అపర చాణక్యుడు, మేథావి పీవీ నరసింహారావు
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక
(28-06-2020)
బాబ్రీ మసీదు
కూల్చివేతకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పీవీ
బాధ్యుడా?
పీవీకి, నెహ్రూ-గాంధీ వారసత్వ
కుటుంబానికి బేధాభిప్రాయాలున్నాయా? ఆయన భారతీయ జనతా
పార్టీతోను,
ఎన్డీయే తోను కుమ్మక్కయాడా? పీవీ మతతత్వ వాదా?
ఎందుకు పీవీ ఎవరికీ కానివాడయ్యాడు? అసలు సోనియాకు పీవీకి ఎందుకు-ఎక్కడ చెడింది? పీవీ మంచోడా?
చెడ్డోడా?
స్వర్గీయ మాజీ
ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ ప్రత్యర్థి అర్జున్ సింగ్ "ఆత్మకథ-ఏ
గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ద అవర్ గ్లాస్ ఆఫ్ టైమ్" పేరిట, పీవీతో అంతగా పరిచయమే లేని సీనియర్ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ పుస్తకం
"బియాండ్ ద లైన్స్" పేరిట, ఆ మహనీయుడిపై బురద చల్లే
కార్యక్రమానికి కొందరు ఆ మధ్యన పనిగట్టుకుని మరీ శ్రీకారం చుట్టారు. పీవీ
నరసింహారావు అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కోపమని, సోనియా అంటే పీవీకి సదభిప్రాయం లేదని, రాజీవ్ హత్యా-మరణానంతరం
సోనియా గాంధీని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేద్దామన్న సూచనకు పీవీ
వ్యతిరేకమని,
ఇంజనుకు తగులుకుని రైలు పెట్టెలన్నీ దాని వెనకాలే
వెళ్లినట్టు నెహ్రూ-గాంధీ కుటుంబం వెనుకే కాంగ్రెస్ పార్టీ వెళ్లడం దేనికని పీవీ ఆ
సందర్భంగా ప్రశ్నించాడని,
బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో ఆయన ఒక గదిలోకి వెళ్లి
తలుపులు వేసుకుని కూర్చోవడమంటే రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయిస్తున్న
దృశ్యం తనకు గుర్తుకొచ్చిందని అర్జున సింగ్ ఆరోపించారు తన ఆత్మకథలో.
అసంపూర్తి గా
మిగిలిపోయిన అర్జున సింగ్ గ్రంథాన్ని ఆయన సన్నిహితుడైన అశోక్ చోప్రా పూర్తి చేసే
ప్రయత్నంలో భాగంగా మరికొన్ని సంచలనాత్మక విషయాలున్నాయి. సోనియా పట్ల పీవీ ప్రవర్తన
తనకు రాజకీయాలంటేనే అసహ్యం వేసే స్థితికి తీసుకెళ్లిందని, ఐతే,
కొద్ది సేపటికే పీవీ మనసు మార్చుకుని తానిచ్చిన ఆలోచనకు
సానుకూలంగా స్పందించారని అర్జున సింగ్ పేర్కొనడం జరిగింది. రాసిన అర్జున సింగ్
కాని, ఎవరినుద్దేశించి రాయడం జరిగిందో ఆ నాయకుడు పీవీ నరసింహారావు కాని ఆ
పుస్తకంలోని విషయాలను బహిర్గతం చేసినప్పుడు మన మధ్య లేరు. ఆ పుస్తకంలోని
నిజా-నిజాలు వారిద్దరన్నా చెప్పాలి, లేదా, వారి సమకాలీనులన్నా చెప్పాలి.
బాబ్రీ కూల్చివేత
వార్త వినగానే తన మనసులో ఆ దృశ్యాలు కదిలాయని, ఆ విషాద ఘటన తాలూకు
పరిణామాలు దేశ చరిత్రలో అంచనా వేయలేని స్థాయిలో ఉంటాయని తన మనసుకు అనిపించిందని, భారతదేశ "లౌకిక వ్యవస్థ" తీవ్రంగా దెబ్బతిన్నదన్న బాధ కలిగిందని, ఆ మనస్తాపంతోనే పీవీకి ఫోన్ చేస్తే, ఆయన అందుబాటులో లేరని
సమాచారం అందిందని అర్జున్ సింగ్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, మరొక్క అడుగు ముందుకు వేసి, బాబ్రీ మసీదును
కూల్చడానికి ఒక రోజు ముందే,
ఆ విషయాన్ని తాను పీవీకి చెప్పానని అర్జున్ రాసుకున్నారు.
అయితే ఆయన ఆ అంశాన్ని అంత తీవ్ర విషయంగా పరిగణించడం లేదనే భావన తనకు కలిగిందని
పేర్కొన్నారు. బీజేపీ,
ఇతర హిందూత్వ అనుకూల సంస్థల కుట్రలు, కుతంత్రాలను ఎందుకు పట్టించుకోవడం లేదని పీవీని ఆయన ప్రశ్నించారట! ఒక విధంగా
పీవీకి "కమ్యూనల్ కలర్" ఇచ్చే ఆరోపణ ఇది.
సరిగ్గా ఇలాంటిదే-అదే
సమయంలో, సందర్భం అనేదేదీ లేకుండా, బహుశా ఇలా కలిమిడిగా
చేద్దామని ఆలోచించి మరీ చేశారన్న భావన కలిగే విధంగా, కులదీప్ నయ్యర్ పుస్తకంలోని కొన్ని భాగాలను మీడియాకు వెల్లడించడం జరిగింది.
బురదజల్లుడు కార్యక్రమం ఆ విధంగా కొనసాగించే ప్రక్రియకు ఆయనా తయారయ్యారు. బాబ్రీ
మసీదు కూల్చివేత సమయంలో,
అర్జున్ సింగ్ చేసిన ఆరోపణను కులదీప్ నయ్యర్ మరి కొంచెం
విస్తరించి చెప్పారు. పీవీ "నిష్క్రియగా" కూర్చొన్నారనేదే వారిరువురి
ఆరోపణ. తనకున్న సమాచారం ప్రకారం "బాబ్రీ మసీదు కూల్చివేతకు పీవీ మౌనంగా
అంగీకారం తెలిపారు" అనేది కులదీప్ నయ్యర్ ఆరోపణ. ఆ సమాచారమేంటో ఇదమిద్ధంగా
చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పే ప్రయత్నం చేశారు. కరసేవకులు మసీదును కూల్చడం
మొదలుపెట్టగానే పీవీ పూజలో కూర్చున్నారని, చిట్టచివరి రాయిని కూడా
తొలగించిన తర్వాతే ఆయన పూజనుంచి లేచారని, పూజ జరుగుతుండగా పీవీ
అనుచరుడొకరు వచ్చి ఆయన చెవిలో మసీదు కూల్చివేత అయిపోయిందని చెప్పారని తన పుస్తకంలో
రాసుకున్నారు. తనకందిన సమాచారానికి ఆధారంగా దివంగత సోషలిస్టు నాయకుడు మధు లిమాయేను
పేర్కొన్నారు.
తన పుస్తకంలోని
"నరసింహారావు ప్రభుత్వం" అనే అధ్యాయంలో మసీదు కూల్చివేతకు నిరసనగా మత
కల్లోలాలు జరుగుతున్నప్పుడు పీవీ కొందరు సీనియర్ పాత్రికేయులను తన ఇంటికి పిలిచిన
విషయం; మసీదు కూల్చివేతను ఆపడానికి తన ప్రభుత్వం వీలైన ప్రతి ప్రయత్నమూ చేసిందని
చెప్పిన విషయం;
తాను లక్నోకు సీఆర్ పీ దళాలను పంపినా వాతావరణం అనుకూలించని
విషయం; లాంటివి పేర్కొన్నారు. పీవీ అంటే సోనియా గాంధీకి ఇష్టం లేని విషయాన్ని కులదీప్
నయ్యర్ సహితం రాశారు. పార్టీ పగ్గాలు, ప్రధాని పదవిని పీవీ
చేపట్టడం సోనియాగాంధీకి ఎప్పుడూ ఇష్టం లేదనే సంగతినీ వెల్లడించారు. సోనియా
"మత తత్వ శక్తులు రాజకీయాలను ఆక్రమిస్తున్నాయని" వెలిబుచ్చిన ఆవేదనకు
ప్రాధాన్యం ఇస్తూ రాసిన కులదీప్ నయ్యర్, మతతత్వంపై పోరాడాలంటే
సోనియా రాజకీయాలలో చేరక తప్పదని, అందుకు ఆమె చేతుల్లో
వున్న ఏకైక ఆయుధం కాంగ్రెస్ పార్టీనే నని ఆనాడే తాను అంచనా వేశానని నయ్యర్
రాసుకున్నారు. దీని సారాంశం కూడా పీవీ కమ్యూనలిస్టేనని!
అర్జున సింగ్, కులదీప్ నయ్యర్ తమ ఆత్మకథలలో రాసిన మాటలను వాస్తవాలుగా ఎంతవరకు పరిగణించవచ్చు? వాస్తవ దూరం ఐతే అవి నిజాలు కావని చెప్పేదెవరు? అర్జున్ సింగ్ కాని,
పీవీ నరసింహా రావు కానీ, కులదీప్ నయ్యర్
ప్రస్తావించిన మధు లిమాయే కాని మన మధ్య లేరు. కాకపోతే, పీవీ హయాంలో బాధ్యతాయుతమైన స్థానాలలో పనిచేసిన వారిలో పలువురు అప్పటికే ఇంకా
జీవించే వున్నారు. బాబ్రీ మసీదు సంఘటన కూల్చివేత పూర్వ రంగంలో, ఉత్తర రంగంలో ఆయనతో ఆ విషయాలను ప్రత్యక్షంగానో-పరోక్షంగానో పంచుకున్న వారూ
లేకపోలేదు. మధులిమాయేను కోట్ చేసిన కులదీప్ నయ్యర్, అసలాయన ఆ క్షణంలో పీవీ సమీపంలో వున్నారా? లేరా? అన్న విషయాన్ని కూడా ధృవీకరించుకున్నట్లు లేదు.
సరిగ్గా ఇవే
విషయాలను పీవీ హయాంలో (మరో ఐదుగురు ప్రధాన మంత్రులతో సహా) న్యాయ శాఖ కార్యదర్శిగా
పనిచేసి ఆయనకు "రాజ్యాంగ పరమైన" అనేక విషయాల్లో నిర్మొహమాటమైన
సూచనలిచ్చిన న్యాయకోవిదుడు (స్వర్గీయ) పీసీ రావు, అదే విధంగా పీవీకి మీడియా సలహాదారుగా మాత్రమే కాకుండా ఆయనకు అనేక విషయాలలో
ఆంతరంగికుడుగా పనిచేసిన (స్వర్గీయ) పీవీఆర్‍కె ప్రసాద్ స్వయానా హైదరాబాద్ మీడియాకు
వివరించడం జరిగింది. అర్జున సింగ్-కులదీప్ నయ్యర్ రాసినవన్నీ అసత్య కథనాలేనని, పీవీపై కడుపు మంటతో వారీ పని చేశారని వారి మాటల్లో వ్యక్తమైంది. బాబ్రీ మసీదు
కూల్చివేత సంఘటన సమయంలో,
అలనాటి వాస్తవాలకు వీరు ప్రత్యక్ష సాక్షులు. తమతో పాటు నాటి
కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాధవ్ గోఖలే, కాబినెట్ కార్యదర్శి
రాజగోపాల్,
ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ వైద్య, పీవీ ఆంతరంగిక కార్యదర్శి ఏఎన్ వర్మ, కేంద్ర హోం మంత్రి ఎస్‍బీ
చవాన్ వున్నారని వీరన్నారు. మరి వారందరికీ తెలియని విషయాలు మధులిమాయేకు ఎలా
తెలిశాయో అర్థం కాని ప్రశ్న. వారి రాతలన్నీ పీవీ ప్రతిష్టను దిగజార్చేటందుకేనన్నది
కూడా వారి మాటల్లో వ్యక్తమైంది. ప్రధాని పదవి ఆశించి భంగపడిన అర్జున్ సింగ్‌కు
పీవీపై ఎప్పుడూ కోపమేనని అంటూ ఆయన అలా రాశారంటే ఆ కోణంలో అర్థం చేసుకోవచ్చు కాని, కులదీప్ నయ్యర్ కూడా అలా రాయడం దురదృష్టం అన్నారు.
బాబ్రీ మసీద్
కూల్చివేత సమయంలో పీవీ పూజ గదిలో వున్నారని చేసిన ఆరోపణ చాలా హాస్యాస్పదమైంది గా
పీవీఆర్‍కె,
పీసీ రావులు పేర్కొన్నారు. అర్జున్ సింగ పీవీ వ్యతిరేకైతే, కులదీప్ నయ్యర్ పీవీని ఏనాడూ దగ్గరనుంచి చూడలేదని, అలనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ చేసిన తప్పులకు పీవీని
బాధ్యుడుగా చేయడం తగదని అన్నారు. వారన్నట్లుగా పీవీని రోమ్ తగలబడుతుంటే ఫిడేలు
వాయించిన నీరోతో పోల్చడం చాలా తప్పు. అసలు పీవీ నరసింహారావు ఇంట్లో పూజ గదే లేదట.
కూల్చివేత సంఘటన జరిగిన డిసెంబర్ ఆరవ తేదీన పీవీ రోజంతా ఉన్నతాధికారులతో సమీక్ష
జరుపుతూనే వుంటే ఇక పూజ గదిలో కూర్చోడం ఎలా జరిగింది? పీవీ ఏ పని చేసినా రాజ్యాంగ బద్ధమైందేతేనే చేసేవారట. కళ్యాణ్ సింగ్
ప్రభుత్వాన్ని దింపి రాష్ట్రపతి పాలన ఒక రోజు ముందట విధించడమంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేయడమే! అలా చేయనందున ఈ రోజున ఆయనపై అసత్య
ఆరోపణలు చేసి "కమ్యూనలిస్ట్" అనే ముద్ర వేయడం తగని పని. పీవీ ఏ నాడూ
రాజ్యాంగాన్ని అతిక్రమించలేదు.
పీవీ కాంగ్రెస్
పార్టీ పక్షాన ప్రధాని అయినంత మాత్రాన బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని ఎక్కడా
లేదు. ఆయనకు రాజ్యాంగం మీద ఎనలేని గౌరవం. ఆయన రాజ్యాంగాన్ని అనుసరించి నిర్ణయం
తీసుకున్నాడన్న నింద మోపవచ్చు! పోనీ, కల్యాణ్ సింగ్ మోసం చేశాడందామా? నమ్మక ద్రోహం చేశాడందామా? ఇచ్చిన మాట నిలబెట్టుకోక
పోవడానికి అనేక కారణాలుండవచ్చు! బహుశా బీజేపీకి కూడా అలా జరుగుతుందన్న సమాచారం
వుండి వుండకపోవచ్చు! ఆ తరువాత పార్లమెంటులో వాజ్‌పేయి-ఇతర బీజేపీ నాయకులు
మాట్లాడిన దానిని బట్టి చూస్తే, అదే అర్థం స్ఫురిస్తుంది.
వాళ్లు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారని. చివరకు కల్యాణ్‌తో సహా వారి నాయకత్వం దెబ్బ
తింది-పీవీని దెబ్బ కొట్టారు!
పీవీ దెబ్బ
తినడానికి ప్రధాన కారణం ప్రతిపక్షాల వ్యాఖ్యానాల కంటే స్వపక్షం వారి దాడే! పీవీ
ప్రధానిగా ఏదో మూణ్ణాళ్ల ముచ్చటగా-ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే పదవిలో కొనసాగుతాడని
భావించాడు అర్జున్ సింగ్. అయన తరువాత తానే ప్రధాని అవుతానని కలలు కన్నాడు. పీవీని
దింపుదామంటే,
ఆయనేమో పావులు చాకచక్యంగా కదిపి, ఏకు-మేకై కూర్చున్నాడు. పాతుకు పోయాడు. కాంగ్రెస్ పార్టీ వారందరూ కలిసి
బీజేపీని నిందించడానికి మారుగా, సొంత మనిషి పీవీని
నిందించడం ఎంతవరకు సబబు?
అంతే కాకుండా, బీజేపీతో పీవీ జతకట్టాడు
అనే దాకా వెళ్లాడు అర్జున్ సింగ్. ఆ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే: చివరకు, పదిహేను సంవత్సరాల అనంతరం కూడా, అదీ, లిబర్హాన్ కమీషన్ పీవీని నిర్దోషి అని తేల్చిన తరువాత కూడా, కాంగ్రెస్ నాయకుడైన అర్జున్ సింగ్ తన
ఆత్మకథలో ఇలా రాయడం,
దానికి కులదీప్ నయ్యర్ లాంటి వారు వంత పలకడం విడ్డూరం.
బాబ్రీ మసీదు కూల్చివేతకు తన పార్టీ-తమ ప్రధాని బాధ్యుడనే స్థితికి దిగజారాడు
అర్జున్ సింగ్. ఆయన మైండ్ సెట్, అజెండా, ఒక రకంగా పీవీ మీద ద్వేషం-మరొక రకంగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోవడం.
ఆయన ఆర్థిక సంస్కరణలైనా,
భూసంస్కరణలైనా, నెహ్రూ-గాంధీ విధానాలను
కొనసాగించడమే కాని దానికి విరుద్ధమెలా అవుతుంది? పీవీ తీసుకున్న ప్రతి నిర్ణయం దేశం కోసం మాత్రమే. ఆయనే కనుక తనకోసం నిర్ణయం
తీసుకుంటే,
మరో మారు ప్రధాని కావడం ఏ మాత్రం కష్టమయ్యేది కానే కాదు.
పీవీని అప్రతిష్ట
పాలు చేయడం కొత్తేమీకాదు. పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా జార్ఖండ్ ముక్తి
మోర్చాకు ముడుపులు ఇచ్చారన్న కేసులో పీవీ శిక్షార్హుడని న్యాయస్థానం తీర్పు
ఇచ్చినప్పుడు మీడియాలో ఆ విషయం ప్రముఖంగా ప్రచురించారు. "అవినీతికి అర దండాలు"
అని,
"చెరసాలకు మాజీ ప్రధాని" అని, "ఆర్థిక సంస్కరణల శిల్పికి మూడేళ్ల జైలు శిక్ష" అని శీర్షికలు పెట్టారు.
న్యాయమూర్తి అజిత్ బరెహోక్ తన తీర్పులో, కఠిన పదజాలాన్ని వాడి, పీవీ చేసిన ప్రయత్నం భారత రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకమని, ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమనీ పేర్కొన్నారు. కాని ఆ తరువాత ఏమైంది? ఐదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి, పలువురికి పంచిపెట్టిన మేధావి, ఎన్ని ఒడిదుడుకులు
ఎదురైనా చిరునవ్వు వీడని థీశాలి ముఖంలో కొన్ని సెకనులు మాత్రమే ఆందోళన
కనిపించింది. పీవీ నేరం చేశారో-లేదో తరువాత వెలువడిన తీర్పులే తేల్చాయి. ఏ ఒక్క
దాంట్లో నూ ఆయన నేరస్తుడుగా మిగలలేదు. కొన్నాళ్లకు పై కోర్టు ఆయనను నిర్దోషిగా
విడుదల చేసింది. బహుశా పీవీ జీవించి వున్నట్లయితే అర్జున్ సింగ్-కులదీప్ నయ్యర్
రాతలకు కూడా అలానే చిరునవ్వు నవ్వేవాడేమో!
ఇంతకీ పీవీ చేసిన
తప్పేంటి?
ఆలోచనలలో, అమలులో, విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనబడిన ఈ వ్యక్తి, అపర చాణక్యుడుగా అందరూ
స్తుతించిన ఈ వ్యక్తి,
ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ప్రతిపక్షాలతో సహా ఖండ-ఖండాంతర
ఆర్థిక నిపుణులనుండి ప్రశంసలనందుకున్న ఈ వ్యక్తి చేసిన పెద్ద పొరపాటు, బహుశా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని-నెహ్రూ కుటుంబేతర వ్యక్తిగా-ఐదేళ్లు
కలిగించడం,
విశ్వాస ఘాతకులకు వందేళ్ల చరిత్రను అంకితం చేయడం! తొలి
దక్షిణాది వ్యక్తిగా ప్రధాని పీఠాన్ని అందుకుని, అందులో ఐదేళ్ల పాటు కొనసాగడం చాలా మందికి అందునా ఉత్తరాది వారికి నచ్చలేదు.
నెహ్రూ కుటుంబానికి చెందనివాడు, దక్షిణాది వాడు, ముఖ్యమంత్రిగా కూడా పూర్తికాలం పనిచేయలేనివాడు, కనీస మెజారిటీ సభ్యుల మద్దతు కూడా లేకుండా ప్రధాని పదవిని చేపట్టి నెగ్గు
కొచ్చినవాడు కావడంతో,
పీవీని దెబ్బతీసే ప్రయత్నం ఎప్పుడో-ఏనాడో మొదలైందంటే
అతిశయోక్తి కాదేమో!
భారతావనిలో కులాలు, మతాలు,
భాషలు అటుంచి, ఉత్తరాదివారు-దక్షిణాదివారు
అనే తేడాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అవగాహన చేసుకోవాలంటే, చరిత్రపుటల్లోకి ఎక్కి-విశ్వవ్యాప్త మన్ననలందుకున్న మహనీయుడు పీవీ లాంటి
వ్యక్తిని ఎలా అధఃపాతాళానికి తొక్కే ప్రయత్నాలు చేసారో తెలుసుకోవడమే! అర్జున్ సింగ్‍లు, కులదీప్ నయ్యర్‍లు ఇప్పుడా కోవకు చెందిన వారే.
పీవీ పుణ్యమే చిన్న
కమతాలు
సుమారు ఏబై సంవత్సరాల క్రితం ఆగస్ట్ 30, 1972 న, అప్పటి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో నాటి ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డ,
స్వర్గీయ పీవీ నరసింహారావు చారిత్రాత్మక భూసంస్కరణల
బిల్లును ప్రవేశ పెట్తూ చెప్పిన మాటలు, తదనంతర అమలు పరిణామాలు, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలకనుగుణంగా
చేపట్తున్న సమగ్ర భూప్రక్షాలణ నేపధ్యంలో వెలుగులోకొచ్సిన భూకమతాల వివరాలు, ఒకదానికొకటి అన్వయించుకుని విశ్లేషణ చేస్తే ఆసక్తికరమైన విషయాలు
అవగాహనకొస్తాయి. నాటి పీవీ శాసనసభ ప్రసంగం, చర్చలో ఆయన వెలిబుచ్చిన
అభిప్రాయాలు,
ఆయన అసలు-సిసలైన భూసంస్కరనాభిలాషను ప్రతిబింబిస్తే, ప్రస్తుతం తెలంగాణలోని భూకమతాల లెక్కలు పరిశీలిస్తే, పీవీ గారి దూరదృష్టిని కళ్ళకు కనిపించే విధంగా వుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో
తెలంగాణకు ఏదైనా ప్రయోజనం చేకూరిందా అని భూతద్దం పెట్టుకుని వెతుక్కుంటే, బహుశా,
తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ సీఎంగా వున్నప్పుడు అమలు
చేసిన భూసంస్కరణల ద్వారానే అన్న సమాధానం దొరుకుతుంది. రాష్ట్రంలో సుమారు 97 శాతం చిన్న-సన్న-మధ్యతరగతి కమతాలుండడం పీవీ చలవే!
ఉమ్మడి రాష్ట్రంలో, అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి
అనుగుణంగా,
జాతీయ మార్గదర్శికాల నేపధ్యంలో, జూన్ 1,
1973 నుండి భూసంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఆగస్ట్ 30, 1972 న శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టడానికి పూర్వరంగంలో అదే ఏడాది మే నెలలో
ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా భూసంస్కరణలకు తెరదించింది. భూమిలేని నిరుపేదలకు భూమి
పంచాలనీ,
తద్వారా భూకమతాల్లో చోటుచేసుకున్న అసమనాతలను తొలగించాలనీ, కుటుంబం యూనిట్ గా సీలింగ్ నిర్ధారించాలనీ, “బంజర్” గా
వ్యవహరించే ప్రభుత్వ భూములను పేదలకు పంచాలనీ, అంతవరకూ భూస్వాముల
హక్కుభుక్తంలో వుంటూ మిగులు భూమిగా తేలనున్న లక్షలాది ఎకరాల భూమిని షెడ్యూల్డ్
కులాల-తెగల వారికి,
బలహీన వర్గాల వారికి వ్యవసాయం కొరకు పంచాలనీ, వ్యవసాయ కూలీలకు ఉజ్జ్వల భవిష్యత్ కలిగించాలనీ, గ్రామీణ సామాజిక-ఆర్ధిక స్థితిగతులను మెరుగుపర్చాలనీ, భూసంస్కరణల ఉద్దేశంగా బిల్లులో పేర్కొంది ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలంటే
వ్యవసాయ భూమిని సొంతం చేసుకునే విషయంలో అదొక విప్లవాత్మకమైన కార్యక్రమం.
చారిత్రాత్మకమైన, విప్లవాత్మకమైన భూసంస్కరణల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్తూ పీవీ నరసింహారావు
చేసిన ప్రసంగం,
తదనంతరం చర్చలో పాల్గొంటూ ఆయన చెప్పిన అనేక విషయాలు, ఆయన రాజనీతిజ్ఞతకు,
భూమికి సంబంధించిన, రాజకీయ-ఆర్ధిక-సామాజిక
స్థితిగతులకు సంబంధించిన,
చట్టానికి-సామాజిక న్యాయానికి సంబంధించిన అనేక అంశాలపై ఆయన
కనపరచిన ప్రతిభ ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంది. భూసంస్కరణలు అమలుపర్చాల్సిన-పర్యవేక్షించాల్సిన
సిబ్బందికి సామాజిక న్యాయం పట్ల వుండాల్సిన నిబద్ధత గురించీ, మిగులు భూమి వుండే భూస్వాముల పిర్యాదులను విని వారికి ఎలాంటి అన్యాయం
జరక్కుండా చూసే విషయంలో హైకోర్ట్ నిర్వర్తించాల్సిన పాత్ర గురించీ, స్త్రీధనం-దయాభాగే-మితాక్షర న్యాయం-చట్టం గురించీ, భూమి కోల్పోయే వారి నష్టపరిహారం గురించీ, హరిజనులకు-గిరిజనులకు
భూమి పంపకం గురించీ,
ముందస్తుగా మే నెలలోనే ఆర్డినెన్స్ తీసుకోరావాల్సిన ఆగత్యం
గురించీ,
ఏర్పాటు చేయబోయే ట్రిబ్యునల్స్ గురించీ, కుటుంబం ఒక యూనిట్ గా వుండే విషయం గురించీ, కుటుంబలో మేజర్-మైనర్
పిల్లల గురించీ,
భూసంస్కరణలో సెక్యులరిజం గురించీ, రామాయణం కాలం నుంచే ఎలా భారతదేశంలో భూసంస్కరణలు అమల్లో వున్నాయనే విషయం
గురించీ.....ఇలా అనేక విషయాల గురించి ఆయన మాట్లాడిన అంశాలు ఆయన ప్రజ్ఞా-పాటవాలకు
నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి.
బిల్లు ప్రధాన ధ్యేయం భూస్వాముల
చేతుల్లో,
వారి హక్కుభుక్తంలో వేలాది ఎకరాల భూమి వుండకూడదని, భూసంస్కరణలు రాబోతున్నాయని తెలుసుకుని చట్టం నుంచి తప్పించుకోవడానికి బినామీ
పేర్ల మీద భూమిని బదలాయించడం నిరోధించడమని పీవీ చెప్పారు. భూసంస్కరణలను
అధిగమించడానికి కుక్కల పేరు మీద, పిల్లుల, ఇతర రకాలైన పెంపుడు జంతువుల పేరుమీద కూడా భూస్వాములు తమ భూములను
బదలాయిస్తున్నారనీ,
అలాంటి చట్ట వ్యతిరేక విధానాలను నిరోధించడానికి పకడ్బందీగా
బిల్లును రూపొందించామనీ,
బిల్లు గురించి తాను చర్చించిన అనేకమంది ప్రముఖ వ్యక్తులు
దీని అవసరాన్ని,
ఆవశ్యకతనీ, ప్రాముఖ్యతను
గుర్తించారనీ,
సామాజిక న్యాయానికి బిల్లు అత్యవసరమని వారంతా చెప్పారనీ
పీవీ శాసనసభకు తెలియచేశారు.
పీవీ శాసనసభలో మాట్లాడుతూ.....“ఎప్పుడో
రామాయణ కాలంలోనే భూసంస్కరణలకు భారతదేశంలో బీజం పడింది. ఒక చిన్న భూకమతం మీద
చిన్న-సన్నకారు రైతుకుండే వ్యక్తిగత శ్రద్ధ, ప్రేమ, ధ్యాస బడా భూస్వామికి వుండదు. ఇలాంటి అత్యంత ప్రాముఖ్యతకలిగిన, ప్రాధాన్యత సంతరించుకున్న, విభిన్న కోణాల సమాహారమైన
భూసంస్కరణ చట్టం ఎక్కడో ఒక మూల కూర్చుని తయారుచేసేదికాడు......రాష్ట్రవ్యాప్త చర్చ
జరగాలి.....శాసనసభ క్షుణ్ణంగా చర్చించాలి. కాకపోతే, అనవసర కాలయాపన చేసి,
అనవసర అంశాల మీద చర్చ పొడిగించి, బిల్లు చట్టం కావడంలో జాప్యం జరిగితే, భూస్వామికి లాభం
చేకూర్చిన వాళ్ళం అవుతాం. అలా జాప్యం జరిగితే భూమంతా, భూస్వాముల కుక్కల,
పిల్లుల వాటా అయ్యే ప్రమాదముంది. అందుకే ముందుగా ఆర్డినెన్స్
తెచ్చాం. ఎవరిమీదనో కోపంతోనో, మరెవరిమీదనో ద్వేషంతోనో, ఎవరి పైన పగ తీర్చుకోవడానికో ఈ బిల్లు ప్రవేశ పెట్టడం లేదు. సమాజంలో
చోటుచేసుకున్న అసమానతలు తొలగించి న్యాయం చేయడానికే ఈ బిల్లు తెస్తున్నాం”.
అన్నారు.
ఇంకా ఇలా అన్నారు:
“ఈ రోజు సమాజంలో ఎవరికైనా 500 ఎకరాల భూమి వుంటే ఆయన్ను గౌరవంగా చూస్తాం. ఆ క్రమంలో వాడికి గర్వం, అహంకారం పెరుగడం సహజం. అదే అతడి భూమిని ఒక పాతిక ఎకారాలో-ఇరవై ఎకరాలో చేస్తే, అలా ఆయనకున్న భూమిని తగ్గిస్తే, అదే దామాషాలో అతడి
అహంభావం-అహంకారం-గర్వం కూడా తగ్గుతుంది. ఆస్తిమీదే ఆధారపడే సమాజంలో, ఆస్తికలిగిన వాడినే సమాజం గౌరవించాల్సిన పరిస్థితుల్లో, సమాజంలో విలువలు కొరవడుతాయి. అందుకే విలువలకు ప్రాదాన్యతనిస్తున్న భూసంస్కరణల
బిల్లును ప్రవేశ పెట్టున్నాం. ప్రజా ప్రతినిధులుగా మనకు అయిష్టమైన చట్టాన్ని
తేవాలని కోరుకోం. ఆంగ్లంలో ఒక సామెత వుంది...”చారిటీ బిగిన్స్ ఎట్ హోం” అని.
మెజారిటీ శాసనసభ సభ్యులు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారే. అందుకే, ముందుగా మనమే మన భూముల వివరాలను ప్రకటిద్దాం. మన డిక్లరేషన్లు మనమే
మొదలిద్దాం. ప్రజా ప్రతినిధులుగా-ప్రజా నాయకులుగా అలా చేయడం మన బాధ్యత. నాయకుడంటే
ఓట్లు అడగడం మాత్రమే కాదు. నేనొక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. మీరెవరూ, మనమెవరమూ ఈ చట్టం నుంచి తప్పించుకోలేం. స్వచందంగా వివరాలిస్తే
సరే....లేకపోతే.....ఈ చట్టం ఆధారంగా (నేనే) ప్రభుత్వమే మిగులు భూములను
తీసుకుంటుంది. ప్రజలిది జరగాలనీ, చట్టం అమలు జరిగితీరాలనీ
కోరుకుంటున్నారు”.
పీవీ నరసింహారావు 1972 ఆగస్ట్ నెలలో బిల్లుగా ప్రవేశ పెట్టి, జూన్ 1, 1973 నుంచి అమల్లోకి వచ్చిన భూసంస్కరణల చట్టం తెలంగాణకు సంబంధించినంతవరకు లాభం
చేసిందనే అనాలి. లభ్యమవుతున్న గణాంకాల ప్రకారం
తెలంగాణలో 3.14 లక్షల ఎకరాల భూమి మిగులుగా తేలి షెడ్యూల్డ్ కులాల-తెగల-బలహీన వర్గాల వారికి
ఇళ్ళ జాగాకు,
లేదా, వ్యవసాయానికి పంచడం
జరిగింది. తద్వారా 2.26 మంది లాభపడ్డారు. అదీ-ఇదీ కలిసి సుమారు 23 లక్షల ఎకరాల అసైన్డ్
భూమిని సుమారు 15.
84 లక్షల మందికి పంచడం కూడా జరిగింది. కాకపోతే అలా పంచిన
భూమిని రైతు ఏ మేరకు సక్రమంగా వినియోగించుకోగలిగాడనేది సమాధానం దొరకని ప్రశ్న.
రైతుకు కావాల్సిన కనీస వసతి-సౌకర్యాలు కలిగించకుండా భూమి ఇవ్వడంతోనే
సరిపుచ్చుకుంది అలనాటి ప్రభుత్వం.
భూసంస్కరణల
పుణ్యమా అనీ,
పీవీ గారి పుణ్యమా అని, భూస్వాముల భూమి పోవడంతో
పాటు, చట్టం అమలు మొదలైన తరువాత పెద్ద మొత్తంలో వ్యవసాయ భూముల కొనుగోలు, పెద్ద కమతాలుండే విధానం, క్రమేపీ తగ్గిపోయింది.
సమగ్ర సర్వే-భూ రికార్డుల ప్రక్షాళణ చేయించాలన్న ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన
నేపధ్యంలో లభ్యమవుతున్న గణాంకాల వివరాల ప్రకారం, చిన్న-సన్న-మీడియం కమతాలున్న రైతులే మెజారిటీలో-సుమారు 97 శాతం-వున్నారని తేలింది.
వివరాల్లోకి పొతే:
రాష్ట్రం మొత్తం వ్యవసాయానికి అనుకూలంగా వున్న సుమారు 1.55 కోట్ల ఎకరాల భూమిలో సుమారు 62 శాతం కమతాలు (39 లక్షల ఎకరాలకు పైగా) రెండున్నర ఎకరాల లోపే! మరో సుమారు 24 శాతం కమతాలు (46
లక్షల ఎకరాలకు పైగా) రెండున్నర-ఐదు ఎకరాల మధ్యన వున్నాయి.
అలాగే ఐదు-పదెకరాల మధ్యనున్నవారు సుమారు 11 శాతం (39 లక్షల ఎకరాలకు పైగా) మంది వున్నారు. పదెకరాల నుండి 25 ఎకరాల మధ్యనున్న వారి సంఖ్య 3 శాతం (23 లక్షల ఎకరాలకు పైగా) మాత్రమే. ఇక 25 ఎకరాల పైనున్న వారు కేవలం 0.28 (6 లక్షల ఎకరాలకు పైన)
శాతమే! ఇక కమతందారుల సంఖ్య చూస్తే: రెండున్నర ఎకరాల లోపు 34.41 లక్షలు,
రెండున్నర-ఐదు ఎకరాల లోపు 13.27 లక్షలు,
ఐదు-పదెకరాల లోపు 6 లక్షలు, పది నుంచి పాతిక ఎకరాల మధ్యన 1.67 లక్షలు, పాతిక ఎకరాల పైన కేవలం 15, 775 మంది మాత్రమే వున్నారు. ఏ
విధంగా చూసినా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన ఎకరాకు రు. 10, 000 సబ్సిడీ పథకం ద్వారా లబ్దిపొందేది అత్యధిక శాతం వున్న చిన్న-సన్న-మధ్యతరగతి
రైతులే! పీవీ భూసంస్కరణల పుణ్యమే చిన్న కమతాలు ఏర్పడడం!
(పీవీ శత జయంతి
ఉత్సవాల ఆరంభం సందర్భంగా ప్రత్యేకవ్యాసం)