పార్టీకి మంచి పట్టుండే తెనాలిలో సదస్సు
వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (26-04-2019)
"సన్నాహక సదస్సును విజయవాడలో నిర్వహించాలని
తొలుత భావించారు. కాని ప్రభుత్వం దానికి ఆటంకం
కల్పించింది. ఆ సమయంలో విజయవాడ నగరంలో భారీ స్థాయిలో సాగిన గృహదహనాల కారణంగా
ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. కాంగ్రెస్‌వాళ్లు
పార్టీపై దుష్ప్రచారానికీ, దాడులకూ
పాల్పడ్డారు. పాత జైహింద్‌టాకీస్‌వద్ద ఏర్పాటుచేసుకున్న పార్టీ కార్యాలయంపై కూడా
దుండగులు దాడులకు పాల్పడే పరిస్థితి. అటువంటి
పరిస్థితుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చే ప్రతినిధులు ఒక చోట కూర్చుని
చర్చించే వాతావర ణమూ లేదు, పోలీసులు
కూడా అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. దాంతో
సమావేశ స్థలాన్ని అక్కడకు దగ్గరలోనే ఉన్న గుంటూరు జిల్లా తెనాలికి మార్చారు".
"తెనాలిలో
నాడు పార్టీకి మంచి పట్టుండేది. ప్రతినిధులకు
కావలసిన వసతులు సమకూర్చ డానికి కావలసిన ప్రాంగణాలు కూడా అక్కడ ఉన్నాయి.
దాంతో తక్కువ సమయంలోనే సదస్సు నిర్వహణకు అక్కడ ఏర్పాట్లు జరిగాయి.
తెనాలిలో సదస్సు జరపాలని పార్టీ జాతీయ కౌన్సిల్‌నుండి వాకౌట్
చేసినవారు నిర్ణ యించుకున్నట్లు సాయంత్రం ఏడు గంటలకు రేడియో వార్త వెలువడింది.
అంతే రాత్రి ఎనిమిది గంటల సమయానికి పట్టణంలోని లాడ్జీ లన్నిటినీ
ప్రభుత్వాధికారులే బుక్ చేశారు. దాంతో
ప్రతినిధులకుగాని, నాయకులకు గాని ఎక్కడా వసతి దొరకని
పరిస్థితి. దాంతో చెంచుపేటలో రైల్వేస్టేషన్‌దగ్గరలోనే కోనేరు పక్కన పాడుపడిన
రైసు మిల్లును శుభ్రం చేసి సదస్సు ప్రధాన ప్రాంగణంగా ఉపయోగించారు.
ఈదర శివరామకృష్ణయ్య అనే పార్టీ సానుభూతిపరుడు ఆ రైసుమిల్లును అద్దెకు
తీసుకుని నడిపాడు. కాని కొన్నాళ్లు నడిచి ఆగిపోయింది.
దానిపేరు రాజ రాజేశ్వరీ రైస్‌మిల్లు. రైసుమిల్లు
ఒక ఇనుప రేకుల షెడ్డు. దానికి ప్రక్కనే ఒక తాటాకు పాక
వేశారు. అదే ప్రతినిధుల భోజనశాల. సదస్సు
ప్రాంగణానికి కోటేశ్వరనగర్‌అని పేరుపెట్టారు. సదస్సు
ఏర్పాట్లలో రావి హైమారావు పూర్తికాలం
పనిచేయగా ఆయన కుటుంబం సహకరించింది".
"మూడు రోజుల సదస్సు నిర్వహణలో దాదాపు 20
మంది కార్యకర్తలు ఆహోరాత్రులు కష్టపడ్డారు. నాలుగో
రోజు బహిరంగ సభ జరిగింది. కామ్రేడ్స్
లావు బాలగంగాధరరావు, కొరటాల సత్యనారాయణ,
పర్చూరు నాగేశ్వరరావు, సదస్సు
ఏర్పాట్లు పర్యవేక్షించారు. అయితే
సదస్సు సమయంలో మాత్రం కామ్రేడ్ లావు బాలగంగాధరరావు అక్కడ లేరు.
పార్టీ అగ్రనాయకులు మాకినేని బసవ పున్నయ్య సతీమణి,
బాల గంగాధరరావు సోదరి జగదాంబగారు తీవ్ర అస్వస్థతతో ఉండడమే దీనికి
కారణం. ఆ సదస్సులో ఖరారు చేసిన పార్టీ కార్యక్రమ పత్రాలు తయారు చేయడంలో బసవ
పున్నయ్య తలమునకలయ్యారు. దాని వల్ల
జగదాంబగారి దగ్గర గంగాధరరావు ఉండాల్సి వచ్చింది. బసవపున్నయ్య
కూడా సదస్సులో ప్రవేశపెట్టే పత్రాలను చాలావరకు ఇంటివద్దనే ఉండి తయారుచేశారు.
ఈ సమస్య వల్లనేనేమో తెనాలి సదస్సు సందర్భంగా తీసిన ఏ ఫోటోలో కూడా
బసవపున్నయ్య కనిపించరు. తరవాత
జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో కూడా బసవ పున్నయ్య లేరు. సదస్సులో
వాలంటీర్స్‌గా పనిచేసినవారిలో గడ్డిపాటి కోటేశ్వరరావు, కొండ్రగుంట
వెంకటేశ్వర్లు, రాశాబత్తుని నాగేశ్వర రావు, గుదిబండి
శివబసివిరెడ్డి, దేవా సీతారామయ్య, దొడ్డపనేని
వెంకటేశ్వరరావు, సింహాద్రి శివారెడ్డి తదితరులున్నారు".
"తెనాలి సదస్సు పార్టీలో తీవ్రమైన ఆంతరంగిక పోరాటానికి పరాకాష్టగా
జరిగింది. అందువల్ల పత్రికల్లో ఈ సదస్సు గురించి తీవ్రమైన చర్చోపచర్చలు జరిగేవి.
ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీగా ఏర్పడిన నాయకులపైనా,
వారి వైఖరిపైనా దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుని పత్రికలు
విషప్రచారం గావించాయి. సదస్సు జరిగినంత కాలం కామ్రేడ్
హరేకృష్ణ కోనార్ పత్రికా గోష్టి పెట్టి వివరణ ఇచ్చేవారు. సదస్సు
ఏర్పాట్లలో భాగంగా కార్యకర్తలు ప్రాంగణంలోని అయిదు స్థంభాలకు అయిదుగురు అంతర్జాతీయ
కమ్యూనిస్టు నేతల ఫోటోలు తగిలించారు. మార్క్స్,
ఎంగెల్స్, లెనిన్,
స్టాలిన్, మావోల
ఫోటోలు. ఆర్ట్ పెయింట్ తో వేసిన ఆ ఫోటోలను మంచికలపూడికి చెందిన కొండపనేని
రంగారావు జెకోస్లోవేకియా నుండి తెచ్చారు. ఆ ఫోటోలలో
మావో బొమ్మ ఉండడం, అప్పుడు చైనాకు వ్యతిరేకంగా దేశంలో
ప్రచారం జరుగుతుండడంతో పత్రికల్లో పెద్ద దుమారం రేపారు. ఇండియన్
ఎక్సప్రెస్ లో "మావో పార్టీ" అని సంభోదిస్తూ
సదస్సు గురించి వార్త రాశారు. అప్పటికి
ఉమ్మడి పార్టీనుండి చీలిపోయిన వారు పార్టీకి పేరుపెట్టలేదు.
చైనా అనుకూలురుగా ముద్రవేస్తూ పత్రికలు పెద్ద ఎత్తున వ్యతిరేక
వార్తలు రాసేవి. తెనాలి సదస్సు మూడు రోజులు పాటు జరగగా నాలుగో రోజున బహిరంగ సభ
జరిగింది. తెనాలి మున్సిపల్ ఆఫీసు ప్రాంతాన్ని అప్పట్లో గాడిబావి సెంటర్ అనేవాళ్లు.
అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. సుమారు
పదివేల మంది హాజరైన సభనుద్ధేశించి బసవ పున్నయ్య, సుందరయ్య,
ప్రమోద్ దాస్ గుప్త తదితరులు ప్రసంగించారు. వేదిక
నిర్మాణం, బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక కార్మిక సంఘం కార్యకర్తలు
నిర్వహించారు".
No comments:
Post a Comment