కల్లోల కాలంలో కొన్ని సానుకూల
కోణాలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర జ్యోతి దినపత్రిక
(24-04-2020)
చైనాలోని వుహాన్
పట్టణంలో కరోనా వైరస్ ఆవిర్భవించి,
పెల్లుబికి, దేశ-దేశాలకు సోకినప్పటి నుండీ, యావత్ ప్రపంచం, లౌకిక, అలౌకిక విషయాలన్నింటినీ ఒక్కసారిగా వదిలేసి కరోనాను కలవరిస్తు, అదే జపం
చేస్తున్నది. ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించి, లక్షల మందికి
సోకి,
వేలాది మందిని బలిగొంటున్న కరోనా కారణంగా నేడు మానవాళి
ప్రాణభయంతో గజగజా వణకుతోంది. అయితే, ఈ విపత్కర పరిస్థితులను
ఎదుర్కొనేందుకు ప్రపంచానికీ, ముఖ్యంగా భారతావనికీ
కావాల్సిన శక్తియుక్తులు, సానుకూల అంశాలు, సానుకూల
కోణాలు ఎన్నో ఉన్నాయి.
భారతదేశం ఎన్ని
విపత్కర పరిస్థితులైనా తట్టుకుని నిలబడగలిగే శక్తిని, ప్రత్యేక లక్షణాలను కలిగి వుంది. గతంలో సంభవించిన అనేకానేక విపత్తులను,
మహమ్మారులను, తక్కువ ప్రాణనష్టంతో ఎదుర్కొని, ఆ విపత్తుల నుంచి బయటపడగలనని
నిరూపించింది. కాబట్టి ఇప్పటి కరోనా
విస్తృతి కూడా మనకు ఓ లెక్కకాదనే చెప్పాలి. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా
తెలంగాణా లాంటి రాష్ట్రాలు, చేపట్టి అమలు పరుస్తున్న అనేక
చర్యలు ఒకవైపు కరోనా నియంత్రణ దిశగా, మరో వైపు ప్రజల్లో
భరోసా కలిగించే దిశగా సాగుతున్నాయి.
మనదేశంలో
చాలాకాలంగా ప్రజారోగ్య వ్యవస్థ కొన్ని లోపాలు వున్నప్పటికీ అందరికీ అందుబాటులో
ఉంది. వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెందక మందు కూడా రకరకాల వైద్య విధానాల మూలంగా ఒక
విధంగా చెప్పుకోవాలంటే మన దేశంలో చౌకగానే వైద్యం లభ్యంయ్యేదని చెప్పవచ్చు. దరిమిలా
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల అందరికీ వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు
వైద్య, ఆరోగ్యరంగాల్లో లభిస్తున్న నూతన సాంకేతికత, అధునాతన చికిత్స విధానాలు
మొదలవ్వడానికి పూర్వమే, దేశమంతటా, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్.ఎం.పీలు, పీఎంపీలు,
ఎల్ఎంపీలు, పట్టణాల్లో జనరల్
మెడిసిన్ నేర్చిన ఎంబీబీఎస్ డాక్టర్లు ప్రజల
అవసరాలకు అనుగుణంగా సేవలందించేవారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇంకా అప్పట్లో
అందుబాటులోకి రాలేదు కూడా.
కాలక్రమేణా, నగరాలు, పట్టణాలు, మెట్రోపాలిటన్ సిటీల్లో కార్పొరేట్
ఆసుపత్రులు విస్తరించాయి. నగర పరిసరాలలోని
గ్రామీణ ప్రాంతాలలో కూడా అవి కొద్ది కొద్దిగా విస్తరిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా
ప్రత్యేకంగా ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టి సామాన్యులకు వైద్యసేవలను అందుబాటులోకి
తెచ్చాయి. ఆరోగ్యశ్రీ పథకమే దీనికి ఉదాహరణ. భారతదేశంలో బ్రిటన్ మాదిరి జాతీయ
ఆరోగ్య పథకం కాని, అమెరికా
తరహా ఒబమా కేర్ లాంటి పథకాలు కాని ప్రవేశ పెట్టలేదు. అవన్నీ బీమాకంపెనీల ప్రభావంతో
నడిచే పథకాలు. భారతదేశంలో అమలయ్యే ఆరోగ్య పథకాలు సార్వజనామోదం పొందే పథకాలు. ప్రజలందరికీ
అందుబాటులో, వారి-వారి ఆర్ధిక స్తోమతకు అనుగుణంగా వున్నాయి.
వైద్య-ఆరోగ్య
సంరక్షణ ఏ దేశంలోనైనా మూడు అంచెలుగా విభజించాల్సి ఉంటుంది. సర్వ సాధారణంగా లేదా
నార్మల్ గా (మామూలు జ్వరం లాంటివి) అవసరమయ్యే వైద్య చికిత్సలన్నీ ప్రాథమిక
విభాగంలోకి (ప్రైమరీ కేర్) వస్తాయి. ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక లేదా క్రానిక్ సమస్యలు ద్వితీయ విభాగంలోకి
(సెకండరీ కేర్) రాగా, తృతీయ విభాగంలోకి
(తెర్షరీ కేర్) సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ
సమస్యలు వస్తాయి.
ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
(పి.హెచ్.సీలు),
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సి.హెచ్.సీలు) నెలకొల్పి
ప్రాథమిక ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. ఇక రెండో రకమైన వైద్య
సేవలు అందించడానికి జిల్లా స్థాయిలో ఏరియా ఆసుపత్రులున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు
చాలావరకు,
ప్రభుత్వ ఆసుపత్రులు కొంత మేరకు సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ
సేవలు అందిస్తున్నాయి. ఇటీవలి కాలం వరకూ ఈ అన్ని రకాల ఆసుపత్రులలో ఓపీ సేవల దగ్గర
నుండి, అడ్మిషన్ల వరకూ, సర్జరీలకు, వైద్య పరీక్షలకు ఎప్పుడూ రద్దీగానే వుండేది.
కొన్నేళ్ల క్రితం, మన చిన్న
తనంలో, మన ఇళ్లలోని అమ్మమ్మలు, నానమ్మలు, జలుబు,
దగ్గు, విరేచనాలు, అజీర్తి,
చిన్నపాటి జ్వరాలు, గాయాలు, తదితర సర్వసాధారణ రుగ్మతలకు వంటింట్లో ఉండే పోపు డబ్బాల్లోని
సామాన్లతోనే చిట్కా వైద్యం చేసేవారు. సామాన్య సమస్యలకు, ఇదోక గృహ వైద్యంగా వుండేది. అలాగే మనం తినే వివిధ ఆహార పదార్థాలలో రోగ నిరోధక
శక్తినిచ్చేవి అనేకం వుండేవి. తరతరాలుగా మన ఊర్లోని నాటు వైద్యులు, ఆర్ఎంపీలు, ఇతర ప్రయివేట్ ప్రాక్టీస్ చేసే వైద్యులు, ఆయుర్వేద, మూలికా, హోమియోపతి
వైద్యులు, ఇతరులు రోగిని బట్టి, రోగాలను
బట్టి మందుల్ని ఇచ్చే వారు. బహుశా ఆ వైద్యులకు మన కుటుంబాలతో ఉన్న అనుబంధం, కుటుంబీకుల ఆరోగ్య లక్షణాలన్నీ తెలియడం వల్లే సత్వరంగా రోగం నయమయ్యేలా వైద్యం
అందించే వారేమోననిపిస్తుంటుంది. హస్తవాసి అని కూడా అనేవారప్పట్లో. ఇప్పట్లో అవన్నీ
పోయాయి.
స్వాతంత్ర్యానంతరం
దేశంలో ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. 1948 నుండి కలరా,
మలేరియా మహమ్మారులను నివారించడానికి బి.సి.జి. లాంటి
టీకాలను తప్పనిసరి చేశారు. ఇవి మనకు కొత్త
వైరస్ లను తట్టుకొనేలా చేశాయి. మనలో రోగ నిరోధకశక్తిని కూడా టీకాలు పెంపొందించాయి.
మనదేశంలో మలేరియాతోపాటు,
మశూచి, కోరింతదగ్గు, కుష్టు,
పోలియో వంటి భయంకర వ్యాధులను నియంత్రించడానికి,
రూపుమాపడానికి ఈ టీకాలు ఎంతగానో దోహదపడ్డాయి. అందుకే ఇపుడు మనం కరోనా మహమ్మారి
నుంచి బయటపడటానికి కూడా ఇవే దోహదపడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య
సంస్థతో పాటు పలువురు నిపుణులు కూడా చెప్తున్నారు.
కరోనాకు మందు
పరిస్థితిని చూస్తే, ప్రజారోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున అటు గ్రామీణ
ప్రాంతాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సీలు) మొదలుకొని, ఇటు
పుట్టగొడుగుల్లా వెలసిన కార్పొరేటు ఆసుపత్రుల వరకు ఎక్కడ చూసినా రోగులు
కిటకిటలాడుతూ ఉండేవారు. చిన్నా చితకా రోగాల నుండి ప్రత్యేక సమస్యలకోసం కోసం వైద్యం
కోసం వచ్చే రోగులతో హాస్పిటళ్లలో ఓపీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు
ఎప్పుడూ రద్దీగానే ఉండేవి.
తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక వైద్య, ఆరోగ్య రంగాల్లో
హైదరాబాద్ నగరం, ఆసియా ఖండంతోపాటు, ప్రపంచానికి కూడా మెడికల్-ఫార్మా
హబ్ గా మారిందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం ఇతర రాష్ట్రాలతోపాటు, విదేశాల నుంచి కూడా రోగులు హైదరాబాద్ లోని వివిధ కార్పొరేట్ హాస్పిటళ్లకు
వైద్యం కోసం వస్తుండటమే కారణం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు.
అయితే, ఈ కరోనాతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారయింది. ఇపుడు కరోనా బాధితుల కేసులు తప్ప
ఎక్కడా వేరే ఆరోగ్య సమస్య ఊసేలేదు. కార్పొరేట్ ఆసుపత్రులు కూడా రోగులు లేక
వెలవెలబోతున్నాయి. పీహెచ్ సీలు, ప్రైవేటు దవాఖానలు, వైద్య శాలలు,
చిన్న, పెద్ద ఆసుపత్రులన్నీ
అలాగే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు ఇతర
సమస్యలతో వచ్చే రోగులూ లేరు. కరోనా తప్ప మరే జబ్బు లేని పరిస్థితి ఏర్పడింది.
ప్రజలు హై బీపీ (ఎక్కువ రక్తపోటు), లో బీపీ (తక్కువ
రక్తపోటు),
షుగర్ (చక్కెర) వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల గురించి రావడమే మానేశారు. చిన్నా చితకా ఆరోగ్య సమస్యల గురించి
ప్రజలు పూర్తిగా మరిచేపోయారు.
ఒక ప్రముఖ పల్మనాలజిస్ట్ (ఛాతీ, అలర్జీ వ్యాధుల నిపుణుడు) ఈ విషయమై వివరిస్తూ
ఏ ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆసుపత్రికైనా 4 రకాలుగా ఆదాయం వస్తుందన్నారు. 25 శాతం ఆదాయం విదేశీ రోగుల (మెడికల్ టూరిజం) నుండి, 10 శాతం ఆదాయం ఔట్ పేషెంట్ డిస్పెన్సరీల నుండి (ఓపిడి) నుండి, 40 శాతం ఆదాయం మనం ఎంచుకొని, చేయించుకునే శస్త్ర
చికిత్సల (ఆపరేషన్ల) నుండి, 25శాతం అత్యవసర కేసుల్లో ఆపరేషన్ల నుంచి సమకూరుతుందన్నారు. ఇప్పుడు ఇవన్నీ
ఆగిపోయాయని అన్నారు. కరోనా కారణంగా ఆస్పత్రుల్లో మనం చేయించుకునే ఆపరేషన్లు
పూర్తిగా ఆపివేశారు. ప్రపంచవ్యాప్తంగా
వివిధ దేశాలు ప్రయణాల్లో నిబంధనలు విధించటం వల్ల ఇతర దేశాల నుండి రోగులు వచ్చి
వైద్యం చేయించుకోవటం లేనేలేదు. ఇక రోజూవారీగా వచ్చే రోగులు లాక్ డౌన్, రవాణా సౌకర్యాలు లేనందున తమ వైద్య సమస్యలపై స్థానిక వైద్యుల సలహాలతో మందులు
వాడుతూ, ఆస్పత్రులకే రావడం లేదు. దీంతో ఆస్పత్రులన్నీ వెలవెలబోతున్నాయి.
అలాగే హైదరాబాద్
కు చెందిన ఓ చర్మవ్యాధి నిపుణుడు విశ్లేషిస్తూ, ప్రజలు
కరోనా వైరస్ వ్యాప్తిలాంటి ప్రాణాంతక పరిస్థితి వచ్చినపుడు తమ సాధారణ రోగాల
విషయాల్ని కొంతకాలం పక్కన పడేస్తారు. వారి దృష్టిలో చర్య వ్యాధి కంటే కరోనానే
పెద్ద రోగం. దాని నియంత్రణకే వారు ప్రాధాన్యతనిస్తారని అన్నారు. నగరంలోని మరొక
పిడీయాట్రిషియన్ (పిల్లల వైద్యుడు) స్పందిస్తూ, తమ డిస్పెన్సరీలో రోజూ చాంతాండంత క్యూలు కట్టి నిలబడే రోగులు, తీరికలేకుండా
ఫోన్లు చేసే వాళ్లు ఇపుడు కనీసం ఫోన్
ద్వారానైనా సంప్రదించటం లేదన్నారు. అంటే
వారి పిల్లలకు సమస్యలు లేవని కాదు, కాకపోతే ఆ సమస్యలు అంత పెద్దవిగా కనిపించటం లేదు. వాళ్లకు ఇపుడు
ప్రధానమైనది కరోనా వైరస్ తమకు సోకకుండా నియంత్రించుకోవడమే తప్ప మరోటి కాదు అని
అన్నారు.
ఒకవిధంగా
చెప్పాలంటే లాక్ డౌన్ అన్నది ప్రజలకి కీడు కన్నా మేలు ఎక్కువ చేసిందని చెప్పవచ్చు.
కరోనా ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందించింది. ప్రజలకు పరిసరాల
పరిశుభ్రత ఆవశ్యకతను విశదీకరించింది.
కాలుష్యరహితంగా ఉండేందుకు కరోనా దోహదపడింది. శ్రమ పట్ల ప్రజల్లో గౌరవాన్ని
పెంపొందింప జేసింది. ఇది స్వయం
క్రమశిక్షణకు దారితీయటంతో పాటు జీవితం పట్ల కొత్త అర్థాన్ని ఆవిష్కరింపజేసింది.
సామాజిక సంబంధాల్లో కుటుంబంలో బంధాలకు
ప్రాధాన్యతని పెంచింది. అన్నింటినీ మించి జీవితానికి నిజమైన అర్థాన్ని, పరమార్థాన్నీ బోధించింది. ఇవన్నీ సానుకూల కోణాలే.
లాక్ డౌన్ కారణంగా, ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వటం మూలంగా కాలుష్య పరిమాణం తగ్గింది. మామూలు
రోజుల్లో ఇది సాధ్యమయ్యే పనికాదు. ప్రకృతి తన పూర్వస్థితికి వస్తున్నది. వాహనాల రాకపోకలు లేకపోవటంలో ప్రమాదాలు
పూర్తిగా తగ్గిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు
ఆస్పత్రుల్లో రోగులు లేకుండా పోయారు. అవసరం తగ్గిన అత్యవసర సేవలు, ఎమర్జెన్సీ కాని ఆపరేషన్లు కూడా నిలిచిపోయాయి.
ప్రభుత్వం
ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో బోధానాసుపత్రులను కరోనా
నియంత్రణకు వాడుకుంటున్నది. అలాగే, రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా
ఖాళీగానే ఉన్నందున ఆ ఆస్పత్రుల్లోని మంచాలు అవసరమైతే కరోనా వ్యాధిగ్రస్తుల ప్రివెంటివ్, క్యూరేటివ్, ఐసోలేషన్ సేవల కోసం ఉపయోగించుకుంటే మంచిదేమో!
No comments:
Post a Comment