రామానుజదాసు సుందరకాండ
ప్రవచనాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక
(29,30 ఏప్రిల్, 1 మే
2019)
దర్శనమ్ ఆధ్యాత్మిక
వార్తా మాసపత్రిక, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆద్వర్యంలో, కీర్తి
శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు, వాసుదాస స్వామి నెలకొల్పిన అంగలకుదురు
శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం నిర్వాహకులు, ప్రస్తుత
పీఠాదిపతి, శ్రీమాన్ రామానుజదాస స్వామి వారి వాసుదాస
విరచిత సుందరకాండ ప్రవచనాలు, ఏప్రిల్ నెల 22 సోమవారం
నుండి ఏప్రిల్ నెల 24 బుధవారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 5-30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్
రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగాయి. కిక్కిరిసిన
ఆహ్వానితుల సమక్షంలో అత్యంత మధురాతి మధురంగా జరిగిన ఈ ప్రవచన మహోత్సవాన్ని
ప్రత్యక్షంగా పలువురు వీక్షించడమే కాకుండా దేశ-విదేశాల్లోని అనేకమంది తెలుగువారు
ఫేస్ బుక్, యు-ట్యూబ్ ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని
తిలకించి పులకించారు. కార్యక్రమం జరిగిన మూడురోజులూ రామనుజదాసు ప్రవచనాలు
ఆధ్యాత్మిక పరిమళాలను గుబాళింప చేశాయి.
మొదటి రోజు
ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఎస్కే జోషి వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన కార్యక్రమాన్ని లాంచనంగా
ప్రారంభించారు. ఆదర్శవంతమైన పరిపాలనను అందించి, ప్రజలకు రాముడు ఆదర్శపురుషుడిగా
నిలిచారని ఆయన అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు రాముడిని ఆదర్శంగా తీసుకోదగిన
మహాపురుషుడని ఆయన తన ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు. మొదటిరోజు కార్యక్రమంలో
ద్విసహస్రావధాని, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ రామాయణ
వైశిష్ట్యాన్ని విశదీకరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి
హరికృష్ణ తనదైన శైలిలో సుందరకాండ గొప్పదనాన్ని తెలియచేశారు. కార్యక్రమ నిర్వాహకులు
వనం జ్వాలా నరసింహారావు (ఆంధ్ర) వాల్మీకి రామాయణం క్షీరదార అనీ, సుందరకాండ పాలల్లో కలుపుకున్న పంచదార లాంటిదనీ,
కాండలో సుందరం కానిదేదీ లేదని అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవాది సీతారామయ్యగారు
వావిలికొలను సుబ్బారావుగారి రామాయణ రచనాశైలిని సోదాహరణంగా వివరించారు. దర్శనం
వెంకటరమణ శర్మ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
రెండో రోజు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై
ఆర్ కృష్ణారావు వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన
మాట్లాడుతూ రామాయణంలో కీలక ఘట్టాలను సుందరకాండలో వివరించారని అన్నారు. సత్యం, ధర్మం, తండ్రిమాట జవదాటని సుగుణాలతో
మూర్తీభవించిన ప్రతిరూపమే శ్రీరామచంద్రుదని ఆయన అన్నారు. ఆ మహనీయుడి జీవిత చరిత్రే
వాల్మీకి మహర్షి అందించిన రామాయణమని, అందులోని సుందరకాండలో హనుమంతుడు సీతాన్వేషణలో
తారసపడిన ప్రకృతి వర్ణన అద్భుతంగా వుంటుందని కృష్ణారావు చెప్పారు. మొదటిరోజు
జరిగిన ప్రవచనాల సారాంశాన్ని వనం జ్వాలా నరసింహారావు వివరించారు. రెండో రోజు
కార్యక్రమానికి కూడా దర్శనం శర్మ అధ్యక్షత వహించారు.
ముగింపు రోజు మూడోరోజు కార్యక్రమాన్ని
దూరదర్శన్ మాజీ సంచాలకులు డాక్టర్ పాలకుర్తి మధుసూదన రావు జ్యోతి ప్రజ్వలన చేసి
ప్రారంభించారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, జెన్కో-ట్రాన్స్కో
చైర్మన్-మానేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్ రావు, దైవజ్ఞ శర్మ, ఎస్బీఐ మాజీ సేజీఎమ్ భండారు
రామచంద్రరావు, డెల్హీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల
వేణుగోపాలా చారి, ఆధ్యాత్మిక వేత్త సీతారామయ్య తదితరులు ముగింపు కార్యక్రమానికి
ముఖ్య-గౌరవ అతిథులుగా వచ్చారు. (ఆంధ్ర) వాల్మీకి రామాయణ వైశిష్ట్యాన్ని, ముఖ్యంగా సుందర కాండ ప్రాముఖ్యతను వారు ఆహ్వానితులకు తెలియచేశారు. శ్రీరామాయణం
అద్భుత కావ్యమనీ, సుందరకాండ రసరంయమైన ఘట్టమనీ, సమకాలీన సమాజానికి ఈ ప్రవచనాలు ఒక మార్గదర్శకంగా నిలుస్తాయని
సభాధ్యక్షుడు రమణాచారి అన్నారు. రవీంద్రభారతి వేదిక ఈ ప్రవచన కార్యక్రమంతో
పునీతమైందని ఆయన చెప్పారు. కార్యక్రమం జరిగిన మూడు రోజులు కూడా అతిథులకు సత్కారంతో
పాటు, ప్రవచన కర్త రామానుజదాస స్వామి వారికి ప్రవచనం చేసే
ముందర ముఖ్య అతిథి పూల దండ వేసి సత్కరించారు.
మూడురోజులు
సాగిన ప్రవచన కార్యక్రమంలో మొదటిరోజు సీతా దర్సనం వరకు, రెండో రోజు సీతమ్మ ఆంజనేయుడికి చూడామణి ఇవ్వడం వరకు 38 సర్గలు, చివరి రోజున మిగిలిన 30 సర్గల లోని విషయాలు చెప్పారు రామానుజ దాసు. తొలుత
వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా, యధావాల్మీకంగా తెలుగులోకి
అనువదించిన ఆంధ్ర వాల్మీకి, వాలికొలను సుబ్బారావు (వాసుదాసు)
గారిని గురించి, ఆయన జీవిత విశేషాలను గురించి వివరించారు
స్వామి. ఆ వివరాలు ఆయన మాటల్లో.....
ఇరవైనాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష
వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా
మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్
వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం
చేస్తూ, ఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి
రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు. ఆంధ్ర
పాఠక లోకం మందరాన్ని అపారంగా అభిమానించింది-ఆదరించింది.
వాసుదాసుగారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి తెలుగులో సరైన
వ్యాఖ్యానముంటే, సంస్కృతం రానివారికి చక్కగా అర్థమవుతుందని కొందరంటారు ఆయనతో. జవాబుగా, “శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం, మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు వాసుదాసుగారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త
విజ్ఞాన సర్వస్వం. వాసుదాసుగారు, తాను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి
శ్లోకానికొక పద్యం వంతున రాసారు. మందరంలో తను రాసిన ప్రతి
పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన
మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి"
కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది.
వావిలికొలను
సుబ్బరావుగారు,
కడప జిల్లా-జమ్మలమడుగులో 1863 లో జన్మించి 1939 లో పరమపదించారు. ఎఫ్.ఎ చదువు పూర్తిచేసి, పొద్దుటూరు తాలూకా
కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్
హోదాకెదిగారు. 1893-1904 మధ్య కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసారు. తరువాత, మద్రాస్ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా
1904-1920 మధ్య కాలంలో పనిచేసారు. "శ్రీ కుమారాభ్యుదయం"
అనే ప్రబంధ గ్రంథాన్ని రచించి, నాటి కవి పండితులను
ఆశ్చర్య పరిచారు. ఆయన ప్రతిభకది తొలి హారం. భార్యా వియోగం కలగడంతో, వాసుదాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట
రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, టెంకాయ పట్టుకుని బిక్షాటనచేసి
లభించిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం 1900-1908 మధ్య కాలంలో. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో
వున్నట్లే,
అనువాదంలో కూడా నిక్షిప్తం చేసారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం
అనువాదమైనా,
స్వంత రచన-స్వతంత్ర రచన అనిపించుకుంది.
వాసుదాసుగారు
ఆంధ్ర వాల్మీకిగా లబ్ద ప్రతిష్టులయ్యారు. మహనీయమైన "మందర" రామాయణాన్ని
అనేకానేక విశేషాలతో,
పద్య-గద్య-ప్రతి పదార్థ-తాత్పర్య-ఛందోలంకార విశేష
సముచ్ఛయంతో,
నిర్మించి, వేలాది పుటలలో
మనకందించారు. రామాయణ క్షీర సాగరాన్ని "మందరం" మథించి, మనకందరికీ ఆప్యాయంగా అందించింది. అయితే, దానిని ఆస్వాదించే
తీరికా-ఓపికా లేని జీవులమైపోయాం మనం. భాష, శైలి, అర్థం,
తాత్పర్యం కాలక్రమంలో పరిణామం చెందుతున్నాయి.
"సూక్ష్మంలో మోక్షం" కావాలంటున్నారు నేటి తరం పఠితులూ, పండితులూ. కాలం గడిచిపోతున్నది. వాసుదారుగారు మారిపోతున్న తరాలకు గుర్తురావడం
కూడా కష్ఠమైపోతున్నది. వారి "ఆర్యకథానిథుల" తోనూ, "హితచర్యల" పరంపరలతోనూ, పరవశించిపోయిన ఆ నాటి తెలుగు
పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని మహనీయుడు,
ప్రాతఃస్మరణీయుడు వాసుదాసస్వామి.
వాసుదాసు గారిని
గురించి చెప్పిన అనంతరం ప్రవచనాలను ప్రారంభించారు స్వామి. ఆయన చెప్పిన ప్రవచనాల
వివరాల్లోకి పోతే....
తేట తేట తేనెలోని
తీయందనాన్ని, చల్లని వెన్నెలలోని సుఖ శీతల మధురిమల్ని
కలబోసి వాల్మీకి కోకిల ఆలపించిన ఆనంద మయ కావ్యగానమే సుందరకాండ. శబ్ద-అర్ధ-భావ-రస సౌందర్యాలను
పరస్పరాశ్రయంగా సురుచిర భద్రంగా నింపుకొన్న రసమయ పేటి ఇది. ఇది ఒక అమృత భాండం. జీవ-జీవన సౌందర్య కాండం. బాధల మధ్య బోధలనూ, వ్యక్తుల మధ్య సాధనా సిధ్ధులనూ సిధ్ధపరచి, అందించిన మంత్రమయ అక్షయ అక్షర భాండం
సుందరకాండం. సుందరకాండలో సుందరం కానిదేమిటట? అంటే..ఏమీ లేనే లేదు..అని పెద్దలి
తేల్చేశారు.
ఇందులో హనుమ
మహాయోగి. మహాజ్ఞాని. "విశిష్ట వశిష్ఠుడు".
మహాచార్యుడు. అంతటి వాడు లంకకు వెళ్లేటప్పుడు
శ్రీరామచంద్రుడి భద్ర ముద్రికను (ఉంగరాన్ని), తిరిగి
వచ్చేటప్పుడు సీతమ్మ చూడామణిని చక్కగా ధరించి సముద్రాన్ని సునాయాసంగా దాటి వచ్చాడు. శ్రీసుందరకాండలో సౌందర్యమనేది
రాశీభూతమైంది. మంత్ర పూతమైన రస సౌందర్యం-భగవత్ సౌందర్యమైన శ్రీరామ సౌందర్యం-ఆచార్య సౌందర్యమైన శ్రీహనుమ సౌందర్యం-అశోక, మధు వనాల ఉద్యాన
వన సౌందర్యం-మహా విశిష్టమైన లంకా నగర సౌందర్యం-లంకలో కామినీ భోగినీ జన సౌందర్యం-రావణుడి వీర సౌందర్యం-హనుమ సాధనా సౌందర్యం-ఆదికవి వాల్మీకి మహనీయ రమణీయ మాధుర్యమైన
కవితా శిల్పసౌందర్యం......వీటన్నింటినీ కలబోసిన మహాసౌందర్యం, శ్రీ "సుందర" సౌందర్యం.
సుందరకాండ
వృత్తాంతమంతా కేవలం ఒకటిన్నర రోజుల్లోనే జరిగింది. కధ విషయాని కొస్తే, హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, లంకకు చేరడం, సీతాదేవి కోసం వెతకడం, ఆమెను చూడడం, రామ లక్ష్మణుల సమాచారం చెప్పడం, శ్రీరామ ముద్రికనిచ్చి-చూడామణిని తీసుకో పోవడం, లంకా దహనం, మరలిపోయి శ్రీ
రాముడికి సీతమ్మ సందేశాన్నివ్వడం-ఇంతే!. జాంబవంతుడి
ప్రేరణతో మహేంద్ర పర్వతాన్ని ఎక్కి, అక్కడనుండి లంక
కెళ్ళాలన్న సంకల్పంతో సిద్ధపడ్డ హనుమంతుడి ప్రయాణ సంబ్రమంతో మొదలవుతుందీ కాండ.
హనుమంతుడికి సహాయం
చేయాలనుకొని సముద్రుడు "మైనాకుడిని" పంపుతాడు. సమయాభావం వల్ల ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించ
లేనని సున్నితంగా తిరస్కరించి, ఆయనకు నచ్చ చెప్పి ముందుకు సాగిపోతాడు. దేవతల ప్రేరణతో అడ్డుపడ్డ నాగమాత "సురస"ను
జయిస్తాడు. తనకున్న అణిమాది అష్టసిధ్ధులతో చిన్న
ఆకారంగా మారి, ఆమె కోరినట్లు ఆమె నోట్లో దూరి, సురక్షితంగా బయటకొస్తాడు. ఆ తర్వాత హింసికైన "సింహిక"ను
వధించి, ప్రయాణాన్ని సాగించి లంకకు చేరుకుంటాడు. ఇదంతా కేవలం ఎనిమిది గంటల్లో జరిగింది.
లంకా నగరం చేరిన హనుమంతుడు లంక
ప్రవేశిస్తూ అడ్డగించిన లంకాధి దేవత-లంఖిణిని, జయించి, లంకా వినాశానికి
నాంది పల్కుతాడు. లంకలో చిన్న పిల్లిలా దిగి, తర్వాత చిన్నకోతి ఆకారంలో యధేఛ్చగా
సంచరించి సీతాదేవికై వీధీ-వీధీ గాలిస్తాడు. మండోదరిని చూసి సీతాదేవేనని భ్రమపడుతాడు. రావణ అంతఃపురం చూసి అంతఃపుర స్త్రీల మధ్య
సీతున్నదేమోనని అక్కడా వెతుకుతాడు. సీతాదేవి ఎక్కడా
కనిపించక పోవటంతో, విచారంతో, మళ్ళీ-మళ్ళీ వెతుకుతూ, అశోకవనానికి చేరుకుంటాడు హనుమంతుడు.
హనుమంతుడి ప్రయత్నం ఫలించి, వెతుకుతున్న సీతాదేవి అశోకవనంలో
కనిపిస్తుంది. ఆమే సీతని నిశ్చయించు కోవడానికి, కొన్ని ఆధారాలు చూసుకుంటాడు. ఆమె స్థితికి దుఃఖిస్తాడు. రాక్షస స్త్రీల బెదిరింపులు-రావణుడి బెదిరింపు మాటలు-సీత రావణుడిని నిందించడం, పరుషపు మాటలనటం-ఆయన ఆగ్రహించడం-మళ్లీ రాక్షస స్త్రీల బెదిరింపులు- ఇవన్నీ వింటాడు చెట్టు చాటునుండి
హనుమంతుడు. సీతాదేవి భయపడి శ్రీ్రాముడిని తల్చుకుంటూ
దుఃఖించడం-త్రిజట స్వప్న వృత్తాంత కూడా వింటాడు.
సీతాదేవి వినేటట్లు
శ్రీరాముడి కథను ప్రస్తావించి ఆయన్ను
ప్రశంసిస్తూండగా ఆయన ఉనికి తెలుస్తుందామెకు. ఆ తర్వాత ఆమెతో
సంభాషించడం, ఒకరి విషయాలు ఇంకొకరికి చెప్పుకొఓడం, కుశల వార్తలడగడం జరుగుతుంది. సందేహాలు తీర్చుకున్న సీత, రామ లక్ష్మణుల చిహ్నాలేంటని అడగడం, హనుమంతుడు ఆమెకు నచ్చే రీతిలో చక్కగా
శ్రీరాముడి దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించి చెప్పడం, ఆ తర్వాత కథ. శ్రీ రామ ముద్రికను ఇచ్చి, తన మీద నమ్మకం కుదిరిందనుకున్న హనుమంతుడు
సీతను తన వీపు మీద కూర్చోబెట్టుకుని శ్రీ రాముడి దగ్గరకు తీసుకెళ్తానంటాడు. ఆమె నిరాకరిస్తే, ఆమెను కల్సినట్లు గుర్తుగా ఏమన్నా
ఇవ్వమంటాడు. కాకాసుర వృత్తాంతాన్ని చెప్పి, చూడామణి నిచ్చి, హనుమంతుడిని ఆశీర్వదించి సెలవిస్తుంది
వెళ్ళి రమ్మని సీతాదేవి.
శత్రువుల బలా-బలాలు తెల్సుకోదల్చిన హనుమంతుడు, వెంటనే తిరిగి పోకుండా, అశోక వనాన్ని పాడు చేసి కయ్యానికి కాలు
దువ్వుతాడు. రావణుడికి కోపం వచ్చి పంపిన కింకరులను
మట్టుపెట్తాడు. హనుమంతుడు జయఘోశ చేస్తూ ప్రతీకారంగా
పంపబడిన చైత్య పాలకులను చంపుతాడు. జంబుమాలి వధ, మంత్రి పుత్రుల చావు, సేనానాయకుల మృతి, అక్ష కుమారుడి వధ వెంట-వెంట జరుగు తాయి. ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డ
హనుమంతుడిని తాళ్ళతో కట్టేయటంతో, బ్రహ్మాస్త్ర బంధనం వీడిపోతుంది. రావణుడికి తన వృత్తాన్తాంతా చెప్పి, లంకకు వచ్చిన కారణం చెప్తాడు హనుమంతుడు. రావణుడికి బుధ్ధి చెప్తుంటే కోపించిన ఆయన
హనుమంతుడుని దండించమన్నప్పుడు విభీషణుడి
బోధతో తోక కాల్చి పంపమంటాడు రావణాసురుడు.
ఆ తర్వాత, లంకా దహనం చేస్తాడు
హనుమంతుడు. సీతాదేవిని పునర్దర్శించి మళ్ళీ సెలవు తీసుకుని, గంట సేపట్లోనే సముద్రాన్ని లంఘించి, మహేందాద్రి పై దిగుతాడు. వానర మిత్రులకు లంకకు పోయివచ్చిన విధమంతా "దండకం" లాగా
చెప్తాడు. కిష్కిందకు చేరుకుని, శ్రీరాముడికి సీతాదేవి స్థితిని
వివరిస్తాడు. చూడామణినిస్తాడు. శ్రీరాముడికి హనుమంతుడు సీతా సందేశం
వినిపిస్తాడు. సుందరకాండలో ఆయా సందర్భాల్లో చేసిన వర్ణనలనేకం. మహేంద్ర పర్వతం వర్ణన, హనుమంతుడి గమనవేగ వర్ణన, మైనాకుడి వృత్తాంతం, లంక వెలుపలి ఉద్యానవన వర్ణన, లంకా నగర వర్ణన, చంద్ర వర్ణన, రావణుడి అంతఃపుర వర్ణన, రాక్షస స్త్రీల వర్ణన, పుష్పకవిమాన వర్ణన, రావణుడి వర్ణన, అశోకవన వర్ణన, సీతాదేవి దుఃఖ వర్ణన, సీతా రామచంద్రుల వర్ణన, శ్రీ్రాముడి విరహ తాప వర్ణన, కాకాసుర వృత్తాంతం, చూడామణి వర్ణన, రావణుడి సభలో రావణుడి వర్ణన, రాక్షస విలాప వర్ణన, అరిష్టాద్రి వర్ణన, మధువన వర్ణనలతో నిడివైంది సుందరకాండ.
ఈ వివరాలతో ప్రవచన
కార్యక్రమం ముగిసింది. ప్రతిరోజూ కార్యక్రమం చివర్లో శ్రీరామనుతి పఠించడం విశేషం.
No comments:
Post a Comment