Wednesday, April 1, 2020

వాల్మీకి రామాయణం ఒక విశిష్టమైన గ్రంథం : వనం జ్వాలా నరసింహారావు


వాల్మీకి రామాయణం ఒక విశిష్టమైన గ్రంథం
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (02-04-2020)
1909 వ సంవత్సరంలో ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయంలో చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసిన ఆంధ్ర వాల్మీకి, కవిసార్వభౌమ వాసుదాసు (వావిలికొలను సుబ్బరావు) "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" లో గ్రంథకర్త వాల్మీకి రామాయణం గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు అక్షర లక్షలు చేసే ఆణిముత్యాలు. వివరాల్లోకి పోతే....

వాల్మీకి సంస్కృత రామాయణం మూలంలోని 24,000 శ్లోకాలకు, శ్లోకానికి ఒకటి చొప్పున, తెలుగులో 24,000 పద్యాలను రాయాలని సంకల్పించుకున్నారు వాసుదాస స్వామి. ఇది జరగాలంటే శ్రీరామచంద్రుడే తనకు శరణ్యం అన్న నిర్ణయానికొచ్చారాయన. ఒకనాడు పారాయణం ముగిసిన తర్వాత, భగవత్ సన్నిధానంలో కూర్చొని, శ్రీమద్రామాయణం పుస్తకం ముందుంచుకుని, ప్రశ్న వేసుకున్నారు. ఆశ్చర్యకరంగా వచ్చిన సమాధానం "ఉత్తిష్ఠ హరి శార్దూల, లంఘయస్వ మహార్ణవమ్" ("లెమ్మా హరిశార్దూలా, యిమ్మహితార్ణవము దాటుమీ") అన్న శ్లోక రూపంలో సమాధానం లభించింది. భగవత్ కటాక్షానికి పాత్రుడనయ్యానని నమ్మి, 1900వ సంవత్సరంలో, ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు, గ్రంథ రచన ఆరంభించారాయన.

“శ్రీ రామాయణం, భారతం, భాగవతం అద్వితీయమైన గీర్వాణ భాషా గ్రంథాలు. ఈ మూడింటి లో ఆద్యమైంది శ్రీ రామాయణ కావ్యం. కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది కావడంతో ఆదికావ్యమైంది. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు, అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. అనేకరకమైన లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదు. పరమపదానికి పోవాలనుకునే కోరికగల వారికి, సుఖమైన మార్గాన్ని బోధించగల గ్రంథం శ్రీ రామాయణం తప్ప మరొకటి లేదు. కాలక్షేపానికి చదవడానికైనా శ్రీ రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. ఇహ-పర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి, శ్రీ రామాయణ పఠనం అవశ్య కర్తవ్యం”.

“సీతారాములలో విశేషమేమిటంటే, వారు అవతార మూర్తులు కావడమే ! భగవంతుడే, శ్రీరాముడుగా, లోక రక్షణార్థం జన్మించాడన్న నమ్మకమే, లోకులందరు ఒకేవిధంగా శ్రీ సీతారాములను అర్చన చేయడానికి కారణమైంది. వాల్మీకి మహర్షి ఆ అవతార రహస్యాన్ని, తాను గ్రంథస్థం చేసిన శ్రీ రామాయణంలో వివరించాడు. వాల్మీకి మహర్షి, తను రచించిన ఆది కావ్యానికి శ్రీ రామాయణం అని పేరు పెట్టాడు. ఇందులో సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్తు" అని వెల్లడిచేశాడు. ఆసక్తిగా శోధించిన వారికి, పరీక్షించిన వారికి మాత్రమే, వాల్మీకి రామాయణానికి, ఇతర రామాయణాలకు గల తారతమ్యం, వాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది”.

“శ్రీ రామాయణం మహాకావ్యం. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా వుంటుంది. రామాయణంలో శృంగారం లాంటి నవ రసాలున్నాయి. అందులో శృంగార రసం "సంభోగ శృంగారం". వాల్మీకి శ్లోకాల భావం మాత్రమే కాకుండా, అందులోని కొన్ని పదాలు ఎంత అర్థ గాంభీర్యం గలవిగా-రసవంతంగా వుంటాయో చెప్పలేము. ఇందులో హాస్యం, కరుణ, వీర, రౌద్రం, భయానక, బీభత్సం, అద్భుతం, శాంతం రసాలను కనుగొన వచ్చు”.

“ఇక అలంకారాల విషయానికొస్తే, శబ్దాలంకారాలని, అర్థాలంకారాలని రెండు రకాలున్నాయి. రామాయణంలో శబ్దాలంకారాలు తరచుగా కనబడవు. అంత్యానుప్రాసలు కొన్ని చోట్ల వున్నాయి. వర్షాన్ని వర్ణన చేసిన సందర్భంలో మన ఎదుట వర్షం కురుస్తున్నట్లే వుంటుంది. హేమంతాన్ని వర్ణిస్తుంటే, మనకు మంచులో తడుస్తున్నామా అనిపిస్తుంది. అడవులలో జరిగినవి, మనమెప్పుడూ చూడనివి-విననివి చదువుతుంటే, మన కళ్లకు కట్టినట్లే వుంటుంది. తన వర్ణనా చాతుర్యంతో వాల్మీకి, పాఠకులను, తన చేతిలో బొమ్మలా చేసి, ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాడు”.


“వాల్మీకి మరో ప్రత్యేకత ఉత్ప్రేక్ష. అలానే ఆయన వాడిన శ్లేషాలంకారాలు. శ్లేషాలంకారానికి చక్కటి ఉదాహరణ వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకం. ‘మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః ... యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం’. వేదాన్య విషయంలో కలిగిన ఈ ఆదిమ శ్లోకానికే నిషాద పరంగా ఒక అర్థం, భగవత్ పరంగా రెండో అర్థం వున్నాయి. ఇదే రామాయణ ఉత్పత్తికి కారణమైన శ్లోకం కావడంతో నాంది శ్లోకం అయింది. రామాయణంలోని ఏడు కాండల అర్థం-కథ ఇందులో సూక్ష్మంగా సమర్థించబడింది”.

“అలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయో, అవన్నీ వాల్మీకి రామాయణంలో వున్నాయి. వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం. మరొక్క ఉదాహరణ చిత్రాలంకార ఉపయోగం. ప్రశ్న-జవాబు ఒక్క వాక్యంగానే వుంటే చిత్రాలంకారం అవుతుంది. ఇంత దీర్ఘంగా ఊహించి రాసిన కవి ఇంతవరకూ ఒక్క వాల్మీకే. అలంకారాల వరకెందుకు? సాధారణ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చమత్కారాన్ని కనబరిచేవాడు”.

“వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. పాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో. వాల్మీకి రామాయణమనే "కలశార్ణవం" లో రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే, చీకట్లో తారాడినట్లే. ఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడు. కొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదు. అదే విషయం మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చు. ఆయన చేసిన వర్ణనలను బట్టి, ప్రయోగించిన పదజాలాన్ని బట్టి, పాఠకులు ఊహించుకోవచ్చు. ఒకే విషయం, ఒకటి కంటె ఎక్కువ సార్లు చెప్పితే, ఒక్కోసారి ఒక్కోరకమైన విశేషంతో చెప్పబడుతుంది. ఇలాంటి చిత్రాలు అనేకం వుంటాయి”. 

“వాల్మీకి రామాయణం "ధ్వని కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. రుతు వర్ణనలలో ధ్వని స్ఫురిస్తుంది. శ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతెందుకు ! కాళిదాసు, భవభూతి అంత గొప్ప వాళ్లు కావడానికి రామాయణమే కారణం. కాళిదాసు రచనలు గమనిస్తే, ఆయన వాల్మీకి శిష్యుడని తెలియడమే కాకుండా, గురు శిష్యుల తారతమ్యం స్పష్టంగా బయట పడుతుంది. వాల్మీకి రామాయణం నుంచి కాళిదాసు లాంటి వారు గ్రహించినవి ఎన్నో వున్నాయి. వేదవ్యాసుడంతటి వాడు వాల్మీకి శ్లోకాలను అనువదించగా లేంది, వేరేవారి సంగతి చెప్పాలా ! ఎవరికైనా సత్కవి కావాలని కోరికుంటే, వారు వాల్మీకి రామాయణాన్ని అనేక పర్యాయాలు, శ్రద్ధగా-భక్తితో పఠించాల్సిందే”.

         “శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. ఇలా రామాయణంలో సకల ధర్మాలున్నాయి. ఇందులో వున్న ధర్మాలే మిగిలిన అన్ని గ్రంథాలలోనూ కనబడతాయి. ఇందులో లేని ధర్మాలు మరింకేదాంట్లోను కనిపించవు. రామాయణంలో సూత్రప్రాయంగా చెప్పిన ఎన్నో విషయాలను వ్యాసమహర్షి తన గ్రంథాలలో పేర్కొన్నాడు. భగవద్గీతంతా కూడా రామాయణ సారమేనని గ్రహించాలి”.

“శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం. ఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయి. రామాయణమంతా గాయత్రీ స్వరూపమే. గాయత్రిలోని 24 అక్షరాలను, ప్రతి వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడింది. ఈ గాయత్రీ విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికి, రామాయణంతో పాటే ఉపదేశించాడు. గాయత్రిలోని మొదటి అక్షరంతో శ్లోకాన్ని ప్రారంభించి, అని గాయత్రి కడపటి అక్షరంతో సర్గను ముగించాడు వాల్మీకి”.

“రామాయణం పారాయణం చేసినవారి కోరికలు నెరవేర్చే శక్తి, రామాయణానికి వుండడానికి కారణం, అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే. శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి. వేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో, రామాయణ పఠనం నియమితమైంది. శత కోటి, అంటే 24 గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24,000 గ్రంథాల రామాయణంలోని ప్రతి అక్షరానికి మహా పాతకాలను నాశనం చేయగల శక్తిగలదని కొందరంటారు. కొందరేమో, శత కోటి రామాయణాన్ని వాల్మీకి సంగ్రహంగా చెప్పాడంటారు. ఇలాంటి మహిమ రామాయణంలో వుండడానికి కారణమేంటో ఆలోచించాలి. వాల్మీకి సూత్రాన్ననుసరించి, రామాయణం వేద స్వర సముద్ధృతంగా, సర్వశ్రుతులందున్నట్లుగా తెలుస్తోంది. రామాయణం ఒక మహత్తరమైన సాంఖ్య శాస్త్రం”.

“శ్రీరాముడు సామాన్య ధర్మాలన్నీ ఎలా అనుష్టించింది, కష్ట కాలంలో ఎలా ప్రవర్తించింది, సుఖ కాలంలో ఎలా నడచుకుంది, ఎలాంటెలాంటి వారి మీద ఏ విధమైన అభిప్రాయంతో మెలిగేవాడనేదీ, వీటి కారణాలేంటి అన్న విషయాలన్నీ చర్చించాల్సినవే. రాముడి పైనా, ఆయన తమ్ములపైనా ఏక పత్నీవ్రతం విషయంలో కూడా విరుద్ధాభిప్రాయాలను వెలిబుచ్చిన వారున్నారు”

ఈ విషయాలన్నీ చెప్పిన వాసుదాసు గారు రామాయణ గ్రంథమేమో చాలా గొప్పదనీ,  రాసిన కవేమో బ్రహ్మర్షి అనీ, ఇందులోని మర్మాలేమో మెండుగా వున్నాయనీ, రాసిందేమో సంస్కృత భాషలో అనీ, చదివినా కొద్దీ విశేషాలు కనిపిస్తాయనీ, అందుకే తాను తెలుగులో ఆంధ్ర వాల్మీకి రామాయణంగా దీన్ని రాశాననీ, పాఠకులు ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని దయతో చదివి తనను ధన్యుడిని చేయండనీ విన్నవించుకుంటాడు.

రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు
బాల కాండ             (77)  సర్గలు                           (2256)       శ్లోకాలు
అయోధ్య కాండ        (119) సర్గలు                           (4415)        శ్లోకాలు
అరణ్య కాండ            (75)  సర్గలు                            (2732)       శ్లోకాలు
కిష్కింధ కాండ          (67)  సర్గలు                           (2620)       శ్లోకాలు
సుందర కాండ          (68)  సర్గలు                           (3006)       శ్లోకాలు
యుద్ధ కాండ           (131) సర్గలు                           (5990)       శ్లోకాలు
ఉత్తర కాండ             (110) సర్గలు                           (3234)       శ్లోకాలు
ఏడు కాండలు          (647) సర్గలు                            (24,253)     శ్లోకాలు

No comments:

Post a Comment