Tuesday, August 9, 2022

గాంధీని స్మరిస్తూ, గాంధీ మార్గంలో గమిస్తూ... : వనం జ్వాలా నరసింహారావు

 ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సవాల’ సందర్భంగా

గాంధీని స్మరిస్తూ, గాంధీ మార్గంలో గమిస్తూ...

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (10-08-2022)

ఆంగ్లేయుల పాలన నాటి భారతదేశ రాజకీయాలలో మహాత్మా గాంధీ ప్రవేశించిన తర్వాత స్వాతంత్ర్యోద్యమంపై ఆయన ప్రభావం పూర్తిగా పడింది. మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమం బలపడింది. ‘అహింస’ నినాదంతో ఆయన దూసుకుని పోయారు. దక్షిణాఫ్రికా నుంచి ఆయన బాంబేలో కాలుపెట్టిన వెనువెంటనే, జాతీయోద్యమానికి నాయకత్వం వహించమన్న నినాదం మొదలైంది. ప్రథమ ప్రపంచ సంగ్రామం ముగిసిన తరువాత ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన రౌలట్‌చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో ‘ఆత్మ గౌరవం’ నినాదంతో ‘సత్యాగ్రహ’ ఉద్యమానికి పిలుపునిచ్చారు గాంధీ. విచారణ జరపకుండా, రాజకీయ ఖైదీలను శిక్షించి, జైలుకు పంపించే అధికారాన్ని ప్రొవిన్షియల్ ప్రభుత్వాలకిచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. లాలాలజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి కొందరు నాయకులు గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ, మోతీలాల్ నెహ్రూ లాంటి వారు గాంధీపక్షం వహించడంతో పెద్ద సంఖ్యలో గాంధీకి మద్దతు లభించింది.

జలియన్‌వాలా బాగ్ దారుణ మారణకాండ దరిమిలా, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు మహాత్మా గాంధీ. లక్షలాది మంది ప్రజలు, తారతమ్యాలు మరిచి, ఒక్క మాట మీద నిలబడ్డారు. చౌరీ చౌరా సంఘటనలో పాతిక మంది పోలీసులు మరణించడంతో, సహాయ నిరాకరణకు ఏకపక్షంగా స్వస్తి చెప్పారు గాంధీ. ఆ నిర్ణయం వల్ల గాంధీని కొందరు విమర్శించినప్పటికీ, ఆయన తిరుగులేని నాయకత్వం కొనసాగింది. ప్రజల హృదయాల్లో ఆయనపై ఉన్న అభిమానం చెరిగిపోలేదు. కారణాలు ఏమైనప్పటికీ, చట్ట సభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయభేదా లొచ్చాయి. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ప్రభృతులు ఒక వైపు, రాజాజీ, అన్సారి ప్రభృతులు మరో వైపు వాదించారు. మాట నెగ్గించుకోలేని చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి ‘స్వరాజిస్ట్ పార్టీ’ని స్థాపించారు. మోతీలాల్ నెహ్రూ ఆయన పక్షానే నిలిచారు. తండ్రి మోతీలాల్ స్థానంలో లాహోరులో కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో, డిసెంబర్ 31, 1929 అర్ధరాత్రి, నూతన సంవత్సరం ఆరంభమవుతుండగా, ‘పూర్ణ స్వరాజ్’ నినాదంతో, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక అప్పటినుంచి ‘సత్యాగ్రహ శకం’ ఆరంభమయిందనాలి.

ఫిబ్రవరి 1930లో సబర్మతి ఆశ్రమంలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, శాసనోల్లంఘన ఉద్యమం విషయంలో నిర్ణయాధికారాన్ని గాంధీకి వదిలింది. మార్చ్ 12, 1930న చారిత్రాత్మక దండి సత్యాగ్రహానికి నాంది పలికారు. ఏప్రిల్ 5, 1930 నాటికి దండి చేరుకుంది గాంధీజీ బృందం. సముద్రపు ఒడ్డున పిడికెడు ఉప్పును గాంధీజీ చేతబట్టి, ‘ఉప్పు చట్టాన్ని’ ఉల్లంఘించామని, ప్రతి పౌరుడు తాము అనుకున్న స్థలంలో ఉప్పు తయారు చేసుకోవచ్చని పిలుపిచ్చారు. గాంధీజీ పిలుపు మేరకు ఆరంభమయ్యే శాసనోల్లంఘన ఉద్యమం రూపురేఖలెలా వుండబోతున్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి భారతీయులలోనే కాకుండా, బ్రిటీష్ ప్రభుత్వంలోనూ కలిగింది.

బ్రిటీష్ ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసి ఎరవాడ జైలుకు తరలించడమే కాకుండా, వందల సంఖ్యలో అరెస్టులు చేపట్టింది. జవహర్‌లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ నినాదంతో త్రివర్ణ పతాకాన్ని రావి నది ఒడ్డున ఎగురవేయడం, శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీ మొదలెట్టేందుకు సంపూర్ణ మద్దతును భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించడం, స్వతంత్రం పొందే దిశగా కదిలేందుకు దోహదపడింది.

ఇంగ్లాండులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీ, రిక్త హస్తాలతో స్వదేశానికి తిరిగొచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ వంటి నాయకులను మరోసారి అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జనవరి 4, 1932న గాంధీజీతో పాటు పలువురు అగ్రశ్రేణి నాయకులను అరెస్ట్ చేయడంతో సహా, కాంగ్రెస్ పార్టీని చట్ట వ్యతిరేక సంస్థగా నిర్ణయించింది ప్రభుత్వం.

సెప్టెంబరు 1940లో, భావ స్వాతంత్ర్యాన్ని కాపాడాలంటూ, కాంగ్రెస్ నాయకత్వం సత్యాగ్రహానికి దిగింది మరోసారి. మొదటి సత్యాగ్రహి వినోభా భావే కాగా, జవహర్‌లాల్ నెహ్రూ ఆయన తర్వాత సత్యాగ్రహి. అరెస్టయిన నెహ్రూకు నాలుగేళ్ల కారాగార శిక్ష పడింది. ఆగస్ట్ 7, 1942న బాంబేలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ‘క్విట్ ఇండియా’ తీర్మానాన్ని ఆమోదించింది. నెహ్రూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ బలపర్చారు. తీర్మానం ఆమోదించిన మరుక్షణమే మాట్లాడిన గాంధీజీ, తాను ‘తక్షణమే, వీలుంటే ఆ రాత్రే–తెల్లవారే లోపునే’ స్వరాజ్యం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. గాంధీజీ నాయకత్వంపై భారత జాతీయ కాంగ్రెస్, ప్రజలు, యావత్ భారతావని, అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. ఆయన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమానికి, విజయమో వీరస్వర్గమో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. నాటినుంచి కౌంట్ డౌన్ మొదలైంది. స్వాతంత్ర్యం సిద్ధించే సూచనలు కనపడ సాగాయి. ఒక వైపు ‘క్విట్ ఇండియా’ ఉద్యమం, మరో పక్క ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ప్రభావం, ఇంకో దిశగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, బ్రిటన్ ప్రధాని విన్‍స్టన్ చర్చిల్ ఓటమి, బ్రిటీష్ ప్రభుత్వాన్ని కలవరపరిచాయి.

చర్చిల్ వారసుడు క్లెమెంట్ అట్లీ ఫిబ్రవరి 19, 1946న ప్రకటించిన త్రిసభ్య కాబినెట్ మిషన్‍తో రాజకీయ నాయకుల చర్చలు సఫలం కాలేదు. ఇంతలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన బడుగు–దళిత వర్గాల వ్యక్తితో కలిపి ఆరుగురు హిందువులు, ముస్లింలీగుకు చెందిన ఐదుగురు ముస్లింలు, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక పార్సీ మొత్తం పద్నాలుగురుండే మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించాడు వైస్రాయ్. ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించడంతో, తాత్కాలికంగా, అధికారులతో కూడిన ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు వైస్రాయ్. తదనంతరం, వైస్రాయ్ ఆహ్వానం మేరకు, ఆరుగురు హిందువులతో, ముగ్గురు ముస్లింలతో, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక పార్సీలతో జవహర్‌లాల్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం సెప్టెంబర్ 2, 1946న అధికారాన్ని చేపట్టింది. అక్టోబర్ చివరి వారంలో ముస్లిం లీగ్ కూడా షరతులతో ప్రభుత్వంలో చేరింది.

1946–1947 మధ్య కాలంలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భారీ సంఖ్యలో హిందువులకు ప్రాణ ఆస్తి నష్టం కలిగింది. నవంబర్ 1946లో గాంధీజీ నవొకాళీకి వెళ్లి, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలు పరిస్థితిని కుదుటబర్చాయి. 1946లో లార్డ్ మౌంట్ బాటన్ ఢిల్లీకి రావడంతో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో నేర్చుకున్న పాఠాలతో భారతదేశాన్ని వదిలిపెట్టి పోవాలన్న నిర్ణయానికొచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. విభజన తప్పని పరిస్థితులు అప్పటికే చోటు చేసుకున్నాయి. దేశ విభజన జరగాలన్న మౌంట్ బాటన్ ప్రణాళికకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది. గాంధీజీకి విభజన ఇష్టం లేదు. వ్యతిరేకిస్తే విప్లవం మినహా మార్గాంతరం లేదని కూడా ఆయనకు తెలుసు. రెండు దేశాల జిన్నా వాంఛ నెరవేరనున్న తరుణంలో, స్వతంత్రం సిద్ధించనున్న తరుణంలో, లక్షలాది హిందువులు, ముస్లింలు తరతరాలుగా నివసిస్తున్న ప్రాంతాలను వదిలి ‘శరణార్థుల కాంపుల’లో ఇతరుల దయాదాక్షిణ్యాలతో జీవించాల్సిన పరిస్థితులు కలిగాయి.

అశేష ప్రజానీకం ఎదురు చూసిన రోజు ఇలా ఆనంద–విషాదాల మధ్య రానే వచ్చింది. ఆగస్టు పదిహేను 1947 అర్ధరాత్రి ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగింది భారతదేశానికి. పాకిస్థాన్ మరో స్వతంత్ర దేశంగా ఏర్పాటవడంతో భారతావని రెండుగా చీలిపోయింది. మహాత్మా గాంధీ, స్వతంత్రం సిద్ధించినా కోరుకున్న రీతిలో సిద్ధించనందుకు, సంబరాలకు దూరంగా, ఆగస్టు పదిహేను అర్ధరాత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ఉపన్యాసం సహితం వినకుండా పశ్చిమ బెంగాల్ ‘హైదరీ హౌజ్’లో గడిపారు.

ఈ నేపధ్యంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజైన 15 అగస్టుకు ముందు  వారం రోజులు, అనంతరం వారం రోజులు మొత్తం 15 రోజుల పాటు రాష్ట్రంలో ‘భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాలు అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. స్వాతంత్ర్య  సమరయోధుల, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని, గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవిసమ్మేళనాలు, జాతీయ భావాలను రగలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు.

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ జాతిపిత జ్ఞాపకాలలో గడపడం, ఆయన అడుగుజాడల్లో నడిచిన వారిని స్మరించుకోవడం జాతిపితకి నిజమైన నివాళి.

No comments:

Post a Comment