Saturday, August 13, 2022

పద్దెనిమిదవ రోజు యుద్ధం (1) .... కౌరవ సేనాధిపతి శల్యుడిని సంహరించిన ధర్మరాజు .... ఆస్వాదన-84 : వనం జ్వాలా నరసింహారావు

 పద్దెనిమిదవ రోజు యుద్ధం (1)

కౌరవ సేనాధిపతి శల్యుడిని సంహరించిన ధర్మరాజు

ఆస్వాదన-84

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (14-08-2022)

కౌరవ సేనలకు సర్వసైన్యాధిపతిగా అభిషిక్తుడైన శల్యుడు యుద్ధసన్నద్ధుడై సర్వతోభద్ర వ్యూహం ఏర్పాటు చేశాడు. దాని ముఖ స్థానంలో కర్ణుడి కుమారులు తన చుట్టూ వుండగా శల్యుడు స్వయంగా నిలిచాడు. కుడి పక్కన కృపాచార్యుడు; ఎడమ పక్కన త్రిగర్త వీరులతో కలిసి కృతవర్మ; వెనుకవైపు కాంభోజులు తోడు వుండగా అశ్వత్థామ; నడుమ భాగంలో కురువీరులతో కలిసి దుర్యోధనుడు; ఆయన ముందు గజ సమూహం; దానికి అగ్ర భాగంలో చతురంగ బలాలతో శకుని నిలిచారు. అంతకు ముందే పాండవులు మూడు ముఖాలుగా, త్రిముఖ వ్యూహాన్ని సిద్ధపరిచారు. ధృష్టద్యుమ్న, శిఖండి, సాత్యకులు మూడు ముఖాల సేనలకు అగ్రభాగాన నిలిచారు. భీమార్జునులు ధర్మరాజుకు ముందు భాగాన నిలిచాడు. ఇరు పక్షాలలో సైన్యం దాదాపు పూర్తిగా నశించి, కౌరవ పక్షాన 11 వేల రథాలు, 1700 ఏనుగులు, 2 లక్షల గుర్రాలు, 3 కోట్ల కాల్బలం మాత్రమే మిగలగా; పాండవుల పక్షాన కేవలం 6 వేల రథాలు, 3 వేల ఏనుగులు, ఒక లక్ష గుర్రాలు, కోటి కాల్బలం మాత్రమే మిగిలింది.

శల్యుడి రథాన్ని చూడగానే పాండవులు వేగంగా యుద్ధానికి నడిచారు. ఇరు పక్షాల సైనికులు వీరవిహారం చేశారు. భీకరంగా యుద్ధం చేశారు. భీమార్జునులు అతిశయించి పోరాడడంతోను, ధృష్టద్యుమ్నుడు, శిఖండి ధర్మరాజును ముందుంచుకుని యుద్ధం చేయడం వల్లను, నకుల సహదేవుల విజృంభణ వల్లా, కౌరవ సైన్యం హాహాకారాలు చేసుకుంటూ పారిపోసాగింది. అప్పుడు శల్యుడు తన రథాన్ని ధర్మరాజు వున్న దిక్కుగా తీసుకెళ్లమని సారథికి చెప్పాడు. వెంటనే శల్యుడు పాండవుల వేగిరపాటును ఆపుచేయగలిగాడు. శల్యుడి పరాక్రమాన్ని చూసిన కౌరవ సేనలు మళ్లీ విజృంభించాయి. యుద్ధం భయానకంగా మారింది. నకులుడు, తనతో యుద్ధానికి దిగిన కర్ణుడి కుమారుడు చిత్రసేనుడి తలను ఖండించాడు. ఇది చూసి అతడి సోదరులు సత్యసేన, సుశర్మలు నకులుడి మీదికి పోయారు. అప్పుడు నకులుడు విజృంభించి మొదలు సత్యసేనుడిని సంహరించాడు. తరువాత సుశర్ముడిని చంపాడు.

ఇంత జరుగుతున్నప్పటికీ శల్యుడు కౌరవ సైన్యాన్ని పారిపోకుండా, తన భుజ బలంతో, ధైర్యంగా నిలిపాడు. పాండవుల మీద స్థిరంగా పోరాడాడు. ధర్మరాజు ముందున్న భీమసేన, సాత్యకి, ధృష్టద్యుమ్న, శిఖండి, ద్రౌపదేయ, మాద్రేయులను ఎదుర్కొని వారందరినీ తన బాణాలతో నొప్పించాడు. ఆ భయంకర బాణ వర్షానికి పాండవ సేనలు వెనక్కు తొలగగా ధర్మరాజు సేనలను పురికొల్పి శల్యుడిని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, ఉలూకుడు, దుర్యోధనాదులు, అశ్వత్థామ పాండవులతో కలియబడ్డారు. శల్యుడు భీముడి రథాలను నేలకూల్చాడు. భీముడు రథం దిగి తన గదాయుధం శక్తిని ప్రదర్శించాడు. ఆ సమయంలో సహదేవుడు తనతో కలియబడ్డ శల్యుడి పుత్రుడి తల ఖండించాడు. కోపించిన శల్యుడు పాండవుల మీద బాణాలను కురిపించాడు.

గదాయుద్ధం చేస్తున్న భీముడు శల్యుడి గుర్రాలను చితగ్గొట్టాడు. శల్యుడు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. భీముడి వక్షస్థలాన్ని బద్దలు చేశాడు. ఇరువురూ విజృంభించి గొర్రెపొట్టేళ్ల లాగా పోరాడారు. చివరకు ఒకరి గదాఘాతం వల్ల ఇంకొకరు, అలా, ఇద్దరూ మూర్ఛిల్లారు. శల్యుడిని కృపాచార్యుడు అక్కడి నుండి తీసుకుపోగా కాసేపటికి భీముడు మార్ఛనుండి తేరుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు పోరాటానికి దిగి చేకితానుడిని వధించాడు. ఆ సమయంలో శల్యుడు ధర్మరాజును, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిని, అశ్వత్థామ, త్రిగర్తులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. యుద్ధం ఆశ్చర్యకరంగా మారింది. శల్యుడు ధర్మరాజు మీద బాణాలు కురిపించగా ఆయన కోపించి శల్యుడి సారథిని చంపాడు. అప్పుడు సాత్యకి, భీముడు, శల్యుడిని తీవ్రంగా ఎదుర్కొన్నారు. శల్యుడు భీముడిని, నకుల సహదేవులను, సాత్యకిని నొప్పించి, ధర్మరాజును మూర్ఛ పోగొట్టాడు. సహదేవుడు భయంకరమైన బాణాలతో శల్యుడిని ఎదుర్కొనే సమయంలోనే ధర్మరాజు తేరుకొని శల్యుడి శరీరంలో బాణాలు నాటాడు. అప్పుడు శల్యుడు ఒక బాణంతో ధర్మరాజు విల్లు ఖండించాడు.

ఆ తరువాత ధర్మరాజు శల్యుడి బాణానికి మూర్ఛపోయాడు. ఎంతమంది తనను ఎదిరించినా వెనక్కు తగ్గక భయంకరంగా శల్యుడు పోరాడసాగాడు. మరో పక్క అర్జునుడితో పోరాడుతున్న అశ్వత్థామ, సంశప్తకులు భీకరంగా యుద్ధం చేయసాగారు. ఆ సమయంలో సురథుడు అనే పాంచాల కుమారుడిని అశ్వత్థామ సంహరించాడు. ఇటుపక్క దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడి విజృంభణను అడ్డుకున్నాడు. శల్యుడు పాండవులతో విజృంభించి పోరాడుతుంటే వారంతా ఆయన బాణాలకు బాధపడ్డారు. అప్పుడు ధర్మరాజు తనకు నకులుడు సహాయకుడుగా శల్యుడిని నిలువరించాడు. అయినా అతడి విజృంభణను పూర్తిగా అడ్డుకోలేక పోయాడు. శల్యుడి పోరాడే విధానాన్ని ఇరుపక్కల సైనికులు మెచ్చుకున్నారు.

ఇలా యుద్ధం చేస్తున్న శల్యుడు పరాక్రమంతో గర్వసహితుడై పాండవ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో శల్య ధర్మరాజులు ఒకరిమీద ఇంకొకరు బాణాలు ప్రయోగించుకాగా ఇరు పక్షాల సైన్యాలు విజృంభించి దొమ్మియుద్ధం చేశాయి. మరో పక్క దుర్యోధనుడు భీముడి విల్లును ఖండించాడు. కోపించిన భీముడు దుర్యోధనుడిని మూర్ఛపోగొట్టాడు. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలు అర్జునుడితో తలపడి, ముందుకు సాగి ధర్మరాజును చుట్టుముట్టింది. ఆ సమయంలో ధర్మరాజు విజృంభించాడు. అయితే శల్యుడు ఆయన మీద వాడి బాణాలు ప్రయోగించాడు. శల్యుడు, ధర్మరాజు యుద్ధం చేస్తుండగా శల్యుడు విరథుడు కావడంతో అశ్వత్థామ అతడిని తన రథం మీద తీసుకోనిపోయాడు. ఎప్పుడైతే శల్యుడు యుద్ధం నుండి తొలగాడో అప్పుడే ధర్మరాజు విజృంభించి కౌరవ సైన్యాన్ని పారదోలాడు.

ఇంతలో శల్యుడు మరో రథాన్ని సమకూర్చుకొని ధర్మరాజు మీదికి మళ్లీ యుద్ధానికి వచ్చాడు. శల్యుడు అమితమైన పరాక్రమంతో విజృంభించి పోరాడాడు. అయితే ధర్మరాజు వేసిన మరో కఠినమైన బాణం దెబ్బకు శల్యుడు మూర్ఛిల్లగా ధర్మరాజు సంతోషించాడు. తేరుకున్న శల్యుడు తీవ్రంగా యుద్ధం చేస్తుంటే భీముడు శల్యుడిని గట్టిగా కొట్టాడు. కృపాచార్యుడు మధ్యలో వచ్చి ధర్మరాజు సారథిని చంపాడు. దైవయత్నం కూడా అవసరమనుకున్న ధర్మరాజు పరమాత్మను ప్రార్థించాడు. రుద్రుడిని ప్రార్థిస్తూ, శ్రీకృష్ణుడిని మనసులో ధ్యానిస్తూ, శల్యుడి మీద బాణాలు వేయసాగాడు. అప్పుడు భీముడు శల్యుడి విల్లును ఖండించి, సారథిని చంపాడు. ఆయన కవచాన్ని నేలమీద పడగొట్టాడు. శల్యుడు అప్పుడు కత్తి, డాలులతో యముడిలాగా విజృంభించాడు. భీముడు అతడి కత్తిని, డాలును ఖండించాడు.

అటు శల్యుడికి, ఇటు ధర్మరాజుకు వారివారి పక్ష వీరులు సహాయంగా వచ్చి యుద్ధం చేయసాగారు. ధర్మరాజు అప్పుడు శ్రీకృష్ణుడిని, శివుడిని ప్రార్థించి, శక్తి ఆయుధం మీద చేయి వేసి, నమస్కారం చేసి, నిప్పులు రాలే కన్నులతో శల్యుడిని చూశాడు. వెంటనే శల్యుడు మీద శక్తి అనే ఆ ఆయుధాన్ని విసిరాడు. ఆ ఆయుధం శల్యుడి కవచంలో ప్రవేశించి, రొమ్ము చీల్చి, వీపు నుండి బయటకు వచ్చి భూమిలో ప్రవేశించింది. శక్తి దెబ్బకు శల్యుడి ముక్కు, చెవులనుండి నెత్తురు కారింది. శల్యుడు భూమ్మీద బోరగిలపడిపోయి, మరణించాడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శల్యపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

        

     

   

No comments:

Post a Comment