Wednesday, June 10, 2020

హైదరాబాద్ బేగంపేట నుండి షికాగో సిన్సినాటి దాకా .... మా అమెరికా మొదటి పర్యటన అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు


హైదరాబాద్ బేగంపేట నుండి షికాగో సిన్సినాటి దాకా
మా అమెరికా మొదటి పర్యటన అనుభవాలు
వనం జ్వాలా నరసింహారావు

సరిగ్గా 21 సంవత్సరాల క్రితం 1999 సంవత్సరంలో మా శ్రీమతి విజయలక్ష్మి (బుజ్జి) తో మొట్టమొదటిసారి అమెరికా వెళ్లాం. ఎన్నోరకాలుగా అదొక మధురానుభూతి. మొదటిసారి అమెరికా వెళ్ళడమే కాకుండా, మొదటిసారి విమానం ఎక్కడం కూడా. మా రెండో అమ్మాయి కిన్నెర ఆహ్వానం మేరకు, ఆమెకు పుట్టబోయే అబ్బాయిని చూడడానికి, ఆమె కాన్పు అప్పుడు సహాయంగా వుండడానికి అమెరికా వెళ్లాం. జులై 2, 1999 న అక్కడికి చేరుకున్నాం.

భారతీయ కాలమానం ప్రకారం జులై 2 న బయల్దేరిన మేము, అమెరికా కాలమానం ప్రకారం అదేరోజున అంటే జులై 2 న అక్కడికి చేరుకున్నాం. ఎయిర్ ఇండియా వారిచ్చిన ఆతిధ్యాన్ని మా శ్రీమతి ఆస్వాదించలేకపోయింది. కారణం మేము ప్రయాణం చేసిన రోజు శుక్రవారం కావడం, ఆ రోజున ఏ పదార్థంలోనైనా పులుపు తగులుతుందేమో నాన్న భయంతో బయటి ఆహారం ఆమె తీసుకుపోకపోవడమే. వాస్తవానికి విమానంలో ఇచ్చిన ఆహారం లో పులుపు లేనేలేదు. అది వేరే సంగతి.
       
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో మా బందిమిత్రులు అనేకమంది మాకు వీడ్కోలు పలకడానికి వచ్చారు. వచ్చిన వారిలో స్నేహితుడు, బంధువు అయిన భండారు శ్రీనివాసరావు (ఆయన శ్రీమతితో సహా) కూడా వున్నాడు. యాదృచ్చికంగా అదే రోజున మరో విమానంలో ఆయన కొడుకు సందీప్ మేం వెళ్తున్న సిన్సినాటికి పోతున్నాడు.

విమాన ప్రయాణం చేసే ప్రతి పాసెంజర్ చేయాల్సిన చెక్-ఇన్, బాగేజ్ క్లియరెన్స్, బోర్డింగ్ పాసులు తీసుకోవడం లాంటి లాంచనాలన్నీత్వరగా పూర్తిచేసాం. విమానం ఎక్కగానే ఒకరిద్దరు ఊహించని స్నేహితులు కనిపించారు. వారిలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ హనుమంతరావు, ఆయన భార్య వున్నారు. అలాగే సిన్సినాటీకే వెళ్తున్న భార్గవి ఆమె చంటి పాపతో సహా కలిసింది. 75-80 ఏళ్ల వయసున్న మరో వృద్ధుల జంట కూడా కలిసింది. మేమంతా మొదటిసారి అమెరికా వెళ్తున్నా వాళ్లమే. షికాగో దాకా అంతా కలిసే ప్రయాణం చేసాం.
    
ఎయిర్ ఇండియా ట్రాన్సిటరీ ఫ్లైట్ ముంబాయి-బాంబే కు చేరుకుంది. అక్కడ విమానం మారాల్సి వుంది. కుంభ వృష్టిగా కురుస్తున్న వర్షంలో విమానం దిగి బస్ ఎక్కాం. ఆ కాసేపట్లోనే తడిసి ముద్దయి పోయాం. లౌంజ్ కు చేరడం, మళ్లీ బోర్డింగ్ పాసులు తీసుకోవడా, మరో విమానం ఎక్కడం అన్నీ చేయడానికి సుమారు 45 నిమిషాలు పట్టింది. మా కొత్త స్నేహితులకు కూడా సహాయం చేసాం.

విమానంలో మా ప్రయాణం మొదలైంది. అప్పుడు ఉదయం 6 గంటల సమయం అయింది. ఎయిర్ హోస్టెస్ ఆతుధ్య లాంచనాలు మొదలయ్యాయి. (బ్లాక్) కాఫీ, తరువాత బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు. బుజ్జి తనకు పాలు కావాలంటే ఎయిర్ హోస్టెస్ వెంటనే స్పందించి ఇచ్చింది. అలా, అలా, లండన్ హీత్రో విమానాశ్రయం దాకా ఎయిర్ హోస్టెస్ తో స్నేహం కొనసాగించాం. ఆ తరువాత కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రయాణం కావడానికి కొద్ది రోజుల క్రితం వరకూ జరిగిన సంఘటనలను నేమరేసుకున్నాం. మాకు అమెరికా పోవడానికి సహాయపడ్డ అందరికీ కృతజ్ఞలు చెప్పుకున్నాం. క్రమంగా నిద్రలోకి జారుకున్నాం. మూడు-నాలుగు గంటల తరువాత మరో డోస్ ఆహారం సర్వ్ చేస్తున్నప్పుడు మేల్కొచ్చింది. అమెరికా వెళ్తున్నాం కాబట్టి దారి పొడుగూతా టైం మారుతున్నప్పటికీ, మా రిస్ట్ వాచుల్లో మాత్రం మేం ఇండియా టైమే పెట్టుకున్నాం. అమెరికాలో ఉన్నంత కాలం కూడా అలాగే వున్నాం. మా తరువాత పర్యటనలలో కూడా ఇండియా టైం తోనే మానేజ్ చేసాం.         
లంచ్ సర్వ్ చేసే టైం దగ్గర పడుతున్నాకొద్దీ నాలో సహనం సన్నగిల్లుతూ వచ్చింది. మా ఫ్లైట్ టికెట్లు పంపేటప్పుడు కిన్నెర చెప్పిందేమిటంటే, ఎయిర్ ఇండియా విమానంలో భారతీయ ఆహారం ఇస్తారు కాని డ్రింక్స్ ఇవ్వకపోవచ్చని. డ్రింక్స్ విషయంలో కిన్నెర చెప్పింది తప్పయితే బాగుంటుందని నా ఆలోచన. ఇంతలో డాక్టర్ రంగారావు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. డ్రింక్స్ ఇస్తారుకాని కొనుక్కోవాలని ఆయన అన్నారు. అనడమే కాకుండా నా వెంట తీసుకుపోవడానికి హాండ్ బాగేజ్ లో ఒక బాటిల్ కూడా ఇచ్చాడు. అప్పట్లో ఇప్పటిలాగా బాటిల్ తీసుకుపోకూదదన్న నిబంధన లేదు.

ఇంతలో ఎయిర్ హోస్టెస్ గొంతు వినిపించింది. ఎవరికేం కావాలో అడుగుతున్నది. కోక్, సూప్, డ్రింక్ (విస్కీ, బీర్, వైన్) లలో ఏం కావాలి అని ప్రశ్న వినిపించింది. మబ్బు తెరలు తొలగిపోయాయి. 60 ఎంఎల్ పెగ్ మెజర్ షివాస్ రీగల్ నా కోరిక మేరకు ఇచ్చింది హోస్టెస్. మా శ్రీమతి ములుకుల్లాంటి చూపులను లెక్కచేయకుండా నాపని నేను కానిచ్చాను. ఒకటి వెంట మరొకటి ఎయిర్ హోస్టెస్ ఇస్తూనే వుంది...నేను వాటిని ఆస్వాదిస్తూనే వున్నాను. ఎంత అనేది ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. ఈ తతంగం అలా...అలా.. కొనసాగింది. ఇంతలో ట్రాన్సిట్ హాల్ట్ లండన్ హీత్రో విమానాశ్రయం వచ్చింది. అక్కడ మమ్మల్ని విమానం దిగనీయకుండానే క్లీనింగ్ కార్యక్రమం జరిగింది. కాఫీ, డ్రింక్స్, లంచ్/డిన్నర్ సర్వింగ్ షికాగో పోయేంతవరకూ కొనసాగాయి. అమెరికా-షికాగో టైం ప్రకారం జులై 2 మధ్యాహ్నం 3 గంటలకు (12-30 ఎఎం భారతీయ కాలమానం) షికాగో విమానాశ్రయం చేరుకున్నాం.
 
విమానం దిగినప్పటినుండీ ప్రతిదీ కొత్తగా అనిపించింది. ధైర్యం తెచ్చుకుని ముందుకు అడుగు వేశాం. క్యూలో నిలుచున్నాం. మొదటి లాంచనం పాస్పోర్ట్, వీసా, బోర్డింగ్ పాస్ చెక్ చేయడం. అదొక అరగంట పట్టింది. అక్కడ కౌంటర్ మీదా కూర్చున్న ఉద్యోగిని మేమెందుకు అమెరికా వస్తున్నామని ప్రశ్న వేసింది. కూతురు ప్రసవ సమయంలో సహాయంగా వుండడానికని సమాధానం ఇచ్చాం. ఎప్పుడని అడిగితే ఆగస్ట్ మొదటివారం అని జవాబిచ్చాం. ఆవిడ ‘ఓకే’ అన్నది కాని అది మాకు ‘ఆకె’, ‘ఆకె లాగా ధ్వనించింది. వెంటనే మా పాస్పోర్టులు తెరిచి ‘జనవరి 2, 1999 వరకు అమెరికాలో వుండవచ్చు అని స్టాంప్ వేసింది. అంటే ఆర్నెల్లు మించి వుండకూడదని. అదే ఎవరికైనా ఎక్కువలో ఎక్కువ అనుమతించే కాలపరిమితి అని తరువాత మాకు తెలిసింది.     

అక్కడి నుండి కస్టమ్స్ క్లియరెన్స్ కౌంటర్ దగ్గరికి పోయాం. విదేశాలనుండి వచ్చి అమెరికాలో కాలుపెట్టిన మొట్టమొదటి విమానాశ్రయంలో కస్టమ్స్ చెక్ తప్పనిసరి. మా పెద్ద-పెద్ద నాలుగు సూట్ కేసుల చెకింగ్ చకచకా జరిగిపోయాయి. ఆవకాయ పచ్చళ్లు ఉన్నాయా అని అడిగారు. లేవని (ఉన్నప్పటికీ) యధాలాపంగా సమాధానం ఇచ్చాం. ప్రతి భారతీయుడు ఇచ్చే సమాధానం అదేనని అక్కడివారికి తెలుసట. ఇక అక్కడి (షికాగో) నుండి సిన్సినాటీకి ‘ఆల్ అమెరికన్ ఎయిర్ లైన్స్’ లో ప్రయాణం చేయాలి. కాకపొతే బాంబే లోనే మా బోర్డింగ్ పాసులు సిన్సినాటీ దాకా ఇచ్చారు. లగేజ్ మా ప్రమేయం, ప్రయాస లేకుండా అధికారులే పంపే ఏర్పాటు వుంది. ఆలా లగేజ్ మోయకుండా విమానం ఎక్కాల్సిన తరువాతి టర్మినల్ వైపు వెళ్లాం.     
  
షికాగో విమానాశ్రయంలో మాకేడురైన అతి పెద్ద సమస్య ఎస్కలేటర్. అదంటే బుజ్జికి (ఇప్పటికి కూడా) పూర్తిగా విరుద్ధ భావం. ఏడెనిమిది సార్లు అమెరికా పోయాం కానీ, ఎస్కలేటర్ వాడడానికి ఆమె ఎప్పుడూ విముఖురాలే. ఇండియా ఎయిర్పోర్టుల్లో వాటిని వాడకుండా తప్పించుకుంది. వాతి బదులు ఎలివేటర్ వాడేది. అమెరికాలో తప్పలేదు. ఎలివేటర్ మాకు కనిపించలేదు. ఎలానా అని అనుకుంటుంటే, సరిగ్గా అప్పుడే, ఇద్దరు అందమైన తెలుగు మాటకారి అమ్మాయిలతో పరిచయం చేసుకుంది. వాళ్లిద్దరూ కూడా మొట్టమొదటిసారి అమెరికా వస్తున్నారు. అలాంటి వారె మా ఆవిడకు ఇష్టం. వాళ్ళిద్దరూ అటో చేయి, ఇటో చేయి పట్టుకుని ఆమెను ఎస్కలేటర్లో దింపారు.  

మేం వెళ్లాల్సిన గెట్ నంబర్ 3 కు పోయే దారిలో ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర ఆగం. కిన్నెర ఇచ్చిన కోడ్ నంబర్ ఆధారంగా డబ్బులు వేయకుండానే ఫోన్ చేయగలిగాం మా అమ్మాయికి. కిన్ని, కిషన్ గొంతులు ఫోన్లో వినగానే ప్రాణాలు చేచి వచ్చాయి. మేం షికాగో విమానాశ్రయంలో ఉన్నామని, సిన్సినాటీ వెళ్లే విమానం ఎక్కబోతున్నామనీ చెప్పాం. అక్కడి నుండి సిన్సినాటీ ఫ్లైట్ డిపార్చర్ సెంటర్ కు వెళ్లాం. బోర్డింగ్ పాసులు మార్చుకునే తతంగం పూర్తి చేసుకుని, లగేజ్ విమానం ఎక్కిందని నిర్ధారించుకుని రిలాక్స్ అయ్యాం. వాష్ రూమ్ వెళ్లి ఫ్రెష్ అయ్యాం. అంతా సులభంగా అయిపోయింది.

 ఆల్ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో (చాలా చిన్న విమానం) షికాగో నుంచి సిన్సినాతీకి గంటన్నర ప్రయాణం. షికాగో కాలమానం ప్రకారం సాయింత్రం 6.45 కు బయల్దేరిన విమానం సిన్సినాటీ కాలమానం ప్రకారం రాత్రి 8.30 కు చేరింది. విమానంలో కేవలం సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమె సర్వ్ చేశారు. ఆ లెక్కన మన ఎయిర్ ఇండియా విమానం వంద శాతం బెట్టర్.

   చేరాల్సిన సిన్సినాటీకి 8.30 పీఎం కు చేరాం. బయటకు వస్తుంటేనే ‘హలో అన్న అపరిచిత గొంతు వినిపించింది. ‘మీరేనా ఫలావారు?’ అన్న మాట కూడా వినిపించింది. అవునన్నాం. అతడి పేరే ప్రసాద్. కిషన్, కిన్నెరల స్నేహితుడు. కిన్నెర గర్భిణీ కనుక, కారు నిమ్మదిగా నడపాల్సినందున, విమానాశ్రయానికి చేరడం ఆలస్యమయితే, మేం కంగారు పడకుండా, దేనికైనా మంచిదని, ప్రసాద్ ను ముందుగా పంపారు. అసలు కిన్నిని రావద్దని చెప్పినా అది వినలేదు. ఇంతలో వాళ్లు కూడా వచ్చారు. కిన్ని పెళ్లి అయిన తరువాత మొట్టమొదటిసారిగా కలుసుకున్నండున అందరిలో ఒకింత ఉద్వేగం చోటు చేసుకుంది కాసేపు. 
      
సిన్సినాటీ విమానాశ్రయంలో ‘ఫ్రీ ఫర్ ఆల్ లాగా వుంది అంతా. కిషన్ కారు బయటికి వచ్చే ద్వారం దాక అవచ్చిమ్ది. లగేజ్ క్లియరెన్స్ అంతా 15 నిమిషాల్లో అయిపోయింది. ఎవరి లగేజ్ ఎవరన్నా తీసుకుపోయేంత స్వాతంత్ర్యం వుందక్కడ. కాకపొతే అలా ఎప్పటికీ జరగదని కిషన్, కిన్నెర చెప్పారు. ఎవరు కూడా మా బాగేజ్ స్లిప్పులు అడగలేదు. టికెట్లు కానీ, బోర్దిమ్గా పాసులు కానీ అడగలేదు. 45 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాం. పొద్దుపోయెంతవరకూ కబుర్లు చెప్పుకున్నాం.

మొదటి రెండు-మూడు రోజులు మా తోడల్లుడు జూపూడి ప్రసాద్ కూడా మాతోనే వున్నాడు. సిన్సినాతీకి ఆనతి దూరంలో వున్న లెక్సింగ్టన్ కు, అక్కడికి కొద్ది దూరంలో వున్న మిడిల్స్బర్గ్ నుండి లెక్సింగ్టన్లో నివసిస్తున్న గన్నంరాజు వెంకటేశ్వర్ రావు (కూతురు శ్రీదేవి దగ్గర వున్న) జూపూడి ప్రసాద్ ను కారులో తీసుకు వచ్చాడు. లెక్సింగ్టన్ నుండి నేను, కిషన్ సిన్సినాతీకి తీసుకువచ్చాం. ఆ తరువాత రెండు-మూడు రోజులు తానా సమావేశాలతో గడిచి పోయింది. తానా విశేషాలు మున్ముందు తెలుసుకుందాం.       

No comments:

Post a Comment