Saturday, August 6, 2022

కర్ణుడి మరణం తరువాత కౌరవ సర్వసైన్యాధిపతిగా శల్యుడికి అభిషేకం ..... ఆస్వాదన-83 : వనం జ్వాలా నరసింహారావు

కర్ణుడి మరణం తరువాత కౌరవ సర్వసైన్యాధిపతిగా శల్యుడికి అభిషేకం

 ఆస్వాదన-83

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-08-2022)

పదిహేడవ రోజు యుద్ధంలో కౌరవ సైన్యాధ్యక్షుడైన కర్ణుడు చనిపోయిన తరువాత చావగా మిగిలిన రాజశ్రేష్టులను తన వెంట తీసుకొని దుర్యోధనుడు తన విడిదికి వెళ్లాడు, దుర్యోధనుడు శిబిరంలోకి ప్రవేశించకుండా ఒక బహిరంగ ప్రదేశంలో బంధు మిత్ర పరిజనులతో కూర్చున్నాడు. అప్పుడు కృపాచార్యుడు దుర్యోధనుడితో, తాను క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా ఒక మాట చెప్తానని, ఆ మాటను చక్కగా విని అది శుభం అయితే ఆ ప్రకారమే చేయమని, ఇష్టం లేకపోతే మానుకొమ్మని అన్నాడు. భీష్మద్రోణకర్ణుల లాంటి మహావీరులను పాండవులు చంపగలిగారని, అది వారి దైవబలానికి, భుజ బలానికి నిదర్శనమని, కౌరవ సేన పదిహేడు రోజుల యుద్ధంలో పూర్తిగా బలహీన పడిందని, పాండవులను శ్రీకృష్ణుడు కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడని, ఒక్క అర్జునుడే మిగిలిన కౌరవుసేనను పూర్తిగా సంహరించగల సమర్థుడని, కాబట్టి శత్రువులకు ఉత్సాహం అధికంగా వున్న ఆ  నేపధ్యంలో సంధి చేసుకోవడం ఉచితమని, సంధికి సమ్మతించమని, అదే అవశ్య కర్తవ్యమని చెప్పాడు.

దుర్యోధనుడు తనను తాను రక్షించుకోవాలని, అతడు జీవించి వుంటే సర్వసంపదలు కలుగుతాయని, ధర్మరాజును మంచిగా చూడమని, ధర్మరాజు రాజ్యభాగాన్ని దుర్యోధనాదులకు తప్పక ఇస్తాడని, శ్రీకృష్ణుడు కూడా సంధిని కాదనడని, అన్నగారి మాటకు తమ్ములు ఎదురు చెప్పరని, అందువల్ల అసూయ మాని సంధి చేసుకొమ్మని, సంధి చేసుకోవడం న్యాయ సమ్మతమని కృపాచార్యుడు స్పష్టంగా చెప్పాడు. తన మాట వినక పోతే ఆ తరువాత చింతించాల్సి వుంటుందని కూడా అన్నాడు.

తన క్షేమం కోరి, తన రక్షణ కోరి, తన మీదగల స్నేహభావం వల్ల, గౌరవం వల్ల, తనను యుద్ధ నుండి వైదొలగమని, సంధికార్యం ఆచరణీయమని కృపాచార్యుడు చెప్పాడని, కాని ఆ మాటలు తనకు రుచించవని జవాబిచ్చాడు దుర్యోధనుడు. తాను మాయాజూదాన్ని కలిగించి, రాజ్యాన్ని అపహరించి, ధర్మరాజు మనసు కుంగదీసి, కౌరవ సభలో ద్రౌపదిని అవమానించి, సంధి చేయడానికి వచ్చిన శ్రీకృష్ణుడిని కాదని దుర్భాషలాడి, అభిమన్యుడిని ఒంటరిని చేసి చంపించి, ఇన్నీ జరిగిన తరువాత భీముడు దుశ్శాసనుడిని చంపి నెత్తురు తాగిన అనంతరం ఇప్పుడు సంధి అనడం తగునా అని ప్రశ్నించాడు. అది పాండవులకు భయపడి సంధికి అర్ధించడం కాదా? అన్నాడు. తనకు యుద్ధమే అవశ్య కర్తవ్యం కాని, ఒకానొకడి దయవల్ల లభించే రాజభోగాలు అవసరం లేదని, తన నిర్ణయం పాండవులతో యుద్ధమేనని, దానికి కృపాచార్యుడు కూడా అంగీకరించాలని చెప్పాడు దుర్యోధనుడు.

ఆ తరువాత కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామ, శకుని, శల్యుడు మొదలైనవారి సలహా మేరకు కురుక్షేత్రానికి రెండామడల దూరంలో వున్న సరస్వతీ నది సమీపంలో బహిరంగ ప్రదేశానికి సేనలతో సహా వెళ్లాడు. అప్పుడు కృపాచార్య ప్రభృతులు దుర్యోధనుడితో ఎవర్నైనా ధైర్యశాలిని, వ్యూహకర్తను కౌరవ సేనకు సైన్యాధిపతిగా నియమించమని సూచించారు. సేనాపతిత్వానికి అర్హుడిని నిర్ణయించమని దుర్యోధనుడు అశ్వత్థామను కోరగా, పరాక్రమ దర్పం, సంపూర్ణమైన ధైర్యం కలవాడైన శల్యుడిని సైన్యాధిపతిగా అభిషిక్తుడిని చేయమని చెప్పాడు ఆయన. దుర్యోధనుడి కోరిక మేరకు స్వంత అల్లురైన పాండవులను వదిలి కౌరవ పక్షం వచ్చాడు శల్యుడని, ఆయన కన్నా మించిన వారు, కౌరవుల హితం కోరేవారు ఎవరూ లేరని అన్నాడు. ఆ మాటలకు అక్కడున్న రాజులంతా శల్యుడిని చుట్టుముట్టి యుద్దోత్సాహంతో జయజయధ్వానాలు చేస్తూ పొంగిపోయారు. దుర్యోధనుడు సహితం శల్యుడికి నమస్కారం చేసి, భుజబలంతో విజృంభించి తనకు ఆశ్చర్యకరమైన విజయాన్ని సమకూర్చి పెట్టమని, సైన్యాధిపత్యం వహించమని ఆయన్ను ప్రార్థించాడు.  

తన విలువిద్యా నైపుణ్యాన్ని ఒక వినోద క్రీడలాగా ప్రదర్శించి తనను అందరూ మెచ్చుకునేలా యుద్ధం చేస్తానని, పాండవ కుమారులను యుద్ధంలో పారదోలుతానని, లేదా సంహరిస్తానని శల్యుడు తన ప్రతాపాన్ని చెప్పుకున్నాడు. వెంటనే దుర్యోధనుడు సంతోషించి, సరస్వతీ నదీ జలాలను తెప్పించి, శాస్త్రోక్తంగా శల్యుడిని అభిషేకించి, కౌరవసేనకు సర్వసైన్యాధిపతిని చేశాడు. ఈ విషయాలన్నీ తన వేగులవారి ద్వారా ధర్మరాజు తెలుసుకున్నాడు. శల్యుడిని కౌరవ సేనాధిపతిగా నియమించిన నేపధ్యంలో ఏంచేస్తే, ఎలా చేస్తే బాగుంటుందని శ్రీకృష్ణుడిని అడిగాడు. శ్రీకృష్ణుడు అప్పుడు శల్యుడి భుజబలాన్ని, ధైర్య సాహసాలను, పరాక్రమాన్ని వర్ణించి చెప్పి, అతడి విజృంభణాన్ని భీముడు కాని, అర్జునుడు కాని, ధృష్టద్యుమ్నుడు కాని, సాత్యకి కాని ఎదుర్కోలేరని, ధర్మరాజే అతడిని ఎదుర్కోగల సమర్థుడని అన్నాడు. ధర్మారాజు ఒకేఒక్క రోజు యుద్ధంలో శల్యుడిని సంహరించగలడని అనగానే ఆయన చెప్పినట్లే శల్యుడితో యుద్ధం చేస్తానని విజయం సాధిస్తానని ధర్మరాజు శ్రీకృష్ణుడితో అన్నాడు.

పద్దెనిమిదో రోజు తెల్లవారుతుండగానే దుర్యోధనుడు యుద్ధానికి తన సేనను సిద్ధం చేయడానికి దళపతుల దగ్గరికి సేనాధిపతులను పంపాడు. అందరి మనస్సులో రణోత్సాహం ఉప్పొంగగా చతురంగ బలాలను సమకూర్చుకున్నారు. యుద్ధ సన్నద్ధ సూచకాలైన తూర్పుధ్వనులు మోగాయి. యుద్ధ సన్నద్ధులైన శల్య, శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన కౌరవ యోధులు అంతా కలిసి ఒక ప్రదేశంలో దుర్యోధనుడితో సమావేశం అయ్యారు. తమలో ఎవరూ ఒక్కొక్కరే పాండవులను ఎదుర్కోకుండా, దృఢమైన వ్యూహంతో అందరూ కలిసి ఒక్కుమ్మడిగా ఒక్కొక్కడి మీద తలపడి పాండవుల ప్రయత్నాన్ని అణచివేయాలని నిర్ణయించుకున్నారు. అలా చేస్తే విజయం సులభంగా సంపాదించవచ్చని, ఇదే తమ శపథం అని పరస్పరం ఒట్టుపెట్టుకున్నారు. తరువాత చతురంగ బలాలు యుద్ధానికి పోయాయి.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శల్యపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment