ఫస్ట్ ఎంబీబీస్ పరీక్షల్లో ఫస్ట్ రాంక్
వైఆర్కే మెడిసిన్ (1945-50-52): విశాఖ
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (14-04-2019)
ఆ రోజుల్లో ఐదున్నర సంవత్సరాల ఎంబిబిఎస్ కోర్సులో మొదటి ఆరునెలలు "ప్రీ
రిజిస్ట్రేషన్" అనేవారు. ఆ
ఆరు మాసాలు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
(బి.ఎస్సీ వారికిచ్చే సబ్సిడియరీ
బుక్స్ తో సహా) ఉండేవి. ఆరు నెలల తరువాత పబ్లిక్ పరీక్షలుండేవి.
అందులో ఉత్తీర్ణులైన వారే ఫస్ట్ ఇయర్ కు వెళ్ళడానికి అర్హులు.
చిత్రమేమిటంటే, డాక్టర్‍గారి
బాచ్ లో, ఆ ఆరు నెలల పరీక్షల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారిలోనే సగం మందికి పైగా
ఫెయిలయ్యారట. అనాటమీ, ఫిజియాలజీ సబ్జెక్టులకు రెండు
పూర్తి సంవత్సాలుండేవి. రోజూ ఉదయం
తొమ్మిది గంటల నుండి పన్నెండు వరకు అనాటమీ డి సెక్షన్ వుండేదట.
సాయంకాలం లెక్చర్ క్లాసులుండేవి. ఆనాడున్న
ప్రొఫెసర్ మాథ్యూస్‍గారిని, ఫిజియాలజీ
ప్రొఫెసర్ మేడమ్‍గారిని, అసిస్టెంట్
ప్రొఫెసర్లుగా పనిచేసిన డాక్టర్ సీతారామారావుగారిని, డాక్టర్
బ్రహ్మయ్యశాస్త్రిగారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు డాక్టర్‍గారు.
"ఫస్ట్ ఎంబీ" పరీక్షల్లో
రాధాకృష్ణమూర్తిగారు "ఫస్ట్ రాంక్"
సాధించారు. వాస్తవానికి
ఆ రాంక్ మిత్రులు బాల పరమేశ్వరరావుగారికి దక్కాల్సిందేనని, ఆయన
ఆనాటమీ పేపర్ రాసేటప్పుడు, కాస్త
కంగారుపడి "సెలినస్ ఏంటీరియర్" గురించి
రాయడానికి బదులు "సెర్రేటస్ ఏంటీ రియర్"
గురించి చక్కగా రాసేసి, బయటకు
వచ్చి నాలుక కరుచుకున్నారట! ఆ చిన్న
పొరపాటు చేయకపోతే, ఆ రాంక్ ఆయనకే దక్కేదని -
దక్కి ఉండాల్సిందేనని అంటారు డాక్టర్ గారు. నిజానికి
ఫైనల్ ఎంబిబిఎస్‍లో, ఆ రాంక్ ఆయనకే న్యాయంగా దక్కింది.
మిత్రుడిని అభినందించారీయన.
క్లినికల్ సైడ్ వెళ్లాక సర్జరీ ప్రొఫెసర్ లెఫ్ట్ నెంట్ కల్నల్
రమణమూర్తి, ప్రొఫెసర్ కృష్ణస్వామి,
మెడిసిన్‍లో ప్రొఫెసర్ టి.కె. రామన్, ప్రొఫెసర్ అనంతాచారి గార్లను గురించి
చెప్పుకోవాల్సిందేనంటారు. ప్రొఫెసర్ భాస్కర మీనన్ పెథాలజీ అద్భుతంగా చెప్పేవారట.
ఫార్మకాలజీ ప్రొఫెసర్
ఈశ్వరయ్య చాలా డ్రై సబ్జెక్టును ఎంతో ఆసక్తికరంగా, మధ్య
మధ్య హాస్యంగా, చెణుకులతో చెప్పేవారట. ఆయన
ప్రొఫెసర్ డేవిడ్‍తో కలిసి తరువాత ఎంతో
పాపులర్ పుస్తకంగా పేరుతెచ్చుకున్న "ఫార్మకాలజీ
టెక్స్ట్ బుక్" (డేవిడ్ అండ్ ఈశ్వరయ్య) రాశారట.
అలాగే బాక్టీరియాలజీ ప్రొఫెసర్ - ప్రిన్సిపాల్
గా కూడా కొంతకాలం పనిచేసిన ఎన్.డి.
పండాలే గారు మంచి లెక్చరర్ కాకపోయినా. చాలా
లోతుగా సబ్జెక్ట్ వున్నవారంటారు. ఆయన కూడా
బాక్టీరియాలజీ టెక్స్ట్ బుక్ అప్పటికే రాశారట. అలాంటి
ఉద్దండులైన సీనియర్ ప్రొఫెసర్లు దొరకడం కూడా తన బాచ్ వైద్య విద్యార్థుల అదృష్టంగా
చెప్పవచ్చు నంటారు.
ప్రొఫెసర్లతో పాటు అసిస్టెంటు సర్జన్లుగా పనిచేసిన డాక్టర్ పినాకపాణి
ఎం.డి (తరువాత కాలంలో గొప్ప సంగీత
విద్వాంసుడుగా పేరు తెచ్చుకున్నారు), డాక్టర్
కోదండ రామయ్య ఎం.డి (గుంటూరులో
ప్రొఫెసర్‍గా, పాపులర్ ఫిజిషియన్‍గా పేరు సంపాదించుకున్నారు),
ఎం.సి.ఐ
చైర్మన్‍గా చాలా సంవత్సరాలు పనిచేసిన డాక్టర్ పిన్నమనేని నరసింహారావు ఎం.ఎస్
(ఇ.ఎన్.టి), డాక్టర్
లింగం సూర్యనారాయణ (తరువాత వైస్ ఛాన్సలర్‍గా పనిచేశారు),
విద్యార్థులకు చాలా సహాయం చేసేవారట.
1947లో
జరిగిన రెండు ముఖ్య సంఘటనలను డాక్టర్ వై.ఆర్.కే
గుర్తు చేసుకున్నారు. ఆ ఏడాది మే నెల 4 న
తన వివాహం జరిగిందని, అది తన స్వాతంత్ర్యం పోయిన రోజని
చమత్కరించారు! రెండోది ఆగస్ట్ 15. దేశానికి
స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఆ రోజుతో
అంతకు ముందు విధిగా ధరించాల్సి వున్న సూటూ-బూటూ
-నెక్ టై బాధ తీరిపోయిందన్నారు. స్టాఫ్
- స్టూడెంట్స్ కూడా ఎవరికిష్టమైన డ్రస్ వారు వేసుకునే వారట.
1949లో
నాలుగో సంవత్సరం మెడిసిన్ చదువుతుండగా తనకు రెండు స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయంటారు.
ఒకటి జైలుకు వెళ్లి రావడం - కేసులు,
రెండు ఆయన ఎంతగానో ప్రేమించే చెల్లెలు భీమేశ్వరి టైఫాయిడ్ జ్వరంతో
చనిపోవడం - తనను పెంచిన తల్లితండ్రులకు గర్భ శోకం మిగల్చడం.
పాఠ్య గ్రంధాల చదువుతో పాటు, ఇతర
గ్రంధాల పట్ల ఆసక్తి పెరగడంతో, ఆ కారణాన,
ఫైనల్ ఎంబిబిఎస్ లో నాలుగో రాంక్ మాత్రమే పొందగలిగానంటారు.
తనకన్నా ఎక్కువ రాంక్ వచ్చిన మిత్రులు తనకంటే ఏ మాత్రం తక్కువ వారు
కాదని, అందరూ చాలా సమర్థులేనని అంటారాయన.
డిసెంబర్ 1950లో పరీక్షలు అయిపోయాయి.
జనవరి 1951
నుండి హౌస్ సర్జన్‍గా పని చేశారు. ఆ
రోజుల్లో అందరికీ స్టయి ఫండ్ దొరికేది కాదు. మొదటి
10
రాంకులు వచ్చిన వాళ్లకే ఇచ్చేవారు. వారిలో
రాధాకృష్ణమూర్తిగారు కూడా వుండడంతో ఆయనకు కూడా రు. 90లు
దొరికేవి. సంవత్సరం పూర్తయిన తరువాత ఇంకా కొన్ని స్పెషాలిటీల్లో అనుభవం కోసం
స్టయిఫండ్ లేకుండానే సీనియర్ హౌజ్ మెన్‍గా మరొక ఆరు మాసాలు పనిచేశారు.
ఆ అనుభవం తనకు ప్రయివేట్ ప్రాక్టీసులో బాగా ఉపయోగపడిందంటారు.
ఆయన వైద్య విద్య సాగుతున్నప్పుడే వీర తెలంగాణ రైతాంగ విప్లవ సాయుధ
పోరాటం సాగింది. జరిగింది తెలంగాణ ప్రాంతంలోనే అయినప్పటికి, పుచ్చలపల్లి
సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య లాంటి ఆంధ్ర ప్రాంతం వారి సహాయ సహకారాలతో పాటు
నాయకత్వం కూడా దానికుండేది. పోరాటం
చేసే వారికి ఆయుధాలు-ఆయుధ సామగ్రి సమకూర్చడానికి,
పోరాటంలో గాయపడిన వారికి చికిత్స చేయడానికి ఆంధ్ర ప్రాంతం వారి
అవసరమొచ్చేది.
No comments:
Post a Comment