Monday, August 1, 2022

ఆ ఊళ్ళు....ఆ రోజులు : వనం జ్వాలా నరసింహారావు

 ఆ ఊళ్ళు....ఆ రోజులు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (02-08-2022)

ఇటీవల ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో వున్న మా స్వగ్రామం వనంవారి కృష్ణాపురం సతీసమేతంగా వెళ్లి రావడం జరిగింది. చిన్నతనంలో నివసించిన 75 సంవత్సరాల క్రితం నిర్మించిన మా పాతకాలంనాటి బాగుచేయించిన ఇంటిని, తిరిగిన గ్రామాన్ని చూసిన తరువాత ఒక్కసారి బాల్యం, యవ్వనం తొలినాళ్లు, అలనాటి తీపి జ్ఞాపకాలు ఒకటి వెంట మరొకటి గుర్తుకొచ్చి అదో రకమైన మధురమైన అనుభూతి కలిగింది. ఆ అనుభూతిని, రాతల్లో వర్ణించడం సాధ్యపడదు. గ్రామాలలో ఆ రోజులు మళ్లీ రావు కదా అనిపించింది.  

మా గ్రామం, ఆ వూళ్లోని కొఠాయి (రచ్చబండ), మా ఇల్లు, ఇంటి ముందున్న స్థలంలో తెలతెలవారుతుండగానే శుభ్రం చేసి కలాపు నీళ్లు చల్లడం, కచ్చడం బండ్లు, పెంట బండ్లు, మేనాలు, వరి పొలాలు, మల్లె తోటలు, మామిడి తోటలు, మిరప, మొక్క జొన్న తోటలు, తోటలలోని మోటబావులు, జొన్న చేలు, చేలలోని దోసకాయలు, మంచె, అరకలు, ఎద్దులు, పాడి పశువులు, మేకలు, వరి గడ్డి వాములు, మంచి నీళ్ల బావులు, బావుల పక్కన నిమ్మ, అరటి చెట్లు, ఇంటి వెనుక ఉదయాన్నే చల్ల చిలికే ప్రక్రియ, వెన్న పూస తినడం, ఉదయాన్నే చద్ది అన్నం తినడం, పల్లెల్లో వూరగాయ కారాలు పెట్టడం, సాయంత్రం ఇంటి ముందు నీళ్లు చల్లి నవారు, నులక మంచాల మీద పడుకోవడం,  వచ్చిపోయే బంధువులతో కబుర్లు, ఇలా ఎన్నో. ఎన్నెన్నో విషయాలు సినిమా రీళ్లలా గుర్తుకు రాసాగాయి.

మా చిన్నతనంలో గ్రామాల్లో పంచాయతీ తీర్పులు అమోఘంగా వుండేవి. అన్నీ పదిమంది సమక్షంలోనే జరిగేవి. పెద్ద మనుషులిచ్చిన తీర్పుకు తిరుగు లేదు. న్యాయస్థానాలలో మాదిరిగా "అపీల్" లేదు. ఒక సారి పెద్ద మనుషులు తీర్పు చెప్పారంటే ఆ గ్రామంలోని ఎవరైనా సరే బద్ధులై పోవడమే! పెద్ద మనుషులుగా వ్యవహరించిన వారిలో గ్రామంలోని వెనుకబడిన వర్గాలకు, దళితులకు చెందిన ఒకరిద్దరు కూడా వుండేవారు.

         బతుకమ్మ పండుగ వచ్చిందంటే అందరికీ సంబరమే! దసరాకు, ఊరూ-వాడా, వూరి బయట మైదానంలో పాతిన జమ్మి చెట్టు దగ్గర గుమిగూడే వారు. రామ చిలుక దర్శనం చేసుకునే వారు. దీపావళికి అంతా సంబురమే. ముక్కోటి ఏకాదశికి జొన్న పంట "వూస బియ్యం" తయారయ్యేవి. జొన్న కంకులలోంచి అవి కొట్టుకుని వుడకబెట్టుకుని తింటుంటే బలే సరదాగా వుండేది. గ్రామంలో ముస్లింలు హిందువులు కలిమిడిగా అట్టహాసంగా జరుపుకునే పండుగ "పీర్ల పండుగ". వూర్లో  "పీర్ల గుండం" వుంది. దాన్నిండా కణకణలాడే నిప్పులు పోసి, ఆ నిప్పుల్లోంచి పీర్లను ఎత్తుకునే వ్యక్తులు నడిచి పోతుంటే బలే గమ్మత్తుగా వుండేది.

వ్యవసాయపు పనులు వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియతో మొదలయ్యేవి. మొదలు ఎవరింటిలో వారి పాడి పశువుల వల్ల పోగైన పెంటను తోలే వారు. అదనంగా కొందరు పొలాలు లేని వారి దగ్గర నుంచి పెంట ఖరీదు చేసి కొని పొలాలకు తోలే వారు. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణగానే జరిగేది. యాదవుల (గొల్లలు) "జీవాలను" (గొర్రెలు) పొలాలలో రాత్రింపగళ్లూ వుంచేవారు.

అప్పట్లో రసాయనిక ఎరువుల వాడకం అలవాటు దాదాపు లేదనే అనాలి. చెరువు పూడిక తీసి మట్టిని పొలాలకు తోలే వారు. తెల్లవారు జామునుంచే పెంట బండ్లను కట్టే ప్రక్రియ మొదలయ్యేది. మధ్యాహ్నం పన్నెండు (రెండు జాములు అనే వాళ్ళు) గంటల సమయం వరకు తోలి ఇళ్లకు తిరిగి వచ్చి, భోజనం చేసి ఎడ్లకు దానా వేయడం, నీళ్లు పెట్టడం లాంటివి చూసుకునేవారు. ఆ సంవత్సరానికి కావాల్సిన వ్యవసాయ పనులకు సంబంధించిన వాటిని ఒక గంట-రెండు గంటల పాటు చూసుకునేవారు. మళ్లీ నాలుగు గంటల ప్రాంతంలో పెంట బండ్ల కార్యక్రమం మొదలయ్యేది. వెన్నెల రోజుల్లో రాత్రుళ్లు కూడా బండ్లు తోలేవారు.

తొలకరి వానలు మొదలవ్వగానే పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో, దంతెలతో దున్నడం జరిగేది. వర్షాలు కురిసే తీరుతెన్నుల ఆధారంగా పొలం పనులలో మార్పులు చేర్పులు జరుగుతుండేవి. వర్షాలు ఆగుతే మిగిలిన పెంటను తోలడం కొనసాగించేవారు. వేరు శనగ, అందులో కంది పంటలు వేసే వారు. చెరువులకు నీళ్లు రావడం జరుగుతే వరి నాట్లు, ఆ తరువాత జొన్న పంట వేసే వారు. వరి నాట్లు వేయడానికి ముందర పొలాన్ని నాగళ్లతో, బురద నాగళ్లతో దున్నడం జరిగేది. వరి నాట్లు మహిళలే పాటలు పాడుకుంటూ, హుషారుగా వేసేవారు.

నాట్లు పడ్డ తరువాత దశలవారీగా పొలాలకు నీరు పెట్టడం జరిగేది. వరి కొంత పెరిగిన తరువాత కలుపు తీయడం జరిగేది. మూడు-నాలుగు నెలల తరువాత కోతల సీజన్ ఆరంభమయ్యేది. కోయడం, గూళ్లు వేయడం, సమయం చూసుకుని, వాతావరణం అనుకూలించినప్పుడు నూర్పిడి చేయడం, తూర్పార పట్టడం, చివరకు వరి ధాన్యాన్ని ఇంటికి తోలడం జరిగేది. నాటు కూలి, కోత కూలి, ఇతర కూలి అంతా ధాన్యం రూపేణగానే. ఎకరానికి ఐదారు కుండల ధాన్యం కూలీగా వుండేది.

వేరు శనగ పంట విత్తనాలు తయారు చేయించే ప్రక్రియతో మొదలయ్యేది. విత్తులు తీసేటప్పుడు వచ్చిన పప్పుతో శనగ నూనె చేయించి ఉపయోగించే వారు. వర్షాలు పడగానే, భూమిని దున్ని అదను కుదిరినప్పుడు "ఎద" పెట్టే వారు. ఒకడు ఎద గొర్రు తోలుతుంటే, పక్కన నడుచుకుంటూ మరొకరు, శనగ విత్తులను, భూమిలోకి గొర్రు పైభాగంలోంచి భూమిలో పడేలా పోసేవారు. శనగ విత్తులతో పాటు కంది విత్తనాలు కూడా ఒక పద్దతి ప్రకారం ఎద పెట్టాలి. శనగ పంట ముందు చేతికొస్తుంది. ఆ తరువాత రెండు నెలలకు కంది పంట వస్తుంది. శనగ విత్తనాలు మొలకెత్తిన నెల రోజుల తరువాత పై పాటు చేయాలి. ఇది కూడా కష్టమైన పనే. ఎద్దుల కాళ్ల కింద మొక్కలు నలిగి పోకుండా, అరక కింద చెట్లు పడ కుండా తోలాలి. మూడు నెలల తరువాత శనగ మొక్కలను భూమి నుంచి పీకించి కాయలను వేరు చేసేవారు. మరో రెండు నెలలకు కంది కళ్ళం వేసి ఆ పంటను కూడా తెచ్చుకునే వారు.  

ఇక మరో పంట జొన్న. వీటినే పచ్చ జొన్నలనే వారు. దీనికి కూడా ఎద పెట్టడం వుంటుంది. జొన్న పంట తయారైన తరువాత కోసి, కట్టలు కట్టించే వారు. కూలీ కింద కట్టలనే ఇచ్చే వారు. ప్రతి ఐదు కట్టలకు ఒక కట్ట కూలీ కింద పోయేది. ఇక ఆ తరువాత జొన్న గూడు వేయించడం, కంకి కోయించి తొక్కించడం, తూర్పార బట్టడం, ధాన్యాన్ని ఇంటికి-మార్కెట్‌కు చేర్చడం జరిగేది. రైతులు చేస్తుండే వ్యవసాయానికి ప్రతిఫలంగా పుట్ల కొద్దీ వడ్లు (పుట్టికి 75 కిలోల బరువుండే ఎనిమిది బస్తాలు), జొన్నలు, వేరు శనగ, కందులు, పెసలు, ప్రతి ఏటా పండేవి. ఇప్పటిలాగా కేవలం వడ్లు మాత్రమే పండించే వారు కాదు.

ఈ పంటలకు తోడు మిరప తోట, మధ్యలో బంతి పూల చెట్లు వేసే వారు. తోటలో మోట బావి వుండేది. మోట తోలడం కష్టమైన పనే. మోట తోలడానికి కట్టిన ఎద్దులను వెనుకకు నడిపించుకుంటూ, భావి ముందరకు తీసుకెళ్లాలి. భావిలో మోట బక్కెట్ (చాలా పెద్దగా వుంటుంది) పూర్తిగా మునిగి నీరు నిండే లాగా ఎద్దులను వెనక్కి తేవాలి. అప్పుడు మునిగి-నిండిన బకెట్ పైకి రావడానికి ఎద్దులను ముందుకు తోలాలి. బకెట్ కట్టిన తొండం లోంచి నీరు భావిదగ్గరున్న కాలువలో పడి ప్రవహించుకుంటూ మిరప చెట్లను తడుపుకుంటూ పోతుంది.

అలానే పొగాకు పంట కూడా వేసే వారు. మొక్క జొన్న వేసే వారు. దినుసు గడ్డలు, వుల్లి గడ్డలు కూడా సాగు చేసేవారు. క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లాంటి కూరగాయలతో సహా ఎన్నో రకాల కూరగాయలను కూడా పండించేవారు కొందరు. ఇక మామిడి తోట సరేసరి. జొన్న చేలల్లో పప్పు దోసకాయలుండేవి. అవి అక్కడనే కొడవలితో కోసుకుని, మంచెపైకెక్కి కూచుని తినే వారు చాలామంది. జొన్న వూస బియ్యం కూడా కొట్టించుకుని, పలుకు రాళ్ల నిప్పులో వేడి చేసుకుని తినే వారు. చేనులో దొరికే పెసలు తినే వారు.

ప్రతి పంటకు "పరిగ" అని వుండేది. పొలాలలో పంటను రైతు తీసుకెళ్ళిన తరువాత, పొలంలో మిగిలిన దాన్ని "పరిగ" అంటారు. వార్షిక కూలీ మీద ఆధారపడి జీవించే పాదరక్షలను తయారు చేసే వారు, పొలాలకు నీరు పెట్టే నీరుకాడు, బట్టలుతికే వాళ్లు, సమాచారాన్ని ఒక వూరి నుంచి ఇతర గ్రామాలకు తీసుకెళ్ళే మనిషి, ఈ పరిగ తీసుకుంటారు. పరిగ కూడా చాలా మోతాదులోనే వుంటుంది ఒక్కో సారి.

సంక్రాంతికే పంటలు ఇంటికి చేరేవి. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది. ధాన్యం కొలవడానికి ఉపయోగించే "కుండ" లు, "మానికలు", "తవ్వలు" "సోలలు", "గిద్దెలు" వూరి రైతుల వద్ద వుండేవి. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో కాని, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. ఇప్పటిలాగా విత్తనాలు కొనుక్కొనే అలవాటు లేదు.

ఆశ్చర్యకరమైన విషయం, పంట కోసినప్పటి నుంచి, ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది రూపాయల విలువ చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో పడి వుండేది. రైతుకు అభధ్రతా భావం వుండకపోయేది. పొలంలో కల్లం పూర్తైన తరువాత, వూళ్లోని కొంత మందికి "మేర" అని ఇచ్చే ఆచారం వుండేది. గ్రామంలోని కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, నీరుకాడు, షేక్ సింద్....ఇలా కొద్ది మందికి కల్లంలో కొంత ధాన్యం వారు ఏడాది పొడుగూ చేసే పనులకు ప్రతిఫలంగా ఇవ్వడం ఆనవాయితీ.

ఇంటి వాకిలి శుభ్రం చేయడానికి పొడగాటి కందికట్టె చీపురు (పొలికట్టె) ఉపయోగించేవారు. కలాపి జల్లే నీళ్లలో పశువుల పేడను కలిపేవారు. ఇంటి వెనుక "చల్ల” చిలికేవారు. ఒక గుంజకు "కవ్వం" కట్టి తాడుతో పెరుగు చిలికి చల్ల చేసేవారు. ఎండాకాలంలో ఉదయాన్నుంచే చల్ల ముంచుకుని తాగే వారు. వెన్న పూస కూడా తినే వారు. వెన్న పూస నుంచి "నెయ్యి" తయారు చేసేవారు.

ప్రయాణాలకు కచ్చడం బండి ఉపయోగించేవారు. ఇది చిన్నగా వుంటుంది. కచ్చడం బండి పైన ఒక గుడిసె లాంటిది అమర్చి వుంటుంది. లోపల కూర్చోవడానికి చిన్న నులక మంచం ("చక్కి"), ముందర బండి తోలేవాడు కూచోవడానికి "తొట్టి" వుంటుంది. సామానులు చక్కి కింద అమర్చే వారు. ఎక్కువలో-ఎక్కువ ముగ్గురు-నలుగురు కంటే అందులో కూర్చోవడం కష్టం. వాటికి కట్టే ఎద్దులు కూడా చిన్నవిగానే వుంటాయి. ప్రయాణానికి పోయే ముందర వాటిని అందంగా అలంకరించేవారు. ముఖాలకు పొన్న కుచ్చులు”, “ముట్టె తాళ్లు”, మెడకు మువ్వలు-గంటలు”, బండి చిర్రలకు (ఎద్దుల మెడపై బండి "కాణీ" వేసినప్పుడు అది జారి పోకుండా రెండు చిర్రలు అమర్చే వారు) గజ్జెలు, ఎద్దుల మెడలో వెంట్రుక తాళ్లు, నడుముకి టంగు వారు అలంకరించేవారు. ఎద్దులను అదిలించడానికి తోలేవాడి చేతిలో "చండ్రకోల" వుండేది.

వడ్రంగి వ్యవసాయ పనిముట్లయిన "అరకలు", "నాగళ్లు", "బురద నాగళ్లు", "దంతాలు", "బండి రోజాలు" లాంటివి తయారు చేస్తుంటే బలే ముచ్చటగా వుండేది. బండి చక్రాలకు రోజాలను అమర్చడం చాలా కష్టతరమైన పని. ఇనుముతో తయారు చేసిన రోజాను కొలిమిలో కాల్చి, అది ఎర్రగా వున్నప్పుడు, చక్రానికి తొడిగేవారు. అలానే బండి "ఇరుసు" తయారు చేసే విధానం కూడా చాలా కష్టమైంది.

ఇప్పుడు అంతా యాంత్రీకమైపోయింది. పాడి పశువులు లేవు. ఎరువు తోలడం లేదు. చెరువు మన్ను తోలడం లేదు. అంతా రసాయన ఎరువులే. నూటికి తొంబై మంది వరి పంట మాత్రమే వేస్తున్నారు. పునాస పంటలు దాదాపు లేనట్లే. ఒకనాడు సమృద్ధిగా గ్రామాల్లో లభించే పాడి ఇప్పుడు లేదు. గ్రామాల వారు కూడా బస్తీల నుండి పాల పాకెట్లు కొనాల్సిన పరిస్థితులు. మిషన్ భగీరథ నీళ్లకు అదనంగా మినరల్ వాటర్ కొంటున్నారు కొందరు. వ్యవసాయ పనిముట్లు దాదాపు లేనట్లే. ఎక్కడ చూసినా ట్రాక్టర్లే. రచ్చబండలు లేవు. పాత రోజుల నాటి పెద్దమనుషుల తీర్పులు లేవు. ఇంటి ముందు కలాపి చల్లడం లేనే లేదు. ఎద్దుల బండ్లు దాదాపు లేవు. ప్రతి గ్రామంలో స్కూటర్లు, కార్లు, మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, పెట్రోల్ బంకులు అనేకం వున్నాయి. పొలాలకు ఎవరూ నడిచి పోవడం లేదు. ఏదో ఒక వాహనం ఉపయోగిస్తున్నారు చాలా మంది. బహుశా మున్ముందు ట్రాఫిక్ సమస్యలు కూడా రావచ్చు. వీటితో పాటు ఒకప్పుడు లేని కాలుష్యం పెరిగింది. విత్తనం వేయడం దగ్గర నుండి పంట ఇంటికి వచ్చేదాకా మానవ వనరుల అవసరం ఏమాత్రం లేకుండా పోయింది. పాతకాలం నాటి పద్ధతులు పూర్తిగా మారాయి. గ్రామాలలో ఆరోజులు మళ్లీ తిరిగి రావు!

1 comment:

  1. చదివిన ప్రతివారూ తమతమ చిన్ననాటి జ్ఞాపకాలను తడుముకునేలా అద్భుతంగా రాశారు. 🙏🙏
    సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా వాడడం ఒక్కటే పరిష్కారం అనుకుంటా..

    ReplyDelete