Thursday, April 11, 2019

దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు రావాలి : వనం జ్వాలా నరసింహారావు


దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు రావాలి
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (12-04-2019)
జాతీయ రాజకీయాలకు తన అవసరం కావాల్సి వస్తే దాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా ఆయన పాల్గొంటున్న ప్రతి ఎన్నికల సమావేశంలో ప్రకటిస్తున్నారు. దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం అవసరమనీ, దేశ ప్రజలు ప్రబలమైన మార్పు కోరుకుంటున్నారని ఆయన అంటున్నారు. ఏడు దశాబ్దాల కాంగ్రెస్-బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. దీని నేపధ్యం సరిగ్గా ఏడాది క్రితం ఆయన చెప్పిన మాటల్లో వుంది. కేసీఆర్ ఏడాది క్రితం, మొట్టమొదటిసారిగా, మార్చ్ 3, 2018 న ప్రగతి భవన్లో టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులతో సమావేశం ముగిసాక మీడియాతో మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై వ్యక్తపరిచిన స్పందన గుర్తుచ్సుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని దుయ్యబట్టారు. రెండుపార్టీలు మార్చిమార్చి దేశాన్ని పరిపాలిస్తున్నా పథకాల పేర్ల మార్పిడి తప్ప ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఒరిగిందేమీలేదని ఆగ్రహం తెలియపర్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ సంఘటన గురించి ప్రస్తావిస్తూ, దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు రావాల్సిన ఆవశ్యకత గురించి జాతీయ స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. ఆవిర్భవించిన అనతికాలంలోనే అధికారం అందుకున్న రాజకీయ శక్తుల చరిత్ర గురించి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పటికే ఈ దిశగా ఆలోచనలు కొనసాగుతున్నాయని తానూ జాతీయస్థాయికి వెళ్లాల్సి వస్తే బాజాప్తా పోతామని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేసారు.

“దేశంకోసం పనిచేసే హక్కు మాకు లేదా?” అని సీఎం ఆ సందర్భంగా ప్రశ్నించారు. పంటల కనీస మద్దతు ధర ఐదొందలు రూపాయల చొప్పున పెంచాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. మీడియాతో జరిపిన సుదీర్ఘ సంభాషణలో ఆయన దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఆవశ్యకత గురించి పదేపదే నొక్కిచెప్పారు. ప్రబలమైన ఆవశ్యకత ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయో చరిత్ర చెప్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. జనతా పార్టీ పుట్టడం…ఎన్నికల్లో స్వీప్ చేయడం రోజుల్లో జరిగింది. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కొద్ది నెలల్లోనే స్వీప్ చేసింది. ఇక టీఆర్‌ఎస్ పుట్టిన కొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేసింది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలా ప్రారంభమవుతుందో చెప్ప లేం. కానీ సమయం నిర్ణయిస్తుంది. పనిమాత్రం ఆగదు అని పేర్కొన్నారు.

దేశంలో రాజకీయ పరివర్తన తీసుకురావడానికి తనవంతు కృషిచేస్తానని, మార్పు విషయంలో నాయకత్వం వహించాల్సి వస్తే తప్పక ఆలోచిస్తానని స్పష్టంచేశారు. 70 ఏండ్ల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెట్టుకోవడం సరైంది కాదని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన అనేక అంశాలు ఇప్పటికీ అమలుకాలేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కేంద్రం తెలంగాణకు చేసిన మెహర్బానీ ఏమీ లేదని, రాష్ర్టానికి ఉన్న హక్కుగా తప్పితే తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని స్పష్టంచేశారు.


సీఎం కేసీఆర్ వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే....
“రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన అనేక అంశాలు ఇప్పటికీ అమలుకాలేదు. వాటి మీదనే కేంద్రాన్ని పెద్దఎత్తున నిలదీయాలని, పోరాటం చేయాలని నిర్ణయించాం. ఇక రిజర్వేషన్ల విషయం ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా చెప్పాను. 70 ఏండ్ల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో పెట్టుకోవడం సరికాదని చెప్పాం. అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు కూడా ఈ మాట బలంగా చెప్పి పంపించాం. విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే రిజర్వేషన్లు మా రాష్ర్టాల పరిధిలో మేం ఇచ్చుకుంటున్నాం. మేం కేంద్రాన్ని అడుగడం లేదు. కాబట్టి, ఈ అంశం మీ దగ్గర పెట్టుకోవద్దని చెప్పాను. దానిపైన స్పందన లేకపోగా పాతపద్ధతే కొనసాగిస్తామని చెప్తున్నారు. దీనిపైనా పెద్దఎత్తున పోరాటం కొనసాగిస్తాం. రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేయవచ్చనని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది పెద్ద విషయం కాదు. కేంద్రం అనుకుంటే ఆర్టికల్ 16 ను సవరించవచ్చు. దీనికి అన్ని రాష్ర్టాలు సపోర్ట్ చేస్తాయి. ఏకగ్రీవంగా బిల్లు పాస్ అయితది. కానీ కేంద్రం తన పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అసలు రహస్యం ఇదే”.

ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రెండు రాష్ర్టాలకు ఇవ్వాలని విభజన చట్టంలో చెప్పారు. కానీ కంటితుడుపుగా ఒకటో రెండో ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది. వీళ్లు (బీజేపీ) తీసేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కొనసాగించాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తం. గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని కూడా మా ఎంపీలు పోరాటం చేస్తరు. ఇవికాకుండా తెలంగాణకు ఇవ్వాల్సిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఎయిమ్స్, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, ఇలా అనేకం పెండింగ్‌లో ఉన్నయి. వీటిపైన కేంద్రాన్ని నిలదీస్తం”.

“బీజేపీ, కాంగ్రెస్ రెండూ దొందూదొందే. దేశంలో గుణాత్మకమైన మార్పు రావడం లేదు. రావాల్సిన అక్కర ఉన్నది. చాలా సీరియస్‌గా దేశంలో ఏదో ఒకటి జరుగాల్సి ఉంది. 70 ఏండ్ల నుంచి దేశం ఇదే మూసలో పోవాల్సిన అవసరం లేదు. దేశ రాజకీయాల్లో అనేక విషయాల్లో ప్రబలమైన మార్పు రావాలి. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్న. ఎట్టిపరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్ ఆ స్టాండ్‌మీదనే కొనసాగుతది. దాంట్లో ఎలాంటి అనుమానం వద్దు. మూడో ప్రత్యామ్నాయమా, మరోటా అనేది పక్కనపెడితే ఒకటి వెరీ క్లియర్. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముంది. ప్రజలు దానికోసం ఎదురుచూస్తున్నరు. విసిగిపోయారు. 70 సంవత్సరాలు గడిచిపోయినయి. తక్కువ సమయం కాదు. చాలా సుదీర్ఘ సమయం. అందుకే మార్పుకు శ్రీకారం చుట్టబడుతుంది. ఒక ఆరు సంవత్సరాల తక్కువ సమయాన్ని మినహాయిస్తే, మిగిలిన 64 సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ లేదా బీజేపీ పాలించాయి. జాతికి వాళ్లు ఏం సమాధానం చెప్తారని నేను సీరియస్‌గా డిమాండ్ చేస్తున్న. 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో తాగేందుకు నీళ్లు లేవు. ఇది నిజం కాదా? అబద్ధమా? ఎన్ని రోజులు ఈ స్టోరీలు వింటం? దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉంది. వందశాతం దేశంలో గుణాత్మక మార్పు రావాలనే దానికి నేను కట్టుబడి ఉన్న. దేశంలో ఓ ప్రశ్న వినిపిస్తున్నది. కాంగ్రెస్ పోయింది...బీజేపీ వచ్చింది. కానీ ఏం మార్పు తెచ్చింది? ఏం జరిగింది? పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నరు. రైతులకేంచేశారో చెప్పండి. ఫలానా పని చేసినమని చెప్పండి. ఎత్తి చూపించే పథకమేందో చెప్పండి. మీరు పెట్టిన కిరీటమేందో చూపండి. రైతుల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని మేం డిమాండు చేసినం. ఇప్పుడున్న ఎమ్మెస్పీకి ఓ ఐదేసి వందలు పెంచండి చూద్దాం”.

“అధికారంలోకి ఎవరొచ్చినా, పథకాల పేరు మార్పు మాత్రమే జరుగుతది. జాతీయ రాజకీయాలకు కేసీఆర్ అవసరమైతే.. దేశం కోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తాను. దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం అవసరం. దేశ ప్రజలు పరివర్తన కోరుకుంటున్నారు. అందుకు వారిని సిద్ధంచేయాలి. గుణాత్మకమైన మార్పురావాలి. అన్ని రంగాల ప్రజలను ఆదుకోవాలి. దేశ రాజకీయాల్లో మార్పురావాలి. అది గుణాత్మకంగా ఉండాలి. జాతీయ రాజకీయాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రబలమైన ఆవశ్యకత ఉన్నపుడు ఎలాంటి మార్పులు జరిగాయో చరిత్రలో ఉన్నాయి. జనతా పార్టీ పుట్టడం, ఎన్నికల్లో స్వీప్‌చేయడం కేవలం కొద్ది రోజుల్లోనే జరిగింది. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన 10 నెలల్లోనే స్వీప్‌చేసింది. ఇక టీఆర్‌ఎస్ పుట్టిన కొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేసి, అనంతరం తన లక్ష్యాన్ని విజయవంతంగా ముద్దాడింది. ఇవి అందరి మనసులో ఉంది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ప్రారంభమవుతుందో చెప్పలేం. కానీ సమయం నిర్ణయిస్తుంది. పని మాత్రం ఆగదు. జాతీయ రాజకీయాల గురించి ఇప్పటికే ఆలోచనలు కూడా ప్రారంభమయ్యాయి. మాట్లాడేవారు మాట్లాడుతున్నారు”.

“ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నా. థర్డ్‌ఫ్రంట్ అంటరో.. మరో ఫ్రంట్ అంటరో లేక మెయిన్ ఫ్రంట్ కూడా కావొచ్చు. భారత రాజకీయ పరివర్తనలో మార్పు తీసుకరావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నాకు వ్యక్తిగత మిత్రుడు. ఆయనతో కలిశా. మాట్లాడా. రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. మార్పు విషయంలో నాయకత్వం వహించాల్సి వస్తే తప్పక ఆలోచిస్తా. జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహించే అవకాశం వస్తే తెలంగాణవాదులంతా గర్వపడాలి. ఎప్పటినుంచో తెలంగాణ సాధించాలనే తపన ఉంది. 2001 నుంచి బయటికి వచ్చి పోరాడినం. టీఆర్‌ఎస్ ఏర్పడిన మొదటి ఏడాదే స్థానిక ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌చేశాం. 11 ఏండ్లకు తెలంగాణ సాధించాం. తెలంగాణలో ప్రజలందరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు తప్ప ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. తెలంగాణ శాంతియుతంగా ఉంది. ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ప్రజలకు ఏ ఇబ్బంది లేదు. ఆరోగ్యం సహకరించి, భగవంతుడి ఆశీస్సులు ఉంటే దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు తీసుకొచ్చేందుకు కృషిచేస్తా. త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుంది”. దీనర్థం రాజకీయాల్లో గుణాత్మక మార్పు తధ్యం".

No comments:

Post a Comment