Thursday, August 11, 2022

పాలనా సంస్కరణలు ఏమైనట్టు? : వనం జ్వాలా నరసింహారావు

 పాలనా సంస్కరణలు ఏమైనట్టు?

వనం జ్వాలా నరసింహారావు

సాక్షిదినపత్రిక (11-08-2022) 

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంగా సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రతి ఐదు సంవత్సరాలకొక సారి, లేదా, ఒక్కొక్క సారి కొంచెం ముందు వెనుకగా లోక సభకు ఎన్నికలు జరగడం ప్రభుత్వాలు మారడం చూస్తూనే వున్నాం. ప్రతిపక్షంలో వున్నప్పుడు అధికార పార్టీని విమర్శించడం, అధికారంలోకి వచ్చిన తరువాత అదే తప్పు చేయడం పరిపాటి అయిపోయింది. కేంద్రంలో అధికారంలో ఎక్కువ కాలం వున్న కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ లేదా వాటి సారధ్యంలోని కూటములు అవలంభిస్తూ వస్తున్న ఈ ‘బ్లేం గేం’ అవిచ్చిన్నంగా సాగుతూనే వున్నది.     

పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయత, ప్రజా సంక్షేమం, పౌర సౌకర్యాలు, అభివృద్ధి అనే మాటలను స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ సారధ్యంలోని ప్రభుత్వం కాని తరచుగా చెప్పిన సందర్భాలు అనేకం. పాలనలో పారదర్శకత ఉట్టిపడేందుకు, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు, పాలనాపరమైన సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటిస్తూ స్వతంత్ర భారతంలో మొదటి 50 సంవత్సరాలలో 45కు పైగా కమిటీలు, కమిషన్లు అనేక సూచనలు, సిఫారసులు చేశాయి. అవన్నీ అమలులోకి వచ్చాయా అన్న విషయాన్ని అటుంచితే ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న నేపధ్యంలో ఇప్పటికైనా ఆ కమిటీలు, చేసిన సూచనలు, సలహాలను క్రమానుగతంగా సింహావలోకనం చేయాల్సిన అవసరం వుంది.

స్వతంత్ర భారత తొలి ప్రభుత్వం 1947లో "సెక్రటేరియల్ రీ-ఆర్గనైజేషన్ కమిటీ” ని నియమించింది. తదనంతరం అన్నిస్థాయిల్లో చోటుచేసుకుంటూ, అందరిని అప్పటికే కలవరపరుస్తున్న అలనాటి అవినీతి ప్రభావాన్ని తగ్గించుకోవటానికి జరిగిన తొలి ప్రయత్నమే 1948లో ఏర్పాటైన "ఎకానమీ కమిటీ". ప్రభుత్వ యంత్రాంగ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి టాటెన్ హామ్ అనే బ్రిటిష్ పాలనా నిపుణుడు రూపొందించిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సచివాలయ వ్యవస్థాగత నిర్వహణకు గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ 1949లో కొన్ని సూచనలు చేసింది. ప్రణాళికా సంఘం 1950లో ఏర్పాటైంది. వెన్వెంటనే ఎ.డి. గొరాడియా కమిటీని నియమించారు. ఈ కమిటీ సమర్పించిన రెండు నివేదికల ఆధారంగా 1951లో పాలనా పరంగా చేపట్టవలసిన సంస్కరణల గురించి విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. ఇవి సాధించిందేమిటనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా!

అయ్యంగార్ నివేదికపై ఆర్.ఎ. గోపాలస్వామి 1952లో "ప్రభుత్వ యంత్రాంగం-సామర్ధ్యం పెంపుదల" పేరుతో ఒక నివేదిక సమర్పించారు. ఈ నివేదికను ఏలినవారు గోప్యంగా ఉంచారు. అమెరికన్ నిపుణుడు పాల్ ఏపెల్ బీ 1953-54లలో వరుసగా సమర్పించిన రెండు నివేదికలు మన పాలనా సంస్కరణలలో మైలు రాళ్లుగా ప్రశస్తిని పొందాయి. అశోక్ చందా కమిటీ 1954లో సమర్పించిన "ప్రాజెక్టుల పూర్తి లో జాప్యాన్ని అరికట్టేందుకు అవసరమైన బడ్జెటరీ-ఆర్ధిక నియంత్రణల మార్పులు" అన్న నివేదికపై కేంద్ర మంత్రి మండలి అసలు చర్చించనేలేదు.

దరిమిలా అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి చింతామణి దేశ్ ముఖ్ ఆర్థికపరమైన సంస్కరణలను అధ్యయనం చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు, 1962 లో సంతానం కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 1964లో సమర్పించిన నివేదికపై పార్లమెంటులో విశేష చర్చ జరిగింది. అంతేకాక ప్రభుత్వోద్యోగులలో ప్రకంపనలు సృష్టించింది. కేంద్రమంత్రులకు ప్రవర్తనా నియమావళి ఉండాలని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటుచేయాలని గాంధేయవాది అయిన సంతానం సూచించారు. దరిమిలా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. అలా జరగడం కొంతలో కొంత నయమే!

ప్రజాస్వామ్య వ్యవస్థను స్థానికంగా ఎదుర్కుంటున్న సమస్యలను సిబ్బంది పనితీరుకు సంబంధించిన వివిధ అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ప్రణాళికా సంఘం 1960లో వి.టి. కృష్ణమాచారి కమిషన్ ఏర్పాటు చేసింది. కృష్ణమాచారి 1962లో సమర్పించిన నివేదికలోని అన్ని సిఫారసులను ప్రభుత్వం అంగీకరించింది. ప్రజల ఆర్ధిక-సామాజికాభివృద్ధి అవసరాలకు అనుగుణంగా పనిచేయగల రీతిలో ఐ.ఎ.ఎస్. అధికారాల విస్తరణ జరగాలని, తదనుగుణంగా శిక్షణ ఇవ్వాలని కృష్ణమాచారి కమిషన్ సూచించింది. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, సాంకేతిక సిబ్బంది సమన్వయంతో పనిచేయాలనీ, సహకారోద్యమం-సామాజికాభివృద్ధి కార్యక్రమం కలిసి పురోగమించాలని కూడా కృష్ణమాచారి సూచించారు.

ప్రభుత్వ పాలనా వ్యవస్థ పనితీరును కూలంకషంగా అధ్యయనం చేసి, అది మరింత సమర్ధంగా పనిచేసేందుకు తగు సూచనలివ్వడానికి 1966లో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన "అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్"(ఇదే మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్)ను నియమించారు. మొరార్జీ ప్రభుత్వంలో చేరిన దరిమిలా, ఆ కమిషన్‌కు కె. హనుమంతయ్య నేతృత్వం వహించారు. 20 అధ్యయన బృందాలు, నాలుగు నిపుణుల బృందాలు, ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుచేసిన ఈ కమిషన్ నాలుగేళ్లు శ్రమించి 500కు పైగా సిఫారసులతో 20 నివేదికలను సమర్పించింది. రాజీవ్‌గాంధీ హయాంలో మాత్రమే ప్రభుత్వ సిబ్బందికి శిక్షణావశ్యకత అనే అంశం పాలనా సంస్కరణల్లో అతి ముఖ్యమైన అంశమని గుర్తించారు.

1980ల తొలినాళ్ళలో లక్ష్మీకాంత్ ఝా నేతృత్వంలో ఆర్ధిక పరిపాలనా సంస్కరణల కమిషన్ ఏర్పాటైంది. ప్రభుత్వ ప్రాధమ్యాలు నియంత్రణ నుంచి అభివృద్ధి దిశగా మార్పుచెందాలని ఝా సూచించారు. 1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమవడంతో పాలనా సంస్కరణలకు సంబంధించి కూడా ప్రభుత్వ దృక్పథంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలో ఆర్ధిక క్రమశిక్షణ నెలకొల్పడానికి తగు సూచనలిచ్చేందుకు జాతీయ అభివృద్ధి మండలి, 1992లో అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూపట్ణాయక్ అధ్యక్షతన, ఒక కమిటీ నేర్పాటుచేసింది. ఉద్యోగులకిచ్చే కరవుభత్యాన్ని స్తంభింప చేయాలన్న సిఫారసుని పాటించకపోవడంతో బిజూ ఆ కమిటీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను కమిటీ నొక్కి చెప్పింది.

1997 మేలో పాలనా సంస్కరణల దిశగా మరో కీలకమైన ప్రయోగానికి అంకురార్పణ జరిగింది. అప్పటి ప్రధాని ఐకే గుజ్రాల్ అధ్యక్షతన న్యూఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ప్రభుత్వాల పనితీరు, జవాబుదారీతనం, కార్య సాధనపైన ప్రజలకు రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతోందని, పాలనా వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు అత్యవసరంగా కొన్ని చర్యలు చేపట్టాలనీ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీని పర్యవసానమే తొమ్మిదంశాల ఒక కార్యాచరణ ప్రణాళిక, తద్వారా కేంద్రం, రాష్ట్రాల్లో ఫలవంతమైన, బాధ్యతాయుతమైన సుపరిపాలనను ప్రజలకు అందివ్వడం. కార్యాచరణ ప్రణాళిక  అమలును సత్వరమే పూర్తిచేస్తామని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు జాతికి వాగ్దానం చేశారు. కాలం చెల్లిన చట్టాలను సమీక్షించి కొత్త చట్టాలను రూపొందించుకోవాలని గుజ్రాల్ అన్నారు. చట్టం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలేగాని ఇబ్బందులు కలుగజేయకూడదని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రులు ఇదే తీరులో గంభీరోపన్యాసాలు చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే గుజ్రాల్ ప్రభుత్వం పతనమైయింది.

కార్యాచరణ ప్రణాళికలోని తొమ్మిదంశాలు: సిటిజన్ చార్టర్ తయారీ, జవాబుదారీ పరిపాలన, కట్టుదిట్టంగా త్వరితగతిన ప్రజల సాధక బాధకాలను నివారించగల వ్యవస్థ, గ్రామ-పట్టణ స్థాయిలలో స్థానిక సంస్థలకు అధికారాల నిచ్చే పౌర సేవలను వికేంద్రీకరించడం, చట్టాలను, ప్రభుత్వ నియమనిబంధనలు సమీక్షించటం, పారదర్శకత-సమాచార హక్కు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజలకవసరమైన సమాచారాన్ని పొందే పౌర సదుపాయ కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసేవారికి ప్రవర్తనా నియమావళి, అవినీతి నెదుర్కొని పరిపాలనను ప్రక్షాళన చేయడం, ప్రభుత్వాధికారుల పదవీ కాలంలో స్థిరత్వం అనేవే ఈ తొమ్మిదంశాలు. బాధ్యతాయుత, జవాబుదారీ పరిపాలనందించడానికి ఈ కార్యాచరణ ప్రణాళికను దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యల ద్వారా అమలుపర్చాలని ఆ సమావేశంలో తీర్మానించారు కూడా. అయిదేళ్ళ అనంతరం సమీక్ష జరిగింది. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలన్నీ అసంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడయింది. మళ్ళీ కధ మొదటికొచ్చింది.

ఈ నేపధ్యంలో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అయిన తరువాత కార్యాచరణ ప్రణాళికలోని సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చారు. తరువాత, వీరప్ప మొయిలీ అధ్యక్షతన కేంద్రంలోని యు.పి.ఎ. ప్రభుత్వం ఆగస్ట్ 31, 2005 న మరో పాలనా సంస్కరణ కమిషన్ ఏర్పాటు చేసింది. వీరప్ప మొయిలీ కమీషన్‌ను ప్రభుత్వం అనేక కీలకాంశాలపై అధ్యయనం చేయమని కోరింది. కొత్త కమిషన్ ని నియమించాలనే ఆలోచన చేనే ముందు ఇదివరకటి కమిటీలు, కమిషన్‌లు చేసిన సూచనలు, సిఫారసులపై ఒకింత దృష్టి సారించి వాటి అమలుకు తగు చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది.

వీరప్ప మొయిలీ కమిషన్‌, మే నెల 31, 2009 న పదిహేను సుదీర్ఘమైన నివేదికల రూపంలో, అనేక రకమైన పాలనాపరమైన సిఫారసులు చేసింది. ఆ సిఫారసులను ఏఏ రంగాలలో-ఎంత మేరకు అమలు జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయంలో అధికారులకు కాని, మంత్రులకు కాని, వాటి అవసరం వున్న పౌరులకు కాని ఏ మాత్రం సమాచారం లేకపోవడం దురదృష్టకరం. అనేక రంగాలలో పాలనానుభవం కలిగిన ప్రముఖులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్‌లో, సభ్యులుగా వున్నారు. వారి సిఫారసులు, గతంలో పాలనా సంస్కరణలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ-కమీషన్ల సిఫారసుల మాదిరిగా కాకుండా చూడాల్సిన బాధ్యతను అప్పటి ప్రభుత్వం మర్చిపోయినట్లే స్పష్టమవుతోంది.

కమీషన్ దశలవారీగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలను మూడు ప్రధాన విభాగాలుగా క్రోడీకరించింది. పాలనాపరమైన, సామాజిక-ఆర్థిక పరమైన, సెక్యూరిటీ పరమైన రంగాలకు చెందిన అంశాలుగా వాటిని పేర్కొన్నారు. కమీషన్ చేసిన సిఫారసులలో తొమ్మిది ప్రధానమైన అంశాలున్నాయి.

అధికారిక రహస్యాల చట్టాన్ని ఉపసంహరించుకుని, ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రభుత్వపరమైన అంశాలను మాత్రమే జాతీయ బధ్రత చట్టం పరిధిలో చేర్చాలన్నది మొదటి సిఫారసు. సమాచార హక్కు చట్టం అమలు పర్చాల్సిన ఇన్ఫర్మేషన్ కమీషన్ సభ్యులలో ఏభై శాతం సివిల్ సర్వీసు అధికారిక నేపధ్యం లేనివారిని నియమించాలన్నది రెండోది. పక్షపాత ధోరణితో కూడిన సాయుధ బలగాల 1958 చట్టాన్ని రద్దుచేసి, 1967 నాటి చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం దాని స్థానంలో అమలులోకి తేవాలనే ది మరొక సిఫారసు. మహిళలకు 33% రిజర్వేషన్‌లను కలిగించడంతో సహా పోలీసు వ్యవస్థలో సమగ్ర సంస్కరణలను తేవాలనేది మరో అంశం. పాతిక వేల జనాభాకు తక్కువున్న ప్రదేశాలలో స్థానిక న్యాయ స్థానాలను ఏర్పాటు చేసి సత్వర న్యాయం కలిగించాలన్నది మరొకటి. నైతిక విలువలతో కూడిన పాలనను అందించడానికి, ప్రధాని మినహా, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులందరినీ విచారణ పరిధిలోకి వచ్చేలా "నేషనల్ ఆంబడ్స్ మెన్" ఏర్పాటు; ఎంపీల-ఎమ్మెల్యేల నియోజక వర్గం అభివృద్ధి నిధుల పథకం రద్దు; కేంద్ర ఆర్థిక కమీషన్ తరహాలో రాష్ట్ర కమీషన్ల ఏర్పాటు; మేయర్లను నేరుగా ఎన్నుకునే విధానం అమలు పరచడం లాంటివి ఇతర సిఫారసులు.

ఎప్పటిలాగానే సిఫారసులన్నీ బాగానే వున్నాయి. అవి ఎంతవరకు అమలు అయ్యాయి అనేది జవాబులేని కోటి రూకల ప్రశ్న! మామూలుగా బుట్ట దాఖలు! అమలు చేసిన దాఖలాలు లేవు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత, గత ఎనిమిది సంవత్సరాల కాలంలో పాలనా సంస్కరణల విషయంలో ఏమాత్రం దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంలో గత 75 సంవత్సరాలలో పాలనా సంస్కరణల అంశాన్ని మోదీ ప్రభుత్వం కూలంకషంగా అధ్యయనం చేసి, రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పాలనలో అనుభవజ్ఞులను సంప్రదించి, వాటిల్లో ఏమైనా మంచివి వుంటే, అవసరమైన మార్పులు చేర్పులతో అమలు చేస్తే మంచిదేమో!

1 comment:

  1. Prof Chakilam Madhusudan Rao.
    Very nice very educative and enlightening post.In,my opinion,redtapism and corruption are prevalent in both State and central govts. The laws of the govt are implemented more in breach than in spirit.Time limit should be prescribed for each administrative act and it’s violation should be viewed seriously. Authorities must be responsive to the public.Welfare measures like free distribution of goods should be avoided.Consultation of interests should take place while enhancing prices of goods or services.

    ReplyDelete