Monday, April 22, 2019

భద్రాచలం తెలంగాణదే!! ..... వనం జ్వాలా నరసింహారావు


భద్రాచలం తెలంగాణదే!!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (23-04-2019)
          ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చరిత్ర, భూగోళం అవగాహనలేని కొందరు అజ్ఞానులు, కుహనావాదులు భద్రాచలం ఆంధ్రప్రదేశ్ లో భాగమని వితండ వాదన చేస్తున్నారు. వాస్తవానికి అనాదిగా భద్రాచలం తెలంగాణ ప్రాంతంలోనిదేననీ, అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముమ్మాటికీ దానిలో అంతర్భాగమేననీ చారిత్రిక ఆధారాలు, రుజువులు తెలియచేస్తున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడెమీ, “అభ్యుదయ తెలంగాణ చరిత్రాంశాలు” శీర్షికన ప్రచురించిన స్వర్గీయ మాదిరాజు రామకోటేశ్వరరావు వకీల్ స్వీయచరిత్రలో భద్రాచలక్షేత్ర అపూర్వ విషయాలు కూలంకషంగా వివరించడం జరిగింది. ఇది చదివితే చారిత్రిక నేపధ్యంలో భద్రాచలం ఏ ప్రాంతానిదో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ రాష్ట్రంలో అలనాటి స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఉవ్వెత్తున లేచిన ఆంధ్రమహాసభల మూలపురుషులలో ఒకరు మాదిరాజు రామకోటేశ్వరరావు. ప్రజాహిత ఉద్యమాలన్నింటిలో ప్రముఖ పాత్ర వహించిన ఆయన స్వీయచరిత్ర కేవలం ఒక వ్యక్తి చరిత్రే కాకుండా, అభ్యుదయ తెలంగాణా సమగ్ర చరిత్ర అని చెప్పొచ్చు. ఆ చరిత్రలో భాగంగానే భద్రాచలం ఎలా తెలంగాణాలో అంతర్భాగమో చెప్పడం జరిగింది. వివరాల్లోకి పోతే.....

         భద్రాచల రామచంద్రస్వామి మహిమ భారతదేశం మొత్తానికీ తెలుసు. కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆ పుణ్యక్షేత్రం గురించి తెలియనివారు లేరనవచ్చు. ఆ దేవస్థానానికి నైజాంప్రభుత్వం అప్పట్లో 19645 హాలీ రూపాయలు ప్రతిఏటా ఇవ్వడం ఆనవాయితీ. నిజాం ప్రభుత్వ కాలంలో “ఉమారె మజహబి” అనే ఒక మత విషయక  శాఖ వుండేది.  వెల్లోడి మంత్రివర్గంలో బూర్గుల రామకృష్ణారావు రెవెన్యూ మంత్రి అయిన తరువాత మతశాఖను రద్దు చేసి పబ్లిక్ ఎండోమెంట్స్ శాఖగా మార్చారు. దానితో పాటు మతశాఖ పక్షాన ఇస్తున్న నగదు మామూళ్ళను రద్దుచేసినప్పటికీ భద్రాచల క్షేత్రానికి ఇస్తున్న దాంట్లో మార్పు తేలేదు. అలా ఆ గ్రాంట్ రద్దు కాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా, కొన్ని చారిత్రిక ఆధారాలు సేకరించేటందుకు, రామకోటేశ్వరరావు అలానాటి ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న భావరాజు వెంకట కృష్ణారావుతో కలిసి 1952 సంవత్సరంలో భద్రాచలం వెళ్ళారు. వారానాడు సేకరించిన ఆధారాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నవే కాకుండా, భద్రాచలం ఎలా తెలంగాణ ప్రాంతానిదో స్పష్టంగా తెలియపరచేవిగా వున్నాయి అనాలి.

         వారికక్కడ 1832 నాటి శిలాశాసనం కనిపించింది. వరంగల్ సుబేదారు మహమ్మదల్లి విచారించి ఇచ్చిన విజ్ఞప్తిని చూశారు. స్థానిక అనుభవజ్ఞులు అనేక ఆధారాలు చూపించారు. అర్చకుల దగ్గరున్న విరాసత్ తక్తాలు, ఆదాయవ్యయ పట్టికలు చూశారు. కంచర్ల గోపన్న (భక్ర రామదాసు) చేయించిన ఆరు లక్షల రూపాయల నవరత్న ఖచితమైన బంగారు ఆభరణాలు చూశారు. నిత్యోత్సవాలలో  పవళింపు సేవదాకా చేసే సేవలను చూసి, ఆయా సందర్భాలలో పాడడానికి భక్తులు రచించిన కీర్తనలు విని అవెలా చారిత్రిక ఆధారాలో విశ్లేషించారు. భద్రాచల దేవస్థానం ఆస్తులను, భక్తులు సమర్పించిన ఆభరణాలను, వాటి నేపధ్యాన్ని చారిత్రిక దృక్ఫదంతో అధ్యయనం చేశారు. ఒక వరంగల్ న్యాయవాది “అనిశెట్టిపల్లి” అనే గ్రామాన్ని దేవస్థానానికి దానపూర్వకంగా ఇచ్చిన విషయాన్ని గమనించారు. సమీపంలోని పర్ణశాలకు వెళ్లి, మార్గమధ్యంలోని దండకారణ్యంలో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతంగా నివసించారని చెప్పుకునే స్థలాలను చూసారు. ఇవన్నీ భక్తిభావంతోనే కాకుండా వ్యవహార దృష్టితో పరిశీలించారు వారు.  
     
         గోల్కొండ రాజ్యాన్ని అబూల్ హసన్ తానీషా అనే నవాబు పరిపాలించిన సంగతి తెలిసిందే. ఆయన కాలంలోనే అక్కన్న-మాదన్న అనేవారు మంత్రులుగా వుండేవారు. వారు నేలకొండపల్లి (ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఒక మండల కేంద్రం) గ్రామానికి చెందిన కంచర్ల గోపన్నను భద్రాచలం తాలూకాకు తహసీల్దారుగా నియమించారు. పరమ భాగవతోత్తముడైన గోపన్న కబీరుదాసుకు శిష్యుడై, ఆయన ద్వారా తారక మంత్రాన్ని ఉపదేశించుకుని, (భక్త) రామదాసు అనే వ్యవహారనామంతో ఉద్యోగధర్మం నెరవేర్చాడు.


తాలూకాలో వచ్చే రెవెన్యూ ఆదాయాన్ని శ్రీరామచంద్రమూర్తికి దేవాలయ నిర్మాణానికి, ఆభరణాల కొనుగోలుకు వినియోగించాడు భక్త రామదాసు. తత్ఫలితంగా ఆయన్ను నాటి ప్రభువులు గోల్కొండ చెరసాలలో నిర్భందించారు. పలుబాధాలకు గురిచేశారు. అయినా ధైర్యం కోల్పోక సదా రామనామస్మరణతో జైలుజీవితం గడిపాడు. ఇదిలా వుండగా, ఒకనాటి రాత్రి రామలక్ష్మణులు తానీషా అంతఃపురంలోకి వచ్చి ఆయనకు ఆరు లక్షల వరహాలు చెల్లించారు. దరిమిలా రామదాసును చెరసాల నుండి విడుదల చేశారు. ఇదంతా చరిత్ర. వకీలు రామకోటేశ్వరరావు గారికి దొరికిన చారిత్రిక ఆధారాలను బట్టి, తానీషా ప్రభువు భద్రాచలం తాలూకాను శాలివాహన శకం 1574, నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి (క్రీస్తు శకం 1652 సంవత్సరం) నాడు రామచంద్రమూర్తికి ఇచ్చారు. దీనికి సంబంధించిన సనదులు, శాసనాలు వున్నాయని వకీలుగారు తన పుస్తకంలో పేర్కొన్నారు.

రామదాసు మరణానంతరం కొంతకాలానికి ఔరంగజేబు ప్రభుత్వోద్యోగి ధ్వంస జఫరుద్దౌలా అనే ఆయన దేవాలయాలను కొల్లగొట్టేవాడని అనుకునేవారు. ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం ఆలయ అర్చకులు, తమ దేవాలయం కూడా దోపిడీకి గురి కావచ్చని భయపడ్డారు. వెంటనే గర్భాలయ ద్వారానికి రాయికట్టి, మూసివేసి, అర్చకులు ఉత్సవ విగ్రహాలను, ఆభరణాలను తీసుకుని పోలవరానికి వెళ్లిపోయి ఒక బీదవారి ఇంట్లో దాక్కున్నారు. ధ్వంస వచ్చి ఆలయాన్ని మూసివుండగా చూసి, ఆభరణాలు లేనందున చేసేదేమీ లేక మరలిపోయాడు. ఒక వంద సంవత్సరాలు అలా ఆభరణాలు పరాయి ప్రదేశంలో వున్నాయని అంటారు. ఆ తరువాత అర్చకులు విగ్రహాలతో, ఆభరణాలతో సహా భద్రాచలం ప్రవేశించి నందనామ సంవత్సర (1242 ఫసలీ లేదా 1833 సంవత్సరం) చైత్ర శుద్ధ అష్టమి సోమవారం నాడు పునఃప్రతిష్ట చేయించారు.

తరువాత కాలంలో తూము లక్ష్మీ నరసింహ దాసు, నాదెళ్ళ వరద రామదాసును శిష్యుడిగా చేసుకుని, భద్రాచలం వచ్చాడు. అప్పటికీ క్షేత్ర ప్రభావం బాగా ఉన్నప్పటికీ, మధ్యలో కొంతకాలం భద్రాచలం తాలూకాను అశ్వారావుకు స్వాధీనపరిచినందున కొంత ఆరాచకం ప్రబలి వుండేది. దాన్ని సహించలేని గురు-శిష్యులు హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అది నాసరుద్దౌలా పరిపాలనా కాలం. రాజా చందూలాల్ మంత్రిగా వుండేవాడు. లక్ష్మీ నరసింహ దాసు, వరద రామదాసు ఇద్దరూ కలిసి మంత్రిని కలిశారు. సంగతంతా వివరించారు. భక్త రామదాసు కాలం నాడు భద్రాచలం తాలూకా గోదావరికి ఉత్తర-దక్షిణ భాగాలలో కొంత మేరకు వ్యాపించి వుండేది. గోదావరికి దక్షిణాన వున్న పాల్వంచ తాలూకా నిజాం పాలనలో, ఉత్తరాన వున్నా భద్రాచలం తాలూకా బ్రిటీషు వారి పాలనలో వుండి వుండవచ్చు. ఏదేమైనా వున్నది తెలంగాణ ప్రాంతంలోనే. ఆ లెక్కన తూర్పు గోదావరి జిల్లాలోని కొంత భాగం ఇప్పటికీ భద్రాచలానికి, అంటే, తెలంగాణాకు చెందిందే!!! అలా కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొన్నాళ్లకే దుర్భుద్ధితో ఇక్కడి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుకోవడమే కాకుండా ఇప్పుడు భద్రాచలం కూడా తమదేనని మొండిగా వాదిస్తున్నారు.

మంత్రి చందూలాల్ ఆర్ధిక నిపుణుల సలహా తీసుకున్నారు. అశ్వారావు జమీందారీ కొంతవరకే వుంచి, వరద రామదాసు పేరుమీద 15 జమాది ఉస్సాని 1250 హిజరి (1244 ఫసలీ లేదా 1835 సంవత్సరం) నాడు ఒక సనదు జారీ చేశాడు. దానిం ప్రకారం 55 గ్రామాలు అమాని, 11 గ్రామాలు సర్ బస్తా మొత్తం 66 గ్రామాలు హసనాబాదు పరగణా, పాల్వంచ తాలూకా, శంకరగిరి పట్టు కింద ఆయన అధీనంలోకి తేవడం జరిగింది. ఇవన్నీ అలా తెలంగాణా ప్రాంతానివే. ఇప్పుడా 66 గ్రామాల్లో కొన్నిటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్కుంది. అప్పట్లో అక్కడ వసూలయ్యే పన్ను రు. 71,000. అందులో పరిపాలనా వ్యయం రు. 12,500 కాగా, 18,500 దేవస్థాన వ్యయం. 8000 మంది సిబ్బందిని కూడా ఇచ్చారు.

ఈ సనదు వచ్చినప్పటి నుండి రామచంద్రస్వామి పూజాపునస్కారాలు, ఉత్సవాలు అద్భుతంగా సాగుతున్నాయి. ఇది జారీచేసిన కొంతకాలానికి ఉభయ రామదాసులు మరణించారు. గ్రామాల పొందుబాటు, శిస్తుల వసూళ్లు, పన్నుల చలామణి చేయడానికి బాధ్యత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. పాల్వంచ జమీందారు అశ్వారావు బహద్దూర్ వారసుడైన రాజా సీతారామచంద్రరావు పేరుమీద నవాబ్ సాలార్ బహద్దూర్, పాల్వంచ, శంకరగిరి పట్టీలను సంస్థానాలుగా ఆయనకు ఇచ్చి, ప్రతిఫలంగా సంవత్సరానికి భద్రాచలం దేవాలయానికి 20981 హాలీలు ఇవ్వమని ఆదేశించడం జరిగింది. ఈ సనదును తేదీ 14, షవాల్ 1275 హిజిరి (1264 ఫసలీ లేదా 1855 సంవత్సరం) న జారీచేయడం జరిగింది.

ఒకానొక సందర్భంలో పరిపాలనా సౌలభ్యం కొరకు, అతి తక్కువకాలం, భద్రాచలాన్ని బ్రిటీష్ పాలనలోని తూర్పు గోదావరి జిల్లాలో వుంచినప్పటికీ, దేవాలయం మాత్రం నైజాంపరిపాలనలోనే వుండేది. ఒక మేనేజర్ కూడా వుండేవాడు. నైజాం పోలీసులుండేవారు. కల్యాణోత్సవం చైత్ర శుద్ధ నవమి (శ్రీరామనవమి) నాడు, నైజాం ఇలాకా రెవెన్యూ పోలీసు అధికారులు, జవాహిరితో స్వామిని ఊరేగింపు చేస్తూ, కళ్యాణమంటపానికి తీసుకుని పోయి, కల్యాణోత్సవం తరువాత స్వామిని ఆభరణాలతో సహా దేవాలయానికి చేరుస్తుండేవారు. కానుకలు వేసే హుండీని కాపాడేవారు.

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారికి కుతుబ్ షాహీ పాలనాకాలంలో తానీషా భద్రాచలం తాలూకాను సమర్పించారనేది అక్షరసత్యం. దానిని ఆసఫ్ జాహీ వంశీకులు స్వాదీనపర్చుకుని నాసరుద్దౌలా కాలంలో మరో విధంగా కొనసాగించారు. ఏదేమైనా అనాదిగా భద్రాచలం ప్రాంతం తెలంగాణాలో అంతర్భాగంగా కొనసాగుతూ వస్తున్న విషయం ఎవరూ కాదనలేరు. భద్రాచలం పట్టణం కానీ, ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గుంపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలు కానీ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా చెందుతాయి? ఎంత తొందరగా వాటిని తెలంగాణాలో విలీనం చేస్తే అంత మంచిది.    

25 comments:

  1. కేసీఆర్ గారు మరియు తందానా తెలంగాణా వాదులూ అందరూ 1956 నాటి తెలంగాణా కావాలీ అన్నారా లేదా? మరి 1956లో భద్రాచలం తెలంగాణాలో ఉందా?

    మరీ వెనక్కు వెనక్కు పోయి నిజాంరాజ్యంలో ఉంది కదా తెలంగాణా అంటే అది విపరీత వాదమే. ఆలెక్కన బ్రిటిషువారి పాలనలోనికి రాకముందు సర్కారు జిల్లాలు నిజాం పాలన లోనివి కావా?

    మీరు పైగా కొన్ని ప్రాంతాలను ఉద్దేశించి "ఎంత తొందరగా వాటిని తెలంగాణాలో విలీనం చేస్తే అంత మంచిది" అన్నారు. ఇది విద్వేషపూరితమైన మాట అని నిష్కర్షగా చెప్పవచ్చును. ఏమీ కలపకపోతే? తెలంగాణావారు ఆంద్రప్రదేశం పైన యుధ్ధం చేసి స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారా?

    భ్రద్రాచలాన్ని తెలంగాణా దొంగిలించింది అని మా ఉద్దేశం. ఈ మాటంటే మీకు కోపం వస్తుంది కదూ? కాని మీరు ఎన్ని కానిమాటలన్నా ఆంధ్రావారు మాత్రం శాంతంతో, సహనంతో, వినయంతో, విధేయతతో, భక్తిప్రపత్తులతో, గౌరవంతో, ఆదరంతో ఎంతో ఆనందంతో స్వీకరించి మీ ఆజ్ఞపాలించాలా? ఏం మాటలండీ?

    ReplyDelete
    Replies
    1. "కేసీఆర్ గారు మరియు తందానా తెలంగాణా వాదులూ అందరూ 1956 నాటి తెలంగాణా కావాలీ అన్నారా లేదా?"

      పచ్చి అబద్దం. *ఒక్క* ఆధారం (not yellow media rants) ఉంటే చూపించండి.

      TRS submission to GoM:

      "Therefore, these firm borders, *circumscribing ten districts* of Adilabad, Nizamabad, Karimnagar, Warangal, Khammam, Nalgonda, Mahboobnagar, Medak, Rangareddy and Hyderabad would constitute a robust Telangana State"

      T-JAC submission to GoM:

      "As per the latest Delimitation exercise done during 2007, *these 10 districts* have been divided into 17 Parliamentary and further, 119 Assembly constituencies. Successful elections have also been conducted during 2009 under the supervision of Election commission of India. Therefore, we have *a rare congruity among the boundaries of districts*, parliamentary and Assembly constituencies, within the territorial limits of newly envisaged state"

      Delete
  2. Now telangana is a separate state... But previous Badrachalam is in WG district of combined AP... How can you claim that it belongs to TS state...

    ReplyDelete
    Replies
    1. Telangana does not need logic to stake claims. If judt ahsndfula of telangana persons happen to live in Boston, it is sufficient and Boston belongs to Telengana.

      Delete
  3. భద్రాచలంలో జరిగే కళ్యాణానికి వెళ్ళడానికి కేసీఆర్ కి సమయం దొరకడం లేదు. మీకు భద్రాచలం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి ?

    ReplyDelete
    Replies
    1. రేపు హలీం తినటానికి ఎగురుకుంటూ. వెళ్ళటానికి మాత్రం బోలెడు సమయం దొరుకుతుంది చూస్తూ ఉండండి.

      Delete
    2. అధికారంలో ఎవరుంటే వారితో ఒవైసీ జట్టు కడతారు.

      Delete
  4. >>>భద్రాచలం పట్టణం కానీ, ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గుంపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా చెందుతాయి? ఎంత తొందరగా వాటిని తెలంగాణాలో విలీనం చేస్తే అంత మంచిది.>>>

    మొత్తం ఆంధ్రాని విలీనం చేసుకోకూడదా ?

    ReplyDelete
    Replies
    1. అక్షరాలా బెదిరిస్తున్నారండీ!

      Delete
  5. ఆంద్రరాష్ట్రం, తెలంగాణా (హైదరాబాదు రాష్ట్రం) కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటికి భద్రాచలం ఆంధ్రరాష్ట్రంలో ఉంది. 1956 నాడు విలీనం జరగటానికి ముందు ఉన్న తెలంగాణా మాత్రమే కావాలంటూ అల్లరి (అదే లెండి ఉద్యమం) చేసి సోనియా దయాదాక్షిణ్యఫలంగా సాధించుకున్నారు. మంచిది. అలా ఏర్పడ్డ తెలంగాణాకు భద్రాచలాన్ని అప్పగించటం తప్పే కాదు ఆంధ్రులపట్ల ద్రోహం చేయటమే. ఎందుకు భద్రాచలం విషయంలో పాతచరిత్ర తవ్విపోస్తారు? విలీనంతో రాని భద్రాచలం ఆంధ్రానుండి విభజనతో ఎందుకు పోవాలీ? న్యాయాన్యాయాలు వదలి పైగా మేధావులమని వ్యాసాలొకటి!

    ReplyDelete
  6. పోలవరం ప్రాజక్ట్ దృష్ట్యా ఈ మండలాలను ఏపీ రాష్ట్రంలో విలీనం చేశారనుకుంటాను. తిరిగి తెలంగాణాకు బదిలీ చేస్తే ప్రాజక్ట్ గతేమిటి?

    ReplyDelete
    Replies
    1. పోలవరం ప్రాజెక్ట్ ఆగాలనే కదా తెలంగాణా అసలు కోరిక? అబ్బే అగాలీ అని అక్షరాలా అనరను కోండి, ఏదో ఒక బుల్లి డామ్ కట్టుకోండి అంటారు - అందుకు ఎంతో సహాయం కూడా చేస్తాం అనీ అనగలరేమో. ప్రాజెక్ట్ నీరు కారితే వారికి ఆనందమే.

      "నెమలికంటను నీరుకారిన వేటగాడికి లోటు యేమిరా" అని వినలేదా మీరు?

      Delete
    2. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా కూడా పని చేస్తున్న ఈ బ్లాగర్ గారికి ఈ పాయింట్ తెలియదనుకోవాలా? లేక కరడు గట్టిన ప్రాంతీయాభిమానం అనుకోవాలా? అనవసరంగా ఎగదొయ్యడం అనుకోవాలా?

      Delete
    3. ఇది వనం వారి సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రోపగాండా బ్లాగు అనుకోవాలి!

      Delete
  7. More loyal than the king himself అని ఒక ఆంగ్ల నానుడి. అలా ఉంది.

    ReplyDelete
  8. తరతరాలుగా చాలీచాలని పోడు సాగుతో బతుకీడిస్తున్న కోయ బిడ్డలను నట్టేట ముంచేసి బలిసిన కామందుల మూడో పంటకు నీళ్లు తరలించే బంగారు మాయలేడి పోలవరం. అసమదీయ కాంట్రాక్టర్లకు అప్పణంగా దుద్దులు అప్పచెప్పే ఏకైక లక్ష్యంతో మొదలెట్టిన ఈ తెల్ల గున్న ఏనుగు దండకారణ్యం పాలిట శాపమే తప్ప వరం కాదు.

    ReplyDelete
    Replies
    1. అయ్యా, గొట్టిముక్కుల గారూ, అచ్చం తెలంగాణా వాడిని అనిపించుకున్నారు మరింత ఆంధ్రద్వేషం వెళ్ళకక్కి. పోలవరం బంగారు మాయలేడా? పోలవరం నీళ్ళ్తో సాగుబడి చేసుకొనే ఆంధ్రా రైతులంతా బలిసిన కామందులా? వహ్వా వహ్వా. మీ ద్వేషం మండా! శాపమో వరమో మాక్కావాలి, మేంకట్టుకుంటున్నాం. బస్. మీ అభిప్రాయంతోనూ మీ దొంగ ఏడ్పులతోనూ మా ఆంధ్రావాళ్ళకు పనిలేదు.

      ముందు మీ యిల్లు దిద్దుకోండి! మీ పరమపూజనీయ ప్రియాతిప్రియతమ నాయకుడి రాజ్యంలో ఈరోజున విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలపేపర్లు దిద్దే తెలివికూడా సరిగ్గా లేని మీ రాష్ట్రాన్ని ముందు బాగుచేసుకోండి. ఇతరుల మీద పడి దొంగేడుపులు ఆపండి.

      Delete
  9. నేను సుమారు 30 ఏండ్ల క్రితం భద్రాచలం ఏరియా దగ్గర నాలుగేళ్లు పనిచేసాను.. bridge ఆవలనున్న సారిపాక, బూర్గంపాడు, పాల్వంచ ఏరియా వారికి భద్రాచలం ఏరియా వారికి యాసలో,భాషలో చాలా తేడా కనబడేది..భధ్రాచలం లో తూ.గో యాస ఉండేది, రిలీజ్ సినిమాలు వచ్చేవి..ఆంధ్ర లో ఉన్న ఫీలింగ్ ఉండేది..
    పైగా భక్తులు ఎక్కువగా ఆంధ్రా వాళ్ళు ఎక్కువగా వచ్చే వారు..భక్త రామదాసు సినిమా తర్వాత, పోలవరం ప్రాజెక్టు మొదట్లో నుండి హైదరాబాద్ భక్తులు ఎక్కువ అయ్యారు..
    నేను అక్కడ ఉన్న ఆ రోజుల్లో తెలంగాణ వారు భద్రాచలం మీద అంతగా ఆశక్తి చూపేవారు కాదు..పైగా వెటకారంగా మాటాడేవారు (కొంతమంది)...

    ReplyDelete
    Replies
    1. వోలేటి గారూ, మీరు చెప్తున్నది గిరిజనేతరుల గురించి అనుకుంటా. భద్రాచలం ప్రాంత గిరిజనులకు (ముఖ్యంగా కోయలకు) ములుగు & బూర్గంపహాడ్ ట్రైబల్స్ మధ్య తేడాలు ఏవీ ఉన్నట్టు లేదు.

      ముల్కీ వ్యతిరేక (ఉరఫ్ జై ఆంధ్ర) ఉద్యమం ఉదృతంగా ఉన్నప్పుడు సైతం భద్రాచలం ఆంధ్రాలో కలపాలన్న డిమాండ్ రాలేదు. రంపచోడవరం ప్రాంతంలో తీవ్ర ఉద్యమం చెలరేగినా భద్రాచలంలో కనీస స్పందన కూడా లేదు.

      ఇంకో విషయం: ఆంధ్రకు బదిలీ కాబడిన ప్రాంతం గంగకు రెండు వైపులా (ఉ. బూర్గంపహాడ్ మండలంలో ఆరు గ్రామాలు) విస్తరించి ఉంది. నాకు తెలిసి వీటిలో కొన్ని *ఎప్పుడూ* తూగో జిల్లాలో లేవు.

      Delete
  10. Jai Gottimukkala గారి స్పందనకు ధన్యవాదములు..నేనో సామాన్య జీవిని,నాకు అన్నం పెట్టి
    ఆదరించిన తెలంగాణ అంటే నాకు ప్రాణం..ఈ రాజకీయాలు పక్కన పెడితే, ఎవరి ఇలాకా లో ఉన్నా భద్రాచలం అభివృద్ధి కావాలి... రాముడు నిత్యం నవ్వుతూ ఉండాలి.. అప్పట్లో ఈ ప్రాంతీయ బేధం లేకుండా తెలంగాణాలో ఎక్కడికెళ్లినా కలుపుగోలుగా, ఆప్యాయంగా "ఓ అన్నా, తమ్మీ" అని పిలిచేవారు..
    డివిజన్ సరిగ్గా జరగలేదు..అని నా సొంత అభిప్రాయం..

    ReplyDelete
    Replies
    1. తెలుగు వారికి రాముడు ఆరాధ్య దైవం. తెలుగువాళ్ళని నిలువునా అడ్డదిడ్డంగా చీల్చిన ఈ రాష్ట్రవిభజన రాముడికి సంతోష దాయకం అని అనుకోను. రాముడికి పరమసంతోషదాయకం అనుకొనే వారికో దండం. వారితో వాదించను.

      Delete
  11. వోలేటి గారూ, ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది కనుక ఇందులో నాకయితే ఎటువంటి ఆక్షేపణ లేదు. ఏదేమయినా మీకు తెలంగాణా ప్రజల మీద ఉన్న అభిమానానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  12. Abul Hasan Qutub Shah became king in 1672. How can he arrest Ramadas in 1652? Ramadas died in 1680, after he was released from the prison. I think he was arrested in 1668, by Abdullah Qutub Shah, the father-in-law of Abul Hasan Qutub Shah.

    ReplyDelete
  13. హైదరాబాదు తెలంగాణాకు ఇచ్చారు. భద్రాచలం ఆంధ్రలో కలిపిఉంటె బాగుండేది. అక్కడ ఆలయ సంస్క్రృతి సంప్రదాయం ఆంధ్ర ప్రాంతం అనిపిస్తుంది. తెలంగాణాలో ముక్కలు ముక్కలు చేసి ముప్పై మూడు జిల్లాలు చేశారు. ఇవన్నీ తుగ్లక్ చర్యలు. జ్వాలా లాంటి సీనియర్లు ఇంత దారుణంగా అన్యాయంగా మాట్లాడు తున్నారు. భండారు గారు ఈ విషయం ఎందుకు చర్చించరు.

    ReplyDelete
  14. చర్చ బాగుంది.

    ReplyDelete