క్షీరసాగర మధనంలో అనేక
రహస్యాలు
శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం బాలకాండ మందర మకరందం-11
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక
(08-06-2020)
గంగ మహాత్మ్యాన్ని
గురించి రామ లక్ష్మణులకు వివరించాడు విశ్వామిత్రుడు. శంకరుడి శిరస్సులో
పడినందున-పాపాలను పోగెట్టేదైనందున పావనమైంది గంగంటారు. పావనమైంది కనుకనే రుద్రుడు
ధరించాడు.అందువల్ల మనం కూడా పావనమవుదామని సమస్త దేవతలు స్నానమాడి వారు
పావనులై-గంగనూ పావనం చేసారు. శివుడి శిరస్సునుండి వెలువడిందికనుకనే గంగ
పవిత్రమైందని-అంతకు ముందు అపవిత్రమయిందనీ అనడం సరికాదు. వాస్తవానికి, భగీరథుడి కోరిక ప్రకారం గంగా జలాలు తన శిరస్సుమీద పడడం చూసిన శివుడు, యోగ్యుడనయ్యానని భావించి-పావనుడు కావడానికి గంగను తన శిరస్సుపై ధరించాడు. గంగ
పవిత్రం కావడానికి అసలు కారణం, విష్ణు పాదంలో పుట్టడమే.
హరుడి శిరస్సునందుండి పడడం వల్ల గంగ పుణ్య నదైందని శైవులు వాదిస్తారు. గంగ
పుణ్యనది కనుకనే శివుడు తలపై ధరించాడని వైష్ణవ వాదం. ఈ వివాదాన్ని పరిష్కరించేది
వాల్మీకి రామాయణం మాత్రమేనని వాసుదాసుగారి అభిప్రాయం. రామాయణం మూల శ్లోకంలో
పుణ్యగంగ,
పుణ్య శివుడి శిరస్సులో పడిందనుంది. గంగాశివులకు పరస్పర
సంబంధం లేనప్పుడు కూడ ఇద్దరూ పుణ్యులనే అర్థం. అయోధ్యా కాండలో వశిష్ఠ వాక్యంగా
కూడా ఇది చెప్పబడుతుంది. అక్కడ గంగ పాద తీర్థం ధరించి పార్వతీ పతి ధన్యమయ్యాడు అని
చెప్పబడుతుంది ఒకానొక చోట.
గంగా జలాన్నంతా
నిమిషంలో తాగిన జహ్నముని రాజర్షి. భరత వంశపు రాజు. ఆ వంశంలో అజామీఢుడు అనే
రాజుండేవాడు. ఆయన కొడుకే జహ్నుడు. ఆయన కొడుకు సింధుధ్వజుడు. ఆయన కొడుకు
బలాకాశ్వుడు. బలాకాశ్వుడి కొడుకు వల్లభుడు. ఆయన కొడుకు కుశికుడు. కుశికుడి కొడుకు
గాధి. కొడుకుకై గాధి తపస్సు చేస్తున్నప్పుడు అడవిలో ఆయనకు సత్యవతి జన్మించింది.
తర్వాత విశ్వామిత్రుడు పుట్టాడు. సత్యవతిని భృగు వంశంలో పుట్టిన చ్యవనుడి కొడుకు
ఋచీకుడు వివాహం చేసుకున్నాడు. సత్యవతి-ఋచీకులకు జమదగ్ని పుట్టాడు. జమదగ్ని భార్య
రేణుక. వీరిరువురికి పరశురాముడు జన్మించాడు.
మరో ఆసక్తికరమైన
విషయం గంగా మహాత్మ్యం సర్గలో చెప్పబడింది. కుమార సంభవ సందర్భంలో
"రసవాదం" గురించి పరోక్షంగా చెప్పినట్లే ఇక్కడ యోగ విషయం చెప్పడం
జరిగింది. గంగోద్భవానికి యోగవిద్యకు సంబంధముందని ఈ సర్గలో వాల్మీకి చెప్పిన
శ్లోకాల్లో వుందంటారు వాసుదాసుగారు. "ప్రాణ శక్తి వాయువాహనగా, బ్రహ్మ రంధ్రం మూలంగా,
సహస్రార కమలస్థానం ప్రవేశించి, అక్కడనుండి,
శివ స్థానమైన ఆజ్ఞా చక్రానికి దిగి, అక్కడ మూడు పాయలుగా ఇడాపింగళసుషుమ్నలవతుంది. అందులో సుషుమ్న మధ్యది. దీన్నే
తపోబలంతో భగీరథుడు తెచ్చాడు. ఇది మేరు దండం వెంట కిందకు దిగి-దిగి, మూలాధారంలోని కుండలిని (నాగ లోకాన్ని) తాకింది. ఈ కారణాన, నిశ్చేష్టంగా పడి వున్న అణువులు ఊర్ధ్వగాములవుతాయి". అని సూచన మాత్రంగా
వ్యాఖ్యానించి,
యోగులకు సవిశేషంగా తెలుస్తుందని అంటారు వాసుదాసుగారు.
కాకపోతే ఇతరులకీ విషయం అభేద్యం అనికూడా చెప్తారు.
క్షీరసాగర మధనం
గురించి చెప్పినప్పుడు అనేక రహస్యాలు బాలకాండలో వివరించబడ్డాయి. ఇంద్రుడు ఒకనాడు
ఐరావతాన్నెక్కి విహారానికి వెళుతుంటే దుర్వాసుడు ఆయనకు ఎదురుగా వచ్చి, ఒక పుష్ప హారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని తను ధరించకుండా, ఐరావతం కుంభాలకు చుట్టాడు. అది తొండంతో దాన్ని తీసేసి, నేలపై పడవేసి కాల రాసింది. సగౌరవంగా తానిచ్చిన పూల దండను, ఐశ్వర్యమదంతో అగౌరవ పర్చి-అవమానించిన ఇంద్రుడి ఐశ్వర్యమంతా సముద్రం పాలై పోవాలని
దుర్వాసుడు శపించాడు. వెంటనే ఇంద్రుడి ఏనుగులు, గుర్రాలు, మణులు,
ఇతర భోగ పదార్థాలన్నీ మాయమై సముద్రంలో పడ్డాయి. ఇంద్రుడు
దరిద్రుడై-బుద్ధిమంతుడై,
మరల విష్ణువును ప్రార్థించాడు. మున్ముందు పెద్దలను అవమానించ
వద్దని ఇంద్రుడికి హితవు పలికి-బుద్ధిచెప్పి, మందరంతో పాల సముద్రాన్ని
చిలకమని,
అందులోంచి ఆయన మునుపటి ఐశ్వర్యమంతా లభిస్తుందని చెప్పాడు
విష్ణుమూర్తి. అలా,
ఆ మహా విష్ణువు సహాయంతో, ఇంద్రుడు మరల
లబ్దైశ్వర్యుడు అయ్యాడు.
పాల సముద్రంలో
అమృతం పుట్టడం కూడా యోగశాస్త్రాన్ననుసరించే వుంది. మూలాధారమందుండే త్రికోణం మందరం.
దాన్ని చుట్టి వున్న వాసుకి కుండలి. దాన్ని మథించిన సురాసురులు
ఇడాపింగళనాడులందుండే ప్రాణశక్తి వాయువులు. దీనంతటికి ఆధార భూతుడు విష్ణువు. కుండలి
మొదలు మేల్కొన్నప్పుడు,
దేహంలో శక్తి ప్రసారమైన కారణాన, వికారాలు పుట్తాయి. అప్పుడు, ఆ యోగవిద్య తెలిసిన
గురువు, దాన్నుండి అపాయం కలగకుండా చేయాలి. ఆ గురువే, వాసుకి భూషణుడైన శివుడు. శివుడు వాసుకి కంకణుడు కాబట్టి, విషం ఆయనను భాదించదు. భగవంతుడైన విష్ణుమూర్తే, గురువైన శివుడిని,
అపాయాన్నుండి కాపాడమని ప్రేరేపించాడు. ఆ తర్వాత, తానే ఆధారంగా నిలుచుండి, యోగి అభీష్ఠాన్ని నెరవేర్చాడు.
అమృతం పుట్టినప్పటికీ,
ఆ దశలో, హరి భక్తిలేని సాధకులు, అందగత్తెలను చూసి చెడిపోతారు. భగవంతుడిని ఆశ్రయించి వున్నవారు చెడరు. అందువల్ల
ఆయనే విఘ్నాలను అణచివేసి,
అమృతాన్ని దేవతలకిచ్చాడు.
అహల్యా వృత్తాంతం
కూడా ఇతర రామాయణాలకన్నా భిన్నంగా వుంటుంది మందర మకరందంలో. అహల్య శిలగా మారిందని
కొన్ని గ్రంథాలలో చెప్పబడిన విషయం వాస్తవం కాదని వాల్మీకి రామాయణం స్పష్టం
చేసింది. వాల్మీకి మతమే వేరు. దుఃఖానుభవం లేకుండా, రాయిగా పడి వుంటే,
పాప ఫలం అనుభవించినట్లెలా అవుతుంది? అహల్య స్త్రీగా వుంటూనే, ఆహారం లేకుండా తాపంలో
మాడుతుంటుంది. రామచంద్రమూర్తి ఆశ్రమ ప్రవేశం చేయగానే ఆ తాపం తొలగి లోకానికి
కనిపిస్తుంది. అంటే,
జారత్వ దోషం పోవాలంటే, అనేక సంవత్సరాలు తపించి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి. అలా కాకపోతే వంశ నాశనం అవుతుంది. గౌతముడు
అహల్య స్వరూప నాశనం చేయకుండా, గాలిని ఆహారంగా తీసుకుంటూ, కఠిన వ్రతం ఆచరించమని మాత్రమే అంటాడు. జారత్వమే అభ్యాసంగా వుంటే, ఆ స్త్రీని పతితగా భావించి స్వీకరించ కూడదు-పరిత్యజించాలి. స్త్రీలు తమ
జాతివారితో వ్యభిచరించినప్పటికీ, గర్భం రాకపోతే పరిత్యజించ
రాదు. అంటే,
గర్భం వచ్చినా-అసవర్ణులతో వ్యభిచరించినా, వదిలి పెట్టాలి. గర్భం ధరించకపోతే, న్యాయ శాస్త్ర ప్రకారం
దండించి ప్రాయశ్చిత్తం చేయించాలి. కుక్కలతో కరిపించాలని కూడా శాస్త్రంలో వుంది.
వశిష్టుడి గురించి
చెప్పేటప్పుడు వాసుదాసుగారు రాసిన పద్యాల్లో, ఆయన్ను
"జపివర్యుడు",
"జపశీలుడు" అనే విశేషణాలను ప్రయోగించారు. ఇలా
ప్రయోగించడంలో వక్త-వ్యాఖ్యాత వుద్దేశం, వశిష్ఠుడి మహాత్మ్యానికి
కారణం ఆయన నిరంతరం చేస్తున్న జపమే. ఆయన జపించే మంత్రం "గాయత్రి" యే.
గాయత్రీ మంత్రమే బ్రహ్మాస్త్రం. అది జపించడం వల్లే, వశిష్ఠుడింతటి మహాత్మ్యంగలవాడయ్యాడు. ఇంకో క్షత్రియుడయితే, బ్రహ్మాస్త్రం తగిలితే చనిపోవాల్సిందే. ఒకవేళ అతడికి కూడా బ్రహ్మాస్త్ర
ప్రయోగం వస్తే శత్రువు అస్త్రాన్ని అణచి వేయొచ్చు.ఇవేవీలేకుండా,వశిష్ఠుడు దాన్ని మింగి జీర్ణించుకున్నాడు. తపోబలంతో, జప బలంతో,
బ్రాహ్మణ్యంతో వశిష్థుడి దేహమే బ్రహ్మమై వుండగా, ఆయన్నెవరేం చేయగలరు?
కార్చిచ్చుమీద చిచ్చుబుడ్లు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అదే
జరిగింది వశిష్ఠ-విశ్వామిత్రుల మధ్య జరిగిన "ఆత్మ-అనాత్మల" యుద్ధంలో.
వశిష్ఠ విజయం నిజానికి గాయత్రీ విజయమే. అంతటి గొప్పదైన గాయత్రిని అధికరించి
చెప్పబడిందే,
శ్రీమద్రామాయణం-శ్రీ మధాంద్ర వాల్మీకిరామాయణం. అందుకే ఇవి
సర్వోత్కృష్ట గ్రంథాలని వేరే చెప్పాల్సిన
పనిలేదు.
No comments:
Post a Comment