Wednesday, June 24, 2020

కౌసల్య, దశరథుల అంగీకారంతో శ్రీరామ వనవాసం : వనం జ్వాలా నరసింహారావు


కౌసల్య, దశరథుల అంగీకారంతో శ్రీరామ వనవాసం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ చింతన (25-06-2020)  
రామాయణంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్లే అంశం ముఖ్యమైనది. అప్పుడు, అక్కడ జరిగిన పరిణామాలు తెలుసుకుందాం. దశరథుడి సమక్షంలో ఆయన పక్షాన కైక అజ్ఞానుసారం అడవులకు పోవడానికి సిద్ధపడ్డ శ్రీరాముడు, తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. కైకకూ నమస్కారం చేశాడు. అంతఃపురాన్ని వదిలి బయటకొచ్చి, తల్లి ఇంటికి పోయాడు. లక్ష్మణుడు తనలో పెల్లుబుకుతున్న కోపాన్ని, దుఃఖాన్ని తన మనసులోనే అణచిపెట్టుకున్నాడు. తల్లి, కౌసల్యను చూసిన రాముడు, అయిష్టమైన వార్త ఎలా చెప్పాలి అని సిగ్గుతో తలవంచుకున్నాడు. చేతులు జోడించి చెప్ప సాగాడు.

"అమ్మా! దండకారణ్యంలో నేను దర్భాసనం మీద కూర్చునే సమయం దగ్గర పడుతున్నది. రాజు గారు భరతుడికి యౌవరాజ్యాన్ని ఇచ్చాడు. నన్ను పద్నాలుగేండ్లు దండకారణ్యంలో ముని వేషంలో తిరగమని ఆదేశించాడు" అని రాముడు చెప్పగానే కౌసల్య పక్కనే వున్న లక్ష్మణుడు వినేట్లు ఇలా అంది.

"నాయనా! రామా! నువ్వు అడవులకు పోతే, నాకు మరణించడం తప్ప వేరే మార్గం లేదు కదా! ముందు-ముందు నేను కైకకు పరిచారికురాలు కావాల్సిందేనా?. ఇలాంటి పరిస్థితిలో, ఎలా బతికుండాలి రామా? నా దుఃఖానికి అంతమెప్పుడో నువ్వే చెప్పు. పద్నాలుగేండ్లు నిన్ను చూడకుండా ఎలా ప్రాణాలు బిగపట్టుకుని వుందగలను?

ఏడుస్తున్న కొసల్యను చూసి లక్ష్మణుడు ఇలా అన్నాడు. ఎవతో, ఒక ఆడుది, నోటికొచ్చినట్లు వదరుతే, దానికి విలువ ఇచ్చి, ఏ సుఖాలకు నోచుకోకుండా, రాజ భోగాలన్నీ వదిలిపెట్టి, పౌరుషం విడిచి, అడవికి పోవడం అనేది, నాకు ఏ మాత్రం సమ్మతం కాదు. శ్రీరాముడు అడవులకు పోయేంత నేరమేం చేశాడో నాకు తెలియదు”. ఆ తరువాత శ్రీరాముడితో ఇలా అన్నాడు.

"ఈ విషయాలన్నీ రెండోవాడి చెవిన పడక ముందే, ఈ భూమినంతా నీ మహా శాసనానికి లోబడేట్లు, నా సహాయంతో శీఘ్రంగా చెయ్యి. నీకెవరు అడ్డం వస్తారో చూద్దాం. తప్పు చేసినవారిని త్రండ్రైనా, ఆచార్యుడైనా దండించాల్సిందే. ఇది ధర్మ శాస్త్రం. ఎవరి సలహాతో, వారి మాటలను నమ్మి, ఏ నెపంతో ఈ రాజ్య భారాన్ని నీపైన మోపకుండా, కైకకు ఇవ్వాలనుకున్నాడు? ఆయనకున్న ప్రధాన బలం మనమిద్దరం. మనల్ని కాదనుకుని, కైక కుమారుడిని ఎలా రాజు చేయగలడు? అది సాధ్యమా?"

జవాబుగా, సముదాయిస్తూ రాముడిలా అన్నాడు. "లక్ష్మణా! అజ్ఞానంతో, పుత్ర వ్యామోహంతో తల్లి దుఃఖిస్తున్నదని నాకు తెలియదా? నువ్వు కూడా ఆమె లాగా మాట్లాడ వచ్చా? లక్ష్మణా! తండ్రి మాట కాని, తల్లి మాట కాని, బ్రాహ్మణ వాక్యం కాని, ముందు చేస్తానని చెప్పి, మాట తప్పడం ధర్మాత్ముల లక్షణం కాదు. నేను వారి ఇష్ట ప్రకారం చేస్తానని మాట కూడా ఇచ్చాను. ప్రతిజ్ఞ కూడా చేసాను. అది తప్పను కదా?”. తరువాత, శ్రీరామచంద్రమూర్తి, తల్లి కౌసల్య వైపు చూసి, "అమ్మా! నేను అడవులకు పోవడానికి, అక్కడే వుండడానికి వెంటనే అనుమతించు. నన్ను దీవించి, ప్రయాణానికి పోయ్యేవారికి చెప్పాల్సిన వీడ్కోలు మాటలు చెప్పు. ఉత్సాహంగా నన్ను అడవులకు పంపు. పద్నాలుగేండ్లు అడవుల్లో వుండి, ప్రతిజ్ఞ తీర్చి తిరిగి నగరానికి వస్తాను” అంటాడు.  

ధర్మాన్ని మించిన దైవం వున్నాడని అంటూ, తమ్ముడు లక్ష్మణుడితో, శ్రీరాముడు ఆ వివరాలను చెప్పాడిలా: "నాకు పట్టాభిషేకం చేయాలని ప్రయత్నం చేసిన వాడు దశరథుడు కాదు. దానికి విఘ్నం కలిగించింది కైక కాదు. నేను అడవుల పాలవడానికి నా దోషం ఏదీ లేదు. ఇవన్నీ కేవలం దైవ కృత్యాలే! మరెవరి పనీ కాదు. కాబట్టి ఎందుకు బాధ పడ్తావు? ఇంత దూరాలోచన దైవ ప్రేరణ వల్లనే కలిగింది. కైకకు నా మీద వున్న ప్రేమ విరోధంగా మారడానికి కారణం దైవం కాకుండా మరెవరో చెప్పు? ఇదంతా విధి చేష్టకాకుండా ఇతరుల చేష్ట ఎలా అవుతుంది? ఇతరులకు ఇది సాధ్యం కూడా కాదు".


శ్రీరామచంద్రుడు చెప్పినదాన్ని లక్ష్మణుడు అంగీకరించలేదు. కోపంతో ఇలా అన్నాడు అన్నతో. "అన్నా! రామచంద్రా! నువ్వేదో దైవాన్ని గొప్పదిగా భ్రమపడుతున్నావు. నువ్వే చెయ్యాలనుకుంటే, చేయదల్చుకుంటే, నీకు అసాధ్యమైన పని ఏదన్నా వుందా? అన్నింటిలో సమర్థుడవైనప్పటికీ, ఏ సామర్థ్యం లేని దైవాన్ని ఎంతో పెద్ద చేసి చెప్పావు. ఇది సమర్థుడి లక్షణమా? దేనికీ కొరగాని దైవాన్ని ధీరుడవు, సమర్థుడవు, చిత్త విభ్రాంతి లేని వాడివైన నువ్వు పామరుడిలాగా పొగుడుతున్నావు. ఇది నీకు తగునా?"

ఈ విధంగా చెప్తున్న లక్ష్మణుడిని చూసి, శ్రీరాముడు జనకుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడమే ఉత్తమమని అంటాడు. అదే సరైన మార్గం అనీ, తండ్రి జీవించి వుండగా ఆయన చెప్పినట్లు చేయాలనీ మరీ మరీ చెప్పాడు. శ్రీరాముడు వనవాసం చేయడానికి నిశ్చయించుకున్నాడని తెలిసి, ఆయనను పోవద్దని చెప్పడం వృధా అని భావించి, తనను కూడా అడవికి తీసుకొని పొమ్మని కౌసల్య అడుగుతుంది రాముడిని. ఇలా అంటున్న తల్లితో రాముడు భర్తను విడిచి తన వెంట రావడం సరైంది కాదని చెప్పాడు.

కౌసల్య, కొడుకు చెప్పిన మాటలే ధర్మమని అనుకుంది. కొడుకును చూసి కౌసల్య, "నాయనా! నీ మనసును మార్చలేకపోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా పోయి రా. తండ్రి కొరకు నువ్వు పూనిన వ్రతం పూర్తి చేసి, కృతకృత్యుడవై, తిరిగి రాగానే నిన్ను చూసి సుఖపడతాను. అప్పటి దాకా ప్రాణాలు పోకుండా బిగబట్టుకుంటాను. ఇలా పోయి అలా వచ్చే లోపున పద్నాలుగేళ్లు తొందరగా గడిచి పోయేట్లు సుఖంగా తిరిగి రా. నీకు శుభం కలగాలి" అని అంటుంది.

అంతఃపురంలో వున్న సీతకు శ్రీరాముడి వనవాస వార్త తెలియదింకా అప్పటికి. ఇంటిలోకి ప్రవేశించిన శ్రీరాముడు సీత ముఖం చూడగానే సిగ్గుతో తలవంచుకున్నాడు. సీతను చూసి  దుఃఖాన్ని ఆపుకోలేని రాముడు బహిరంగంగానే శోకించాడు. శ్రీరాముడి ముఖం చూసిన సీతకు శోకంతో గుండె చెదిరిపోయింది. సీతతో శ్రీరాముడు, తనను అడవులకు పొమ్మని తండ్రిగారు ఆజ్ఞాపించారని చెప్పాడు. అడవుల మధ్య సుఖంగా విహారం చేయబోయే ముందర సీతకు చెప్పి ఆమె సమ్మతి తీసుకుని పోతే క్షేమం అని అనుకుని వచ్చానని అంటాడు.

         భర్తకు ఇలా జవాబిచ్చింది సీత. "రాజు నిన్ను అడవికి పొమ్మంటే నన్ను కూడా పొమ్మనే అర్థం. నీలో నేను సగం. నీ సగం దేహం ఇంట్లో పెట్టి, మిగిలిన సగం దేహంతో అడవికి పొమ్మని నీకు రాజు చెప్పాడా? ఏ ఏ దశల్లో ఏఏ విధంగా భర్తృ సేవ ఎలా చేయాల్నో, ఆ పద్దతులేంటో, చిన్న తనంలోనే నా తల్లిదండ్రులు నాకు నేర్పారు. కాబట్టి నేనేం చేయాలో నాకు తెల్సు. నువ్వు నన్ను వదిలితే, నేను ప్రాణం వదులుతాను. ఆమె మాటలు విని, సీతను ఓదార్చుతూ, మిక్కిలి ప్రేమతో కౌగలించుకుని, ఆమెను బాధపడవద్దని, తనతో తీసుకొని పోతానని చెప్పాడు శ్రీరాముడు.

శ్రీ సీతారాముల మధ్య జరిగిన సంభాషణను, శ్రీరాముడి వెంట వచ్చి సమీపంలోనే వున్న లక్ష్మణుడు ఆసాంతం విన్నాడు. కట్టుకున్న భార్య సీతనే వనవాసానికి, కష్టం మీద, శ్రీరాముడు అంగీకరించడాన్ని అర్థం చేసుకున్నాడు. లక్ష్మణుడు కూడా అన్న వెంట పోవాలని నిశ్చయించుకున్నాడు. తన అభిప్రాయాన్ని లక్ష్మణుడు ఇలా చెప్పాడు శ్రీరాముడికి: "చేతిలో విల్లు ధరించి, గొప్ప మృగాలతో నిండిన అడవుల్లో అపాయం లేని తోవల గుండా, నేను ముందు పోతుంటే, నా వెనుక మీరిరువురూ, ఎటువంటి ప్రయాస లేకుండా వన వినోదం చూసుకుంటూ రావచ్చు. సంచరించవచ్చు. మహానుభావా! నువ్వు లేని స్థలం వైకుంఠమైనా నాకు వద్దు".

లక్ష్మణుడు, చేస్తున్న ప్రార్థనను అర్థం చేసుకున్న శ్రీరాముడు, తమ్ముడితో తన మాటలుగా ఇలా చెప్పాడు. "లక్ష్మణా! నిన్ను నిష్కారణంగా ఇక్కడ వదలి పోతానా? నీలో ఏదో దోషముందని నిన్నిక్కడ వదలి పోవడం లేదు. నా వెంట నువ్వు వచ్చావనుకో! ఆ తరువాత నీ తల్లిని, నా తల్లిని ఏ లోపం లేకుండా భరించేవారెవరు? ఇక్కడే వుండి తల్లిని చూసుకో. నా మాట మీద గౌరవం వుంచి, నీతిగా అన్న మాట మీర కూడదని అనుకో. నా కోసం నా మాట విను. నువ్వు, నేను, ఇద్దరం లేకపోతే, మన తల్లులు ఎలా సుఖపడతారు?"

         శ్రీరాముడు చెప్పిన మాటలకు లక్ష్మణుడు జవబిచ్చాడిలా: "అన్నా! నువ్వు నాకు తండ్రితో సమానం. అడవుల్లో నీకవసరమైన కందమూలాలు నేను సేకరిస్తాను. నేను రాకపోతే ఇవన్నీ నువ్వే చేసుకోవాలి కదా? ఆ శ్రమ తప్పిస్తాను. నీకు అలసట వస్తే విసురుతా. నీ పాద సేవ చేస్తా. అడవిలో దొరికే పండ్లు, దుంపలు, ఇంకా అలాంటివి తెచ్చిస్తా. నువ్వు సీత వినోదంగా వుండొచ్చు. కొండ శిఖరాలలో మీరిద్దరూ విహరిస్తుంటే లేదా నిదురిస్తుంటే విల్లంబులు ధరించి మీకు కాపలాగా వుంటాను". లక్ష్మణుడి మనస్సు అర్థం చేసుకున్న రాముడు, ఆయన తనతో పాటుగా వనవాసానికి రావడానికి సమ్మతించాడు. వరుణుడు తమకు లోగడ ఇచ్చిన రెండు కటారులు, అక్షయ బాణ తూణీరాలు, భేదించనలవికాని కవచాలు, అడవుల్లో రాక్షస వధ చేయడానికి, వేట కొరకు కావాలని వాటిని తెమ్మంటాడు.   

         లక్ష్మణుడు తన హితులకందరికీ తమ వనవాస యాత్రా విషయమంతా చెప్పి, శ్రీరాముడు చెప్పిన ఆయుధాలను తీసుకొనివచ్చి ఆయనకు చూపాడు. శ్రీరాముడందుకు సంతోషించాడు. శ్రీరాముడు, తనకున్న ధనం, ఇతర పదార్థాలు, లక్ష్మణుడితో కలిసి, బ్రాహ్మణులకు, ఇతర తపస్వులకు, తమను ఆరాధించేవారికి, సేవకులకు, ఎప్పుడు ఇచ్చేదానికంటే ఎక్కువగా ఇచ్చి సంతోషపెడ్దామని అంటాడు లక్ష్మణుడితో. వసిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడిని, ఇతర పెద్దలను పిలిపించమటాడు.

శ్రీరాముడి ఆజ్ఞ ప్రకారం, లక్ష్మణుడు సుయజ్ఞుడింటికి పోయాడు. శ్రీరాముడు చేయబూనిన కార్యం గురించి వివరించి, తనతో అక్కడకు రమ్మంటాడు. సుయజ్ఞుడు శ్రీరాముడి గృహానికి వచ్చాడు. సీతా సమేతంగా శ్రీరాముడెదురేగి, మొక్కి, ఆయనకు తన వస్తువులన్నీ ఇచ్చాడు. సంతోషంతో సీతారామలక్ష్మణులను దీవించి పోయాడు. దానాలిచ్చి అందరినీ తృప్తి పరిచి, రామలక్ష్మణులు సీతాసమేతంగా తండ్రిని చూడడానికి బయల్దేరారు. తండ్రిని చూడడానికి పోతున్న రామలక్ష్మణులను, వారి వెంట వున్న సీతాదేవిని చూసి దుఃఖపడే పురజనులు కైకేయీ దశరథులను నిందించారు.

          తండ్రిని సమీపించిన శ్రీరాముడు దశరథుడితో ఇలా అన్నాడు: "సీత, లక్ష్మణుడు కూడా నాతో అరణ్యాలకు వస్తున్నారు. నేనెంత వద్దని వారించినా, వదలక, నా వెంట రావడానికి ఇష్టమున్నందున, ఇక్కడ వుండలేమన్నారు. కాబట్టి వాళ్లు రావడానికి అంగీకరించాను. నాకు, సీతకు, లక్ష్మణుడికి, ప్రజలకు త్వరగా అనుమతి ఇవ్వు".    

శ్రీరాముడిని చూస్తూ దశరథుడు ఇలా అంటాడు. "శ్రీరామా! అడవులకు పోయి శీఘ్రంగా తిరిగి రా. అడవులకు పోకుండా నిన్ను ఆపుచేయడం నాకు శక్యం కాదు. శ్రీరాముడు తనను వదలి పోతున్నాడనే బాధతో, దుఃఖంతో, నిద్రాహారాలు మాని ఏడుస్తుండడం వల్ల కలిగిన శరీర తాపంతో, గుండె చెదరిన దశరథుడు, కొడుకును కౌగలించుకుని, శవంలాగా కాళ్లు చేతులాడించకుండా నేల మీద పడిపోయాడు.

అప్పుడు స్వయంగా కైకే నార చీరెలు తెచ్చి, "రామా! వీటిని కట్టుకో" అని పురజనులందరి ముందర శ్రీరాముడికిచ్చింది. ఇలా ఎప్పుడైతే నార చీరెలు తన చేతికి వచ్చాయో, వెంటనే, శ్రీరాముడు తాను ధరించిన సన్న వస్త్రాలను తీసేసి, పక్కన పెట్టి, సంతోషంగా నార చీరెలు కట్టుకున్నాడు. ఆయన కట్టుకోగానే, తండ్రి చూస్తుండగానే, లక్ష్మణుడు కూడా కట్టుకున్నాడు. శ్రీరామలక్ష్మణులు నార వస్త్రాలు కట్టుకున్న తరువాత, సీతను కూడా కట్టుకొమ్మని, ఆమె చేతికి కైక నార చీరెలను ఇచ్చింది. సీత నార వస్త్రాలను పట్టుచీరెలలాగా భావించి కట్టుకుంటుంటే చూసిన వారందరూ కఠినమైన పదజాలంతో దశరథుడిని ఛీ కొట్టారు. ఏడ్వసాగారు. ఆ తరువాత శ్రీరాముడు తన తల్లి కౌసల్య దగ్గర, ఇతర మాతల దగ్గర శలవు తీసుకున్నాడు. సుమంత్రుడు తోలుతున్న రథం ఎక్కి అడవులకు బయల్దేరి వెళ్లిపోయారు సీతారామలక్ష్మణులు. 
(వాసుదాసు ఆంధ్రవాల్మీకి రామాయణం మందారం ఆధారంగా)

No comments:

Post a Comment