ధర్మాన్ని బోధించిన ఆదికావ్యం
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (13-04-2019)
శ్రీ
సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రను, వీరు ఆచరించిన
ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శత కోటి
గ్రంథాత్మకమైన ప్రబంధంగా, ఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికి, ఇతర మహర్షులకు
ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై శ్రీరామ
భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి
రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే.
వాల్మీకి
సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది,. శ్రీమద్రామాయణంలో
నాయిక సాక్షాత్తు శ్రీదేవైన సీతా దేవి. నాయకుడు మహావిష్ణువైన
శ్రీరామచంద్రమూర్తి. వీరిరువురు త్రేతాయుగంలో దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ
చేసి,
ధర్మ
సంస్థాపన చేసేందుకు అవతరించారు. ఇహ-పర సాధకంబులైన "స్వధర్మాలలో, స్త్రీ ధర్మం
సీతని,
పురుష
ధర్మం శ్రీరామచంద్రమూర్తని లోకానికుపదేశించాడు వాల్మీకి.
శ్రీరామచంద్రుడు
బాలుడుగా వున్నప్పుడు జరిగిన సంగతులు తెలిపేది "బాల కాండ". ఇందులోనే
సీతాకల్యాణ ఘట్టం అత్యంత మనోహరంగా రాసారు వాల్మీకి కవి. "కాండం"అంటే జలం...అంటే
నీరు.
శ్రీ
రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్ల, అందులోని జలం కాండమన్నారు. శ్రీ రామాయణంలోని
బాల కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన
కారణభూతుడు"
అని
బోధపడుతుంది.
జననం
మొదలు ఇరవై అయిదు ఏళ్లు వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయి. పన్నెండో ఏట
పెళ్లైనప్పటినుండి పట్టాభిషేకం ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు. బాల కాండ వృత్తాంతమంతా
12 సంవత్సరాల కాలంలో జరిగింది.
రామాయణ రచనకు పూనుకున్న వాల్మీకి మహర్షి, భగవద్విషయాన్ని బోధించే
యోగ్యతలున్న గురువు దొరకలేదనే నిర్వేదంతో శుష్కించి, తన ఆశ్రమానికి వచ్చిన
నారదుడికి
సాష్టాంగ నమస్కారం చేసి: "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం
మీరనివాడు,
సమస్త
ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని
స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో
దేవదానవులను గడ-గడలాడించ
గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు
వేస్తాడు. వాస్తవానికి
ఈ గుణాలన్నీ వున్నవాడు శ్రీరామచంద్రుడే! అందుకే ఆయన చరిత్రను మనకందించాడు వాల్మీకి
మహర్షి.
బాల
కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి
కారణం,
అరణ్య
కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార
శక్తి,
యుద్ధ
కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం
జరిగింది.
రామాయణంలో
చెప్పబడిన పరతత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పరతత్వాన్ని
స్థాపించి,
పరమాత్మ
అనుభవించే ఉపాయం శరణాగతని అర్థం చేసుకోవాలి. శరణా గతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. శరణాగతికి పురుష కారం
అవశ్యం.
పురుష
కారానికి కావాల్సిన ముఖ్య గుణం శరణాగతుడి పట్ల దయ. రామాయణంలో పురుష కారం
ప్రధానమైంది.
శరణాగతుని
అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్య వలన
పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రుఘ్నుడి చర్యలు
భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. మనం సదా జపం చేయాల్సింది
రామాయణమే.
రామావతారం
పూర్ణావతారమే.
అంటే
ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను
బాధించవు.
రామచంద్రమూర్తి
శోకించాడని వాల్మీకి రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం
కలిగిందాయనకు.
అయితే
శోకం కలిగింది తన కొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని
మనుష్యులు దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం
ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి
కారణమయ్యానని మాత్రమే రాముడు శోకించాడు. అలానే, సీతాదేవి విషయంలోనూ
దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందని
రామచంద్రమూర్తి దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించే వాళ్లు
మనుష్యులు.
జీవులకు
కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు. శ్రీరామ చరిత్ర అంటే
మహాపురుష చరిత్రే. అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన బాల కాండ
మొదటి పద్యం లోనే వివరించబడింది.
శ్రీ రామాయణం, భారతం,
భాగవతం అద్వితీయమైన గీర్వాణ భాషా గ్రంథాలు. ఈ మూడింటి లో ఆద్యమైంది
శ్రీ రామాయణ కావ్యం. కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది కావడంతో
ఆదికావ్యమైంది. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు-అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే
లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. "శ్రీరామాయణం"
అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ
చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. సీతాదేవి
మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ
రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్తు" అని వెల్లడిచేశాడు. శ్రీరామచంద్రుడు
మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకేమో
వాస్థవార్థం చెప్తూ, ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు.
రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను
చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీరాముడు భగవంతుడేనన్న
అర్థం, హారంలోని సూత్రంలాగా, రామాయణంలోని
ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది. రామాయణాన్ని చదివేవారందరు,
ఈ అర్థాన్ని మనస్సులో పెట్టుకొని, ఇందులోని
ప్రతి అంశాన్ని-ప్రతి వాక్యాన్ని హెచ్చరికతో శోధించాలి. ఇలా ఆసక్తిగా శోధించిన
వారికి-పరీక్షించిన వారికి మాత్రమే, వాల్మీకి
రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది.
(ఆంధ్ర) వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు,
ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా,
సందర్భోచితంగా, వారున్న
అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. పాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు
ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే
చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో. వాల్మీకి రామాయణమనే "కలశార్ణవం" లో
రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది
వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే,
చీకట్లో తారాడినట్లే. ఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట
చెప్పడు. కొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదు. అదే విషయం
మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చు.
ఆయన చేసిన వర్ణనలను బట్టి, ప్రయోగించిన
పదజాలాన్ని బట్టి, పాఠకులు ఊహించుకోవచ్చు.
వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం "ధ్వని
కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని
కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం
వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం
వుంది. శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన,
అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం,
ప్రజా ధర్మం, పతి ధర్మం,
సతీ ధర్మం, భాతృ
ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు
ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది.
లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం
మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా
సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు
చెప్పబడ్డాయి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చర్యల వలన భాతృ ధర్మం,
సుగ్రీవుడి చర్యల వలన మిత్ర ధర్మం, హనుమంతుడి
చర్యల వలన భృత్యు ధర్మం తెలియ చేయబడ్డాయి రామాయణంలో. రామాయణంలో సకల ధర్మాలున్నాయి.
ఇందులో వున్న ధర్మాలే మిగిలిన అన్ని గ్రంథాలలోనూ కనబడతాయి. ఇందులో లేని ధర్మాలు
మరింకేదాంట్లోను కనిపించవు.
ఇలా (ఆంధ్ర) వాల్మీకి రామాయణంలో ఒకటి కాదు...వందల...వేల రకాల
వ్యావహారిక, ప్రాపంచిక, ధర్మ,
అర్థ, కామ, మోక్ష సంబంధమైన అనేకానేక విషయాలు వుండడం వల్ల దానిని మించిన గ్రంథం
మరోటి లేదని అంటారు.
(ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు
రచించిన ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)
No comments:
Post a Comment