Tuesday, April 30, 2019

1985 తర్వాత పార్టీ సేవకే అంకితం .... వైఆర్కే జైలు – కోర్టులు .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


1985 తర్వాత పార్టీ సేవకే అంకితం
వైఆర్కే జైలు – కోర్టులు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (29-04-2019)
కమ్యూనిస్ట్ పార్టీ చీలిన నేపధ్యంలో, దేశవ్యాప్తంగా సీపీఎం నాయకులను అరెస్ట్ చేసిన నేపధ్యంలో, పౌర హక్కుల ఉద్యమం ఆరంభించిన నేపధ్యంలో, ఆ ఉద్యమానికి ఆద్యుడైన డాక్టర్ రాధాకృష్ణమూర్తిని, ఆయనకు తోడ్పడిన ఇతరులను ప్రభుత్వం నిర్బంధించింది. వీరికంటే ముందు అరెస్ట్ కాబడి, జైలులో వుంటూ పెరోలుపై విడుదలై వచ్చి, మరల వెళ్ళిపోతున్న వట్టి కొండ నాగేశ్వరరావును పంపడానికి, డాక్టర్ వై.ఆర్.కె, అడ్వకేట్ కర్నాటి రామమోహన్‌రావు ప్రభృతులు, డోర్నకల్ వరకు వెళ్ళి తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతుండగా, వారి కొరకు కాపలా వున్న పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనంలో ఖమ్మం తరలించి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూర్చో బెట్టారు. వీరిని అరెస్ట్ చేసిన సమయంలోనే, ఖమ్మంలో వున్న అడ్వకేట్లు బోడేపూడి రాధాకృష్ణ, కె.వి సుబ్బారావులను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. డాక్టర్ వై.ఆర్.కె పేషంటైన పోలీసు అధికారి మాధవరావు వారిని స్టేషన్‌లో మర్యాదగా చూశాడు. అక్కడి నుంచి రైలులో హైదరాబాద్ చంచల గూడా జైలుకు తరలించారందరినీ. అక్కడ మోటూరు హనుమంత రావు, ఎల్.బి.జి (లావు బాల గంగాధర రావు), మంచికంటి, గుంటూరు బాపనయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఎస్.ఆర్. దాట్ల, నల్లమల గిరిప్రసాద్ ల నుండి జిల్లా నాయకుల వరకున్నారు. రెండు వారాల తర్వాత, ముషీరాబాద్ జైలుకు మార్చారు. కారణం తెలియదు. రెండో పర్యాయం జైలు జీవితం అలా ప్రారంభమయింది. జైలులో రాజకీయ తరగతులు జరిగేవి.

రాధాకృష్ణమూర్తిగారు డాక్టర్ అని తెలుసుకున్న జైలు అధికారులు ఆయనకు అనధికారికంగా, అధికారులు చేయాల్సిన బాధ్యతను అప్పచెప్పారు. ఆయనకు అంటగట్టారనడం సమంజసమేమో! ప్రతి దినం జైలు డాక్టర్ వచ్చి, డిటెన్యూలను పరీక్షించి, అవసరమను కుంటే కొందరిని ఆసుపత్రులకు చికిత్స కొరకు పంపాల్సి వుంటుంది. ఆయన రావడం మానేయడంతో ఆ స్థానాన్ని డాక్టర్ వై ఆర్ కె భర్తీ చేశారు. పరీక్ష చేసి మందులు రాయడం, ఎవరెవరిని బయటకు పంపాలనే నిర్ణయం ఆయన తీసుకోవడం, అధికారిక సంతకం మాత్రం జైలు డాక్టర్ చేయడం నిత్య కృత్యమైంది. సాధారణంగా డిటెన్యూలకు ఏదోఒక మిష మీద జైలు గోడలు దాటి బయటకు పోవాలనిపిస్తుంది. వైద్యుడి సలహాపై వెళ్ళడం అన్నింటికన్నా తేలిక. సీపీఎం నాయకత్వం మటుకు, డిటెన్యూల ఆ ఆలోచనకు వ్యతిరేకం. అదే జైల్లో వున్న పుచ్చలపల్లి సుందరయ్య గారు, డిటెన్యూలను ఆ కారణంగా బయటకు పంపే విధానానికి స్వస్తి చెప్పాలని ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు. ఆయన ఆదేశమంటే అది శిరోధార్యమే! దానికి తిరుగులేదు.


జైలులో పుచ్చలపల్లి సుందరయ్య గారితో డాక్టర్ వై.ఆర్.కె పంచుకున్న అభిప్రాయాలు ఎంతోమంది ఆదర్శప్రాయంగా తీసుకోదగ్గంత విలువైనవి. ప్రతి దినం మార్నింగ్ వాక్‍కు కలిసి పోతుండే వారిద్దరూ. అలా పోతుంటే ఒక నాడు వై ఆర్ కే ఊహించని ప్రశ్న వేశారు సుందరయ్య గారు. పార్టీకి, పార్టీ అనుబంధ సంస్థలకు ఎనలేని సేవలందిస్తున్న డాక్టర్ వై.ఆర్.కె, అంతవరకు సభ్యత్వం మాత్రం తీసుకోలేదు. పూర్తి కాలం కార్యకర్తగా పార్టీలో చేరి సభ్యత్వం ఎందుకు తీసుకోవడం లేదని అడిగారు సుందరయ్య గారు. జవాబుగా, తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పారు డాక్టర్ వై.ఆర్.కె. తాను ఒంటరివాడిని కానని, కుటుంబ బాధ్యతలు ఎన్నో తన నెత్తిమీద వున్నాయని, ఆర్థికంగా నిలదొక్కుకో లేదని, ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయని, చిన్నతనం నుంచి కష్టాలకు అలవాటు పడలేదని చెప్పి అసలు కారణం బయట పెట్టారు. సుందరయ్యగారిలా త్యాగాలు చేయలేనని, పార్టీపరంగా తనకిచ్చే ఆదేశాలను చిత్త శుద్ధితో అమలు చేయగలనే కాని, పూర్తి కాలం కార్యకర్తగా త్యాగం చేసే స్థాయికి ఇంకా ఎదగలేదని స్పష్టం చేశారు. డాక్టర్‍గా తనకు వృత్తి పరమైన కొన్ని విద్యుక్త ధర్మాలు నిర్వహించాల్సిన బాధ్యత వుందని, సుఖమయమైన జీవన శైలికి అలవాటు పడ్డ తన పద్దతులు గమనించి ఇతర కార్యకర్తలు చెడిపోయే అవకాశం వుండవచ్చని, ముమ్మూర్తులా-త్రికరణ శుద్ధిగా, మరింత త్యాగానికి సిద్ధంగా వుండగలిగిన నాడు, ఆయన కోరినట్లు పార్టీలో చేరుతానని చెప్పారు. అప్పటివరకు, తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ, పార్టీ అప్ప చెప్పిన కార్యక్రమాన్ని నెరవేరుస్తానని చెప్పిన డాక్టర్ వై.ఆర్.కె అన్న మాట ప్రకారం నడచుకున్నారు. 1985లో పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత సుందరయ్యగారికి ఇచ్చిన మాట ప్రకారం మనసా-వాచా-కర్మణా పార్టీ సేవకే అంకితమయ్యారు. అలా ఆయన రెండో పర్యాయం జైలు జీవితం గడిచింది.

సరిగ్గా అదే రోజుల్లో, ఆ పాటికే జైలు జీవితం గడుపుతూ అనారోగ్యానికి గురైన ప్రముఖ సీ.పి.ఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యగారిని పెరోల్ పై విడుదల చేసి, చికిత్స కొరకు సోవియట్ రష్యా పంపించి, కుదుటపడ్డ తర్వాత ముషీరాబాద్ జైలుకు తీసుకొచ్చారు. ఖమ్మంలో అరెస్టయిన నలుగురినీ (వై.ఆర్.కె, బోడేపూడి రాధాకృష్ణ, కె. వి. సుబ్బారావు, కర్నాటి రామ్మోహన రావు) కూడా ముషీరాబాద్ జైలుకే పంపారు. ఆ విధంగా వీరికి ఆపాటికే జైలులో వున్న సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డిగార్ల లాంటి ప్రముఖులందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మాస్కో నుండి తిరిగి వస్తూ ఢిల్లీలో ఇందిరా గాంధిని, హైదరాబాద్‍లో ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గార్లను కలుసుకుని అరెస్టులపై తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు సుందరయ్య. డాక్టర్ వై.ఆర్.కె త్రయాన్ని అరెస్ట్ విషయాన్ని ప్రశ్నించిన సుందరయ్యతో "మీకంటే వారే ప్రమాదకరమైన వ్యక్తులు" అని జవాబిచ్చాడట బ్రహ్మానందరెడ్డి. ఆ విషయాన్ని స్వయంగా తెలియచేసిన సుందరయ్య, పౌరహక్కుల ఉద్యమ ప్రభావం అంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని కుదిపేసినందుకు ఆయన్ను, మేధావిత్రయాన్ని అభినందించారు.

No comments:

Post a Comment