వివాహానంతరం అయోధ్యలో
సీతారాములు
శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం బాలకాండ మందర మకరందం-14
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(29-06-2020)
బాల కాండ చివరలో
సీతారాములు అయోధ్యలో వివాహానంతరం గడిపిన విషయాన్ని వివరించబడింది. అయోధ్యా నగరంలో
శ్రీ సీతా రాములు సర్వ సుఖాలు అనుభవించారని చెప్పడంలో వారిద్దరి అన్యోన్యత, అనురాగం,
అవతార నేపథ్యం లాంటి అనేక విషయాలు భావగర్భితంగా
దర్శనమిస్తాయి. సీతను గూడి శ్రీరామచంద్రుడు ప్రియంగా గడిపాడు అనిచెప్పడంలో, భోగానుభవంలో ప్రాధాన్యం శ్రీరామచంద్రమూర్తికేనని చెప్పబడింది. సీత
భోగ్య-రామచంద్రుడు భోగి. భోగ్యకంటే భోగి ప్రధానం. "సీతనుగూడి ప్రియంగా", అనడమంటే,
సీత దగ్గరలేని సమయం దుఃఖకరమే కాని ప్రియంకాదని-కాజాలదని
భావం. అయితే,
సీతారాముల విహారంవలన కలిగే సంతోషం, సీతకే చెందాలని రామచంద్రమూర్తి అభిప్రాయం. ఇరువురి విషయంలోనూ, "కూరిమి" శబ్దాన్ని ప్రయోగించడమంటే, వారిరువురు పరస్పరం
సమానమైన ప్రేమ కలవారై వున్నారని భావం. కూరిమి చెప్పబడిందే కాని, కామం గురించి చెప్పలేదు. అంటే, వారి
ఐకమత్యానికి-పరస్పరానురాగానికి కారణం కూరిమిగాని, కామంకాదే. వారలా అనేక "ఋతువులు" గడిపారని వుంది గాని, అనేక సంవత్సరాలని లేదు. దానర్థం-వారు ఏ ఏ ఋతువుల్లో ఎలా సుఖపడాల్నో అలానే
సుఖపడ్డారని.
రామచంద్రమూర్తి
కోరిక కోరబోతున్నాడని ముందుగానే సీత ఎలా పసిగట్టగలదన్న సందేహం రావచ్చు. ఆమెకు అంత
శక్తెలా వచ్చిందంటే,
ఆమె మైథిలికన్య-మహా జ్ఞాని, మహాయోగైన జనక రాజు కూతురు కనుక. దేశ స్వభావం-వంశ స్వభావం బట్టీ, దేవతతో సమానమైనందున ప్రాగల్భ్యాన్ని బట్టీ, సాక్షాత్తు లక్ష్మి
కాబట్టి సహజ బుద్ధి విశేషాన్ని బట్టీ అమెకు ఆ శక్తి వచ్చిందనాలి. సీతారాముల భోగ
విషయంలో ఇక్కడ చెప్పబడిన లక్ష్మి నారాయణ ఉపమానం పద్మ పురాణంలో కూడా వుంది. ఇక్కడ
చెప్పింది దివ్యదంపతి భోగమే. ప్రాకృత కామ ప్రేరిత సంభోగం గురించి ఎక్కడా
చెప్పలేదు. అప్రాకృత దివ్య మూర్తులలో ప్రాకృత కామం వుండే అవకాశం లేనేలేదు. వివాహం
అయ్యేటప్పటికి తనకు ఆరు సంవత్సరాల వయస్సని సీతే స్వయంగా-పరోక్షంగా రావణుడికి వనవాస
కాలంలో చెప్పింది. ఆ వయస్సులో ఆంతర సంభోగానికి అవకాశం లేదు. బాల కాండ వృత్తాంతమంతా
12 ఏళ్లు. బాల కాండ మందర మకరందం చదివిన వారికి, రామాయణమంతా చదివిన అనుభూతి కలగడంతో పాటు అనేకమైన అద్భుతాలు, రహస్యాలు వివిధ సందర్భాల్లో చెప్పిన కథల ద్వారా తెలుసుకోవచ్చు.
నారదుడు
వాల్మీకికి చెప్పిన సంక్షిప్త రామాయణం-వాల్మీకి యోగదృష్టితో తెలుసుకున్న రామాయణం చదవడమంటే
మొత్తం రామాయణాన్ని చదివినట్లే. వాల్మీకి ప్రశ్నలకు నారదుడిచ్చిన సమాధానం ద్వారా, భగవంతుడు సాకారుడా-నిరాకారుడా అనే విషయం, తత్వ విచారం కంటే గుణ
విచారమే శ్రేయస్కరమన్న విషయం, శ్రీరామచంద్రుడంటే
పరతత్వమైన విష్ణుమూర్తేననీ,
నారదుడు ఉపదేశించింది మోక్ష విషయమైన భగవంతుడి గురించేననీ
బాల కాండ చదివినవారికి బోధపడుతుంది. కవిత్వమంటే ఏమిటి, కావ్య లక్షణాలేంటి,
ప్రబంధ లక్షణాలేంటి తెలుసుకోవచ్చు. ఉపాయ వివేచనం, శరణాగతికి ముఖ్య ఫలం,
పురుష కారం, అధికార స్వరూపం, భగవత్ పారతంత్ర్యం,
భాగవత పారతంత్ర్యం, అర్థపంచక జ్ఞానం, అకించినత్వం,
ఆచార్యవరణం, ఔత్కంఠ్యత, నడవడి,
వాసస్థానం, రామాయణం ద్వయార్థ
వివరణరూపం,
గాయత్రి, దుర్విచార పరిహారం, సంహర జిహాస,
చతుష్షష్టి కళల గురించి వివిధ సందర్భాల్లో తెలుసుకోవచ్చు.
వీణల గురించి, మంత్రుల లక్షణాల గురించి, అతిథి అంటే ఎవరనే విషయం
గురించి,
బ్రహ్మచర్యం గురించి, సందర్భం లేకుండా తెలిసిన
విషయమైనా చెప్పకూడదన్న విషయం గురించి, విష్ణు శబ్ద నిర్వచనం
గురించి తెలుసుకోవచ్చు. సరయూ నది వృత్తాంతం, మలద కరూశాల వృత్తాంతం, సిద్ధా శ్రమ వృత్తాంతం,
బలిచక్రవర్తి వృత్తాంతం, పరిణామ వాదం, కుశనాభుడి వృత్తాంతం,
బ్రహ్మ దత్తుడి చరిత్ర, గంగానది వృత్తాంతం, కుమారస్వామి జననం,
సగర చక్రవర్తి వృత్తాంతం, బ్రహ్మ కల్ప వివరణ,
భగీరథ వృత్తాంతం, విశాలనగర వృత్తాంతం, క్షీరసాగర మథనం,
గౌతమాశ్రమ వృత్తాంతం, విశ్వామిత్రుడి
వృత్తాంతం-ఆయన రాజర్షిగా,
మహర్షిగా, బ్రహ్మర్షిగా కావడం, వశిష్ఠ-విశ్వామిత్రుల యుద్ధం, త్రిశంకోపాఖ్యానం, శునస్సేపోఖ్యానం,
గోదాన వివరణ లాంటి అనేక విషయాలు బాలకాండ మందర మకరందం
చదివితే తెలుసుకోవచ్చు.
వాసుదాసుగారి
ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కోరకమైన
విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ,
చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి.
ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా
చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒక సారి ధర్మశాస్త్రం లాగా, ఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా, మరో చోట ఇంకో శాస్త్రం
లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘిక, సామాజిక,
ఆర్థిక, సామాన్య, నీతి,
సంఖ్యా, సాముద్రిక, కామ,
రతి,
స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా
దర్శనమిస్తుంది. బహుశా,
క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర
విషయాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో
పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. పాదరసం నుండి బంగారం చేసే రహస్యమైన
విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చు, పరిశోధనా దృక్ఫదంతో
చదివితే. ఇవన్నీ బాల కాండలోనూ దర్శనమిస్తాయి. బాలకాండ మందర మకరంలో ఇవన్నీ
వివరించబడ్డాయి. అందుకే-ఇందుకే చదవాలి.
No comments:
Post a Comment