శ్రీరామచంద్రుడు సాక్షాత్తు దేవుడే!
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక ఆదివారం అనుబంధం (14-04-2019)
వాల్మీకిని
రామాయణం రాయమని ప్రోత్సహించడానికి వస్తాడు నారదుడు. అలా వచ్చిన నారదుడిని పదహారు
ప్రశ్నలు వేశాడు వాల్మీకి.
"గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు,
కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు,
నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు,
ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల
వాడు, అసూయ లేనివాడు,
రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా ఈ భూలోకంలో
వున్నారా?"
అని అడిగాడు. నారదుడు ఆ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో ఆ
గుణాలన్నీ వున్న ఒకేఒక వ్యక్తి శ్రీరాముడనే అర్థం స్ఫురణకు స్పష్టంగా వస్తుంది.
వాల్మీకికి కావాల్సిన అనను గుణాలున్న వ్యక్తి ఆగుణాలకు ఎలా అర్హుడనేది రామాయణం
చదివితే అర్థమవుతుంది.
బాల్యంలోనే
శ్రీరాముడు గుహుడు లాంటి ఆటవిక జాతి వారితో సహవాసం చేయడంతో, ఆయన గుణవంతుడు అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి వీర్యవంతుడు అయ్యాడు.
గురువాజ్ఞ మీరక పోవడం, జనకాజ్ఞ జవదాటక పోవడం, పరశురాముడిని చంపక పోవడం లాంటివి రాముడు
ధర్మజ్ఞుడు అని తెలుపుతాయి. అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా, దృఢవ్రతుడిగా,
సచ్చరిత్రుడుగా తెలపడమే. విద్వాంసుడు, సమర్థుడు అనే విషయాలను కిష్కింధ కాండలో
హనుమంతుడితో రాముడు జరిపిన సంభాషణ, వాలి వధల ద్వారా అర్థమవుతుంది. అరణ్యకాండలో కాకాసుర
రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను, సర్వ భూత హితాన్ని తెలుపుతుంది. సుందర కాండలో
హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది వివరిస్తుంది. విభీషణ
శరణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించక
పోవడం, చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం, రాముడి జితక్రోధత్వాన్ని
తెలుపుతుంది. విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా. ఇలానే
రాముడు కాంతియుక్తుడనీ, భయంకరుడనీ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.
వాల్మీకి
శ్లాఘించిన గుణాలు అసమానమైనవి. ఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని వుండడంతో అవి
అనేకమయ్యాయి. మనుష్యమాత్రులలో ఇవి కనపడవు. ఇట్టి సుగుణ సంపత్తికలవాడు, ఇక్ష్వాకుల రాజవంశంలో,
“రామా రామా రామా”, అని లోకులు పొగిడే
రామచంద్రమూర్తి మాత్రమే. అతివీర్యవంతుడాయన. అసమానమైన, వివిధమైన, విచిత్రమైన
శక్తిగలవాడు. స్వయంగా ప్రకాశిస్తాడు. అతిశయం లేని ఆనందం ఆయన సొంతం. ఇంద్రియాలను, సకల
భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. శ్రీమంతుడు. ఎవరిపై శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని నాశనం చేసే వాడు.
శంఖంలాగా మూడు
రేఖలున్న కంఠo, విశాలమైన వక్షస్థలం వున్నాయి రాముడికి.
శత్రు సమూహాలకు ప్రళయకాల యముడిలాంటి వాడు. యుద్ధంలో భయంకరుడు. శ్రీరామచంద్రమూర్తి
చేతులు మోకాళ్లకు తగిలేంత పొడుగ్గా వుంటాయి. అందమైన వక్షం, అసమాన సౌందర్యమున్న నొసలు, చూసేవారిని మైమరిపించే
నడక గలవాడు. అందంగా, శాస్త్రంలో చెప్పినట్లుగా, పరిమాణంలో ఒకదానికొకటి
సరిపోయే అవయవాలున్నాయి. ప్రకాశించే దేహ కాంతి, భయంకరమైన శత్రువులకు
సహించలేని ప్రతాపం,
మనోహరమై, బలిసిన మంచి వక్షం వున్నవాడు. కీర్తించదగిన నిడివి, వెడల్పాటి కళ్లు,
ఎదుటివారు మెచ్చుకునే వేషం, శ్లాఘ్యమైన శుభ చిహ్నాలు, శుభం కలిగించే ఆకారం, మంచి గుణాల మనోహరుడాయన. కనుబొమలు, ముక్కు పుటాలు, కళ్లు,
చెవులు, పెదాలు, చను ముక్కులు,
మోచేతులు, మణికట్టు, మోకాళ్లు,
చేతులు, కాళ్లు, పిక్కలు,
ఎవరికి సమానంగా వుంటాయో వారు భూమిని ఏలుతారని సాముద్రిక
శాస్త్రంలో వుంది. ఇవన్నీ శ్రీరాముడికున్నాయి.
ఆశ్రితులు
అనుభవించేందుకు అనువైన-యోగ్యమైన దివ్య మంగళ విగ్రహానికి తోడు, ఆశ్రితులను రక్షించేందుకు అనువైన గుణాలు కూడా వున్నాయి. శ్రీరామచంద్రుడు
ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు. క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్య
వ్రతంగా ఆచరించేవాడు. చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు. సమస్త భూజనులకు మేలైన కార్యాలనే
చేసేందుకు ఆసక్తి చూపేవాడు. దానధర్మాలు, స్వాశ్రితరక్షణ వల్ల
లభించిన యశస్సు,
శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు. సర్వ విషయాలు
తెలిసినవాడు. బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు. మిక్కిలి పరిశుద్ధుడు. ఋజుస్వభావం గలవాడు.
ఆశ్రిత రక్షకుడు. ఆత్మతత్వం ఎరిగినవాడు. ఆశ్రితులకు, మాత,
పిత,
ఆచార్యులకు, వృద్ధులకు వశ పడినవాడు.
విష్ణువుతో సమానుడు. శ్రీమంతుడు. లోకాలను పాలించ సమర్థుడు. ఆశ్రిత శత్రువులను, తన శత్రువులనూ అణచగలిగినవాడు. ఎల్ల ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడు.
ధర్మాన్ని తానాచరిస్తూ,
ఇతరులతో ఆచరింపచేసేవాడు. స్వధర్మ పరిపాలకుడు.
స్వజనరక్షకుడు. వేద వేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు.
శ్రీరాముడు సర్వ
శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరి. జ్ఞాపకశక్తిగలవాడు. విశేషప్రతిభగలవాడు.
సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడు. సాధువు. గంభీర ప్రకృతిగలవాడు. అన్ని విషయాలను
చక్కగా బోధించగలవాడు. నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల
పొందుగోరేవాడు. అందరిమీద సమానంగా వారి, వారి యోగ్యత కొద్దీ ప్రవర్తించేవాడు.
గొప్పగుణాలున్నవాడు. ఎప్పుడూ, ఏకవిధంగా, మనోహరంగా దర్శనమిచ్చేవాడు. సమస్తభూతకోటికి పూజ్యుడు. అన్నింటా గుణ శ్రేష్ఠుడు.
కౌసల్యా నందనుడని ఆయనకు పేరు. గాంభీర్యంలో సముద్రుడంతటివాడు. ధైర్యంలో హిమవత్పర్వత
సమానుడు. వీర్యాధిక్యంలో విష్ణు సమానుడు. చంద్రుడిలా చూసేందుకు ప్రియమైన వాడు.
కోపంలో ప్రళయకాలాగ్ని. ఓర్పులో భూదేవంతటివాడు. దానంలో కుబేరుడు. అసమాన సత్యసంధుడు.
ధర్మానికి మారుపేరు. ఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు.
రామావతారం
పూర్ణావతారమే. అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను
బాధించవు. రామచంద్రమూర్తి శోకించాడని వాల్మీకి అనేకసార్లు రాసిందీ అసత్యం కాదు.
నిజంగానే శోకం కలిగిందాయనకు. అయితే శోకం కలిగింది తనకొచ్చిన కష్టానికి కాదు. తమకు
దుఃఖాలొచ్చాయని మనుష్యులు దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానేనని మాత్రమే రాముడు
శోకించాడు. సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన
సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే,
తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం
కలిగిందోనని రామచంద్రమూర్తి దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి
దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు.
శ్రీరామచంద్రుడు
వానర సేనలతో సముద్రం దాటి,
లంకలో నిర్భయంగా ప్రవేశించి, యుద్ధభూమిలో రావణుడిని చంపి, సీతాదేవిని చూసి, ఇన్నాళ్ళూ పగవాడింట్లో వున్న ఆడదానిని ఎట్లా స్వీకరించాలా అని సిగ్గుపడి, సీతాదేవిని కఠినోక్తులాడుతాడు. పతివ్రతైన సీత, తన పాతివ్రత్య మహిమను లోకానికంతా తెలపాలని తలచి, లక్ష్మణుడు పేర్చిన చితిలో మండుటెండలో ప్రవేశిస్తుంది. అప్పుడు అగ్నిహోత్రుడు
సీతను బిడ్డలాగా ఎత్తు కొచ్చి, సీతాదేవి వంటి పతివ్రతలు
లోకంలో లేరనీ,
ఆమెలో ఎట్టి లోపించలేదని, ఆమెను గ్రహించమని శ్రీరామచంద్రమూర్తికి అప్పగిస్తాడు. శ్రీరాముడామెను మరల
స్వీకరించి,
బ్రహ్మ రుద్రాదిదేవతలందరు మెచ్చుకుంటుంటే సంతోషిస్తాడు.
దేవతా సమూహాల గౌరవం
పొందిన శ్రీరామచంద్రమూర్తి,
తను చేసిన పని, లోకోపకారం-లోక సమ్మతమైన
పనైనందున,
సంతోషపడ్తాడు. సీతామహాలక్ష్మి తోడుండగా, శ్రీరామచంద్రమూర్తి రాజ్యలక్ష్మిని తిరిగి యదార్థంగా పొందడంతో ముల్లోకాలు
మిక్కిలి సంతోషించాయి. శ్రీరామచంద్రుడు రాజ్యం చేసేటప్పుడు లోకాలన్నీ సంతోషించాయి.
సంతోషాతిశయంతో కలిగిన గగుర్పాటుతో సాదువులు, ధర్మాత్ములు బలపడ్డారు.
శ్రీ రామరాజ్యంలో సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకాని, రోగబాధలుకాని,
యీతిబాధలుకాని లేవు.
శ్రీరాముడు అనేక
అశ్వమేధ యాగాలను,
యజ్ఞాలను చేసి, బ్రాహ్మణులకు లెక్కపెట్ట
లేనన్ని ఆవులను,
ధనాన్ని దానమిచ్చి, తన సుఖాన్ని వదులు కోనైనా
ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించి, వైకుంఠ లోకానికి పోయాడు. శ్రీరామచంద్రమూర్తి, రాజ్య హీనులై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వ రాజుల వంశాల వారిని పిలిపించి, వారి పెద్దల రాజ్యాన్ని వారికిచ్చి, వారంతా స్వధర్మాన్ని
వీడకుండా కాపాడాడు. బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రులనే నాలుగు వర్ణాల వారిని
చక్కగా పరిపాలించాడు. స్వధర్మానుష్ఠానమే మోక్షకారణమనీ, పరధర్మానుష్ఠానం పతనకారణమనీ తెలియచేశాడు. పదకొండువేల సంవత్సరాలు ఇలా
రాజ్యాన్ని పాలించి విష్ణు లోకానికి చేరుకుంటాడు శ్రీరామచంద్రమూర్తి.
రామాయణం
పరిశుద్ధంగా చదివేవారికి,
వినేవారికి మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయి, ఏమాత్రం ఆలస్యం లేకుండా మోక్ష ఫలం కలుగుతుంది. అంతశక్తి దీనికుండటానికి కారణం, ఇది వేద స్వరూపమై,
వేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టి. అంతేకాదు, సంసార సాగరాన్ని తరింపచేస్తుంది కూడా. ఇది వినేవారు-చదివేవారు, అంతమాత్రాన సన్యాసులు కానవసరం లేదు. ఆయుస్సు పెరిగి, కొడుకులు-కూతుళ్లతో,
మనుమలు-ఇష్ట బంధువులతో అనుభవించి, మరణించిన తర్వాత మోక్షాన్ని-బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. పరిమితి
చెప్పనలవికాని మహత్త్వమున్న యీ రామాయణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివినా, ఇతరులు చదవగా విన్నా,
అర్థ విచారం చేసినా, అఖండమైన లాభం జరుగుతుంది.
దీన్ని చదవాలి-వినాలి. విషయ చింతన చేయాలి. వినేవారుంటే చదివి వినిపించాలి.
చదివేవారుంటే వినాలి. ఈ రెండూ జరగని కాలముంటే, విన్నదానిని-కన్నదానిని, విశేషంగా మననం చేయాలి. ఏదోవిధంగా మనస్సు దీనిపై నిలపాలి.
శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రను, వీరు
ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శత
కోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగా, ఓ బృహత్ గ్రంథాన్ని రచించి
నారదుడికి, ఇతర మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు.
అంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై శ్రీరామ భక్తుడైన వాల్మీకికి
ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి రచించిన
రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే.
వాల్మీకి
సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది,. శ్రీమద్రామాయణంలో
నాయిక సాక్షాత్తు శ్రీదేవైన సీతా దేవి. నాయకుడు
మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. వీరిరువురు
త్రేతాయుగంలో దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. ఇహ-పర సాధకంబులైన "స్వధర్మాలలో, స్త్రీ ధర్మం సీతని, పురుష ధర్మం శ్రీరామచంద్రమూర్తని
లోకానికుపదేశించాడు వాల్మీకి.
"శ్రీరామాయణం" అంటే, లక్ష్మీరమణుడైన
శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ
లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి
చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని
"సీతాయాశ్చరితం మహత్తు" అని వెల్లడిచేశాడు. శ్రీరామచంద్రుడు
మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకేమో వాస్థవార్థం చెప్తూ,
ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు
వాల్మీకి. శ్రీరాముడు భగవంతుడేనన్న అర్థం, హారంలోని
సూత్రంలాగా, రామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది.
అందుకే, ఇందుకే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు దేవుడయ్యాడు.
(ఆంధ్రవాల్మీకి
వావిలికొలను సుబ్బారావు రచించిన
ఆంధ్రవాల్మీకి
రామాయణం ఆధారంగా)
No comments:
Post a Comment