సోమరుల్ని పెంచే ఉచితాలు కావు, సమర్థుల్ని చేసే సంక్షేమం!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (23-08-2022)
హైదరాబాద్
నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ ఖిల్లా మీద 75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవాల
సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి, ఆహుతులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రజా
సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అనీ, కేంద్రం ఆ బాధ్యతను
సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ‘ఉచితాలు’ అనే పేరును
తగిలించి అవమానించడం గర్హనీయమని నిశితంగా విమర్శించారు. సహకార సమాఖ్య స్ఫూర్తి
అంటూ ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికార కేంద్రీకరణకు
పాల్పడుతూ, రాష్ట్రాలు ఇస్తున్న సంక్షేమ ఫలాలను ఉచితాలని
ఎద్దేవా చేస్తూ, వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నదని
హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలని ఉచితాలని కొట్టిపారేయడం అసమంజసమనీ అన్నారు.
ముఖ్యమంత్రి
కేసీఆర్ వ్యాఖ్యలకు బలీయమైన కారణం ప్రధాని మోదీ ఇటీవల ఉచిత పథకాల మీద
ఎక్కుపెడుతున్న విమర్శలే. నైరాశ్యంలో కూరుకుపోయిన కొన్ని రాజకీయ పార్టీలు ఉచిత
పథకాలతో రాజకీయాలు చేయాలని చూస్తున్నాయని, అలాంటి చర్యలు మన పిల్లల భవిష్యత్తుకు ప్రతిబంధకంగా
నిలుస్తాయని, స్వయంసమృద్ధిని అడ్డుకుంటాయని మోదీ ఒక సభలో
అన్నారు. దేశ రాజకీయాల్లోంచి ఈ ఉచితాల సంస్కృతిని తొలగించాలని, ఇది దేశాభివృద్ధికి ప్రమాదకరమని మోదీ హెచ్చరించారు.
ప్రజల
సంరక్షణ, సామాజిక
అభ్యున్నతి, ఆర్థికాభివృద్ధి దిశగా కీలకపాత్ర పోషిస్తూ
శ్రేయోరాజ్యాన్ని స్థాపించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. ఈ సిద్ధాంతానికి
అనుగుణంగా, పౌరులందరికీ సమానావకాశాలు కల్పిస్తూ, సదుపాయాలు అందరికీ సమానంగా అందేలా చూస్తూ, పౌరుల్లో
బాధ్యత పెంచుతూ, ప్రజలు మెరుగైన జీవనాన్ని సాగించేందుకు
వీలుగా అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
సిద్ధాంతం. శ్రేయోరాజ్యం నమూనాకు మూల సిద్ధాంతకర్త గ్రేట్ బ్రిటన్‌కు చెందిన
ఉదారవాద ఆర్థికవేత్త సర్ విలియమ్ బెవరిడ్జ్. ఆయన 1942 నవంబరులో బ్రిటిష్
పార్లమెంటుకు ఒక నివేదిక సమర్పించారు. అందులో ఆయన ప్రభుత్వాలు తమ కర్తవ్యంగా
భావించాల్సిన సామాజిక భద్రత విధానాన్ని ప్రతిపాదించారు. ఆనాడు బెవరిడ్జ్ తన
శ్రేయోరాజ్యం నివేదికలో పొందుపరచిన అభిప్రాయాలు ఇప్పటికీ ఆధునిక సంక్షేమ
రాష్ట్రానికి వేదిక కల్పించేవిగా పరిగణిస్తున్నారు.
బెవరిడ్జ్
సూచించినదానికన్నా మెరుగైన విధానాలనే తెలంగాణలో కె. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా
ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. తెలంగాణలోని
అల్పాదాయ, నిరుపేద,
మధ్యతరగతి వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం
సంక్షేమ కార్యక్రమాలను రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమం ప్రధాన లక్ష్యం ఈ
వర్గాల వారి జీవన నాణ్యతను, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.
వృద్ధులు, అంగవికలురు, విద్యార్థులు,
రైతులు, శ్రామికులు, వృత్తి
ఉద్యోగులు వంటి నిరుపేదలు, బడుగులకు సంక్షేమ సాయం
అందించడమనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం.
ప్రజాస్వామ్యంలో
ప్రజలకు అనేక ఆశలు, ఆశయాలు,
ఆకాంక్షలు, అవసరాలు, కోరికలు,
సమస్యలు ఎన్నో ఉంటాయి. ప్రభుత్వపరంగా వివిధ పథకాల ద్వారా ఒక
లబ్ధిదారుడుగా పొందాల్సినవి కూడా ఎన్నో ఉంటాయి. వీటి నేపథ్యంలోనే ఐదేళ్లకోసారి
జరిగే ఎన్నికల్లో ఇవి నెరవేర్చగలరని భావించిన పార్టీనే ఎన్నుకుని అధికారం
కట్టబెడతారు. వీటికి అదనంగా రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు ఫలానా మంచి జరగాలని
భావించి, ఎన్నికల మేనిఫెస్టోలో తదనుగుణమైన వాగ్దానాలు చేస్తాయి.
ప్రజలు ఓటు వేసేటప్పుడు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తామెన్నుకున్న
ప్రభుత్వం తమ అవసరాలను తీర్చే విషయంలో కానీ, ఎన్నికల్లో
చేసిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కానీ ఏమాత్రం ఉదాసీనత కనపర్చకూడదనీ ప్రజలు
ఆశిస్తారు. ప్రతి పథకం అమలుకూ ఎన్ని విధాల వీలుంటుందో, అన్ని
విధాల చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు, ప్రభుత్వాన్ని
అభినందిస్తారు. మళ్లీ మళ్లీ గెలిపిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలలో వాగ్దానాలు చేయడం,
అధికారంలోకి వచ్చాక అవి అమలు చేయడం రాజకీయ పార్టీల కనీస కర్తవ్యం.
అలాకాకపోతే తదుపరి ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని ఎదుర్కోవాలి.
తెలంగాణ
రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ,
బీసీ, మైనా రిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల్లో సహజంగానే
పేదరికం అధికం. వీరంతా రోజువారీ పనులు చేసుకుని కడుపు నింపుకొనేవారే. ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి వసతి లేక వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైపోవడంతో
రైతులు కూడా పేదరికం అనుభవించాల్సిన దుస్థితి ఉండేది. అప్పట్లో రోజూ ఆకలి చావులే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆకలి చావులనేవి ఉండకూడదని, పూర్తి
జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అందుకే, దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిఏటా వేలాది కోట్ల రూపాయలతో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ
పథకాలతో పేదలకు జీవన భద్రత ఏర్పడింది. వారు పస్తులుండాల్సిన పరిస్థితి తప్పింది.
అతి తక్కువ సమయంలోనే దేశంలో మరెవ్వరూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు
చేస్తూ, తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగం
సృష్టించింది. ఇలా చేయడాన్ని ఉచితాలని ప్రధాని ఎద్దేవా చేయడం సమంజసమేనా?
అమ్మ
ఒడి, మధ్యాహ్న
భోజన పథకం, ఫీజు రీయింబర్సుమెంట్, పోస్ట్
మెట్రిక్ స్కాలర్ షిప్పులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ
రెసిడెన్షియల్ కళాశాలలు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీం,
ఎకానమిక్ సపోర్ట్ పథకం, సబ్సిడీతో గొర్రెల
పంపిణీ, చేపపిల్లల పంపిణీ, ఆసరా
పెన్సన్లు, ఉచితంగా పేదలకు డబుల్ బెడ్రూము ఇళ్ళు, రైతుబంధు, రైతు బీమా, దళిత
బంధు, నేతన్నకు బీమా, వ్యవసాయానికి
ఉచితంగా నాణ్యమైన విద్యుత్, రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బలహీనవర్గాల
విద్యార్థులకు గురుకులాలు, కేసీఆర్ కిట్స్, ఆరోగ్యలక్ష్మి... ఇలాంటి పథకాలన్నీ ప్రజల సంక్షేమానికే కదా? ఇవి ఉచితాలా?
అభివృద్ధి
కార్యక్రమాలకు తోడుగా, సంక్షేమం
కూడా ఉండాలి. అణగారిన వర్గాల అభివృద్ధితోనే అసలుసిసలైన అభివృద్ధి సాధ్యమని సీఎం
పదే పదే అంటుంటారు. సంఘటిత అభివృద్ధితోనే బహుళార్థ ఫలితాలు సాధించగలం. ఆ విధంగానే
అణగారిన వర్గాల వారికి ఆర్థికంగా పలు అవకాశాలు దక్కుతాయి. తద్వారా వారికి సాధికారత
లభిస్తుంది. వారూ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన
నాటినుండి ఈ దిశగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తెలంగాణ
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అట్టడుగు వర్గాల వారిని అభివృద్ధిలో
భాగస్వాములుగా చేసి, వారికి సాధికారతనిచ్చేవే. ఇవి ఉచితాలెలా
అవుతాయి?
తెలంగాణ
రాష్ట్రంలో రూపకల్పన జరిగి, వివిధ
స్థాయిల్లో అమల్లో ఉన్న వందలాది ప్రభుత్వ సంక్షేమ పథకాలు దారిద్ర్యరేఖ దిగువన
జీవనం సాగిస్తున్న బడుగు బలహీన వర్గాల ప్రజల వెన్నంటి ఉంటూ వారి జీవితాల్లో వెలుగు
రేఖలు నింపుతున్నాయి. తల్లి గర్భం దాల్చిన నాటి నుండి, తల్లీ
బిడ్డల సంరక్షణతో మొదలుకొని, వారికి సరైన పౌష్టికాహారం
అందిస్తూ, ఆ బిడ్డ విద్యాబుద్ధులు నేర్చే సమయంలోనూ, ఉన్నత చదువుల నేపథ్యంలోనూ, పెళ్లినాటి
వేడుకల్లోనూ... ఇలా జీవిత పర్యంతం ఈ పథకాలు వారికి తోడుంటున్నాయి. భారతదేశంలోని ఏ
రాష్ట్రంలోనూ, గతంలోనూ, వర్తమానంలోనూ
ఇలా జరగలేదు. ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్న ఈ సంక్షేమ పథకాలను ఏ కోశానా
ఉచితాలని అనడానికి వీల్లేదు. వాస్తవానికి ఇలాంటివి యావత్ భారతదేశంలో తక్షణమే అమలు
కావాలి.
తెలంగాణాలో
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల శ్రేయస్సుపై శ్రద్ధ వహిస్తూ, వారి దీర్ఘకాలిక ప్రయోజనాలే
ధ్యేయంగా, సంపద సృష్టి దిశగా పథకాలన్నింటికీ రూపకల్పన
చేశారు. ఆయన రూపొందించిన పథకాలన్నీ ఒకవైపు తక్షణ ప్రయోజనాలను సమకూరుస్తూనే,
మరోవైపు శాశ్వతంగా, స్వయంచాలకంగా ఉపాధి
కల్పనకు బాటలు వేశాయి. ఈ దిశగా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేళ్ళకు పైగా అపారమైన సంపద
సృష్టించడం జరిగింది. ఇవేవీ ఓట్ల కోసం అమలు చేసే ఉచిత పథకాలు కాదు. ప్రజలకు జీవన
భద్రత కలిగించే బహుళార్థసాధక సంక్షేమ పథకాలు. విమర్శించే ముందు మోదీ ఇది
గుర్తించాలి!
జ్వాలా గారూ, చాలా చక్కగా వ్రాసారు. హైదరాబాద్ నగరం సంపదను వర్షిస్తోంది - దానికి కారణం ఎవరో అందరికీ చక్కగా తెలుసును. నిజాంప్రభువులు తప్ప హైదరాబాదుకు ఎవరూ ఏమీచేయలేదని ప్రకటించిన పెద్దమనిషి ఆసంపదను నిస్సిగ్గుగా వాడుకుంటున్నారు కదా. కాని ఆయనను మీరెంతగా ఆకాశానికి ఎత్తి పొగుడుతున్నా ఆయన అపారమైన అప్పులు తప్ప ఏమీ సృష్టించటం లేదన్నది నిజం కాదా? సంక్షేమపధకాలకూ ఉచితతాయిలాలకూ అంతరం ఈయనకే తప్ప ఇంకెవరికీ తెలియదనే మీఅభిప్రాంలాగా ఉందే! మీకు ఉద్యోగమే ఈభజన కావచ్చును. కానీ కన్ను పోయేంత కాటుకలాగా ఈభజన వలన ఆయనకు మరింత నష్టం తప్ప మరేమీ ఉపయోగం ఉండదు.
ReplyDelete