Monday, August 1, 2022

ముర్ము చొరవతోనైనా మార్పు వస్తుందా? : వనం జ్వాలా నరసింహారావు

 ముర్ము చొరవతోనైనా మార్పు వస్తుందా?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (02-08-2022)

ద్రౌపది ముర్ము దేశ ప్రథమ పౌరురాలిగా ఎన్నికైన ప్రప్రథమ ఆదివాసీ మహిళ. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ప్రతి భారతీయ పౌరుడు, ప్రత్యేకించి ఆదివాసీ–గిరిజన పౌరులు గర్వించాల్సిందే. అదే సమయంలో లక్షలాది మంది ఆమె సహచర ఆదివాసీలు, గిరిజనులు ఆమెలాగానే ఏదో ఒకనాడు ఉన్నత పదవుల్లోకి రావాలని, క్షేత్ర స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రజాప్రతినిధులుగా భారీ సంఖ్యలో ఎన్నిక కావాలని ప్రగాఢంగా ఆశించడంలో తప్పులేదు.

భారతదేశంలో ఎన్ని రకాల రాజ్యంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల న్యాయస్థానాల తీర్పులు వచ్చినప్పటికీ, గిరిజనుల, ఆదివాసీల సమస్యలు లెక్కకుమించి ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ లాంటి ఏవో కొన్ని రాష్ట్రాలలో వివిధ రకాల రోల్ మోడల్ పథకాలు అమలవుతున్నాయి కాని, దేశవ్యాప్తంగా చేయాల్సింది ఎంతో ఉంది. అందులో ప్రధానమైంది భూసమస్య.

ఈ నేపథ్యంలో ఒక్కసారి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గిరిజన సంక్షేమం విషయంలో ఏం జరుగుతున్నదో రాష్ట్రపతి భవన్ తెలుసుకోవడం, అధ్యయనం చేయడం, ఆ అధ్యయన ఫలితాల్ని ప్రధానమంత్రికి చూపించి, దేశవ్యాప్తంగా వాటిని అమలు చేయమని సలహా ఇవ్వడం మంచిది. ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికైంది కాబట్టి, ఆమె తనకున్న రాజ్యాంగపరమైన అధికారాలను ఉపయోగించి, ప్రభుత్వం మీద రాజ్యాంగపరమైన ఒత్తిడి తీసుకువచ్చి, ఆదివాసీలకు, గిరిజనులకు సహజ న్యాయం చేకూరుస్తుందని ఆశించవచ్చా? రాష్ట్రపతి చొరవతతో ఆదివాసీల, గిరిజనుల అభివృద్ధి సాధ్యమేనా?

వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమం పేరిట గడిచిన 75 సంవత్సరాల కాలంలో పలు పథకాలు ప్రవేశపెట్టి, తాము గొప్పగా అమలు చేశామని చెప్పినప్పటికీ వీరిలో వెనుకబాటుతనం, పేదరికం మాత్రం పోలేదు. సమాజంలో అత్యంత పేదరికం అనుభవించే వారిలో ఎస్టీలు ఉన్నారనే విషయం నిర్వివాదాంశం. రిజర్వేషన్లు, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక నిధులు తదితర సదుపాయాలు, సౌకర్యాలు కల్పించామని చెబుతున్నప్పటికీ, వారి బతుకుల్లో మౌలికమైన మార్పు రాలేదు.

అందుకే, తెలంగాణ ప్రభుత్వం ఎస్టీల విద్య, సామాజిక వికాసంతోపాటు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నది. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి, ఖర్చు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్టీలకు ప్రత్యేక ప్రగతి నిధి చట్టం తీసుకొచ్చింది. గిరిజనుల జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించి, ఖచ్చితంగా ఖర్చు చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించి, బడ్జెట్టులో నిధులు కేటాయిస్తున్నది.

ఇక్కడ గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చింది. అలా గిరిజనుల దశాబ్దాల కల నెరవేరింది. తండాలు స్వయం పాలనకు వేదికలయ్యాయి. పెద్ద మొత్తంలో ఎస్టీలకు ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేసి, గ్రామ పరిపాలనా బాధ్యతలను ఎస్టీలకే అప్పగించే అభ్యుదయ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోతుంది.

ఎస్టీల గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వందశాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ పథకం, ఎస్టీల కోసం ప్రత్యేక గురుకులాలు, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు, ఎస్టీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఎస్టీ స్టడీ సర్కిళ్లు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్, మెయింటెనెన్స్ ఫీజు, ఆడపిల్లల పెళ్లి ఖర్చుకు కళ్యాణలక్ష్మి, స్వయం ఉపాధి పథకాలు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు భృతి, ఫీజు రీఇంబర్సుమెంటు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం భోజనం తదితర పథకాలను అమలు చేస్తున్నది తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. కోట్ల రూపాయలతో వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల ద్వారా ఎస్టీలు లక్షల సంఖ్యలో లబ్ధి పొందుతున్నారు.

అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు జనాభాపరంగా నిధులు కేటాయించి, ఖర్చు చేయడానికి ఉద్దేశించిన ఎస్టీ సబ్‍ప్లాన్ చట్టాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది. గతంలోలాగా కాకుండా సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే రద్దు కాకుండా, వాటిని మరుసటి ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఎస్టీ సబ్‌ప్లాన్ పేరును ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధిగా మార్చింది ప్రభుత్వం. ఈ నిధులను గిరిజనుల కుటుంబాలు, ఆవాసాలకు మాత్రమే ఉపయోగపడేలా వాడాలని ప్రభుత్వ నిర్ణయం.

ఇదిలా ఉండగా, గిరిజనుల ఆర్థిక వనరుల్లో ఒకటి వారి ప్రాంతాల్లో లభిస్తున్న విలువైన ఖనిజాలు. గిరిజనులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే ఖనిజ (సహజ) వనరులు నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆశించిన స్థాయిలో, పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక వృథాగా వదిలేసిన పరిస్థితుల్లో ఉన్నాయి. నిజంగా వాటిని సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే మైనింగ్ పరిశ్రమ లేదా ఖనిజ ఆధార పరిశ్రమలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా గిరిజనులకే ఆ పరిశ్రమల్లో ఉపాధి కల్పన లభించే అవకాశం ఉంటుంది.

గిరిజనులను భాగస్వాములను చేసి అనేక రకాలుగా విలువను జోడించే ఖనిజ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పి అభివృద్ధి చేయవచ్చు. ఇదే చేసినట్లయితే గిరిజనుల అభివృద్ధి కోసం శాశ్వతంగానే ఒక ‘రాయల్టీ అభివృద్ధి డివిడెండ్ ఫండ్’ను నెలకొల్పడానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. మైనింగ్ వ్యాపారంలో గిరిజనులకు కూడా నిర్దిష్ట వాటాను కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయవచ్చు. ఖనిజ ఆధార వ్యాపార, వాణిజ్య రంగాల్లో మాత్రమే కాక వ్యాపార నిర్వహణలో సైతం వారు రాణించేలా చైతన్యం కలిగించవచ్చు. అంతిమంగా ఇది వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది.

ఈ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంలో జూలై 11, 1997న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోని ప్రధానాంశాలు గమనార్హం. గిరిజనులతోనే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను వెలికి తీయిస్తే వారు సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతారని, గిరిజన హక్కులు – ప్రభుత్వ హక్కులు ఒకదానిపై మరోటి పోటీ పడకుండా సర్దుకుపోవాలనే రాజ్యాంగ ఆదేశం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూ బదలాయింపుపై పూర్తి నిషేధం అమలు కావాలని న్యాయమూర్తులు అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఖనిజ సంపద నిరుపయోగం కాకుండా ఉండేందుకు, అవి వెలికితీసే హక్కున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు గానీ, గిరిజన సహకార సంస్థలకు గానీ ఆ పని అప్పగించాలనీ, అవి పొందే నికర లాభాల్లో 20శాతంతో గిరిజన ప్రాంతాల్లో నీటివనరుల – ఆసుపత్రుల, పారిశుద్ధ్య నిర్వహణకు, రవాణా సౌకర్యాలకు ‘శాశ్వతనిధి’ ఏర్పాటు చేయాలనే తీర్పిచ్చారు.

గిరిజనుల ప్రయోజనాలు కాపాడడానికి చట్టాలు తేవడంలో, అమలు పరచడంలో వ్యత్యాసం కనబడుతున్న సంగతి గిరిజనాభివృద్ధిపై జరిగిన పలు సర్వేల్లో బయటపడింది. జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న ఈ సమస్య పరిష్కారానికి, పార్లమెంటు శాసనం చేయాల్సిన అవసరముంది. రాష్ట్ర ప్రభుత్వం గనుల తవ్వకం అనుమతులు మంజూరు చేసేముందు కేంద్ర ప్రభుత్వ సమ్మతి పొందడం అనివార్యమని అంటూ, అలాంటి సమ్మతిని ఇచ్చేందుకు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రులతో ఉపసంఘాన్ని నియమించాలని కోర్టు ఆదేశించింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పర్యావరణ, అటవీశాఖ మంత్రులు, సంబంధిత కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి సమావేశమై, గిరిజనుల భూములు, ఖనిజ సంపదను వెలికితీసే విషయాల్లో దేశానికంతటికీ ఒకే చట్టాన్ని రూపొందించాలని కూడా ఆదేశించింది. అది జరిగిన దాఖలాలూ లేవు. సుప్రీంకోర్టు సైతం పలు సిఫారసులతో కూడిన తీర్పు ఇచ్చినా ఆ తదనంతర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నాయో స్పష్టం కావడం లేదు. నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చొరవతో బహుశా భవిష్యత్తులో గిరిజనుల ఈ సమస్యలకు పరిష్కారం దొరకవచ్చేమో! దొరుకుతుందని ఆశించవచ్చేమో!

No comments:

Post a Comment