Sunday, April 21, 2019

హైదరాబాద్ విలీనంతో కమ్యూనిస్ట్ పార్టీకి సమస్య ..... వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


హైదరాబాద్ విలీనంతో కమ్యూనిస్ట్ పార్టీకి సమస్య
వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (22-04-2019)
నాలుగున్నర సంవత్సరాల పాటు సాగిన న్యాయస్థానం విచారణను, కమ్యూనిజం సందేశం ప్రజల్లోకి పంపే ఆయుధంగా ఉపయోగించుకున్నారు నిందితులు. కమ్యూనిజం ఉద్యమంగా బలపడ సాగింది. స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో, మరి కొన్నాళ్లలో, స్వతంత్రం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి జోషి మితవాద వైఖరిని, అతివాద భావాల రణదివే అనుచరులు వ్యతిరేకించారు. ఫిబ్రవరి 1948లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, "స్వతంత్ర భారతదేశం" అంటే, "బ్రిటీష్ సామ్రాజ్య వాదుల పాక్షిక వలస ప్రాంతం" గా పేర్కొని, మితవాదిగా ముద్రవేసిన జోషిని తప్పించి, రణదివే ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది.

మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ ప్రతిఘటన, ఎలా సాగిందో, సవివరంగా, స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య తన "వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు" పుస్తకంలో తెలియచేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది. ఆ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. ఆ నాయకత్వానికీ-నూతన రాజకీయ విధానానికి మద్దతు పలికిన వారికీ, తెలంగాణా సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తున్న వారికీ మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయిందని వివరించారు సుందరయ్యగారు తన పుస్తకంలో. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్య గారు వ్యాఖ్యానించారు. దరిమిలా అజయకుమార్ ఘోష్ ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించారు.


భారత దేశంలో పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి  అనుకూలంగా లేవని, ప్రాధమిక దశలో వ్యావసాయిక ప్రాధాన్యమైన విప్లవం చేపట్టడానికి వీలు కావచ్చునని, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుందని", గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అరవై ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్‍ను సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్పష్టం చేశారు స్టాలిన్. చి యాంగ్‌కై-షేక్  తో జవహర్ లాల్ నెహ్రూను పోల్చడం సరికాదని, నెహ్రూ బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని, ఆయనకు ప్రజల్లో అభిమానం బలంగా వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్. మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ  ఆవిర్భావం-ఎదుగుదల గురించి, చీలికల గురించి, అభిప్రాయ భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

         అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1951 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉపసంహరించి సుమారు అరవై ఏళ్లు కావస్తోంది. ఉపసంహరణ పూర్వ రంగంలో,  భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం, సోవియట్ ప్రతినిధి వర్గానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. చారిత్రక ప్రాధాన్యమున్న అందులోని విషయాలు తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాకుండా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. (సశేషం)

No comments:

Post a Comment