Sunday, August 28, 2022

గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టిన భీమసేనుడు, బలరాముడి నిరసన .... ఆస్వాదన-86 : వనం జ్వాలా నరసింహారావు

 గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టిన భీమసేనుడు, బలరాముడి నిరసన

ఆస్వాదన-86

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (28-08-2022)

గద భుజాన ధరించి ఒక్కడే యుద్ధభూమి నుండి తొలగి పారిపోయిన దుర్యోధనుడు తన మాయా శక్తితో ద్వైపాయన అనే మడుగులోపలికి పోయి తన శరీరానికి నీరు తగలకుండా సంస్తంభన విద్యతో వున్నాడు. కొద్ది దూరంలో సంజయుడు వున్నాడు. అప్పుడు కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలు అక్కడ తిరుగుతూ సంజయుడిని చూసి, కురురాజు ప్రాణాలతో వున్నాడా ? అని అడిగారు. దుర్యోధనుడు కొలనులో దాగి వున్న సంగతి చెప్పాడు సంజయుడు వారికి. పాండవులు అటు వస్తున్న అలికిడి విని, నలుగురు కలిసి కృపాచార్యుడి రథం మీద కౌరవుల గుడారానికి వెళ్లారు.

         ఇంతలో అటువైపుగా వచ్చిన యుయుత్సుడు ఆడువారిని హస్తినాపురానికి తీసుకుపోవడం ఉచితమైన పనని అనుకున్నాడు. యుయుత్సుడు మంచి ఆలోచన చేశాడని ధర్మరాజు అన్నాడు. యుయుత్సుడు రథారూఢుడై రాజాంతఃపుర కాంతలను రక్షించే అధికారులను కలిసి, వారితో సహా తాను కూడా ఆ స్త్రీలను ఓదార్చి, హస్తినాపురంలో ప్రవేశించారు. ఆ సమయంలో విదురుడు ఎదురుగా వచ్చి జరిగిన విషయం అంతా విని దుఃఖంతో కలతచెందాడు. యుయుత్సుడిని చేసిన మంచి పనికి పొగిడాడు. ఆ తరువాత విదురుడు అంతఃపురం చేరాడు. యుద్ధరంగంలో కౌరవ సైనికులు పూర్తిగా పలచబడ్డారు.

         పాండవులు ససైన్యంగా దుర్యోధనుడిని వెతుక్కుంటూ ఆ చోటుకు వచ్చారు. వారిని గమనించిన కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలు మరొక చోటుకు పోయారు. వచ్చిన పాండవులు దుర్యోధనుడి కొరకు అనేక దిక్కులలో వెతికారు కాని అతడు కనిపించనందున చింతిస్తూ వెళ్లిపోయారు. వారు వెళ్లిన అనంతరం సంజయుడు ఆ కొలను దగ్గరికి వెళ్లాడు. కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలు దుర్యోధనుడితో సంభాషించారు. కొలను నుండి బయటకు రమ్మని, పాండవ సంహారానికి నడుం బిగించమని, ఆయన చేతుల్లో పాండవ సైన్యం క్షీణిస్తుందని, గెలిస్తే భూమిని పాలించవచ్చని, చనిపోతే స్వర్గ సుఖాలు అనుభవించవచ్చని, మడుగులో దాక్కోవడం ఆయన లాంటి వీరులకు మంచిది కాదని అన్నారు. తన శరీరానికి తగిలిన బాణాల దెబ్బల వల్ల నొప్పి కలిగి చాలా దాహంగా వున్నదని, తన మనసు తన వశం తప్పుతున్నదని, అందువల్ల ఆరోజు ఆగుతే శక్తి తెచ్చుకుని మర్నాడు యుద్ధం చేసి శత్రువులను జయిద్దాం అన్నాడు రారాజు. తన వాడి బాణాలతో పాంచాలురు అందరినీ చంపికాని తాను కవచాన్ని విడువనని, తన మాట నమ్మమని, దైన్యాన్ని ముగిస్తానని అశ్వత్థామ అన్నాడు దుర్యోధనుడితో.

       అదే సమయంలో ఆ కొలనులో నీరు తాగడానికి వచ్చిన భీముడి బోయవారు పక్కనే రాజుకు, కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలకు మధ్య జరుగుతున్న సంభాషణ విని, అక్కడే దుర్యోధనుడు ఉన్నాడని నిశ్చయించుకున్నారు. బోయలు వెంటనే ఆ విషయాన్ని ధర్మరాజుకు చేరవేయాలని నిర్ణయించుకుని వెళ్లి భీముడికి చెప్పారు. భీముడు తనకు బోయవారు తెలియచేసిన విషయాన్ని అన్న ధర్మరాజుకు చెప్పి, దుర్యోధనుడు తనకు తెలిసిన ఒక క్షుద్ర విద్య కారణంగా శరీరానికి నీరు తగలకుండా ద్వైపాయన కొలనులో దాగి ఉన్నాడని అన్నాడు. వెంటనే ధర్మరాజు ఆ వైపుకు వెళ్లాడు. ఆయన వస్తున్న కోలాహలం విన్న కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలు దుర్యోధనుడి అనుమతి తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు. పాండవులు అటు వైపుకు రారని, హస్తినకు వెళ్తారని, ఒకవేళ వచ్చినా తాను ఆ కొలనులో వున్న విషయాన్ని తెలుసుకోలేరని, తెలుసుకున్నా తనను చేరలేరని, ఆ మడుగులో నిర్భయంగా వుంటానని దుర్యోధనుడు పోతున్న వారితో అన్నాడు. అలా అంటూ అంతవరకు బయటున్న దుర్యోధనుడు తనకు వచ్చిన స్తంభన విద్య సహాయంతో జలంలో ప్రవేశించాడు. సంజయుడు మాత్రం ఆ దగ్గరలోనే ఒక పొదలో దాగి వున్నాడు.

         ఇంతలో పాండవులు అక్కడికి వచ్చారు. శ్రీకృష్ణుడి సూచన ప్రకారం ధర్మరాజు కొలను దగ్గర నిలబడి, దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, అతడికి అలాంటి నీచమైన స్థితి తగదని, ఆయన కొరకు అనేకమంది రాజులు చనిపోయారని, నీళ్లలో మునిగి ఉన్నంత మాత్రాన చావు తప్పుతుందా? అని అన్నాడు. దుర్యోధనుడిని శూరుడని అంటారని, అలాంటప్పుడు కొలనులో దూరడం ధర్మమా అని, ఆయన అభిమానం ఎక్కడికి పోయిందని, యుద్ధంలో రాజులు వెనుకంజ వేయవచ్చా అని, కౌరవ వంశంలో పుట్టిన అతడు నీచమైన చావును తెచ్చుకుంటున్నాడని, ఆయన కీర్తిని, గొప్పతనాన్ని శత్రు సమూహం నవ్వే విధంగా చేస్తావా అని ధర్మరాజు ఎద్దేవా చేశాడు. భయాన్ని వదిలి, యుద్ధానికి సిద్ధమై, మగతనంతో చావో, జయమో ఒకటి నిశ్చయించుకొమ్మని, వెంటనే విజృంభించి ఎదుర్కొమ్మని, దుర్యోధనుడు యుద్ధంలో తమను ఓడిస్తే భూమండలం అంతా పాలించవచ్చని, చనిపోతే స్వర్గలోక సుఖాలు పొందవచ్చని, దాక్కుంటే అవమానమని చెప్పాడు.

         జవాబుగా దుర్యోధనుడు, తాను రథాలు, గుర్రాలు, సారథి లేనివాడినని, అస్త్రశస్త్రాలు లేని వాడినని, సేవకులు, స్నేహితులు ఎవరూ లేరని, దెబ్బల వల్ల కలిగిన బాధ వల్ల వెంటనే యుద్ధానికి తలపడలేకున్నానని, అందువల్లే తప్పుకున్నానని, అలసట తీర్చుకుని యుద్ధానికి సిద్ధమవుతానని అన్నాడు. తాను ఎవరి కొరకు రాజ్యాన్ని ఆశించాడో, ఆ కుమారులు, తన తమ్ముళ్లు లేరని, అలాంటప్పుడు యుద్ధం చేయడం ఎందుకని, ప్రపంచాన్నంతటినీ ధర్మరాజే ఏలుకొమ్మని, తనకిక యుద్ధం వద్దని, భూమినంతా ధర్మరాజుకు ఇచ్చానని, తాను శాంతంగా అడవులకు వెళ్లి నారచీరెలు కట్టుకుని తపస్సు చేసుకుంటానని ధర్మరాజుతో అన్నాడు దుర్యోధనుడు.

         అధిక ప్రేలాపనలు మాని యుద్ధానికి లెమ్మన్నాడు ధర్మరాజు. దుర్యోధనుడు ఇచ్చిన దానంతో తాను రాజు కావడానికి అంగీకరించనని, యుద్ధంలో అతడిని చంపి భూమిని పాలిస్తానని, ఒకవేళ భూమిని ఇచ్చినా అతడిని చంపక మాననని, కాబట్టి యుద్ధం చేయమని అన్నాడు ధర్మరాజు. ఆ పరుషపు మాటలకు స్పందనగా దుర్యోధనుడు, తాను ఒక్కడినే అని, పాండవులు సేనతో సహా వున్నారని, తాను ఆయుధాలు లేనివాడినని, తాను ఏవిధంగా యుద్ధం చేయాలని ప్రశ్నించాడు. అలా ఒకవైపు అంటూనే, మరోవైపు, తానొక్కడినే ధర్మరాజును, అయన తమ్ములను, సాత్యకిని, ద్రౌపది అన్నదమ్ములను రూపుమాపుతానన్నాడు. అలా అందర్నీ చంపి భీష్మద్రోణాదివీరుల ఋణాన్ని తీర్చుకుంటానన్నాడు. అప్పుడు ధర్మరాజు, యుద్ధంలో తమ పక్షాన దుర్యోధనుడిని ఒక్కడే ఎదిరిస్తాడని, అతడిని ఓడించగలిగితే రాజ్యాన్నంతా అతడే గ్రహించి దాన్ని అనుభవించవచ్చని అన్నాడు. దుర్యోధనుడికి కావాల్సిన అస్త్రశస్త్రాలను తీసుకోవచ్చని కూడా చెప్పాడు.

         రథాల మీద చాలా యుద్ధం చేశానని ఇక గదా యుద్ధం చేస్తానని అన్నాడు దుర్యోధనుడు. అలా అంటూనే దుర్యోధనుడు విజృంభించి, జలస్తంభన స్థితిని వదిలేసి, నీటి మడుగు అల్లకల్లోలం చేసి, గదాదండాన్ని తన భుజం మీద పెట్టుకొని బయటకు వచ్చాడు. తన భుజబలం మెరుస్తుంటే పాండవులందరిని భూమ్మీద పడగొట్టి తన గద బలాన్ని ప్రదర్శిస్తానని అన్నాడు. అయితే ఒక్కరొక్కరే యుద్ధానికి రమ్మని ధర్మరాజుతో అన్నాడు. తమ ఐదుగురిలో ఒకడిని మాత్రమే యుద్ధానికి ఎంచుకోమని చెప్పాడు ధర్మరాజు. అలా అంటూనే దుర్యోధనుడికి అవసరమైన కవచాలను ఇచ్చాడు. వాటిని ధరించాడు దుర్యోధనుడు.

         ధర్మరాజు కోరిక ప్రకారం, శ్రీకృష్ణుడి సూచన మేరకు భీముడు దుర్యోధనుడితో గదా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శ్రీకృష్ణుడు భీముడికి ఆతడు చేసిన ప్రతిజ్ఞలు గుర్తుచేసి దుర్యోధనుడిని ఓడించడం అతడికి ఒక లెక్కా అన్నాడు. భీముడికి జయం కలిగేట్లు మాట్లాడాడు. సాత్యకి, ఇతర పాంచాల కుమారులు భీముడిని ప్రోత్సహించారు. భీముడు గదను చేత ధరించి దుర్యోధనుడిని ఉద్దేశించి గతంలో తమకు చేసిన అవమానాలను జ్ఞప్తికి తెచ్చాడు. ఆ ఇద్దరు వీరులు వీరోద్రేకాలతో విజృంభించి ఒకరినొకరు చూసుకున్నారు.

         సరిగ్గా అదేసమయంలో తన శిష్యులైన భీమ దుర్యోధనుల గదా యుద్ధాన్ని చూడడానికి బలరాముడు వచ్చాడు. ఆయన్ను అప్పుడు అక్కడ చూడగానే అంతా నమస్కరించారు. బలరాముడు రాగానే దుర్యోధనుడి మనస్సు వికసించింది. ముఖంలో సంతోషం కనిపించింది. ఆ తరువాత దుర్యోధనుడి కోరిక ప్రకారం పాండవులు, దుర్యోధనుడు ద్వైపాయన కొలను విడిచి శమంతపంచకం చేరారు. ఆ ప్రదేశంలో దుర్యోధన భీమసేనులు భయంకర గర్జనలతో, పెనుగర్వంతో ఒకరికెదురుగా ఇంకొకరు నిలిచారు. స్పష్టమైన కంఠంతో దుర్యోధనుడు భీముడిని యుద్ధానికి పిలిచాడు. తాను యుద్ధానికి సిద్ధంగా వున్నానని, ఇక తన చేతికి చిక్కిన దుర్యోధనుడు ఎక్కడికీ పోలేడని అన్నాడు. ఆ సమయంలో భూగోళం వణకింది. 

         ఇరువురి మధ్యా సమతల యుద్ధం సాగింది. భీమసేన దుర్యోధనుల మధ్య గదా యుద్ధం జరిగింది. ఇరువురూ ఆశ్చర్యకరంగా పోరాడారు. లాఘవంగా కొట్టుకున్నారు. పౌరుషంతో యుద్ధం చేశారు. ఇద్దరి శరీరాలలో గాయాలు తగలగా ఆ గాయాలనుండి కారే నెత్తురు వల్ల కాసేపు సోమ్మసిల్లినప్పటికీ, గదలను చేతులు మార్చుకుంటూ పోరాడారు ఇద్దరూ. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ భీమ, దుర్యోధనుల బలాబలాలలో వున్న తేడాను విశ్లేషించాడు. శారీరకమైన బలమున్న భీముడు, నేర్పు, ఉపాయం కల దుర్యోధనుడి దెబ్బలకు నొచ్చుకుంటున్నాడని, కాబట్టి ధర్మ యుద్ధంలో దుర్యోధనుడిని జయించడం కష్టమని అన్నాడు. మోసం వున్న వైరులను మోసపు విధానంతోనే చంపడం తగినదని అన్నాడు. జూదం ఆడినప్పుడు భీముడు దుర్యోధనుడి తొడలు విరుగగొట్టుతానని శపథం చేశాడని, అందువల్ల ప్రతిజ్ఞ పేరుతో బొడ్డు కింది భాగంలో (అధర్మంగా) తొడలు విరిచి చంపడం తప్ప వేరే ఉపాయం లేదని అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ సమయంలో భీముడు తనవైపు చూసినప్పుడు అర్జునుడు తొడలు చేత్తో చరిచాడు.

         అర్జునుడి సైగను అర్థం చేసుకున్న భీముడు, అన్యాయమైనా తొడలు విరుగ గొట్టమన్న శ్రీకృష్ణుడి సలహాను వేరే దారి లేకపోతే అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. భీమ దుర్యోధనుల గదా యుద్ధం భీకరం కాసాగింది. అప్పుడు భీమసేనుడు సందు చూసి, భయంకరమైన వజ్రపుదెబ్బతో దుర్యోధనుడి తొడలు విరిగి కూలేట్లుగా మిక్కిలి వేగంగా తన గదతో కొట్టాడు. ఆ సమయంలో పెద్ద తోకచుక్కలు నేలరాలాయి. గద దెబ్బతో తొడలు విరిగి కూలబడ్డ దుర్యోధనుడిని, ‘నీచాత్ముడా అని సంభోదిస్తూ, భీముడు, ద్రౌపదిని సభలో అవమానం చేసినందుకు తగిన ఫలం అనుభవించమని తన ఎడమ పాదంతో అతడి తలను గట్టిగా తన్నాడు. అంతటితో ఆగక గదను చేతిలో తీసుకుని భీమసేనుడు దుర్యోధనుడి మెడను అదిమిపట్టి, తలను మరోమారు తన్నాడు. అది చూసిన ధర్మరాజు అలా చేయడం అధర్మమని భీముడితో అన్నాడు. దుర్యోధనుడి స్థితిని చూసి ధర్మరాజు అతడి వల్ల ఎంత నాశనం జరిగిందని దుఃఖించాడు.

         భీమసేనుడు చేసిన పనికి విపరీతంగా కోపించిన బలరాముడు నాగలి భుజం మీద పెట్టుకుని భీముడి వైపు నడిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నగారికి అడ్డంగా పోయి భీముడు కౌరవ సభలో చేసిన ప్రతిజ్ఞను గుర్తుచేసి, అలా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడం క్షత్రియ ధర్మమని చెప్పాడు. మైత్రేయ మహాముని శాపాన్ని కూడా గుర్తుచేసి, దాని కారణంగా భీముడి గదాఘాతానికి దుర్యోధనుడి తొడలు విరుగవలసి వున్నదన్నాడు. అలా చేయడం అధర్మం కాదన్నాడు. ‘కపటపు గెలుపు గెలిచిన భీముడు ప్రశంసలు పొందుతాడుగాక!’ అని, ‘ధర్మపరుడైన దుర్యోధనుడికి పుణ్యలోకాలు కలుగుతాయి అని అంటూ బలరాముడు వెళ్లిపోయాడు అక్కడి నుండి. అక్కడున్న వారు భీముడిని అనేకవిధాలుగా పొగిడారు. తొడలు విరిగి పడిన దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని ఆక్షేపించి మోసపూరితుడని, పాపాత్ముడని నిందించాడు.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శల్యపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment