Wednesday, June 3, 2020

వాసుదాసు ఆంధ్రవాల్మీకాన్ని మందర మకరందంగా ఎందుకు రాశాను: వనం జ్వాలా నరసింహారావు


వాసుదాసు ఆంధ్రవాల్మీకాన్ని
మందర మకరందంగా ఎందుకు రాశాను
వనం జ్వాలా నరసింహారావు
ఆప్తమిత్రుడు, హిందీ మిలాప్ వార్తా పత్రికలో పనిచేస్తున్న అనుభవజ్ఞుడైన పాత్రికేయ సన్నిహితుడు, విద్యారణ్య నేను ఆంధ్రవాల్మీకి రామాయణం సుందరకాండ రాసినప్పటి నుండి ఆ పుస్తకం కావాలని అడుగుతున్నాడు. మేమిద్దరం ఎంతో తరచుగా కలుస్తుంటాం. కాని భగవదేచ్చ మనకర్థం కాదు కదా! ఎన్నిసార్లు నేను ఇవ్వాలనుకున్నా, ఆయన నాదగ్గర నుండి తీసుకోవాలనుకున్నా అది సాధ్యపడలేదు. చివరకది నేను రామాయణం అన్ని కాండలను పూర్తిచేసిన తరువాత కాని వీలుకలగలేదు. రెండు-మూడు రోజుల కింద నా పుస్తకాల పూర్తి సెట్టు ఆయనకు చేరాయి. వెంటనే చదవడం మొదలుపెట్టిన విద్యారణ్య నాకు వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణం రాయాలన్న ఆలోచన ఎలా కలిగిందనీ, ఎందుకు కలిగిందనీ, ఆ వివరాలన్నీ రాయాలనీ అడిగాడు. గతంలో అవన్నీ కొంతవరకు రాసినప్పటికీ, మళ్లీ స్నేహితుడి సలహా ప్రకారం రాస్తున్నాను దీన్ని.   

2003 లో మా రెండో అమ్మాయి కిన్నెర సిన్సినాటి (అమెరికా) లో వున్నప్పుడు దాని కూతురు ప్రసవ సమయంలో సహాయంగా వుండడానికి  దంపతీ సమేతంగా వెళ్లిన నేను హైదరాబాద్ లో మొదలుపెట్టిన సుందరకాండ మందర మకరందం పుస్తకాన్ని పూర్తిచేసాను. కొంతకాలానికి, మిత్రుల, సన్నిహితుల ప్రోత్సాహంతో బాలకాండ మొదలుపెట్టాను. అయితే, కారణాలు ఏమైనప్పటికీ, ఆ తరువాత చాలాకాలానికి గాని, అంటే, 2009 లో మా అబ్బాయి ఆదిత్య అమెరికా సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వున్నప్పుడు, మా మనవరాలు కనక్ పుట్టే సమయంలో అక్కడికి పోయినప్పుడు, బాలకాండ మందర మకరందం పూర్తి చేయగలిగాను. అది తీసుకుని ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తే మొత్తం రామాయణాన్ని రాసిన తరువాత అన్నీ కలిపి ముద్రిస్తానన్నాడు. అదోక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. అన్ని కాండలు రాయాలని నిశ్చయించుకున్నాను. బాలకాండ మొదటి ముద్రణ చిన జీయర్ స్వామి దయతో జరిగింది.

తరువాత అయోధ్య కాండ మందర మకరందం మొదలుపెట్టాను. అది సాగనివ్వదని పలువురు చెప్పిన మాట నిజమేమో అన్నట్లుగా అది పూర్తి చేయడానికి చాలా కాలం పట్టింది. దాన్ని హైదరాబాద్ లో, సింగపూర్ లో కూడా రాశాను. కాని చివరకు 2017 లో మరోమారు అమెరికా పర్యటనకు సాన్ ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్ నగరాలకు అబ్బాయి, అమ్మాయిల దగ్గరికి వెళ్లినప్పుడు పూర్తి చేయగలిగాను. తరువాత రెండేళ్ళు అమెరికా రావడం కుదరలేదు. అరణ్యకాండ మందర మకరందం, కిష్కింధ కాండ మందర మకరందం హైదరాబాద్ లోనే పూర్తి చేశాను. యుద్ధకాండ మొదలు పెట్టాను. కాని అది కూడా అమెరికాలోనే పూర్తి కావాలని వుందేమో! అమెరికా రావడం (2019 నవంబర్) పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా మొత్తం రామాయణం ఆరు కాండలు రాయడానికి పదహారేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. ఆ విధంగా పదహారు సంవత్సరాల యజ్ఞం పూర్తయింది.

నేను రామాయణం రాయడానికి పూర్వ రంగం వుంది.         
తొమ్బైవ దశకం చివర్లో నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో సంస్థ కేటాయించిన క్వార్టర్ లో నా నివాసం. అప్పట్లో, మా పొరుగునున్న శ్రీమాన్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు లేచింది మొదలు నిద్ర పోయేదాక రామనామం తప్ప దేని మీద మనస్సు పోనీయడు. ప్రతినిత్యం రామాయణ పారాయణం చేస్తూ వుంటాడు. నా కంటే వయస్సులో చిన్న వాడైనా, జ్ఞానవృధ్ధుడు. నా నిత్య కృత్యాలు చాలవరకు ఆయనకు నచ్చవు. నేనంటే మాత్రం ఇష్టం. ఆయన ఉదయం అనుష్టానం చేసుకుంటుంటే, చనిపోయిన మా నాన్న స్వర్గీయ వనం శ్రీనివాసరావు గారు గుర్తొచ్చేవారు.

నాన్నగారు వాసుదాసు గారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం, మందరం అన్ని కాండల్నీ, కనీసం పాతిక సార్లకు పైగా పారాయణం చేసినవారు. వాసుదాసుగారూ ఆయన శిశ్యులు సుబ్బదాసుగారూ (దాసశేషుడు) ఖమ్మం జిల్లాలోని వనంవారి కృష్ణాపురం గ్రామంలో వున్న మా ఇంట్లో వారి పాదాలు మోపి మా ఇంటిని పావనం చేసారు నా బాల్యంలో చాలా సంవత్సరాల కింద. నేనూ మా నాన్నగారితో నా చిన్నతనంలో తెనాలి దగ్గర అంగలకుదురులోని వారి ఆశ్రమానికి వెళ్లాను ఒకటి-రెండు సార్లు.

         వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒక సారి ధర్మశాస్త్రం లాగా, ఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా, మరో చోట ఇంకో శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది. బహుశా, క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి.


మా శ్రీమతికి మా నాన్న గారి పూజ-పునస్కారాల వారసత్వం వచ్చింది. నాకంతగా అబ్బ లేదు. ప్రక్కనున్న విజయరాఘవ గారినీ,  ఆయన భక్తి సంబంధమైన మాటలను ఎప్పుడూ వింటుంటే ఆమె: " మీరు అన్న గారి మార్గంలోనన్నా పోతారు, లేదా, ఆయన మీ దారికన్నా వస్తారు" అనేది, మేమిద్దరం చర్చించుకుంటుంటే. అదే నిజమైంది కొద్ది రోజుల్లో. నేను రామాయణం చదువుతాను, మీదగ్గరుంటే ఇవ్వండి, అయితే వాసుదాసు గారు వ్రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం మాత్రమే కావాలన్నాను. అలా అడగటానికీ, అదే కావాలంటానికీ, ప్రత్యేక కారణం ఏమీ లేదు. కాకపోతే నా చిన్న తనంలో, మా నాన్న గారు "మందరం" పారాయణం చేస్తుంటే చూశాను కనుక అది మాత్రమే రామాయణమేమో అనుకున్నాను. ఆయితే నేను రామాయణం చదువుతానంటే ఆయన కొన్నాళ్ళు నమ్మలేదు. నేనూ గట్టిగా అడగనూలేదు. ఆయన ఇవ్వనూ లేదు. నేను ఆలోచన వచ్చిన వెంటనే చదవటమూ జరగలేదు.

         మళ్ళీ నిత్య జీవితం. దైనందిన చర్యలు. మధ్యలో మా జిల్లాలోనే వున్న భద్రాచల రాముడినీ, పొరుగు రాష్ట్రంలో ఉన్న శ్రీరంగనాధ స్వామినీ, దర్శించుకొనే భాగ్యం కలిగింది, డిసెంబర్ 2002-జనవరి 2003 లో. "శ్రీ రామావతార సమయంలో శ్రీ సీతా రాముల దర్శనం ఏదోవిధంగా కలగందే ఈ జన్మలో శ్రీరంగనాధుని (శ్రీరంగం) దర్శనం కలగనే కలగదు" అన్నారు విజయరాఘవ గారు. జనవరి 15, 2003 న తన ఇంట్లోకి పిల్చి, స్నానం చేసి రమ్మని, వాసుదాసుగారి శ్రీమదాంధ్రవాల్మీకి రామాయణం సుందరకాండ మందరం నా చేతిలో పెట్టారు. రామాయణం మొత్తం చదవడం తర్వాత, ముందిది చదవమన్నారు. ఎందుకంటే, రామాయణం పఠనమో, పారాయణమో సుందరకాండ తోనే మొదలెట్టాలన్నారు. అవునేమోననుకుని చదవడం ప్రారంభించాను.

         సరీగ్గా పది రోజుల్లో ఆసాంతం చదివాను. ఏరోజుకారోజు, వీలున్నప్పుడల్లా చదివేవాడిని. చదివిన విషయ సారాంశం ఎప్పటికప్పుడు బడి పిల్లాడిలా, విజయరాఘవ గారికి అప్ప చెప్పే వాడిని. వశిష్ఠుడి నోట బ్రహ్మర్షి అంటేనే విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడట! నేను చదువుతున్నానన్న నమ్మకం ఆయనకు కలిగితేనే నాకెందుకో తృప్తనిపిన్చేది. పదిరోజుల్లో చదవడం గొప్ప కాదు. నన్ను ప్రేరేపించి, ప్రోత్సహించి చదివించిన ఆయన గొప్పతనం అది. వాల్మీకి సంస్కృతంలో వ్రాసిన ఇరవైనాలుగు వేల శ్లోకాలను ఎప్పుడంటే అప్పుడు ప్రతిపదార్థంతో సహా అప్పచెప్పగల సమర్ధుడాయన!

ఆరువందల డెబ్భై పేజీల పద్య-గద్య-ప్రతిపదార్ధ తాత్పర్య సహిత సుందరకాండ మందరాన్ని చదవడానికైనా, పారాయణం చేయడానికైనా, నాలాంటి చాలామందికి తీరికా, ఓపికా వుండదేమో అనిపించింది. తెలుగు భాషలో కనీస ప్రావీణ్యత వున్నవారికి అర్ధమయ్యే రీతిలో వాసుదాసుగారి సుందరకాండ మందరాన్ని, ఆయనే "వక్తగా", నేను కేవలం "వాచవిగా"-"అనువక్తగా" శిష్ట వ్యావహారిక భాషలో సంక్షిప్తీకరించి నలుగురికీ అందించగలుగుతే బాగుంటుందేమో అనుకున్నాను.

ఇంతలో అనుకోకుండా సిన్సినాటి (అమెరికా) లో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు మా ఆవిడతో సహా వెళ్లాల్సి వచ్చింది, మనుమరాలు పుట్టబోయేముందర మా అమ్మాయికి తోడుగా వుండేటందుకు. అక్కడ మళ్ళీ మొదలెట్టి ఓ నెల రోజుల వ్యవధిలో శ్రీరామానుగ్రహం వల్ల పూర్తి చేసాను.

ఎందరో సహృదయులు, అందరికీ కృతజ్ఞతలు. సుందరకాండ మందర మకరందం వ్రాయడానికి వాడిన కలం కానీ, కాగితం కానీ, టైపు చెసిన కంప్యూటర్లు కానీ నావి కావు. ఆలాంటప్పుడు రాసింది నేను మాత్రమేనని, రాసిన విషయమంతా నా కృషివల్లనే జరిగిందని ఎలా అనగలను? నేనేంటి? ఆంధ్రవాల్మీకి రామాయణం సుందరకాండ మందరం చదవడమేంటి? చదివిన తర్వాత మందర మకరందంగా మలచడమేంటి? తెలుగు సాహిత్యంలో, రచనా వ్యాసంగంలో అంతో, ఇంతో ప్రవేశం వున్న మాట కొంత వాస్తవమే అయినప్పటికీ, ఆంధ్రవాల్మీకి సుందరకాండను మందర మకరందంగా మలిచే శక్తి నాకు కలగడమేంటి?

ఇదంతా బహుశా ఏదో అద్భుత, అజ్ఞాత, అప్రమేయ శక్తి నాతో కావాలనే చేయించి వుంటుంది! ఆ శక్తే నన్ను మూడు నెలలు ఈ పనికొరకై అమెరికా పంపించి వుంటుంది! నేను అమెరికా ఒహాహియో రాష్ట్రంలోని సిన్సినాటి లో వున్న మా అమ్మాయి ఇంట్లో వున్నప్పుడు, ఆ శక్తే మా అమ్మాయి కిన్నెర, అల్లుడు గారు కిషన్ లో జొరబడి, వాళ్ల ద్వారా, ఆ ఇంట్లో నాకు అనువైన వాతావరణం కలిగించి వుంటుంది! వ్రాయడానికి అవసరమైన కాగితాలు, అన్ని రకాల పెన్నులూ వాళ్లతో ఇప్పించి వుంటుంది ఆ శక్తే! వ్రాసిన దానిని నేనే స్వయంగా కంప్యూటర్ ద్వారా తెలుగులో టైపు చేసుకునేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను అల్లుడిగారి ద్వారా తెప్పించిందీ ఆ శక్తేనేమో! ఇంగ్లీష్ లోనే సరీగ్గా కంప్యూటర్ వాడకం అప్పటికి ఇంకా రాని నాతో 300 పేజీలకు పైగా టైపు చేయించింది ఆ శక్తేనేమో! ఎప్పటికప్పుడు కంప్యూటర్ ప్రింట్లు మా అల్లుడు గారి ద్వారా తీయించి ఇచ్చింది ఆ శక్తేనేమో!

నా వ్రాత ప్రతి అయిన మరునాడే, దాన్ని పిట్స్ బర్గ్ లోని వెంకటేశ్వరస్వామి పాదాల దగ్గర పెట్టే అవకాశం దొరికింది. ఆ తరువాత స్వర్గీయ పీవీఆర్కే ప్రసాద్ గారు దాన్ని ఆవిష్కరించారు. ఇదిప్పటికి మూడు సార్లు ప్రచురించాను. బాలకాండ చినజీయర్ స్వామి దయతో ప్రచురించాను మొదటిసారి. అది కూడా ఇప్పుడు రెండో సారి ముద్రించడం జరిగింది. అయోధ్య, అరణ్య, కిష్కింధ, యుద్ధ కాండలు కోరమండల్ సీతారామయ్య గారి ఆర్ధిక సహాయంతో వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ వుయ్యూరి లోకేష్ కూడా సహాయం చేశారు.

మా నాన్న గారు ఇప్పుడు జీవించి వుంటే బహుశా ఆయన కంటే ఈ విషయంలో సంతోషించే వారెవరూ వుండరు! ఆయన బ్రతికున్నప్పుడు నేనెట్లా వుండాలని కోరుకున్నాడో అలా కొంతవరకూ వున్నానంటానికి ఈ పుస్తకమే నిదర్శనం.

1 comment:

  1. Great effort sir. Your life is fulfilled.

    ReplyDelete