Monday, April 20, 2020

ఎటూ కాలేని మధ్యతరగతి! ..... వనం జ్వాలా నరసింహారావు


ఎటూ కాలేని మధ్యతరగతి!
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (21-04-2020)

‘‘భారతదేశంలో ఒక సామాజిక తరగతి, అదే, మధ్యతరగతి ప్రజానీకం అనాదిగా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతుంటే, ఎవరికీ ఏమీ పట్టకపోవడం ఒక విధంగా విడ్డూరం అనే చెప్పాలి. శతాబ్దాలుగా వీరి జీవితాలను సునిశితంగా పరిశీలించి, విశ్లేషణ చేసినట్లయితే, ఈ తరగతికి చెందిన వారు ఎప్పుడూ, ఏదో సాధిద్దామనుకుంటారు కానీ, ఆ ప్రయత్నాలన్నింటినీ, చివరకి ఎందుకూ పనికిరాక పక్కన పడేయాల్సి వస్తుంది. అంటే కాకుండా, వారి జీవితాలన్నీ శూన్యంలోకి దృష్టి సారిస్తూ, మొరపెట్టుకుంటూ తెప్పరిల్లిపోతూ ఉంటాయి.’’ అని రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కె.వర్మ అనే ప్రముఖ దౌత్యవేత్త తను రాసిన ‘‘ది గ్రేట్ ఇండియన్ మిడిల్ క్లాస్’’ అనే పుస్తకంలో సోదాహరణంగా వివరించారు.

         భారతదేశంలో యావత్ మధ్యతరగతి ప్రజానీకానికి చెందిన వారి జీవితాల నేపథ్యం, వారి పుట్టుక, ప్రస్థానం, పరిణామక్రమం, ఎదుగుదల, అభివృద్ధి, తరుగుదలపై పవన్ కె.వర్మ కూలంకషంగా అధ్యయనం చేసి ఈ పుస్తకాన్ని రాశారు. అందులో రచయిత ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్ని మనం పరిశీలిస్తే భారతదేశంలో మధ్యతరగతి అనేది చివరకు అటూ, ఇటూ ఎటూగాకుండానే మిగిలిపోయిమ్దనీ, మిగిలిపోతుందనీ ఆవేదనను వ్యక్తం చేశారు.

         బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో తమ వెసులుబాటు, అవసరాల కోసం మధ్యతరగతి అనే ఒక వర్గాన్ని తయారు చేశారు. కానీ, బ్రిటిష్ వారు చివరకు ఈ వర్గాన్ని ఏకాకులను చేసి, వారి ఖర్మకు వారిని వదిలేసి 1947లో మన దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. అనంతరం, స్వదేశంలో మన రాజ్యాంగానికి రూపకల్పన జరిగినప్పటినుంచీ, తొలి సాధారణ ఎన్నికల అనంతరం దాకా కూడా జరిగిన అనేక ఎన్నికల్లో ఏ మేనిఫెస్టోలో చూసినా పేదవారికి ఎనలేని ప్రాధాన్యతనిస్తూనే వచ్చారు. ఇవ్వాలి కూడా . ఎవరూ కాదనరు. కానీ, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఈ పేద కుటుంబాల కోసం చేపట్టిన ఉత్పత్తి సంబంధిత సంక్షేమ పథకాలు ఒకరకంగా, పరోక్షంగా, ఉన్నత ఆదాయవర్గాలకే మేలు చేస్తూ వచ్చాయనేది ఆర్ధిక నిపుణుల అభిప్రాయం. ఆర్థిక సహాయాలన్నీ వారికే చేరాయి. ఇక్కడ మధ్యతరగతి వారి ప్రస్తావనే లేకుండా పోయింది. పేదతరగతి మనిషికి అండదండలుగా, అణగారిన ప్రజల రక్షణ కోసం అంటూ కావాల్సినన్ని రాజకీయ పార్టీలున్నాయి. రాజకీయ నాయకులున్నారు. సంఘాలున్నాయి. న్యాయస్థానాలున్నాయి. ఖరీదైన కార్పొరేట్లూ ఉన్నాయి. కానీ, మధ్యతరగతి వారికే ఏ ఆసరా లేదు. ఏ అండదండా లేదు. వారిని పట్టించుకున్న నాధుడే లేడు.

         అయితే, యావత్ భారదేశానికి కొంచెం భిన్నంగా, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ మాత్రం దీనికి మినహాయింపుగా చూడాలి. ఎందుకంటే, మధ్యతరగతి ప్రజల బతుకులకు భరోసానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మధ్యతరగి ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితాలే వీరి అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం. మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఏ ఒక్కరికీ ఏనాడూ ఆలోచనే తట్టని వేళ, సీఎం కేసీఆర్ ఆశయాలు అనితర సాధ్యం.

         ఇటీవల వెలువడిన ఒక నివేదికను పరిశీలిస్తే, భారతీయ సమాజంలో మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉంటారన్నది అంచనా. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు, కడు పేదవారు భారతదేశంలో సహజీవనంగా, పక్కపక్కనే కలిసి మెలిసి జీవిస్తున్నప్పటికీ వారి వారి ఆర్థిక స్థితిగతుల్లో మాత్రం ప్రస్ఫుటమైన, అగాధమంత తేడా ఉంది.

అసలు మధ్యతరగతి వారు అనే కోవను సృష్టించి, వారికి ఆ వర్గాన్ని కేటాయించడం అన్నది 19వ శతాబ్దం తొలి రోజుల్లో వాడుకలోకి వచ్చింది. పట్టణీకరణ చెందుతున్న కలకత్తా, బొంబాయి, మద్రాసు నగరాల్లో బ్రిటిష్ సామ్రాజ్య వ్యవస్థ అప్పట్లో దీన్ని తీసుకొచ్చింది.  

         ఇంతకాలంగా ఈ తరగతి వారు చాలీచాలని ఆదాయంతో దొరికిందేదో తింటూ, ఆటుపోట్లన్నీ అనుభవిస్తూ భయం, సర్దుకుపోతూ, భయం-భయంగా జీవిస్తున్నారు. మధ్యతరగతి ప్రజల పక్షాన మాట్లాడే వారు కూడా కరువై పోవడంతో వారు నోరులేని మూగజీవాలుగానే మిగిలిపోయారు. జనాభా లెక్కల సమయానికో, ఓటు వేయించుకోవడానికో ఈ మధ్యతరగతి జీవుల ఉపయోగం పరిమితమై పోయింది.

       మార్క్సిజం సమాజంలోని అంతరాలను, తరగతులను ఉత్పత్తులు, ప్రాధాన్యతలను బట్టి ఎత్తిచూపింది. మధ్యతరగతి అంటే రాజ్యమేలుతున్న వర్గానికంటే కింది స్థాయిలో ఉన్నది అనే విధానాన్ని మార్క్సిజం రూపొందించింది. ఇక్కడి నుంచే పెట్టీ, బూర్జువాలు అనే పదం వాడుకలోకి వచ్చింది. అంటే ఇది ఒకరకంగా చిన్న పాటి శరీరం కలిగిన బలహీనవర్గం అని అర్ధం చేసుకోవచ్చు.

         కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రకారం బూర్జువాలు మధ్యకాలంలో నివసించిన స్వయం ఉపాధి పొందే వ్యాపారులు మాత్రమే. ఒకరకంగా మర్చంట్లు, బ్యాంకర్లు. వీరి పాత్ర కేవలం ఆర్ధికపరమైన లావాదేవీల్లో మధ్యవర్తిత్వం వహించడం వరకే పరిమితమయ్యేది. వీరు భూస్వాములకు, వారి కింద పనిచేసేవారికి మధ్యలో ఉండేవారు.


         సాంప్రదాయంగా ఉన్నతవర్గానికి చెందినవారంతా వేరుగా ఉండేవారు. ఉన్నతవర్గాల వారికి భూములు, కంపెనీలుండేవి. వాటిలో పెట్టుబడులుండేవి. వారు పదవులను సృష్టించేవారు. పనిచేసే వర్గం  కూలీలు కింద ఉంటారు. పన్నులు కట్టడం, శ్రమించి సంపద పెంచడం వారి వృత్తి. మధ్యతరగతి వారు ఉన్నతవర్గాల వారికింద మేనేజర్లుగా పనిచేసేవారు. మేనేజర్లు కూలీ పనులకు వచ్చే వారికి పనులు పురమాయిస్తుంటారు. మధ్యతరగతి వారు వేరొకరికోసం పనిచేస్తుంటారు. వారికి అదే పని, అదే వ్యాపకం. మధ్యతరగతి పైన ఉండే ఉన్నతవర్గం మాత్రం స్వయం ఉపాధి కలిగినవారు. వారికంటూ ఒక వృత్తి ఉంటుంది. గొప్పవారు మాత్రం ఆ వ్యాపారాన్ని సొంతం చేసుకొనే దిశలోనే ఆలోచనలో ఉంటారు. వారికి కార్పొరేట్ రంగంలో ఉండే ఆ నిచ్చెన గురించి బాగా తెలుసు. అందుకే మధ్యతరగతి వారు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటారని గ్రహించి వారిని పనిలో పెట్టుకొని ధనికులై పోవాలని, ఇంకా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. పరోక్షంగా పొందే ఆదాయం విలువ ధనికులకు బాగా తెలుస్తుంది.

         తర-తరాలుగా మధ్యతరగతి వారితో వచ్చే పెద్ద తంటా ఏమిటంటే, వారు ఉన్నదానికే జీవితాంతం పరిమితమై పోయి ఉంటారు. వారు అటు ధనికులుగా మారరు-మారలేరు. ఇటు పేదవారుగా కూడా మారిపోరు. వారితో మమేకం కాలేరు. దీంతో వారికి పేదవారికి అందే రాయితీలు అందవు. అలాగని వారిదగ్గర తమకు కావాల్సినవి కొనుక్కొని విలాసవంతంగా జీవించడానికి సరిపడా డబ్బు కూడా ఉండదు. వారి జీవన అవసరాలు, సమస్యలు తీర్చుకోవడానికి మాత్రమే అరకోరా డబ్బు ఉంటుంది. ఒకరకంగా చూస్తే ఈ మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా పన్నులు కడతారు. కానీ సౌలభ్యాలు మాత్రం వారికి తక్కువగా అందుతాయి. వీరు కష్టపడి, చెమటోడ్చి పైసా పైసా సంపాదిస్తారు. కానీ, ఆ కష్టానికి సరిపడా ఫలితం రాదు. వచ్చినా, దాన్ని అనుభవించే సమయం, తీరికా కూడా వారికి ఉండదు. తమ జీవితంలో ఖాళీగా కూర్చోవడానికి కూడా వారికి తీరిక ఉండదు. జీవితం గురించి ఆలోచన చేసే సమయమూ ఉండదు. కానీ, మధ్యతరగతి వర్గం వారు ఎక్కువ పనిచేస్తూ తమ కుటుంబాలకు మంచి జీవితాన్ని ఇస్తారు. దేశాన్ని, జాతిని నడిపే యంత్రాలు వీరే అయినప్పటికీ, శతాబ్దాలుగా  వీరికి సమాజంలో సరైన స్థాయి, గుర్తింపు లేకుండా పోయింది.

         జాతీయ విపత్తులు ఎదురైన సందర్భాల్లో మధ్యతరగతి జీవుల పరిస్థితి మరింత దౌర్భాగ్యంగా ఉంటుంది. కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్ డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితిలో దేశంలోని మధ్యతరగతి వర్గాన్నంతటినీ అతలాకుతలం చేస్తున్నది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదవారిని ఆదుకోవడంలో, వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, రిజర్వు బ్యాంక్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ముందుకొచ్చి, కార్పొరేట్ రంగం, అధికాదాయ వర్గం కోలుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నాయి. కానీ, మధ్యతరగతి జీవితాల బాగు కోసం ఏ ఒక్కరూ ఆలోచన చేయరు. లాక్ డౌన్ నేపథ్యంలో మధ్యతరగతి జీవితాలను పరిశీలిస్తే ఈ వాస్తవం మనకు అర్ధమవుతుంది. చేసిన అరా-కోరా (ఇఎంఐ లు వాయిదా వేయడం లాంటివి) మధ్యతరగతి వారి మీద భవిష్యత్ లో మరింత భారం మోపేవే కాని వారిని నిజంగా ఆదుకునేవి కానే కాదు. ఈ వాస్తవం అర్థం చేసుకోలేని మధ్యతరగతి ప్రజానీకం కేంద్రప్రభుత్వం ప్రకటించిన రాయితీని ఉపయోగించుకుని భవిష్యత్ ను తాకట్టు పెట్టుతారు.

ఉదాహరణలు చెప్పుకోవాలంటే ఎన్నో వున్నాయి. దేశంలో సంపూర్ణ మద్యనిషేదాన్ని కోరుకొనే వారి మనోభావాలను గౌరవిద్దాం. అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో అమల్లో వున్న పరోక్ష మధ్య నిషేధం మధ్యతరగతిని ఇబ్బందులకు గురి చేస్తున్నదనేది వాస్తవం. మద్యం షాపులు మూసివేయడంతో మద్యం దొరకడం లేదు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు, ధనికులు, తమకు కావలసిన సరుకును ఎంత ఎక్కువ ధరకైనా సరే బ్లాక్ మార్కెట్లోనో, మరెక్కడో కొనుక్కుంటారు, లేదా, సమకూర్చుకుంటారు. అలాగే, పేదవాళ్లు తమకు కావాలసి నాటుసారానో, గుడుంబానో ఏదోరకంగా దొరకబట్టుకొని తాగుతుంటారు. కానీ, ఎటొచ్చీ మధ్యతరగతివారు మాత్రం అటు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి మద్యం కొనలేక, ఇటు సారా సీసా నోటబెట్టి తాగలేక డోలాయమాన స్థితిలో ఉండిపోతారు. అటూ, ఇటూ కాకుండా పోతారు పాపం.

         ధనికవర్గం వారు తమకున్న స్థాయి, ఆర్థికబలంతో పనిమనుషులను, డ్రైవర్లను, వంట మనుషులను పెట్టుకోగలుగతారు. పని చేయించుకో గలరు. పేదవానికి ఇలాంటివారితో పనిలేదు. వారె స్వయంగా చేసుకుంటారు. చేసుకోగలరు కూడా. కానీ, మధ్య తరగతివారు మాత్రం పనిమనుషులు లేనిదే తమ బట్టలు కూడా తాము ఉతుక్కోలేరు. గిన్నెలు కడుక్కోలేరు. కనీసం ఇల్లు కూడా చక్కబెట్టుకోలేక దయనీయంగా మిగిలిపోతారు. అలా అని పనిమనుషులను పెట్టుకునే తాహాట్ లేదు. రెంటికీ చెడ్డ రేవడి.  
         లాక్ డౌన్ ఒకటి, రెండు నెలల పొడిగించి, ఆ తర్వాత ఎత్తివేసినా ధనికులు తదనంతర పరిస్థితులను తట్టుకొని నిలవ గలుగుతారు. పేదవారికి ఎలాగూ ప్రభుత్వం ఇచ్చే రేషన్ అందుతుంది కాబట్టి ఏరకమైన బాధా ఉండదు. వెరసి మధ్యతరగతివారి పరిస్థితి ఏమిటి? వారి నెలవారీ ఖర్చులు, అద్దెలు ఎవరు భరిస్తారు? నెలవారీ ఈఎంఐలు కట్టేదెవరు? వారి పిల్లల స్కూల్, కాలేజీ, ట్యూషన్, కోచింగ్ సెంటర్ల ఫీజులు ఎవరు కడతారు? వారి కుటుంబాల్లో ఆధారపడి జీవిస్తున్న వృద్ధులను ఎవరు ఆదరిస్తారు? లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కాస్తా ఊడిపోతే ? వారికి మళ్లీ ఉద్యోగం ఎపుడు దొరుకుతుంది? వీటన్నింటికీ మించి ఈ పరిస్థితుల్లో వీరికి ఆదుకునేందుకు ఎవరు ముందుకొస్తారు?

ఇక లాక్ డౌన్ తప్పనిసరిగా ఇంకా పొడిగించుకుంటూ పోతే, ఎమ్డుకంటే కరోన అపున్యమా అని, దాని అవసరం వుంది కనుక, మధ్యతరగతి జీవితాల్లో ఏర్పడే అలజడి, కరోనా వైరస్ కన్నా ప్రాణాంతకమే. దేవుడి దయవల్ల ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఆశిద్దాం. లేదంటే మధ్యతరగతి ప్రజలు అటూ, ఇటూ, ఎటూ కాకుండా పోతారు. పేద, ధనిక వర్గాల వారిని మాదిరిగానే, మధ్యతరగతి ప్రజానీకాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అది తప్పనిసరి.

No comments:

Post a Comment