Saturday, June 20, 2020

అత్యవసర వైద్యాన్ని కాదనడమా? .... వనం జ్వాలా నరసింహారావు


అత్యవసర వైద్యాన్ని కాదనడమా?
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (21-06-2020)

హైదరాబాద్ లో వైద్యం అందక ఓ మహిళ చనిపోయిందని వార్తలొచ్చాయి. నిజా-నిజాలు నిర్ధారణ కాలేదు. ఆ మహిళకు స్వల్పంగా జ్వరం వచ్చిందనీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందనీ, వెంటనే సన్షైన్ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ ఆమెను చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించారని వార్త సారాంశం. ఆ తరువాత ఆమె భర్త ఆమెను తీసుకుని అపోలోకు, ఫీవర్ ఆసుపత్రికి, విరించి ఆసుపత్రికి, కేర్ ఆసుపత్రికి, కింగ్ కోఠీ ప్రభుత్వాసుపత్రికి, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి, హోలిస్టిక్ ఆసుపత్రికి, ఇలా ఏ ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఎక్కడా చేర్చుకోలేదని భర్త అంటున్నారు. చివరకు గాంధీ ఆసుపత్రిలో చేర్చిన తరువాత ఆమె చనిపోయింది. మొదలే గాంధీ ఆసుపత్రికి ఎందుకు పోలేదనేది ప్రశ్నార్థకం! అది వేరే సంగతి. దాన్ని కాసేపు అలా ఉంచుదాం.

రోగి ఎవరైనా, ఉన్నవారైనా, లేనివారైనా, అత్యవసర పరిస్థితుల్లో, అత్యవసరంగా వైద్య సహాయం అందించాల్సిన పరిస్థితుల్లో "చికిత్సా నిరాకరణ" కఠినమైన శిక్షార్హం కానంతవరకు రోగులకు ఇలాంటి విధంగా వైద్య సదుపాయం లభించక పోవడం లాంటివి జరుగుతూనే వుంటాయి. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో మానవ మేధస్సుకు ఇంతవరకూ అంతుచిక్కని కరోనా చికిత్సను అత్యవసరంగా పరిగణించి, ఏ ఆసుపత్రి కూడా చికిత్స నిరాకరించడానికి వీలు లేదని నిబంధనలు విధించాలి. నిబంధనలను పాటించని వాళ్లను కఠినంగా శిక్షించాలి.  

గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సౌకర్యాలున్న ఆసుపత్రులు అతి తక్కువ. డాక్టర్ల కొరతా ఉంది. వైద్యులున్న ఆసుపత్రులలో, చికిత్స నిరాకరించడం అలా వుంచితే, చికిత్సను అందించలేని పరిస్తితులుండే అవకాశాలే ఎక్కువ. ఇక నగరాల-పట్టణాల విషయానికొస్తే, ఆసుపత్రులున్నా, వైద్యులున్నా, ధనికుల విషయంలో ఇబ్బందులు లేకపోయినా, మధ్య తరగతి వారికి కోరుకున్న రీతిలో వైద్యం లభించడం కష్టమే. ఇది ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా కఠోర సత్యం, జీర్ణించుకోలేని వాస్తవం.  

సాధారణ పరిస్థితుల సంగతి ఇదైతే, అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడడానికి సమగ్రమైన చట్టం (నాకు తెల్సినంతవరకు) లేకపోవడం మూలాన, ధనికుల విషయం ఎలా వున్నా పేద-మధ్య తరగతి వారికి మాత్రం అటు గ్రామీణ ప్రాంతాలలోను, ఇటు పట్టణ ప్రాంతాలలోను సరైన సమయంలో సరైన వైద్యం అందక పోవడం, అకాల మరణాలు సంభవించడం జరిగే అవకాశం వున్నది. వాస్తవం చెప్పుకోవాలంటే, నూటికి తొంభై (ఎక్కువగా గ్రామీణ) ఆసుపత్రులలో, కనీస అత్యవసర వైద్య సౌకర్యాలు అంతగా లేవు. దానికి తోడు, కారణాలు ఏవైనా, చికిత్సను నిరాకరించే పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ప్రయివేట్ ఆసుపత్రులలో మరీ ఎక్కువ.

ఈ నేపధ్యంలో, వివిధ రకాల ఆరోగ్య రుగ్మతల వల్ల, క్రమేపీ ఆరోగ్యం క్షీణించి, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకున్న వారికి, అత్యవసర వైద్య సహాయం, అత్యవసరంగా, సకాలంలో లభించేందుకు, "చికిత్సా నిరాకరణ" ను అడ్డుకునేందుకు, కఠినమైన నిబంధనలతో కూడిన వినూత్న వైద్య విధానాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే,  ప్రాణాపాయ స్థితిలో వుండి, అకాల మరణం పాల్పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు మెరుగవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సా నిరాకరణ నేరంగా పరిగణించే ఆలోచన చేయాల్సిందే!


ఒకానొక సందర్భంలో, ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో, వందల సంఖ్యలో చిన్నా-పెద్దా ప్రభుత్వ-ప్రయివేటు ఆసుపత్రులున్నప్పటికీ, అప్పట్లో కుక్క కాటుకు బలైన పసికందు ప్రాణాలను కాపాడేందుకు తల్లిదండ్రులు చేసిన విశ్వ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా డబ్బులివ్వందే చికిత్స చేయలేమన్నారు. చివరకు చనిపోయిన బాలుడి శవానికి కప్పేందుకు గుడ్డనివ్వడానికికూడా డబ్బులడిగారు ఒక ప్రభుత్వాసుపత్రిలో. మర్నాడు మీడియా ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించింది. అదేదో రాజధానిలో జరిగింది కనుక పది మందికి తెలిసింది. తెలియనివెన్నో! ప్రభుత్వాసుపత్రి అయినా, ప్రైవేట్‍దైనా, ప్రభుత్వ డాక్టరైనా, క్లినిక్ నడిపే డాక్టరైనా ప్రాణాపాయంలో ఉన్న పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వలేదన్న సాకుతో వైద్యం అందించకుండా ఉండవచ్చా? అప్పట్లో జరిగిన చర్చే ఇప్పటికీ నిరంతరం జరుగుతూనే వుంది.

పదిమంది ఆశిస్తున్న అత్యవసర వైద్య విధానం, చికిత్సా నిరాకరణ నేరంగా భావించే విధానం, కార్యరూపం దాలిస్తే, ప్రాణాపాయ స్థితిలో వచ్చిన బాధితులు డబ్బులు చెల్లించ లేకపోయినా, వైద్య సేవలు అందించలేమని చెప్పి వెనక్కు పంపడానికి వీలు లేదు.

వాస్తవానికి, సుమారు రెండు దశాబ్దాల కిందటే భారత దేశ అత్యున్నత న్యాయస్థానం, జాతీయ వినియోగదారుల ఫోరం, వివిధ సందర్భాల్లో తీర్పునిస్తూ, ప్రమాదాల బారిన పడినప్పుడే కాక, మరే ఇతర అత్యవసర వైద్య సహాయం అవసరమైనా, రోగిని తీసుకెళ్లిన చోట, చికిత్స చేయకుండా నిరాకరించడం తప్పని, నేరమని పేర్కొన్నాయి. ఇలాంటి సందర్భాల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం మన దేశానికే పరిమితమై లేదు. ఇటువంటివి మళ్లీ జరగ కుండా నిరోధించాలనే ఆలోచనతో కేంద్రప్రభుత్వానికి చెందిన లా కమిషన్ తనంతట తాను చొరవ తీసుకొని, దశాబ్దం కింద, ఒక నమూనా చట్టాన్ని రూపొందించి, దానిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి అభిప్రాయాలడిగింది. అయినప్పటికీ, ఆ నమూనా చట్టం కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు.

లా కమిషన్ నివేదిక-నమూనా చట్టంలో, మెడికో లీగల్ కేసు అనే నెపంతోనో, డబ్బిలివ్వలేదనే కారణానో, భీమా లేదన్న సాకుతోనో, మరేదైనా మిషతోనో వైద్య సహాయాన్ని నిరాకరించడానికి వీల్లేని విధంగా చట్టం రూపొంచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో చికిత్సకైన ఖర్చును ఆ తర్వాత, వైద్య సహాయం అందించిన ఆసుపత్రికి గాని, ప్రైవేట్‍ డాక్టర్‍కుగాని చెల్లించే ఏర్పాటు చేయాలి. ఈ ఖర్చును భరించడానికి ఒక పధకాన్ని రూపొందించాలని, ఆసుపత్రికి చేర్చిన అంబులెన్స్ ఖర్చుకూడా ప్రభుత్వమే భరించే ఏర్పాటు చేయాలని లా కమిషన్ నివేదికలో ఉంది. వైద్య రంగం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కనుక, చట్టం తేవడానికి తోడ్పడేందుకు లా కమిషన్ ఈ విధంగా నమూనా బిల్లును తయారుచేసి ఉండవచ్చు.

లా కమిషన్ తయారు చేసి రాష్ట్రప్రభుత్వాల అభిప్రాయం కోసం పంపిన నివేదికలో పలు ఆసక్తి కరమైన విషయాలను పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా, అత్యవసర వైద్య సహాయం అవసరమైన సందర్భాల్లో విధిగా గుర్తుంచు కోవలసిన "బంగారు ఘడియ" ను (గోల్డెన్‌ అవర్ కాన్సెప్ట్) గురించి విడమర్చి చెప్పింది. ఎమర్జెన్సీ కేసుల్లో రోగిని, వైద్య ప్రమాదాన్ని గుర్తించిన గంట లోపు సమీప ఆసుపత్రికి చేర్చగలిగితే, చేర్చి నిలకడ స్థితిని సాధించ గలిగితే బతికే అవకాశాలు ఎనభై శాతం ఎక్కువగా ఉంటాయని చెప్పే సిద్ధాంతమే " గోల్డెన్‌ అవర్ కాన్సెఫ్ట్". హృద్రోగాలకు, రహదారి ప్రమాదాలకు, ఇతర అనుకోని ప్రాణాంతకమైన సమస్యలకు ఇది అవసరం. అలాగే ప్రభుత్వ డాక్టరైనా, ప్రైవేట్ డాక్టరైనా, వృత్తి రీత్యా సంక్రమించిన బాధ్యత నుంచి తప్పుకునేందుకు వీలు లేదు. ఈ "ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్" ను చట్టం కాదన లేదని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది.

అమెరికా వంటి దేశాల్లో ఒకప్పుడు ఇదే పరిస్థితి ఉండడంతో, 1986లో అక్కడ చట్టాన్ని తెచ్చి, డాక్టర్లు, ఆసుపత్రులు, వైద్య సహాయం నిరాకరించే వీలు లేకుండా కట్టడి చేయడం జరిగింది. మన దేశంలో కూడా అత్యున్నత న్యాయస్థానం దాదాపు అదే సమయంలో ఈ విషయంలో ఇచ్చిన తీర్పులో, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు, ప్రజల సంక్షేమ దిశగా సేవలందించడమే ప్రభుత్వాల కనీస కర్తవ్యమని పేర్కొంది. అవసరమైన ఆరోగ్య-వైద్య సౌకర్యాలను అందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అందుకే ప్రభుత్వం ఆసుపత్రులను, ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ప్రతి పౌరుడి ప్రాణం-స్వేచ్ఛ కాపాడ వలసిన బాధ్యత ప్రభుత్వానిదైనప్పటికీ, సుప్రీం కోర్టు ఆమేరకు తీర్పు ఇచ్చినప్పటికీ, సరైన సమయంలో తగిన వైద్య సహాయం అందక ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఆసుపత్రులకు వెళ్లే రోగుల్లో, ఫీజులిచ్చుకొనేవారూ, ఇవ్వలేని వారూ ఉంటారు.

అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగికి చికిత్స అందే విధంగా చట్ట పరమైన రక్షణ కల్పించాలని, వచ్చిన రోగికి ప్రాధమిక చికిత్స చేసి, అవసరమైన పరీక్షలు నిర్వహించి, ఆసుపత్రిలో-క్లినిక్‌లో చేయదగినంత చికిత్స చేయాలని, స్థోమతలేని వారి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని, తమకు వీలు కాని పరిస్థితిలో చావు బతుకుల్లో ఉన్న రోగులను డాక్టర్ లేదా ఆసుపత్రి యాజమాన్యమే మరో ఆసుపత్రికి తరలించాలని, స్క్రీనింగ్ పరీక్షల వంటివి చేయడం చేత కాకపోతే అవి లభ్యమయ్యే వేరే చోటికి పంపే ఏర్పాటు కూడా చేయాలని లా కమిషన్ సూచనలు చేసింది. రోగికి నిలకడ పరిస్థితి కల్పించాలని, అది తమకు చేత కాకపోతే మరొక చోటికి పంపడానికి నిరాకరించిన ఆసుపత్రి లేదా క్లినిక్ లేదా డాక్టర్ ఆ వృత్తిలో కొనసాగే వీలు లేకుండా నిబంధనలుండాలని సూచించింది. రోగిని తరలించడానికి రమ్మని కోరితే, అంబులెన్సుల నిర్వాహకులు నిరాకరించ రాదన్న సూచన కూడా ఉంది. రోగికి సంబంధించిన రికార్డులన్నీ వెంట పంపాలి. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులను ప్రభుత్వాలు సమకూర్చడానికి సరైన పధకం రూపొందించాలని కూడా లా కమిషన్ సిఫార్సు చేసింది.

లా కమీషన్ అలనాడు సూచించిన నమూనా చట్టం బహుశా ఏ రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చినట్లు లేదు. వచ్చినా సరైన ప్రచారం జరగలేదు. నిజంగా ఇవన్నీ జరిగితే ఇంతకన్నా కావలసిందేముంది? అత్యవసర పరిస్థితుల్లో అన్నింటికంటే ముఖ్యం సమీప ఆసుపత్రికి తరలించడం.

లా కమీషన్ సూచించిన నమూనా చట్టాన్ని ఆధారంగా చేసుకుని, మరింత మెరుగుగా అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడడానికి వీలయ్యే సమగ్రమైన చట్టం ప్రతి రాష్ట్రం తీసుకు రావాలి. అప్పుడే రోగికి సరైన రక్షణ కలిగించినట్లవుతుంది. అన్ని సౌకర్యాలను కల్పిస్తే చికిత్స నిరాకరించినవారిని ప్రశ్నించే హక్కు పౌరుడికి ఉంటుంది. ప్రతి ఆసుపత్రిలోను, కనీస అత్యవసర వైద్య సౌకర్యం లభించే విధంగా, ప్రత్యేకంగా "ఎమర్జెన్సీ గదులను" రూపొందించాలి.

No comments:

Post a Comment