వసిష్ఠ శక్తి సులభమైంది కాదా?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక, చింతన (04-06-2020)
మిథిలాలానగరం వచ్చిన విశ్వామిత్రుడు ద్వారా శ్రీరామచంద్రమూర్తి
దర్శనం తనకు కలిగినందుకు, అహల్యా-గౌతముడి
కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడు సామాన్యుడు కాదని,
ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షితనాన్ని సంపాదించాడని,
శ్రీరామచంద్రుడికి చెప్పాడు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే....
ధర్మస్వభావుడైన విశ్వామిత్రుడు రాజ్యపాలన చేస్తూ,
ఒక పర్యాయం, సేనలతోగూడి
భూమంతాతిరుగుతూ వశిష్ఠాశ్రమాన్ని చూశాడు. ఆశ్రమం లోపలికి పోయి,
వినయ విధేయతలతో వశిష్ఠుడికి నమస్కరించాడు. అప్పుడు వశిష్టుడు,
సేనలతో సహా అతడికి ఆతిథ్యమిచ్చి గౌరవించదల్చుకున్నాననీ,
అంగీకరించమనీ కోరాడు. విశ్వామిత్రుడు ఆతిథ్యం తీసుకునేందుకు
అంగీకరించాడు. వెంటనే వశిష్ఠుడు తన కామధేనువైన శబలను పిలిచి,
అన్ని రకాల భోజ్యాల్ని ఏర్పాటుచేయమని ఆదేశించాడు. వశిష్ఠుడు చెప్పిన
విధంగానే, కామధేనువు, రకరకాల
భక్ష్యభోజ్యాలను, ఎవరేదికోరితే దాన్నిసృష్టించింది. మంత్రులతోను,
బ్రాహ్మణాదులతోను, సైన్యంతోను
కలిసి రాజు సంతృప్తిగా, కడుపునిండా భోజనంచేసాడు.
భోజనానంతరం, విశ్వామిత్రుడు,
తనకు కామధేనువు శబలనివ్వమని అంటాడు. శబలను
ఎడబాయనంటాడు వశిష్ఠుడు. తనను విడిచి శబల కూడా వుండలేదన్నాడు. తాను సర్వం
కామధేనువుతోనే నెరవేర్చుకుంటున్నాననీ, దానికి
ఎన్నో విద్యలు కూడా వచ్చనీ, తనకది
అవ్యానందానికి కారణమైందని, అలాంటి
దాన్ని తను విడిచి ఎలా వుండాలనీ విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు వశిష్థుడు.
కామధేనువును తానివ్వకపోవడానికి మరెన్నో కారణాలను కూడా చెప్పాడు.
వశిష్ఠుడలా కామధేనువును ఇవ్వనని చెప్పగానే, విశ్వామిత్రుడు
బలవంతంగా దానిని తీసుకొని పోసాగాడు. తనను ఈడ్చుకొనిపోతున్న భటుల కట్లు తెంచుకొని,
మునీశ్వరుడి వద్దకు పోతుంది. క్షత్రియ బలమొక బలమేకాదని,
బ్రాహ్మణబలం లెక్కలేని మహిమగలదని, రాజెంత
బలవంతుడైనా వశిష్ఠుడికంటే గొప్పవాడుకాదనీ, తనకాజ్ఞ
ఇస్తే రాజు సేనంతా నాశనంచేస్తాననీ కామధేనువైన శబల అంటుంది. ఆలా ప్రార్థించిన శబలను,
శత్రువులు నివ్వెరపోయేట్లు. వారి రూపం చెడిపోయేట్లు చేయగల,
అనేకమంది శూరులను సృష్టించమని ఆదేశించాడు వశిష్ఠుడు.
వశిష్ఠుడి ఆజ్ఞ లభించగానే, శత్రు
సమూహాలకు భయంకలిగించే పప్లవులనే శూరులను తన హుంభారవంతో శబల సృష్టించింది. కామధేను
కల్పిత శూరులు విశ్వామిత్రుడి సైన్యాన్నంతా రూపుమాపి విజృంభించారు. అది చూసిన
పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు, కోపంతో
కళ్లెర్రచేసి, భయంకర బాణాలతో పప్లవ శూరులను చంపి నిస్సారంగా భూమ్మీద పడేటట్లు
చేశాడు. విశ్వామిత్రుడిపై పగబట్టిన ఆవు, బట్టిసాలు
ధరించి యుద్ధం చేయగల యవనశక సేనల గుంపులను అపారంగా సృష్టించింది. ఆ యవనులు, శకులు,
కార్చిచ్చు అడవిలో పడ్డట్లు, రాజు
సైన్యం మీదపడి దహిస్తుంటే, వాళ్లందరినీ
విశ్వామిత్రుడు తన అస్త్రాలతో పీనుగుపెంటల్లా చేసాడు.
విశ్వామిత్రుడి భయంకరమైన
శస్త్రాస్త్రాలతో కాలిపోయిన తన సైన్యాన్ని చూసిన వశిష్ఠుడు,
యోగ బలాన్ని ఆశ్రయించి శీఘ్రంగా శత్రు సేనలను సంహరించమని శబలను
ఆజ్ఞాపించాడు. వెంటనే హుంకరించిన కామధేనువు మహావీరులను సృజించింది. వారందరు శత్రు
సేనలపై పడి, వారి రథాలను, ఏనుగులను, గుర్రాలను, సైన్యాన్ని నాశనం చేసారు.
సిగ్గుతో కుమిలిపోయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడిని
గెలిచేదెలానని మధన పడి, ఎలాగైనా
వశిష్ఠుడిని జయించాలన్న పట్టుదలతో, రాజ్యభారాన్ని
కొడుకుకప్పగించి, హిమవత్పర్వతానికి పోయి,
శివుడికొరకు తపస్సు చేశాడు.
శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాల్నో కోరుకొమ్మన్నాడు. విలువిద్యనంతా
అంగాలతో, ఉపాంగాలతో, మంత్రాలతో, వాటి రహస్యాలన్నిటితో తనకు ఉపదేశించమని
ప్రార్థించాడు విశ్వామిత్రుడు. రాక్షసుల వద్ద, మునుల
వద్ద, గంధర్వుల వద్ద, యక్షుల
వద్ద, దేవతల వద్ద వున్న అస్త్రవిద్యలన్నీ తనకుపదేశించమని కోరాడు. ఆయన
కోరినట్లే శివుడు ఉపదేశించి పోయాడు. అస్త్రాలన్నీ తన స్వాధీనంలోకి వచ్చాయన్న
ధైర్యంతో, గర్వంతో విశ్వామిత్రుడు వశిష్ఠుడున్న ఆశ్రమానికి వచ్చాడు.
విశ్వామిత్రుడు, వశిష్ఠుడి
తపోవనమంతా, కాల్చి బూడిద చేశాడు. కోపగించిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడిని
మందలించాడు. తపోవనాన్నంతా కాల్చివేసిన చెడుబుద్ధిగల విశ్వామిత్రుడిని ఇక
సహించలేనని అంటూ, సాధ్యంకాని తేజస్సుతో అతన్ని
తేరిపార చూశాడు వశిష్ఠుడు. ఇంత చెప్పినా విశ్వామిత్రుడు వినిపించుకోకుండా,
అస్త్రం వెంట అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో, వశిష్ఠుడు
తనదగ్గరున్న రెండవ యమదండంలాంటి, కాలాగ్ని జ్వాలలను చిమ్మే ప్రకాశవంతమైన బ్రహ్మ
దండాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడకుండా నిలబడ్డాడు.
అయినా
ఆగని విశ్వామిత్రుడు తనదగ్గరున్న ఆగ్నేయాస్త్రాన్ని మునిపై ప్రయోగించాడు.
తనపైకొస్తున్న అస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడిని
నీచ క్షత్రియుడా అని సంబోధిస్తూ: తనక్కడే నిలుచున్నాననీ, ఆతడి బలమెంతో,
చలమెంతో, శస్త్రాస్త్రాల పాండిత్యమెంతో
చూపమని, ముందు వాటన్నిటినీ భస్మం చేసి, ఆతర్వాత ఆతడిని భూమి మీద లేకుండా చేస్తానని,
క్షత్రియ బలానికి, బ్రాహ్మణ బలానికి తేడా అతడికి
తెలియదని, దివ్యమైన బ్రాహ్మణ బలాన్ని ఇక చూపబోతున్నానని, అంటూనే,
విశ్వామిత్రుడి ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మ దండంతో చల్లార్చాడు.
అంతటితోనూ ఆగకుండా విశ్వామిత్రుడు, రకరకాల
శస్త్రాస్త్రాలను వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. వీటన్నిటినీ వశిష్ఠుడు తన బ్రహ్మ
దండంతో హరించివేశాడు. తన అస్త్రాలన్ని వ్యర్థమై పోవడంతో, దీర్ఘమైన
కోపంతో, భయంకరాకారుడై, దేవతా గణం,
ముల్లోకాలు భయపడుతుండగా, బ్రహ్మాస్త్రాన్ని
సంధించి విడిచాడు విశ్వామిత్రుడు.
తనమీదకొస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు,
చేతిలో బ్రహ్మదండాన్ని పట్టుకొని, దేవతలంతా
విభ్రాంతితో గమనిస్తుంటే, దాన్ని
మింగాడు. బ్రహ్మాస్త్రాన్ని మింగిన వశిష్ఠుడు మిక్కిలిభయంకరంగా కనిపిస్తుంటే,
ఆయన రోమకూపాలనుండి, అగ్నిజ్వాలలు
ప్రవహించసాగాయి. ఆ మహా ఋషి శ్రేష్టుడిని, ఋషీశ్వరలందరు
ప్రార్థించారు. వశిష్ఠుడి తపో బలమింతని చెప్పలేమని, సత్కీర్తిగల
ఆయన తన తేజస్సును శమించజేయాలని, బ్రాహ్మణోత్తముడైన
ఆయన చేతిలో విశ్వామిత్రుడు ఓటమి చెందాడని అంటారు వారంతా. ఇలా తనను ఋషీశ్వరులందరు
కోరడంతో, వశిష్ఠుడు శాంతించాడు. ఇదంతా చూసిన విశ్వామిత్రుడికి ఏంచేయాల్నో
తెలియక నిట్టూర్పులు విడిచి దుఃఖంతో తనలో తానే ఆలోచించసాగాడు. తన క్షాత్రం
వ్యర్థమయిందని, అస్త్రాలన్నీ వ్యర్థమయ్యాయని, వాటితో
తనకింక అవసరం లేదని, బ్రాహ్మణుడై, శాంత చిత్తుడై,
ఇంద్రియాలను జయించినందువలనే కదా వశిష్ఠుడికింత మహాత్మ్యం కలిగిందని
అనుకుంటాడు. తనుకూడా శాంత చిత్తుడై, ఇంద్రియాలను
జయించి, బ్రాహ్మణుడు కావడానికి ప్రయత్నించాలని అనుకొని,
తపస్సు చేసేందుకు సిద్ధమవుతాడు.
వశిష్ఠుడి మహాత్మ్యానికి కారణం ఆయన నిరంతరం చేస్తున్న జపమే. ఆయన
జపించే మంత్రం "గాయత్రి" మంత్రం. గాయత్రీ
మంత్రమే బ్రహ్మాస్త్రం. అది జపించడం వల్లే, వశిష్ఠుడింతటి
మహాత్మ్యంగలవాడయ్యాడు. ఇంకో క్షత్రియుడయితే, బ్రహ్మాస్త్రం
తగిలితే చనిపోవాల్సిందే. ఒకవేళ అతడికి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం వస్తే శత్రువు
అస్త్రాన్ని అణచి వేయొచ్చు. ఇవేవీలేకుండా, వశిష్ఠుడు
దాన్నిమింగి జీర్ణించుకున్నాడు. తపోబలంతో, జపబలంతో,
బ్రాహ్మణ్యంతో వశిష్థుడి దేహమే బ్రహ్మమై వుండగా,
ఆయన్నెవరేం చేయగలరు? కార్చిచ్చుమీద
చిచ్చుబుడ్లు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అదేజరిగింది వశిష్ఠ, విశ్వామిత్రుల మధ్య జరిగిన
"ఆత్మ-అనాత్మల" యుద్ధంలో. వశిష్ఠ విజయం నిజానికి గాయత్రీ విజయమే. అంతటి
గొప్పదైన గాయత్రిని అధికరించి చెప్పబడిందే, శ్రీమద్రామాయణం
లేదా శ్రీమధాంద్ర వాల్మీకిరామాయణం. అందుకే ఇవి సర్వోత్కృష్ట గ్రంథాలని వేరే చెప్పాల్సిన పనిలేదు.
గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకిరామాయణంలో, ప్రతి
అక్షరానికి, గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో,
అంతే మహిముంది. వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ
క్షత్రియ యుద్ధం మాత్రమేకాదు. ఆత్మవిద్యకు,
అనాత్మవిద్యకు మధ్యజరిగిన యుద్ధం. సంపూర్ణంగా అనాత్మవిద్య
నేర్చుకున్నప్పటికీ, వాడు, ఆత్మవంతుడిని
గెలవలేడు. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి
సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు,
ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడుకాని,
తన ఉప్పుతిని, కృతఘ్నుడై, దివిటీ దొంగలా తన సొమ్ము అపహరించేందుకు
పూనుకున్నవాడినీ, తన ఆశ్రమాన్నంతా పాడుచేసి తనను
చంపే ప్రయత్నం చేసినవాడినీ, దెబ్బకు-దెబ్బ
అనిగూడా కీడుతలపెట్టలేదు. ఇదే ఆత్మవంతుడైన బ్రాహ్మణుడి లక్షణం. బ్రాహ్మణుడు
ఇతరులవల్ల నష్టపడినాగాని, పరులకు
హానితలపెట్టడు. వశిష్ఠుడు ఇంతజరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు.
వశిష్ఠుడితో ఓటమికి
కుమిలిపోతూ, విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుగా పోయి, తీవ్రమైన
తపస్సు చేసాడు. వేయి సంవత్సరాలు తపస్సుచేసింతర్వాత, బ్రహ్మ
ప్రత్యక్షమై, ఆయన రాజర్షిగా అయ్యాడని వరమిచ్చాడు.
తనింతకాలం తపస్సు చేసింది రాజర్షికావడానికానని పరితపించి, మునుపటికంటే
గొప్పగా తపస్సు చేయసాగాడు.
వెయ్యేళ్లు విశ్వామిత్రుడిలా ఘోరమైన
తపస్సు చేయడంతో, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయన ఋషి అయినాడని చెప్పి అంతర్థానమయ్యాడు.
ఆ మాటలకు తృప్తి చెందని విశ్వామిత్రుడు, అంతకంటే
ఘోరమైన, కఠోరమైన తపస్సు చేయసాగాడు. మేనక ఆయన తపస్సు విఘ్నం చేస్తుంది. అందులోంచి
బయటపడి వెయ్యి సంవత్సరాలు
నిశ్చలుడై-నిర్విఘ్నంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. బ్రహ్మదేవుడు మళ్లీ
ప్రత్యక్షమై విశ్వామిత్రుడి దగ్గర కొచ్చి, ఆయన
మహర్షి అయ్యాడని అంటాడు. ఆయన మాటలకు విశ్వామిత్రుడు పొంగిపోలేదు. తను
జితేంద్రియుడనయ్యానా అని బ్రహ్మను ప్రశ్నించాడు. ఆయనింకా జితేంద్రియుడు కాలేదని,
దానికొరకు ఇంకా ప్రయత్నంచేయాలని, ఆయన
మనస్సు వికారం పొందేందుకు అవకాశమున్నప్పటికీ అలా కానీయకుండా చేయగలిగినప్పుడే
జితేంద్రియుడవుతాడని జవాబిచ్చాడు బ్రహ్మ.
విశ్వామిత్రుడు తిరిగి కామాన్ని జయించడంకొరకు,
వెయ్యేళ్లు విశేష నియమంతో తపస్సు చేశాడు. ఎన్ని విఘ్నాలొచ్చినా, ఎవరు
కలిపించ తలపెట్టినా కోపం తెచ్చుకోలేదు. విశ్వామిత్రుడి దగ్గర కొచ్చిన బ్రహ్మ,
అతడి తపస్సు ఫలించిందని చెప్పి, అతడికి
బ్రాహ్మణత్వం లభించిందంటాడు. తపస్సు చాలించి లెమ్మంటాడు. బ్రాహ్మణుల వేదాలు,
క్షత్రియుల వేదాలు అందరికంటే మొదలు తెలిసిన వశిష్ఠుడు వచ్చి,
తనకు బ్రాహ్మణ్యం లభించిందని అంగీకరించాలని, అంతవరకు
తాను బ్రాహ్మణుడనేనన్న నమ్మకం తనకు కలగదని అంటాడు. ఆయన
కోరిక మేరకు దేవతలు వశిష్ఠుడి వద్దకు పోయి, అది
నెరవేర్చమని ఆయన్ను ప్రార్థించారు. ఆ మహా తపస్వి వచ్చి, విశ్వామిత్రుడితో
స్నేహం చేసి, అతడు బ్రహ్మర్షి అయ్యాడని చెప్పాడు. విశ్వామిత్రుడు నిజమైన
బ్రహ్మర్షి అయ్యాడని, బ్రాహ్మణులకు అధికారమున్న
కార్యాలన్నీ ఆయనా చేయవచ్చని, ఆ అధికారం ఆయనకు లభించిందని దేవతలు చెప్పి
వెళ్లిపోయారు. విశ్వామిత్రుడు కూడా వశిషిష్ఠుడితో స్నేహం చేశాడు.
విశ్వామిత్రుడు తొలుత రాజు. గృహస్థుడు. భార్యతో సహా పోయి
వానప్రస్థుడై తపస్సు చేసి రాజర్షి అయ్యాడు. అడవిలో దొరికే పళ్లుమాత్రమే తిని
తపస్సు చేసి, తర్వాత, ఋషి అయ్యాడు. అప్పటిదాకా భార్యా
పిల్లలు ఆయన వెంటే వున్నారు. తర్వాత ఒంటరిగా వుండి తపస్సు చేసి మహర్షి అయ్యాడు.
మహర్షులంతా జితేంద్రియులు కారు. కాబట్టి, జితేంద్రియుడు
కావడానికి, పంచాగ్నుల మధ్య నిలిచి, ఆహారం మాని, వాయువే ఆహారంగా తపస్సు చేశాడు.
ఇంతచేసినా కామాన్ని జయించగలిగాడుగాని, కోపాన్ని
జయించలేకపోయాడు. అదికూడా జయించేందుకు, మౌనంగా, కుంభకంలో
ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. అప్పుడు అన్నీ జయించి బ్రహ్మర్షి అయ్యాడు. జన్మతో వచ్చే
బ్రాహ్మణ్యం కర్మతో రాదు. విశ్వామిత్రుడికి వచ్చిందంటే దానికొక ప్రత్యేకమైన
కారణముందనే అనాలి. ఎవరికైనా, ఎంత చేసినా కామ క్రోధాలు అనివార్యం. వాటిని తనకు
వశపడేటట్లు చేసుకున్నవాడే బ్రాహ్మణోత్తముడు. అందుకే బ్రాహ్మణ్యం సులభమైంది కాదు.
(వాసుదాసుగారి శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment