Sunday, August 21, 2022

పద్దెనిమిదవ రోజు యుద్ధం (2), కౌరవుల ఓటమి, మడుగులో దాగిన దుర్యోధనుడు .... ఆస్వాదన-85 : వనం జ్వాలా నరసింహారావు

 పద్దెనిమిదవ రోజు యుద్ధం (2),

కౌరవుల ఓటమి, మడుగులో దాగిన దుర్యోధనుడు

ఆస్వాదన-85

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (21-08-2022)

శల్యుడు తమ్ముడితో సహా మరణించిన తరువాత, కౌరవ సేన పారిపోతుంటే, దాన్ని తరుముతున్న సాత్యకిని కృతవర్మ ఎదుర్కొన్నాడు. వారి మధ్య భయంకరమైన యుద్ధం చోటుచేసుకున్నది. సాత్యకి కాసేపట్లోనే కృతవర్మ రథం గుర్రాలను, సారథిని ఖండించాడు. అది చూసి కృపాచార్యుడు అతడిని అక్కడి నుంచి తప్పించాడు. కౌరవ సైన్యాన్ని అప్పుడు వెంటాడుతున్న పాండవ సైన్యాన్ని ఒక్క దుర్యోధనుడే ఎదిరించాడు. మళ్లీ యుద్ధానికి వచ్చిన కృతవర్మ గుర్రాలను ధర్మరాజు చంపాడు. ఆ సమయంలో తనతో కలియబడ్డ కృపాచార్యుడి గుర్రాలను కూడా ధర్మరాజు కొట్టాడు. శల్యుడి చుట్టాలు ఒక్కసారిగా ధర్మరాజును చుట్టుముట్టారు. అప్పుడు భీమార్జున నకులసహదేవులు, ఉప పాండవులు, సాత్యకి మొదలైన వారు ఆ యోధులను ఎదుర్కొన్నారు. శల్యుడి రథిక సమూహాలను చంపారు. పాండవ సైన్యం కేరింతలు కొడుతూ ‘ఇక ధర్మరాజే నాయకుడు అని అరిచారు.

అదే సమయంలో యుద్ధానికి వచ్చిన శకుని మీద నకుల సహదేవులు, సాత్యకి వాడి బాణాలు వేసినప్పటికీ అతడు కూడా స్థిరంగా పోట్లాడాడు. అప్పుడు సాల్వుడు పాండవ సైన్యంలో ప్రవేశించి పరాక్రమించి పోరాడగా, ధృష్టద్యుమ్నుడు అతడిని ఎదుర్కొన్నాడు. అతడితో పాటు, తన ఏనుగుతో సహా, విజృంభించి పోరాడుతున్న సాల్వుడిని భీముడు, శిఖండి కూడా ఎదుర్కొన్నారు. భీముడు సాల్వుడి ఏనుగును తన గదతో చంపగా, సాత్యకి తన బాణం దెబ్బతో సాల్వుడి తలను భయంకరంగా ఖండించాడు. అంతలోనే విజృంభించిన కృతవర్మను సాత్యకి తన బాణాలతో నొప్పించాడు. అతడి గుర్రాలను, సూతుడిని చంపాడు. అప్పుడు కృతవర్మను యుద్ధం నుండి తప్పించాడు కృపాచార్యుడు. కౌరవ సైన్యం చెల్లాచెదరై పోయింది. ఒక్క దుర్యోధనుడు మాత్రం వీరవిహారం చేయసాగాడు. మరో పక్క శకుని కఠినమైన పరాక్రమ విక్రమంతో పోరాడుతుంటే అతడిని ధర్మరాజు ఎదుర్కొన్నాడు. శకుని కొడుకు ఉలూకుడు నకులుడితో పోరాడాడు.

దుర్యోధన, ధృష్టద్యుమ్నుల మధ్య యుద్ధం జరిగింది. ఇరువురూ తీసిపోకుండా యుద్ధం చేశారు. ధర్మరాజు కృపాచార్యుడి గుర్రాలను చంపాడు. శకుని, సహదేవులు ఘోరంగా పోరాడారు. చివరకు శకుని తప్పించుకొని యుద్ధ భూమినుండి తొలగి పక్కనే పోరాడుతున్న దుర్యోధనుడి దగ్గరికి పోయాడు. ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో, అప్పటికి యుద్ధం జరగబట్టి 18 రోజులైందని, తాను యుద్ధం చేసినందువల్ల సముద్రమంత కౌరవ సైన్యం గోవుపాదమంత అయిందని, భీష్ముడు యుద్ధంలో పడిపోయినప్పుడైనా కౌరవులు సంధి చేసుకుంటారని భావించానని, కాని వారు మూఢులని తెలుసుకున్నానని, దుర్యోధనుడు ఎంతటి వివేక హీనుడో కదా అని అన్నాడు. దుర్యోధనుడు తన ప్రాణం వున్నంతదాకా ధర్మరాజుకు రాజ్య భాగం ఇవ్వడని, కాబట్టి మిగిలిన కొంచెం పని కూడా పూర్తి చేయాలని అన్నాడు. దానికొరకు వేగంగా రథం తోలమని చెప్పాడు. ఆయన అలాగే చేయగా అర్జునుడు విజృంభించాడు.

దుర్యోధనుడు, ధృష్టద్యుమ్నుడు ఒకరినొకరు ఎదుర్కొని భీకరంగా యుద్ధం చేశారు. మరో పక్క కురుకుమారులు దుర్విషహ, దుష్ప్రదర్శన ప్రముఖులు భీముడిని ఎదుర్కోగా అతడు వారి ప్రాణాలు తీశాడు. ఇక కురుకుమారులలో దుర్యోధనుడితో పాటు మరొక తమ్ముడు మాత్రమే మిగిలారు. శ్రీకృష్ణుడు అప్పుడు రథాన్ని దుర్యోధనుడి వైపు నడిపించాడు. సహదేవుడు, భీముడు కూడా దుర్యోధనుడిని చంపడానికి పూనుకున్నారు. శకుని బాగా కోపం తెచ్చుకుని, సుశర్మతో కలిసి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడి తమ్ముడు సుదర్శనుడు భీముడిని ఎదిరించాడు. దుర్యోధనుడు సహదేవుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు త్రిగర్త వీరుడైన సత్యకర్ముడి తలను ఖండించాడు. తరువాత సత్యేషుడిని చంపాడు. సుశర్మ ప్రాణాలు తీశాడు. మిగిలిన సైన్యం పారిపోయింది. భీముడు సుదర్శనుడిని సంహరించాడు. శకుని కొడుకు ఉలూకుడు సహదేవుడి చేతిలో చచ్చాడు.

శకుని సహదేవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. సహదేవుడు శకుని గుర్రాలను, ఖండించాడు. శకుని అప్పుడు శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించగా దాన్ని కూడా ఖండించిన సహదేవుడు చివరికి బల్లెం దెబ్బతో శకుని కంఠాన్ని ఖండించాడు. దుర్యోధనుడు తన చుట్టూ శూన్యం కావడం చూసి, ఎదురుగా వున్న పాండవుల సంతోషాన్ని చూసి, యుద్ధభూమినుండి తొలగిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అప్పుడు 2000 రథాలు, 700 ఏనుగులు, 500 గుర్రాలు, 10000 కాల్బలంతో కూడిన పాండవ సైన్యంతో ధృష్టద్యుమ్నుడు ప్రకాశిస్తుంటే, దుర్యోధనుడు ఏకాకిగా మిగిలాడు. తగ్గిపోయిన సైన్యంలో వుండలేక గుర్రం దిగి దుర్యోధనుడు గద భుజాన ధరించి ఒక్కడే యుద్ధభూమి నుండి తొలగి పారిపోయాడు.

అలా ఒక్కడు కూడా తన వెంట వచ్చేవాడు లేకుండా ఏకాకిగా యుద్ధభూమినుండి వెళ్ళిన దుర్యోధనుడు ఆ ప్రదేశానికి దగ్గరగా ఈశాన్య భాగాన ఒక నీటిమడుగు వుంటే ఆ వైపునకు వెళ్లి ఆ మడుగులో దాక్కొని, విదురుడి మాటలు మనసులో తలచుకొంటూ దుఃఖాతిశయంతో విచారించాడు. కౌరవ యోధుల్లో కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, ముగ్గురు మాత్రమే బతికిపోయారు. సంజయుడు దుర్యోధనుడు పోయిన దిక్కుకు పోయి అక్కడున్న ద్వైపాయనమనే కొలను దగ్గరకు చేరాడు. దుర్యోధనుడిని చూశాడు. అతడి స్థితికి మనస్సులో దుఃఖం కలిగింది. జరిగినదంతా ధృతరాష్ట్రుడికి చెప్పమని అన్నాడు దుర్యోధనుడు సంజయుడిని.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శల్యపర్వం, ప్రథమ-ద్వితీయాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment