వాల్మీకి అడిగిన ప్రశ్న
లోకోత్తర విషయం
శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం బాలకాండ మందర మకరందం-5
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక
(27-04-2020)
తాను ఏ విషయాన్ని
బ్రహ్మ దగ్గర తెలుసుకుని వాల్మీకికి ఉపదేశించాలని వచ్చాడో, ఆవిషయాన్ని గురించే వాల్మీకి ప్రశ్నించినందువల్లా, శత కోటి పరిమితమైన రామాయణం తాను బ్రహ్మవల్ల విన్నందువల్లా, తనకు తెలిసిన విషయమే వాల్మీకి అడిగినందువల్లా సులభంగా చెప్పొచ్చునని భావించాడు
నారదుడు. రామగుణస్మరణమనే అమృత పానానికి అవకాశం లభించిందని సంతోషపడ్తాడు. అయితే
తెలియని విషయాన్ని అడగకుండా తెలిసిన విషయమెందుకు అడిగాడు వాల్మీకి? శ్రీరాముడిని ఆయన ఎరుగును కదా! అయోధ్య సమీపంలోనే, ఆయన రాజ్యంలోనే వాల్మీకి ఆశ్రమం వుంది కదా? శ్రీరాముడిని గురించి
వాల్మీకికీ తెలుసు-నారదుడికీ తెలుసు. మరి ప్రశ్న-జవాబు ఎందుకు? వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయానికి సంబంధించింది. అడిగినవాడు, జవాబిచ్చేవాడూ వేదాంతజ్ఞులే. ఇరువురూ సర్వదా భగవత్ చింతన చేసేవారే. అయితే, వాల్మీకి వేసిన ప్రశ్న భగవంతుడి గురించే అయితే, ఆ భగవంతుడు సగుణుడా,
నిర్గుణుడా, సాకారుడా, నిరాకారుడా,
ద్రవ్యమా, అద్రవ్యమా, ఏకతత్వమా,
అనేకతత్వమా అని అడక్క గుణాలగురించే ఎందుకడిగాడు? అనుష్ఠానం ప్రధానంగాని,
వాదం కాదు. మామిడిపండు తింటేనే తీపో-పులుపో తెలుస్తుంది.
అనుష్ఠాన రూపకమైన భక్తి మార్గమే శ్రేష్ఠం. నారదుడు భక్తుడు. తత్వవిచారంకంటే గుణ
విచారమే శ్రేయస్కరమని ఆయన నమ్మకం. వాల్మీకీ ఆ కోవకి చెందినవాడే. అందుకే భగవత్ గుణ
వర్ణన వాల్మీకి చేయగానే నారదుడు సంతోషించాడు.
అందంగా-శాస్త్రంలో
చెప్పినట్లుగా,
పరిమాణంలో ఒకదానికొకటి సరిపోయే అవయవాలు రాముడికి వున్నాయని
నారదుడు వాల్మీకికి చెప్పడంలో చాలా అర్థముంది. కనుబొమలు, ముక్కు పుటాలు,
కళ్లు, చెవులు, పెదాలు,
చను ముక్కులు, మోచేతులు, మణికట్టు,
మోకాళ్లు, వృషణాలు, పిరుదులు,
చేతులు, కాళ్లు, పిక్కలు,
ఎవరికి సమానంగా వుంటాయో వారు భూమిని ఏలుతారని సాముద్రిక
శాస్త్రంలో వుంది. జంట-జంటగా వుండే ఈ అవయవాలలో, జంటలోని రెండు, ఒకదానికొకటి సమానంగా వుండడమే కాకుండా ఆకారం సరిగా వుండాలి. ఇవన్నీ
రాముడికున్నాయని భావన. కౌసల్య ఆనందాన్ని అభివృద్ధి చేస్తూ, కౌసల్యా నందనుడని శ్రీరామచంద్రుడు పేరు తెచ్చుకున్నాడని నారదుడంటాడు. రాముడు
తండ్రి పేరు చెప్పలేనివాడని కానీ, అందుకే తల్లి పేరు
చెపుతున్నాడే అనిగానీ భావించరాదు.
దశరథుడు
నిష్కారణంగా శ్రీరాముడిని అడవులకు పంపాడు. కౌసల్య నవమీ వ్రతాలు చేసి రాముడిని
కనింది. భర్త చనిపోయినప్పటికీ, పుత్ర వాత్సల్యం వల్ల
జీవించి,
శ్రీరామ పట్టాభిషేకాన్ని చూసిన ధన్యురాలు. అట్టి ధన్యత
దశరథుడికి కలగలేదు. పన్నెండు నెలలు శ్రీరామచంద్రుడిని గర్భంలో ధరించింది కౌసల్య.
ప్రధమ ముఖ దర్శనం కూడా కౌసల్యదే. పాలు-నీళ్లు పోసి, ముద్దులాడిందీ కౌసల్యే. బాల క్రీడలు చూసి ఆనందించిన ధన్యత కౌసల్యకు కలిగింది.
"కౌసల్యా సుప్రజ రామా" అని రాముడిని సంబోధించాడు విశ్వామిత్రుడు.
సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖ దర్శనం మొదలు కలిగింది కౌసల్యకేగాని దశరథుడికి కాదు.
దశరథ పుత్రుడంటే ఏ భార్యకు పుట్టిన ఏ కొడుకో అనుకోవచ్చు. కౌసల్యకు ఒక్కడే కొడుకు.
శ్రీరాముడిని తన వెంట యాగ రక్షణకై పంపమని విశ్వామిత్రుడు కోరినప్పుడు, పామరుడివలె అంగీకరించలేదు దశరథుడు. పుత్రుడి శ్రేయస్సు కోరి, కౌసల్య మారు మాట్లాడకుండా అంగీకరించిందే కాని, తన వళ్లో వుంచుకుని ముద్దులాడలేదు. అందుకే "కౌసల్యానంద వర్థనుడు"
అని నారదుడు,
"కౌసల్యా సుప్రజ రామా" అని విశ్వామిత్రుడు, "లోకచయభర్త శుభమతి యా కోసల తనయ గాంచె" అని సీతాదేవి చెప్పడం గమనించాలి.
దశరథుడికంటే కౌసల్యే ప్రశంసనీయమైందని ఆమె పేరు చెప్పబడింది. కుశల భావమే కౌసల్యం.
వాల్మీకి అడిగిన
ప్రశ్నల్లో,
నారదుడిచ్చిన సమాధానంలో, విశేషణాలన్నీ భగవంతుడికే
అన్వయించి చెప్పి,
రామాయణాన్ని పెద్ద వేదాంత గ్రంథం చేసారని ఆక్షేపించవచ్చు. ఆ
గుణాలన్నీ ఉత్తమపురుషులకు కూడా వుండొచ్చునని అనవచ్చు. శ్రీమద్రామాయణం
ధ్వనికావ్యమని అర్థం చేసుకోవాలి. అదో గూఢార్థగుంభితం. వ్యర్థ పదాలు, వ్యర్థ విశేషణాలు అసలే కనపడవు. రామాయణార్థం సరిగ్గా గ్రహించాలంటే అనేక
శాస్త్రాల జ్ఞానం వుండాలి. అదిలేనివారికి యదార్థ జ్ఞానం కలగదు. వాస్తవానికి
నారదమంటే మేఘమని అర్థం. మేఘం నీళ్లిస్తుంది. నిప్పులు కురిపించదు. నారదుడంటే జ్ఞాన
దాత. జ్ఞాన దాత చేయాల్సింది జ్ఞానముపదేశించడమో, మోక్ష విషయం చెప్పడమో
అయ్యుండాలి. నారదుడు నారాయణుడి వద్ద భాగవతాన్ని విని, పాంచరాత్ర ఆగమం ఏర్పరిచాడు. అందుకే దాన్ని "నారద పాంచరాత్రం"
అంటారు. ఇదే సాత్త్వతశాస్త్రం. వాల్మీకికి ఉపదేశించిదిదే. ఆ ఉపదేశంతో వాల్మీకి
శ్రీమద్రామాయణం రచించాడు. ఋషీశ్వరులు సంభాషించుకొనేటప్పుడు లౌకిక ప్రసంగాలు చేయరు.
కాబట్టే వాల్మీకి ప్రశ్నించింది అవతార మూర్తి గురించే-నారదుడు జవాబిచ్చిందీ అవతార
మూర్తిని గురించే. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణంలో, రాముడిని అడవులకు పంపినందువల్ల దశరథుడు మరణించడంతో, రాజ్యార్హుడైన జ్యేష్ఠ పుత్రుడు అరణ్యాలలో వున్నందున, రాజ్యం అరాజకం కాకుండా వుండాలని తలచిన వశిష్ఠుడు-ఇతర పెద్దలు, రాజ్యభారం వహించాలని భరతుడిని ప్రార్థించినా ఆయనొప్పుకోలేదని వుంది. సూర్య
వంశపు రాజులకు పురోహితుడు వశిష్ఠుడు. ఆయన దశరథుడి అభిప్రాయం ప్రకారం చెప్పినా
భరతుడు తిరస్కరించడం సబబేనా-గురు వాక్యం మీరినట్లు కాదా అన్న సందేహం రావచ్చు.
అయితే రాజు చెప్పిన మాటలను మాత్రమే వశిష్ఠుడు చెప్పాడే కాని, పెద్దవాడుండగా చిన్నవాడు రాజ్యం ఏలడం అన్యాయమని ఆయనకూ తెలుసు. ఇక భరతుడేమో
భగవత్ పరతంత్రుడు. తనను,
తన దేహాన్ని, తన సర్వస్వాన్ని
రామార్పణం చేసాడు. దాన్ని మరల గ్రహించడమంటే పారతంత్ర్య విరోధమే. అంటే స్వరూప హాని
కలగడమే. ఇది ఆత్మహత్యలాంటి ఘోర పాపం. మాట వినకపోతే వశిష్ఠుడు శపించవచ్చు కాని ఆత్మ
హాని కూర్చలేడు. అయినా వశిష్ఠుడు
ప్రార్థించాడే గాని శాసించలేదు.
బాల కాండలోని
సంక్షిప్త రామాయణంలో నారదుడు అయోధ్యకాండ
అర్థాన్ని సంగ్రహంగా చెప్పి, పితృవాక్య పాలన అనే
సామాన్య ధర్మాన్ని,
స్వామైన భగవంతుడి విషయంలో దాసుడు చేయాల్సిన కైంకర్య
వృత్తిని,
ప్రపన్నుడు భగవత్ పరతంత్రుడిగానే వుండాలన్న విషయాన్ని, ప్రపత్తికి భంగం కలిగే పనులు ఎవరు చెప్పినా చేయకూడదనే విశేష ధర్మాన్ని తెలియ
పరుస్తాడు.
సీతను రక్షించ బోయి
రావణుడి వల్ల చనిపోయిన జటాయువుకు దహన సంస్కారాలు చేసి రాముడు శోకించాడని సంక్షిప్త
రామాయణంలో నారదుడు చెప్పాడు. రామచంద్రమూర్తి విష్ణువు అవతారమైనందున ఆయనకు ఇతర
మానవులవలె శోక మోహాలుంటాయా అన్న సందేహం కలగొచ్చు. మనుష్యులకెలాంటి శోక మోహాలు
ప్రాప్తిస్తాయో,
అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు. మనిషికి శోక మోహాలు కలగడానికి కారణం
కామ-క్రోధాలే. ప్రకృతి పరిణామమే దేహం. ప్రకృతి గుణమే రజస్సు. రజో గుణాలవల్ల
జన్మించినవే కామ-క్రోధాలు. కామం విఘ్నమైతే కోపంగా మారుతుంది. ఇష్టపడే వస్తువు
దొరక్కపోయినా-పోగొట్టుకున్నా శోకం కలుగుతుంది. మోహానికీ కారణం కోపమే. ప్రకృతి
పరిణామమైన దేహం,
ప్రకృతి గుణాలైన సత్వ-రజస్సు-తమస్సులను కలదై వుంటుందనీ, కొద్దో-గొప్పో ఈ మూడు గుణాలు లేకుండా దేహి వుండడనీ, రజస్సు కారణాన శోక-మోహాలు కలుగుతాయని, ఇవన్నీ పూర్వ జన్మలో
చేసిన పాపాల మూలాన ఈ జన్మలో ఫలితం అనుభవించాల్సివస్తుందనీ శాస్త్రం చెప్తుంది.
అంటే, ప్రకృతి బద్ధుడైన పురుషుడు, ప్రకృతి గుణాలైన
శోక-మోహాల వలన పీడించ బడుతాడని అనుకోవాలి. అలాంటప్పుడు ప్రకృతికి అతీతుడైన
విష్ణువు,
ప్రకృతి గుణాల మూలాన ఎలా పీడించబడుతాడన్న సందేహం కలగొచ్చు.
అవతార దశలో ప్రకృతికి విష్ణువు కూడా బద్ధుడనే సమాధానం చెప్పుకోవాలా?
No comments:
Post a Comment