Sunday, August 14, 2022

ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కాంచినాడు : స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు

 ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కాంచినాడు

స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు

(ఈ కింది గీతాన్ని స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా 1972 ఆగస్టు 15, అర్థరాత్రి 12 గంటలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ పి. వి. నరసింహారావు గారు శాసనసభా భవనంలో తమ సందేశంగా వినిపించారు.)

ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కాంచినాడు

ఒళ్లు విరిచి, కళ్లు తెరిచి వోహో అని లేచినాడు

కటిక చీకటుల చిమ్మెడు కారడివిని పయనించు

నిజ జఠరాగ్ని జ్వాలల నింగినంత లేపినాడు

అదుగో, హిమనగమిచ్చిన అశ్రు తర్పణమ్మనగా,

కడుపుమంట సెగ ఆవిరి గంగానది చేసినాడు,

యుగ యుగాల అన్యాయం నగుమోముల దిగమ్రింగగ

సాంధ్యారుణ రౌద్ర క్షితజముఖుడై చెలంగినాడు

వాడొక విప్లవ తపస్వి, మోడుపడిన కాయముల

వాడిన నెమ్మనముల, సర్వం కోల్పోయిన దళ గళముల

వాడి చెడిన చూపుల, బువ్వకు నోచని జనగణముల

వెతల బరువు మోసి మోసి విల్లుకు వంగిన నడుముల

జరాహటములై కృశించు జవ్వనంపు వల్లకాళ్ళ –

అన్నిటినీ కాయకల్పమా తపస్సు చేసినాడు.

నవరసార్ధ్ర జీవితాల, నవోన్మేష మానసాల

నవ పల్లవ తరుశాఖల రవళించెడు పూజనాల

నవవిధ భక్తుల, రక్తుల, నవశక్తుల మేళవించి

నవ నిర్మిత జాతి సంతరించినాడా విప్లవ తపస్వి,

పావు శతాబ్దము పొడుగుల పాలకుల, అర్భకుల మధ్య

విభజన వికృతమై పోవగ, బావురమనే జీవితాలు-

అటు సమృద్ధి, ఇటు దైన్యము, అటు పెంపు, ఇటు హైన్యము

ఒకడు మింటికెగయ అసంఖ్యకు లింకిరి భూతలమున,

అర్భకుని భుజాన మోయు అమ్మ, వాని పడద్రోయ

దారి చూపు కాగడాలు  తలకొరివిగ పరిణమింప,

ధర్మకర్తలే ధనకర్తలుగా మారిపోయినారు

పావు శతాబ్దము పొడవున – వెలుగు నీడలలాగాను

దాగిలి మూతలనుచు తలంచ

వెలుగు ముక్కు విదిచెను నీడల నలుపు తిరస్కరించి

తంత్రీనాదముల చెలిమి తరగదంచు భావించ

ఈ నిద్రాణ నిశీధిని

ఈ నీరవ వాయు తరంగిణిలో ఒరపిడివడి

దొర్లిన భావస్ఫుల్లింగములు వెలుగునిచ్చునా?

అటులని విశ్వసించునా పథికుడు?

మృగ జలమును జలమని నమ్మి చనిన ఆ చిర పిపాసి

శీతోదక సేవనమున సేదదీరునా నేటికి?

మిన్నుమన్ను కలిసి చెలిమి చెన్నారెడు శివ సుందర సీమ,

వన్నెనంచు సంతసించ వచ్చునా పాంథుడు?

భూమి దానవ గ్రహమైపోవ రోదసిని మధంచి

మానవతా వాహనకై పూనుకున్న రాజ్యేందిర

జయదుందుభి విని ఉత్తేజనము పొందునా పౌరుడు?

మోదమలరని చెర అరలో మూల్గిన భావ కిశోరికి

విహారయ స్వేచ్ఛాంతరిక్ష వీధిని లభ్యమవునా?

అవునని, అవునౌనౌనని జనవాక్యము

తనువులు పులకెత్త ప్రతిధ్వనిత్యమయ్యె మన కంఠము

శాశ్వతమై నిలచెడు ప్రశ్న పరంపర ఇది

పృచ్ఛకుడెవడో ? ఇవ్వగ జాలెడు నెవడో సమాధానము? నాకేల?

విహంగమున కాకనంపు కొలతలేల?

చిన్న అలకు ఒడ్డు దూరమున్నదన్న చింత ఏల?

దీపము పెనుగాలికి భీతిల్లనేల?

జీవితాత్మకు ఎన్నడు బ్రహ్మము

చేరుదునన్న సందియమ్మదేల?

నేనొక చైతన్యోర్మిని

నిస్తుల ప్రగతి శకలమును

ఇది నా సంతత కర్మ

మరే హక్కులు లేవు నాకు

ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ

వెలుగుటయే నా తపస్సు

వెలిగించుట నా ప్రతిజ్ఞ!

(పీవీ గారి కూతురు, ఎమ్మెల్సీ, శ్రీమతి సురభి వాణీదేవి గారి సౌజన్యంతో)

No comments:

Post a Comment