గాయత్రీ బీజసంయుతమైనది
వాల్మీకి రామాయణం
శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం బాలకాండ మందర మకరందం-12
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(15-06-2020)
గాయత్రీ
బీజసంయుతమైన వాల్మీకి రామాయణంలో, ప్రతి అక్షరానికి, గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో, అంతే మహిముంది. వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం
మాత్రమే కాదు. ఆత్మ విద్యకు, అనాత్మవిద్యకు మధ్య
జరిగిన యుద్ధం. సంపూర్ణంగా అనాత్మవిద్య నేర్చుకున్నప్పటికీ, వాడు,ఆత్మవంతుడిని గెలవలేడు. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడుకాని, తన ఉప్పు తిని-కృతఘ్నుడై-దివిటీ దొంగలా తన సొమ్ము అపహరించేందుకు
పూనుకున్నవాడిని,
తన ఆశ్రమాన్నంతా పాడుచేసి తనను చంపే ప్రయత్నం చేసినవాడిని, దెబ్బకు-దెబ్బ అనికూడా కీడు తలపెట్టలేదు. ఇదే ఆత్మవంతుడైన బ్రాహ్మణుడి లక్షణం.
బ్రాహ్మణుడు ఇతరులవల్ల నష్టపడినాగాని, పరులకు హానితలపెట్టడు.
వశిష్ఠుడు ఇంతజరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు.
ఆంధ్ర
వాల్మీకిరామాయణం బాల కాండ మందరంలో, అవసరమైన ప్రతి చోటా, మనుష్యులు ఆచరించాల్సిన ధర్మాలను సందర్భోచితంగా వివరించబడింది. బొందితో
స్వర్గానికి పోవాలన్న త్రిశంకుడి కోరిక వక్రబుద్ధిగల శిష్య లక్షణంగా
అర్థంచేసుకోవచ్చు. సరైన శిష్యుడు, తనకేది హితమో-పథ్యమో, అది చెప్పమని గురువులను కోరాలి గాని, నిర్భంధించి-తన
ఇష్టప్రకారం,
అసాధ్యమైన పనులు చేయించమని అడిగి-ఆయన చేయించనన్నాడని
గురువును (వశిష్ఠుడు) త్యజించడం దోషం. గురు శుశ్రూష చేసి, అతడి మనస్సును సంతోషపర్చి, తన కార్యాన్ని
సాధించుకోవాలి శిష్యుడు. అలాచేయనందువల్లే త్రిశంకుడి ఆ గతి పట్టింది. వశష్ఠుడి
కొడుకులు త్రిశంకుడి కోరిక తిరస్కరించడమంటే, పుత్రులు తండ్రి
మార్గాన్ని అనుసరించి ప్రవర్తించాలని, ఆయనకు అవమానకరమైన పనులు
చేయకూడదని అర్థం. గురువును నిందించినవాడు చండాలుడవుతాడన్న అర్థం కూడా
స్ఫురిస్తుంది.
త్రిశంకుడి అసలు
పేరు సత్యవ్రతుడు. ఆయన భార్య సత్యవ్రత-కేకయ రాజు కూతురు. సత్యవ్రతుడు సూర్యారుణుడి
కొడుకు. అతడు సత్యవ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత, అయోధ్యా నగరంలో నివసిస్తున్న ఒక బాలికను-వివాహితను, రాజకుమారిడినన్న అదికా గర్వంతో, చెరిచాడు. రాజుకీవిషయం
తెలిసి, కోపించి,
తన దగ్గర వుండొద్దని సత్యవ్రతుడిని ఆజ్ఞాపించాడు. కుక్క
మాంసం తిని బతకమని కూడా తండ్రి ఆదేశించాడు. తన పక్షాన పురోహితుడైన వశిశ్ఠుడు తండ్రితో
మాట్లాడలేదని సత్యవ్రతుడికి ఆయనపై కోపమొస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి, సత్యవ్రతుడి తండ్రి అడవికి పోయి తపస్సు చేయసాగాడు. రాజ్యం, నగరం,
అంతఃపురం ఇబ్బందులకు గురి కావద్దని, వశిష్ఠుడు స్వయంగా కాపాడసాగాడాసమయంలో. ఆ సమయంలోనే, విశ్వామిత్రుడు,
భార్యా పిల్లలను వదిలి పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు
చేస్తుండేవాడు. ముగ్గురు పిల్లల్ని, తన్ను పోషించుకోలేక
విశ్వామిత్రుడి భార్య,
నడిమి కొడుకు మెడకు పలుపు తగిలించి, వంద ఆవులిస్తే అమ్మడానికి బేరం పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న సత్యవ్రతుడు, ఆమెను వారించి,
వారందరినీ తన రక్షణలో వుంచుకున్నాడు. ప్రతిదినం జంతువులను
వేటాడి వారందరికీ మాంసాహారం పెట్టి పోషించేవాడు. ఒక రోజున వేటాడేందుకు ఒక్క
జంతువుకూడా దొరకలేదు. సమీపంలోనే వున్న వశిష్ఠుడి ఆవును చంపి దాని మాంసం
తిన్నారారోజున. తండ్రికి అప్రియమైన పనులు చేయడం,
పాలిచ్చే గురువు గోవును చంపడం, అప్రోక్షిత మాంసాన్ని తినడం అనే మూడు చెడు కార్యాలను చేసినందున త్రిశంకుడు అనే
పేరుతో వ్యవహరించమని-లోక నిందితుడైన అతడిని తనింకేమీ చేయనని అంటాడు కోపించిన
వశిశ్ఠుడు. అప్పటినుంచి సత్యవ్రతుడు త్రిశంకుడయ్యాడు. తపస్సు పూర్తయిన తర్వాత
వచ్చిన విశ్వామిత్రుడు,
తన భార్యా పిల్లలను కాపాడిన త్రిశంకుడితో, ఆయన కోరుకున్నప్పుడు కావాల్సిన సహాయం చేస్తానని హామీ ఇచ్చినందువల్ల, ఆయన వచ్చి అడగ్గానే,
వశిశ్ఠుడు కాదన్నా, యజ్ఞం చేయించేందుకు
పూనుకుంటున్నాడు. ఒక వైపు ఆయన శక్తిని ప్రదర్శించినా, మరో విధంగా ఫలితం కూడా అనుభవించాడు.
విశ్వామిత్రుడి
తపస్సువలన,
సర్వం అనర్థకమైన కోపాన్ని జయించినవాడికే తపస్సిద్ధి
కలుగుతుందనీ,
బ్రాహ్మణ్యానికి కామ-క్రోధాలను జయించడం ఆవశ్యమని
అర్థమవుతున్నది. కామ క్రోధాలు రెండూ, రజోగుణం వల్ల కలుగుతాయి.
వీటికెంత ఆహారమైనా సరిపోదు. ఇవి మహా పాపాలు-శత్రువులు. తపస్సిద్ధికి జితేంద్రియత్వం
అవశ్యం. ఏం తిన్నా,
తాకినా, చూసినా, విన్నా సంతోషంగాని-అసంతుష్టిగాని పడడో వాడే జితేంద్రియుడు. కామ క్రోధాలను
విశ్వామిత్రుడు జయిస్తే దశరథుడిపై కోపం ఎందుకొచ్చిందని సందేహం కలగొచ్చు. ఆయన
మునుపటి విశ్వామిత్రుడయివుంటే వాస్తవానికి శపించాలి. అలా చేయలేదు. ఆ కోపం ఆయన
కార్యసాధనకు తెచ్చుకున్న కోపంకాని, ఇంతకుముందు లాగా మనస్సులో
కాపురముంటున్న కోపం కాదు.
విశ్వామిత్రుడు
తొలుత రాజు. గృహస్థుడు. భార్యతో సహా పోయి వానప్రస్థుడై తపస్సు చేసి రాజర్షి
అయ్యాడు. అడవిలో దొరికే పళ్లుమాత్రమే తిని తపస్సు చేసి, తర్వాత,
ఋషి అయ్యాడు. అప్పటిదాకా భార్యా పిల్లలు ఆయన వెంటే
వున్నారు. తర్వాత ఒంటరిగా వుండి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. మహర్షులంతా
జితేంద్రియులు కారు. కాబట్టి, జితేంద్రియుడు కావడానికి, పంచాగ్నుల మధ్య నిలిచి-ఆహారం మాని-వాయువే ఆహారంగా తపస్సు చేశాడు. ఇంతచేసినా
కామాన్ని జయించగలిగాడుగాని,
కోపాన్ని జయించలేకపోయాడు. అదికూడా జయించేందుకు, మౌనంగా-కుంభకంలో ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. అప్పుడు అన్నీ జయించి బ్రహ్మర్షి
అయ్యాడు. జన్మతో వచ్చే బ్రాహ్మణ్యం కర్మతో రాదు. విశ్వామిత్రుడికి వచ్చిందంటే
దానికొక ప్రత్యేకమైన కారణముందనే అనాలి. ఎవరికైనా-ఎంత చేసినా కామ క్రోధాలు
అనివార్యం. వాటిని తనకు వశపడేటట్లు చేసుకున్నవాడే బ్రాహ్మణోత్తముడు. అందుకే
బ్రాహ్మణ్యం సులభమైంది కాదు.
No comments:
Post a Comment