Thursday, August 11, 2022

యోధుల కలల సాకారం : వనం జ్వాలా నరసింహారావు

 యోధుల కలల సాకారం

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (12-08-2022)

స్వాతంత్ర్య సముపార్జన కావించుకుని 75 సంవత్సరాల సుదీర్ఘ ఘనచరిత్రను లిఖించుకోవడం భారతీయులందరికీ గర్వకారణం.  ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రతీ భారత పౌరుడు అలనాటి త్యాగధనుల కీర్తి ప్రతిష్టలను వేనోళ్ల కొనియాడుకుంటూ వారందించిన సేవలను, ఫలాలను పొందుతూ ముందుకు సాగుతున్న అపూర్వ ఘడియలివి.

           ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 75 యేండ్ల స్వతంత్ర భారత  వజ్రోత్సవ  కార్యక్రమాన్ని 15 రోజుల పాటు అపురూపంగా, ఆనందంగా నిర్వహించుకోవాలనే  సత్సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ముందుకు సాగుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహింపబడుతున్న వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలను ఆస్వాదించే అదృష్టం వర్తమాన కాలంలో వున్న మనందరి అదృష్టం.

             ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారత దేశం పరిఢవిల్లుతున్నది. భారత స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆనాడు వారు పొందుపరిచిన ప్రజాస్వామిక, లౌకిక వాద, సహకార సమాక్యవాద విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుని మీద ఉన్నది. భారత దేశం భిన్న సంస్కృతులతో, విభిన్న భాషలు, మతాలు, ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాలతో అత్యున్నత ప్రాపంచిక సార్వజనీన విలువలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి విలక్షణమైన సాంస్కృతిక జీవన విధానం ఆపాదించబడింది.

              తెలంగాణ ప్రభుత్వం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో అనూహ్య ప్రగతిని సాధించి, అనేక రంగాలలో కీర్తి పతాకాలను ఎగురవేసింది. ఈ ఘనత, ఈ చరిత దార్శనిక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే చెందుతుంది. ఈ వజ్రోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న నేపథ్యంలో సుజలాలు, సుఫలాలు పొందుతూ, సస్యశ్యామలంగా, సుభిక్షంగా, సమృద్ధిగా రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని ప్రతి భారతీయుడితో పాటు ప్రతి తెలంగాణ వ్యక్తి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారనడంలో సందేహం లేదు.

        వ్యవసాయ రంగంలో, సాంకేతిక రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో అధునాతన ఆవిష్కరణలు అందిపుచ్చుకొని, అంచెలంచెలుగా ఎదుగుతూ, విజేతలుగా నిలుస్తూ దేశానికే రోల్ మోడల్ గా పురోభివృద్ధి చెందేందుకు తమ వంతు సేవలు అందించిన ప్రతీ ఒక్కరి పాత్ర గర్వకారణంగా భావించాల్సిన తరుణమిది.

     పిల్లల నుండి పెద్దల వరకు ఈ వేడుకలలో భాగస్వాములను చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతూ, ఉత్తేజపరుస్తూ అనేక కార్యక్రమాల రూపకల్పన చేయటం అభినందనీయం. జాతీయ నేతల విగ్రహాలకు, నివాళులు అర్పించడం, తగు రీతిన అలంకరించటం, జాతీయ గీతాలాపన, ఫ్రీడమ్ రన్-ఫ్రీడం పార్కుల నిర్వహణ, దీప నీరాజనం, జాతీయ సమైక్య రక్ష బంధనం, కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, ముగ్గులపోటీలు, పుస్తక ప్రదర్శనలు, వివిధ క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రోగులకు సేవలు, బీటింగ్ రిట్రీట్, ర్యాలీలు నిర్వహిస్తూ జాతీయ భావన నింపుతూ, స్ఫూర్తి ప్రదాతలుగా అందరినీ సమాయత్తం చేయటం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ధర్మో రక్షతి రక్షితః అన్న సూత్రం పాటిస్తూ మహాత్ముడు నడయాడిన అహింసా మార్గాన్ని అనుసరిస్తూ, సోదర భావాన్ని పంచుతూ వసుదైక కుటుంబంలా కలిసి శాంతి సహజీవనం కావించడానికి పునరంకితం అవుదాం. ఆ దిశగా పయనిద్దాం.

         స్వాతంత్ర్య సముపార్జన అనంతరం యావత్ భారత జాతి స్వశక్తితో ఉన్నత  శిఖరాలను అధిరోహించడం మన ఉనికిని చాటడం, మన ఉన్నతిని విశ్వవ్యాప్తం కావించడం హర్షణీయం. ఇదే స్ఫూర్తిని, కీర్తిని, ప్రతిభని, విశ్వాసాన్ని పంచుకుంటూ, పెంచుకుంటూ ముందుకు సాగాలనీ,ఇటువంటి శత, సహస్ర ఉత్సవాలు అనేకంగా నిర్వహించు కుంటూ ఆ పథంలో నూతనోత్సాహంతో ముందుకు సాగాలని అందరం కోరుకోవాలి. ఈ వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు చైతన్య దీపికలై ఉత్సాహం నింపుతూ, పరవళ్ళు తొక్కాలి.  

దేశవ్యాప్తంగా అంబరాన్నంటే సంబరాలతో కోటి జండాల పండుగ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభవేళ శాంతి, సహనం, సౌభ్రాతృత్వాలను పెంపు చేసుకుంటూ, పక్షం రోజులపాటు తెలంగాణ తిరంగా  తోరణాలతో కోలాహలంగా వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని  ప్రతీ ఒక్కరికీ మనఃపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా మహాత్ముడిని, స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఒకింత స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కనీస బాధ్యత.  

బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1600 సంవత్సరంలో రాయల్‌ చార్టర్‌ ద్వారా జరగడంతో మన దేశంలో ఆంగ్లేయుల పాలనకు అంకురార్పణ మొదలైంది. పదిహేడవ శతాబ్ది ఆరంభానికల్లా, వాణిజ్యపరంగా పటిష్ఠమైన స్థితికి చేరుకున్నారు ఆంగ్లేయులు. ఔరంగజేబు పతనంతో చోటుచేసుకున్న అనిశ్చిత స్థితి భారతదేశంలో బ్రిటీష్ ఆధిపత్యానికి మార్గం సుగమం చేసింది. ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వారికి మధ్య సుదీర్ఘంగా జరిగిన పోరాటంలో విజయం సాధించిన బ్రిటన్ భారత దేశంలో అధికారానికి చేరువై, 1857 నాటి సిపాయిల తిరుగుబాటు నాటికి పట్టు సాధించింది. తిరుగుబాటు తదనంతరం, బ్రిటన్ లోని ప్రభుత్వం, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన స్థానంలో, నేరుగా పాలన సాగించాలని నిర్ణయం జరిగింది. వాస్తవానికి, సిపాయిల తిరుగుబాటు పూర్వ రంగంలోనే, ఒక మోస్తారు సాంస్కృతిక విప్లవం, భారతావనిలో వేళ్లూనుకోవడమే కాకుండా, రాజకీయ చైతన్యానికి కూడా బీజాలు పడ్డాయి.  

1885 లో లార్డ్ డఫరిన్ ఆశీస్సులతో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగింది. ఆదిలోని కాంగ్రెస్ మితవాద భావాల అధినాయకత్వం ఒక వైపు బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే, మరొక వైపు, పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేకతకు పునాదులు వేయ సాగింది. స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. ఉద్యమకారులపై ప్రభుత్వ దమన కాండ తీవ్రతరమైంది. పంజాబ్ నుంచి లాలా లజపత్ రాయ్, సర్దార్ అజిత్ సింగ్ ల బహిష్కరణ, బాల గంగాధర తిలక్, అరబిందో ఘోష్ ల నిర్బంధం, బెంగాల్ విభజన వ్యతిరేక ఆందోళన, భారత జాతీయోద్యమానికి పునాదులు బలంగా నాటాయి.

ప్రధమ ప్రపంచ సంగ్రామంలో బ్రిటన్ కూరుకుపోయిన సమయంలోనే, పూనా కేంద్ర కార్యాలయంగా, పూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా హోం రూల్ లీగ్ స్థాపించిన తిలక్ దేశ వ్యాప్తంగా పర్యటించి, దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉద్యమించాలని చేసిన విజ్ఞప్తికి అన్నీ బీసెంట్ సహకారం లభించింది. ఇంతలో, మహాత్మా గాంధి నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమం బలపడ సాగింది. ఆయన "అహింస" నినాదంతో దూసుకు పోయారు. దక్షిణాఫ్రికాలో ఆపాటికే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గాంధీ ఉద్యమించారు. ఆయన బాంబేలో కాలుపెట్టిన వెనువెంటనే, జాతీయోద్యమానికి నాయకత్వం వహించమన్న నినాదం మొదలైంది. ఈ లోపుగానే, రౌలట్ చట్టం తీసుకొని వచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం, విచారణ జరపకుండా, రాజకీయ ఖైదీలను శిక్షించి, జైలుకు పంపించే అధికారాన్ని ప్రొవిన్షియల్ ప్రభుత్వాలకిచ్చింది. ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమానికి పిలుపిచ్చారు మహాత్మా గాంధి.

పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ లో జనరల్ డయ్యర్ జరిపించిన దారుణ-మారణ కాండలో వేలాదిమంది మరణించారు. దరిమిలా, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు మహాత్మా గాంధి. ఆబాల గోపాలం మద్దతు లభించిందా ఉద్యమానికి. లక్షలాది మంది ప్రజలు, తారతమ్యాలు మరిచి, ఒక్క మాట మీద నిలబడి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. అయితే, చౌరీచౌరా సంఘటనలో పాతిక మంది పోలీసులు ప్రజాగ్రహానికి గురై చంప బడడంతో, గాంధి ఉద్యమాన్ని నిలుపుదల చేశారు. అయినా ఆయన తిరుగులేని నాయకత్వం కొనసాగింది. ప్రజల హృదయాల్లో ఆయనపై నున్న అభిమానం చెరిగిపోలేదు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధి మొదలెట్టేందుకు సంపూర్ణ మద్దతు లభించి, స్వతంత్రం పొందే దిశగా కదిలేందుకు దోహద పడింది.

అనుకున్న రోజునే, సబర్మతీ ఆశ్రమం నుంచి, ఉప్పు సత్యాగ్రహం కొరకు "దండి" యాత్ర గాంధీ సారధ్యంలో మొదలైంది. దాన్నంత పెద్దగా పట్టించుకోవద్దుకున్న బ్రిటీష్ ప్రభుత్వానికి ఉద్యమం ఉధృతం అవగాహనైంది. అరెస్టుల పర్వం మొదలైంది. గాంధి, త్యాబ్జీ, సరోజినీ నాయుడులను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులెవరు హాజరు కాకపోవడంతో, నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ గాంధీజీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇరువురి మధ్య సమావేశం జరిగింది. గాంధి-ఇర్విన్ ఒప్పందం దరిమిలా రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు గాంధి. నిరాశతో స్వదేశానికి రావడం మినహా ఒరిగిందే మీ లేదు. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో ఆంగ్లేయులకు మద్దతిచ్చి, ప్రతిఫలంగా, సంపూర్ణ స్వరాజ్యం పొందాలని భావించడం జరిగింది. ఇంతలో, పాకిస్తాన్ ఏర్పాటు తన లక్ష్యంగా ప్రకటించాడు జిన్నా. యుద్ధానంతరం డొమైన్ హోదా కల్పిస్తామని బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గాంధి తిరస్కరించడంతో 1947 వరకు పరిష్కారం దొరకని స్థితికి పరిస్థితులు చేరుకున్నాయి.

గాంధీజీ నాయకత్వంపై ప్రజలు, యావత్ భారతావని, అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. ఆయన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమానికి, విజయమో-వీర స్వర్గమో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. నాటినుంచి కౌంట్ డౌన్ మొదలైంది. స్వాతంత్ర్యం సిద్ధించే సూచనలు కనపడ సాగాయి. 1946 లో లార్డ్ మౌంట్ బేటన్ ఢిల్లీకి రావడంతో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో నేర్చుకున్న పాఠాలతో భారత దేశాన్ని వదిలిపెట్టి పోవాలన్న నిర్ణయానికొచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. హఠాత్తుగా వదిలిపెట్టకుండా, అధికార మార్పిడికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను మౌంట్ బేటన్ కు అప్ప చెప్పిన బ్రిటీష్ ప్రభుత్వం, భవిష్యత్ లో భారత దేశంతో సత్సంబంధాలు కొనసాగేట్లు చూడమని సూచించింది. విభజన తప్పని పరిస్థితులు అప్పటికే చోటు చేసుకున్నాయి.

అశేష ప్రజానీకం ఎదురు చూసిన రోజు ఆనంద-విషాదాల మధ్య రానే వచ్చింది. ఆగస్టు పదిహేను 1947 అర్థ రాత్రి ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగింది భారత దేశానికి. మరో రెండు రోజులకు పాకిస్తాన్ మరో స్వతంత్ర దేశంగా ఏర్పాటవడంతో భారతావని రెండుగా చీలిపోయింది. చీలిక కోరుకున్న వారిలోను, కోరుకోని వారిలోను, ఎందరో తమకిష్టం వున్నా-లేకపోయినా, తర-తరాలుగా తాముంటున్న ప్రదేశాలను వదిలి, సుదూరంగా వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి.

బ్రిటీష్ సామ్రాజ్యం యొక్క అణచివేత పాలన నుండి విముక్తి పొందిన తరువాత, భారత జాతీయ జెండాను స్వతంత్ర భారతదేశం తొలి ప్రధాన మంత్రి పండిట్ నెహ్రూ ఎగురవేశారు. ఢిల్లీలోని ఎర్రకోట లాహోరీ గేట్ పైన జెండా రెపరెప లాడింది. మన దేశాన్ని విముక్తి చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన మన స్వాతంత్ర్య సమరయోధులు, నాయకుల త్యాగాలను స్మరించుకోవడానికి ప్రజలు కలిసి రావడంతో ఆగస్ట్ 15 ను దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా  గర్వంగా జరుపుకుంటున్నాము.

నిత్య నూత నోత్తేజ, శ్వేత, హరిత, సింధూర శోభిత త్రివర్ణ  తోరణాల నడుమ స్వేఛ్ఛవాతావరణం లో విజయదుందుభి మోగిస్తూ సాగే పథం లో పాదం కలుపుతూ పయనించే వారందరికీ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల శుభాకాంక్షలు.

No comments:

Post a Comment