోకస్ వంటివి వాతావరణ కీడు చేస్తుందని పేర్కోన్నారు. ఇవే కాకుండా పాథోజెనిక్ బ్యాక్టీరియా వంటి ఆక్టినోబాసిలస్, ప్రోటిమో బ్యాక్టీరియా, ఫర్మిక్యూటిన్, సియానో బ్యాక్టీరియా, క్లోరోఫాస్ట్, బ్యాక్టీరియా డిటెస్, ఆస్కోమైకోటావంటి వుంటాయి అన్నారు.

         కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రకటించిన  రోజు నుండి వీటిలో పైన పేర్కోన్న ఏ  ఒక్కటికూడా ప్రైవేటు డిస్పెన్సరీలలో గాని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో గానీ రిపోర్ట్ కాలేదు.   లేదా ఇటువంటి రోగులకు సేవలు అందించటం అన్నది జరుగలేదు.  ఇది  హైదరాబాద్ లో గాని ఇతర ముఖ్య పట్టణాల్లో కానీ ఉన్న పరిస్థితి.

         1970 ప్రాంతంలో హైదరాబాద్ మహానగరం చెరువులకు, చెలిమలకు, ముత్యాలకు పేరుగాంచిన పట్టణం ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా, చల్లగా ఆహ్లాదకరంగా ఉండేది.   ఎంతటి ఎండా కాలంలోనైనా ఇక్కడ చమట పట్టటం, గాలిలో తేమ తగ్గి ఉక్కిరి బిక్కిరి కావటం, ఎండకి తట్టుకునే పరిస్థితి తలెత్తటం జరుగలేదు.  సాయంత్రాలు చల్లగా మారటం, చిరుజల్లులు కురవటం జరిగేది.   ప్రతి చెడు వెనుక ఒక మంచి దాగి ఉంటుంది అని పెద్దలు ఉద్భదించినట్లుగా, కరోనా భయంతో విధించబడిన లాక్ డౌన్ కారణంగా కీడుకంటే మేలు మెండుగా జరిగింది.   వాతావంణ  పరంగా భాగ్యనగరం తన పూర్వపు స్థితిని పొందింది.  చాలా రోజులుగా పగలు, సాయంకాల వేళల్లో ప్రశాంతతను, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ వాతావరణం. అనూహ్యంగా ప్రజలు చక్కని పర్యావరణం  పొందగలుగుతున్నారు.  దీనినే అనుకోవరంగా భావించాలి.   కలిసొచ్చిన, కానరాని దీవేనగా భావించాలి. 70 దశకం అనుభూతిని ఆ ఆనందాన్ని ప్రజలు పొందుతున్నారు.  ఈ నేపథ్యం హైదరాబాదీ ప్రజలు ఎదురుచూడనిది.  ఈ సందర్భం ‘‘దూర్ కహా రహీ’’ చిత్రంలోని కిషోర్ కుమార్ పాట ‘‘కోయి.. లౌటాదే మేరీ బీత్ హుయే దిన్’’  జ్ఞప్తికి తెస్తున్నది, పాతకాలాన్ని ఎవరో తిరిగి తీసుకొచ్చారు అన్న చందాన.

No comments:

Post a Comment