నియంత్రిత సాగు లాభాదయకం
వనంజ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక
(06-06-2020)
నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాలన్న
నిర్ణయాన్ని రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వం
నిర్వహించిన ఒక సర్వేలో తేలినట్లు సమాచారం. ఇది మంచి పరిణామం. రైతులకు ప్రభుత్వం
అండగా ఉంటున్న విషయం జగద్విదితం. నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం వల్ల రైతులకు మేలు
కలుగుతుంది. ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే. వ్యవసాయ విధానంలో, నియంత్రిత పద్ధతి పాటించటం ఎంతో లాభాదాయకంగా
మారుతుంది. తద్వారా రైతులు సంపన్న వంతులుగా తీర్చిదిద్ద బడతారు. ఆద్యతన భవిష్యత్
లో లక్ష కోట్ల రూపాయల సంపద వ్యవసాయం ద్వారా సమకూరుతుందన్న సీఎం కేసీఆర్ ఆశాభావం
నిజమయ్యే రోజు దగ్గరలోనే వుంది.
తెలంగాణ జీవిక,
జీవన విధానం వ్యవసాయాదారితం. రాష్ట్రంలో 60-65 లక్షల మంది
రైతులున్నారు. ఇంకా అనేక మంది వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నారు. రైతులు అసంఘటితంగా
ఉండడం వల్ల,
గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు చేయకపోవడం
వల్ల రైతులు ఎంతో వ్యధను, గోసను అనుభవించారు.
వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్
ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు తీసుకోవడం
వల్ల పరిస్థితి బాగా మెరుగైంది. వ్యవసాయాభివృద్ధి కోసం, రైతులకు మేలు చేయడం కోసం ఇంకా కృషి జరగాల్సి వుందని కేసీఆర్ అంటుంటారు.
రైతు తాను పండించిన
పంట అమ్ముదామంటే అమ్ముడుపోదు. కావాల్సిన వస్తువులు కొందామంటే విపరీతమైన ధరలు
ఉంటాయి. ఈ పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు
భారతదేశాన్ని పాలించిన ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం కూడా వ్యవసాయంపై చిత్తశుద్ధితో
పనిచేయలేదు. తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిలో మార్పు
తేవడం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చేస్తున్నది. రాష్ట్రంలో గతంలో
వ్యవసాయం పరిస్థితి వేరు,
ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి వేరు. ప్రభుత్వం వ్యవసాయ
రంగానికి సంబంధించి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నది. కరెంటు గండం
గట్టెక్కింది. సాహసోపేతంగా తలపెట్టిన భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి
అవుతున్నది. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా నీళ్లే
కనిపిస్తాయి. రైతుబంధు,
రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్
లాంటి పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం
వ్యవసాయాభివృద్ది – రైతు సంక్షేమం కోసం కంకణబద్ధమై పనిచేస్తున్నది.
అనేక సందర్భాల్లో
ముఖ్యమంత్రి కేసీఆర్,
విభిన్న వేదికలపై వ్యవసాయం గురించి ప్రస్థావిస్తూ ఇంకా ఎంతో
చేయల్సి వుందనీ, తద్వారా వ్యవసాయంతో గిట్టు బాటు మాత్రమే
కాకుండా దానిని లాభదాయకంగా మార్చాలన్న సంకల్పాన్ని వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే
"ధాన్య భాండాగారంగా తెలంగాణ" నిలదొక్కు కోవాలన్న ఆశాభావాన్నీ
వ్యక్తీకరించారు. ఈ దిశగానే నూతన వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరించారు. ఇది ముందుగానే
ఉహించారో ఏమో తెలియదుగానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించినంతనే ప్రతి రైతు వేసిన పంటలే
వేయాలన్న భావనను విస్మరించాలని నిర్ణయించారు.
తదనుగుణంగా, నియంత్రిత విధానాన్ని అనుసరించాలని గ్రామగ్రామాన తీర్మానాలు చేశారు.
రైతులంతా ఒకే పంట
వేసే విధానం పోవాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే వేయాలి. ఏ గుంటలో ఏ పంట
వేయాలనే విషయం వ్యవసాయ శాఖ నిర్ణయించాలి. రైతులు అవే పంటలు వేయాలి. వేసిన పంటను
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. నియంత్రిత పద్ధతిలో పంటలు వేయాలి. నియంత్రిత
పద్ధతిలోనే కొనుగోళ్ళ జరగాలి. ప్రజలకు అవసరమైన, మార్కెట్లో డిమాండ్ ఉన్న
పంటలను వ్యవసాయశాఖ గుర్తించాలి. ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేయడానికి అనువైనదో
నిర్ణయించాలి. రైతులకు మార్గదర్శకం చేయాలి. ఎవరు ఏ పంట వేస్తున్నారో ఖచ్చితంగా
రికార్డు చేయాలి.
జనాభా ఆహరపు
అవసరాలు,
అలవాట్లు, మార్కెట్ల లో ఏ ఉత్పత్తికి ఎంత
డిమాండ్ ఉన్నది,
ఎగుమతి అవకాశాలు దేనికి ఎక్కువగా ఉన్నాయి అన్న ఇతర అంశాలు
పరిగణలోకి తీసుకోవాలి. రాబోయే కాలంలో వ్యవసాయం ఆశాజనకంగా, ఫలవంతంగా ఉండాలి. తెలంగాణ రైతులు మంచి సరుకు, నాణ్యమైన పదార్ధాలు అందించి లాభాల బాటలో నడవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్
అభిమతం.
తెలంగాణలో గతంలో
ప్రాజెక్టులు,
కరెంటు సరిగా లేకపోవడం వల్ల సాగునీటి లభ్యత అంతగా లేదు.
ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో రైతులు ఎవరికి
తోచినట్లు వారు వారి వనరులకు అనుగుణంగా పంటసాగు చేశారు. అందరూ ఒకే పంట వేయడం వల్ల
ధరలు కూడా రాలేదు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మారుతున్నది. ప్రతీ మూలకూ సాగునీరు
అందుతున్నది. 24 గంటల కరెంటు వల్ల బోర్ల ద్వారా కూడా జోరుగా వ్యవసాయం సాగుతున్నది. కాబట్టి
రైతులను సరిగ్గా నిర్ధేశించగలిగితే లాభదాయక వ్యవసాయం చేస్తారు. పంటల ఎంపికలో, సాగు పద్ధతుల్లో,
ఎరువుల వాడకంలో, మార్కెటింగులో మార్పులు
వస్తాయి. ఈ దిశగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉందని
ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలషించారు.
రాష్ట్రంలో
ఎక్కువగా వరి పండిస్తున్నారు. పంటకాలం తక్కువనే కారణంతో దొడ్డు రకాలు
పండిస్తున్నారు. కానీ ఎక్కువ మంది జనం సన్నరకాలు తింటున్నారు. సన్నరకాలకు ఇతర
రాష్ట్రాల్లో,
ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు సాగునీటి
వసతి కూడా ఉంది కాబట్టి రైతులు ఎక్కువగా సన్నరకాలు పండించే విధంగా చైతన్య పరచాలి.
తెలంగాణ వ్యవసాయ
శాస్త్రవేత్తలు రూపొందించిన తెలంగాణ సోనా బియ్యం రకానికి మంచి డిమాండ్ ఉంది.
మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇవి చాలా మంచివి. షుగర్ ఫ్రీ రైస్ గా వీటిని వ్యవసాయ రంగ
నిపుణులు గుర్తించారు. తెలంగాణ సోనా రకం బియ్యంలో గ్లైసమిన్ ఇండెక్స్ తక్కువ శాతం
ఉంటుందని,
ఇది ఆరోగ్యదాయకమని అమెరికన్ జర్నల్స్ కూడా ప్రచురించాయి.
తెలంగాణ సోనాకు మంచి బ్రాండ్ ఇమేజి ఉంది. కాబట్టి ఈ రకాన్ని ఈ వర్షాకాలం సీజన్
లోనే 10 లక్షల ఎకరాల్లో పండించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి కావాల్సిన
విత్తనాలను కూడా వ్యవసాయ యూనివర్సిటీ సిద్ధం చేసిందని తెలుస్తోంది. కాబట్టి ఈ రకం
పండించేందుకు ముందుకు రావలసిన తరుణం ఆసన్నమయింది.
రైతులంతా ఒకే పంట
కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలి. అలా అయితేనే అన్ని పంటలకు డిమాండ్ వస్తుంది.
రైతులు తక్కువ శ్రమ,
ఎక్కువ దిగుబడి, మార్కెట్ అవకాశాలు, మంచి ఆదాయం పొందగలిగిన పంటలను గుర్తించాలి. వ్యవసాయశాఖ వాటిని రైతులకు
సూచించాలి. ఏ రైతు ఏ పంట వేయాలో నిర్ణయించి, సాగు చేయించాలి. వేరుశనగ, కందులు,
పామాయిల్ లాంటి వాటికి మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇంకా
ఇలాంటి డిమాండ్ కలిగిన పంటలను గుర్తించాలి. వాటిని ఎన్ని ఎకరాల్లో పండించాలి? అనే విషయం తేల్చాలి. తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలు, పండ్లకు కూడా కొరత ఉంది. అవి ఏ మోతాదులో పండించాలి అనే విషయంపై కూడా అధ్యయనం
జరగాలి. ఎరువుల వాడకం ఇప్పటిలాగానే ఉండాలా? ఏమైనా మార్పులు అవసరమా? అనే విషయాలను కూడా పరిశీలించాలి.
వరి ఒక నియంత్రిత
పద్ధతిలో పండించాలనీ, అది కూడా ఈ రాబోయే సీజన్ నుండే నుండే అమలులోకి రావాలని ప్రభుత్వం
సంకల్పించింది. రైతులందరికీ రైతు బంధు సహకారం నూటికి నూరు శాతం అందాలని సీఎం
అన్నారు. తదనుగుణంగా రైతులకు సరైన పంటలు వేయడంలో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
రాష్ర్టంలో గత
ఏడాది వర్షాకాలంలో వరి పంట దాదాపు 40 లక్షల ఎకరాల్లో సాగు
చేశారు. ఈ ఏడాది కూడా అంతే విస్తీర్ణంలో సాగు చేయాలని సంకల్పించారు. గత ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ
సంవత్సరం దానిని 70 లక్షల ఎకరాలకు పెంచాలని సంకల్పించారు. గత ఏడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లో కందులు సాగు చేశారు. ఈ సారి 15 లక్షల ఎకరాలకు పెంచారు. సోయబీన్, పసపు, మిర్చి,
కూరగాయాలు తదితర పంటలు గత ఎడాది మాదిరిగానే పండిచాలని వివిధ రకాల విత్తనాలు పండించే రైతులు
ఈ క్రమంలో వారి వారి ప్రయత్నాలు
కొనసాగించుకోవచ్చని ప్రభుత్వం సంకల్పించింది. వర్షాకాలంలో మక్కల సాగు
లాభసాటి కాదు కాబట్టి దానిని యాసంగిలో సాగు చేసుకోవచ్చు. వర్షాకాలంలో మక్కల సాగు
లాభసాటి కాదు కాబట్టి దాని స్తానంలో పత్తి, కందులు పంటలు పండించటం, వరి వంగడాల విషయంలో తగు జాగ్రత్తలు
పాటించటం అనివార్యం. మార్కట్లో డిమాండ్ ఉన్నరకాలు పండిoచాలి. తెలంగాణ సోనాకు డిమాండ్ ఉంది కనుక ఆరకం పండిచాలి.
రాష్ట్రంలో అమలు
చేసే నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానంపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్ల వారీగా
రైతు సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. ప్రభుత్వ ఉద్దేశాన్ని, నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు
వివరిస్తున్నారు.
రాష్ట్రంలో కొత్తగా
సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం
నిర్ణయించిన పంటలనే సాగు చేయాలని నిర్ణయించినందున, ఇకపై విత్తనాలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి మాత్రమే అమ్మడం
జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే
లభ్యమయ్యేలా విత్తన నియంత్రణ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంని ప్రభుత్వం
ప్రకటించింది.
ఈ నేపద్యంలో ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాలి. ప్రస్తుతం రైతులకు సరైన
అవగాహన లేకపోవడం వల్ల కేవలం వ్యాపారుల మాట నమ్మి వాటిని వాడుతున్నారు. తగిన
మోతాదులో ఎరువులు,
పెస్టిసైడ్స్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు తెలపాలి.
ఎరువులు ఎక్కువ వాడిన పంటకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండదనే విషయం కూడా
వారికి అర్థమయ్యేట్లు వివరించాలి.
No comments:
Post a Comment